బాపట్ల : మానవ వికాస పరిణామంలో పుస్తకాల పాత్ర మహౌన్నతమైనదని, పుస్తకం కనుగొనబడిన తర్వాత మానవ విజ్ఞానం త్వరితగతిన అభివృద్ధి చెందిందని.. బాపట్లలో ఆదివారం ఉదయం సాహితీ భారతీయ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ పుస్తక దినోత్సవం సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రజాకవి వైద్య విద్వాన్ డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. ఆంగ్ల నాటక రచయిత అయిన షేక్స్‌పియర్ వంటి గొప్ప రచయితల జన్మదినం ఏప్రిల్ 23వ తారీకు అవటం వలన ఆ రోజును ప్రపంచ పుస్తక దినోత్సవం గా ప్రకటించారని, చిరిగిన చొక్కా అయిన తొడుక్కో ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో అని మహానుభావులు ప్రకటించారని, పుస్తక పఠనం వల్ల విజ్ఞానాభివఅద్ధి జరుగుతుందని సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహ వర్మ తెలియజేశారు. పూర్వం పుస్తకం హస్తభూషణంగా, పుస్తక పఠనం ఒక అలవాటుగా ఉండేదని కానీ ఇప్పుడు ప్రజల్లో పఠనాసక్తి తగ్గిపోయిందని పుస్తక పఠనాన్ని అలవర్చుకునే ఆవశ్యకత ఎంతైనా ఉందని సాహితి భారతి కోశాధికారి ఆదం షఫీ అన్నారు. ఈ సభలో మర్రి మల్యాద్రి రావు ఎన్.కృష్ణ, ఎం.జాకబ్, కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, అవ్వారి వెంకటేశ్వర్లు, రెంటాల మురళి రాధాకృష్ణమూర్తి, తదితరులు పాల్గొని పుస్తక పఠన ఆవశ్యకత గురించి తెలియజేశారు.










