
- ప్రణయ్, లక్ష్యసేన్‌కు కష్టం
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ డ్రా విడుదల
కౌలాలంపూర్(మలేషియా): ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో భారత షట్లర్లకు క్లిష్టమైన డ్రా విడుదలైంది. కౌలాలంపూర్‌లోని హెడ్‌క్వార్టర్స్‌లో విడుదల చేసిన డ్రాలో మహిళల సింగిల్స్‌లో పివి సింధుకు తొలిరౌండ్‌లో బై లభించింది. మూడోరౌండ్‌లో నొజొమి ఒకుహర(జపాన్), క్వార్టర్‌ఫైనల్లో రిచ్‌నాక్ ఇంటనాన్(థాయ్ లాండ్)తో తలపడే అవకాశముంది. టైటిల్ నెగ్గే క్రమంలో ప్రపంచ నంబర్‌వన్ క్రీడాకారిణి అన్ సే యంగ్‌ను ఢీ కొట్టాల్సి రావొచ్చు. పురుషుల సింగిల్స్‌లో సీడింగ్ దక్కిన హెఎస్ ప్రణయ్, సాత్విక్-చిరాగ్ శెట్టి జోడీలకు సులువైన డ్రా లభించింది. యువ షట్లర్ లక్ష్య సేన్‌కు 11వ సీడింగ్ దక్కింది. డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టికి తొలి రౌండ్ బై లభించింది. ఇక ప్రణయ్ తొలి మ్యాచ్‌లో ఫిన్లాండ్‌కు చెందిన కల్లె కల్జోనెన్‌తో తలపడనున్నాడు. మారిషస్ ఆటగాడు గార్జెస్ జులియన్ పాల్‌తో లక్ష్య సేన్, జపాన్ ప్లేయర్ కెంటా నిషిమొటోతో కిదాంబి శ్రీకాంత్ పోటీపడనున్నారు. డెన్మార్క్ కోపెన్‌హగన్‌లో ఆగస్టు 21 నుంచి 27 వరకు బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్స్ పోటీలు జరుగనున్నాయి. మహిళల డబుల్స్‌లో త్రీసా జాలీ, గాయత్రి గోపిచంద్‌కు కూడా మొదటి రౌండ్ బై లభించింది. అశ్విని భక్త్, శిఖా గౌతమ్ జోడీ నెదర్లాండ్స్‌కు చెందిన డెబొరా జిల్లె, చెరిల్ సీనెన్ జంటను ఢీ కొట్టనుంది. మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ కపూర్, ఎన్ సిక్కి రెడ్డి ద్వయం స్కాట్లాండ్ జోడీ ఆడం హల్, జులీ మ్యాక్‌ఫెర్సన్‌తో పోటీ పడనుంది. మరో భారత ద్వయం వెంకట్ ప్రసాద్, జుహీ దేవగన్ జర్మనీకి చెందిన జోన్స్ రల్ఫీ జాన్సెన్, లిండా ఎఫ్లెర్‌తో తలపడనుంది. మొత్తం 16మంది షట్లర్లు భారత్ తరఫునుంచి ఈ టోర్నీలో ప్రాతినిధ్యం వహించనున్నారు.