ఇంటర్నెట్డెస్క్ : కీళ్లనొప్పులు చాలా మందిని వేధిస్తుంటాయి. సాధారణంగా కీళ్లనొప్పులు వయసుపైబడిన వారికి రావడం సహజం. అయితే నేటికాలంలో ఈ నొప్పులు వయసుతో సంబంధం లేకుండా వస్తున్నాయి. కేవలం జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లే కీళ్ల నొప్పులు రావడానికి కారణమని పరిశోధనల్లో తేలింది. అక్టోబర్ 12 ప్రపంచ ఆర్థరైటిస్ దినం. మరి కీళ్లనొప్పులు తగ్గాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం..!
ఆహారపు అలవాట్లు..
రకరకాల కీళ్లనొప్పులుంటాయి. ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందాలంటే కచ్చితంగా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రొటీన్స్ గల ఆహారం తీసుకోవాలి. మీరు తీసుకునే ఆహారమే అనారోగ్యాలకు చెక్పెడుతుందని డాక్టర్స్ చెబుతున్నారు. అలాగే సరిపడా నిద్ర కూడా తప్పనిసరి. నిద్ర సరిగ్గా లేనివారే కీళ్లనొప్పులకు గురవుతున్నారని పరిశోధనల్లో వెల్లడైంది. అందుకే డాక్టర్స్ శరీరానికి తగినంత నిద్ర కూడా అవసరమని చెబుతున్నారు. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా.. వాటిని తగ్గించుకుని కంటినిండా నిద్రపోతే ఆర్థరైటిస్ బారిన పడే అవకాశాలు చాలావరకు తగ్గుతాయని డాక్టర్స్ చెబుతున్నారు.
మద్యం, పొగ తాగడం మానేయాలి
పొగ తాగడం, మద్యం సేవించడం వల్ల కూడా కీళ్ల నొప్పులకు గురవుతారు. తప్పనిసరిగా.. ఈ అలవాట్లు ఉన్నవారు మానుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
అధిక బరువు
అధిక బరువున్నా కీళ్లనొప్పులు వస్తాయి. అందుకే రోజూ వ్యాయామం చేస్తూ.. శరీర బరువు నియంత్రణలో ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అధిక బరువు ఉండడం వల్ల.. కీళ్ల గాయాలు కూడా త్వరగా నయం కావు. చాలా సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని డాక్టర్స్ చెబుతున్నారు.
ఈ కీళ్ల నొప్పులు రోగ నిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. అలాగే కిడ్నీ సంబంధిత వ్యాధులు కూడా తలెత్తుతాయి. మోకాళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్, అరచేతుల్లో నొప్పులు బాధపెడతాయి. తీవ్రమైన నొప్పులకు గురికాకముందే.. వైద్యుల్ని సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది.