పద పద.. చావో రేవో తేల్చేద్దాం...

పదపద పదపద మనదొకటే మాటై.../ పదపద పదపద పోరాట బాటై / పదపద పదపద చావో రేవో తేల్చేద్దాం/ పదపద పదపద పాదయాత్రలో అడుగేద్దాం...అని ఎలుగెత్తి చాటుతూ పోలవరం నిర్వాసితుల పోరుకేక మహా పాదయాత్రలో అగ్రభాగాన నిలిచారు ప్రజానాట్యమండలి కళాకారులు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం, ఏలూరు జిల్లాల నుండి మొత్తం 30 మంది కళాకారులు పోలవరం నిర్వాసితుల పాదయాత్రకు నూతనోత్తేజాన్ని కలిగిస్తూ ఆద్యంతం ఉత్సాహాన్ని నింపారు. వందలాది కిలోమీటర్ల దూరం ఆట పాటలతో అలరించారు ఈ కళాకారులు. వీరిలో అత్యధికులు నిర్వాసితులు. అన్నింటినీ మించి అందరూ ఆదివాసీ యువత కావడం విశేషం. జూన్ 20న ప్రారంభమైన పోలవరం నిర్వాసితుల పోరుకేక మహా పాదయాత్ర బృందంతో కలిసి అడుగేస్తూ డప్పుల చప్పుళ్లతో, రేలా ఆట పాటలతో, నృత్యాలతో పోలవరం నిర్వాసితుల గొంతుకయ్యారు. ఈ పాదయాత్రకు సన్నాహకంగా...నిర్వాసితుల కష్టాలను, కన్నీళ్లను కళ్ళకు కట్టినట్లుగా ప్రచార గీతాన్ని దేవేంద్ర రచించగా..రవి కళ్యాణ్ సంగీత సారథ్యంలో...వర్థమాన గాయకుడు రాంకీ ఆలపించారు. ఈ గీతం పాదయాత్రలో ప్రజల్ని ఉర్రూతలూగించిందనడం అతిశయోక్తి కాదు. చింతల యాదగిరి రాసిన-ఉన్న ఊరునీ కన్నతల్లినీ వదిలి పోలేను...పాట మానవత్వం వున్న ప్రతి ఒక్కరినీ కదిలించి కన్నీళ్లు పెట్టించింది. ఆదివాసులం అడవితల్లి బిడ్డలం గోదారి గట్టున ఊగే రేలా పువ్వులం-అంటూ పోలవరం నిర్వాసితుల అస్తిత్వాన్ని తెలియజేసిన అనంగారి భాస్కర్ పాట కూడా నిర్వాసితులను చైతన్యపర్చింది. పోలవరం ప్రాజెక్ట్ పేరుతో ఆదివాసులను అడవికి దూరం చేసి వారి జీవన విధానాన్ని, వైవిధ్యాన్ని, సంస్కృతిని సైతం ధ్వంసం చేస్తారా అంటూ ప్రశ్నించింది. జూన్ 20వ తేదీన జరిగిన మహా పాదయాత్ర ప్రారంభ సభలో 5 పాటలతో పోలవరం పోరుకేక ప్రచార గీత మాలికను తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలోనే రెండు కేంద్రాలుగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం ఎర్రగట్టు గ్రామంలో, ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో మూడు రోజులు పాటు 45 మంది కళాకారులతో శిక్షణా శిబిరాలు నిర్వహించింది ప్రజానాట్యమండలి.
ఈ మహా పాదయాత్రలో డప్పుల దళంతో పాటు రెండు జిల్లాల నృత్య దళాలు కీలక పాత్ర పోషించాయి. ప్రధానంగా దేవేంద్ర రచించిన పద పద పద పద పాదయాత్ర అడుగేద్దాం, పోలవరం పులి వేట- గీతాలకు వందల గ్రామాల్లో నృత్యాలు చేశారు. వీరితో పాటు వందలాది మంది పాదయాత్ర బృందం, నిర్వాసిత గ్రామాల ప్రజలు నూతనత్వం సంతరించుకున్న రేలా డిజే పాటలతో అడుగులు వేస్తూ ఒక జాతర వాతావరణంతో ముందుకు సాగారు. పాదయాత్రకు ప్రతి గ్రామంలోను గిరిజన సంప్రదాయ నృత్యాలతో మహిళలు హారతులిస్తూ ఘన స్వాగతం పలికారు. కొన్ని చోట్ల తీన్మార్ బృందాలు కూడా హోరెత్తించాయి. నెల్లిపాకలో మొదలై కూనవరం, చింతూరు, వరరామచంద్రపురం, వేలేరుపాడు, కుకునూరు, జీలుగుమిల్లి, బుట్టాయి గూడెం, జంగారెడ్డిగూడెం మండలాల్లోని ప్రతి నిర్వాసిత గూడెం పర్యటిస్తూ వందలాది కిలోమీటర్ల పాదయాత్రలో అలుపన్నది లేకుండా ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మంగరాజు, అనిల్ సారథ్యంలో కళాకారులు ముందుకు సాగారు. పాదయాత్ర సాంస్కృతిక కార్యక్రమాలకు మంతెన సీతారాం గైడ్‌గా వ్యవహరించారు.
ఉమ్మడి సాంస్కృతిక జీవన విధానానికి ప్రతీకలు ఆదివాసులు. అడవితో వారిది విడదీయలేని అనుబంధం. ప్రస్తుతం పోలవరం బహుళార్థ సాధక జాతీయ ప్రాజెక్టు పేరుతో లక్షలాది ఎకరాల అడవిని ముంచేస్తూ లక్షలాది ఆదివాసులను కాంక్రీట్ జనారణ్యంలోకి తెచ్చి పెట్టింది ప్రభుత్వం. పునరావాసం కల్పించడంతోనే ప్రభుత్వం చేతులు దులుపుకుంటే ఉపయోగం లేదు. వారి సాంస్కృతిక జీవన విధానాన్ని పునర్నిర్మించే భాధ్యత కూడా ప్రభుత్వానిదే. అడవికి దూరమైన ఆదివాసులు వారి ఆహారపు అలవాట్లుకు, వేటకు, ఆట పాటలకు, ప్రకృతిని పూజించే సంస్కృతికి, ఆచార వ్యవహారాలకు, ఆదివాసుల పండుగలకు కూడా దూరంగా నెట్టివేయబడుతున్నారు. సుమారు 12 రకాల పండుగలు ప్రకృతితో పెనవేసుకుని వుంటాయి. ప్రస్తుత నిర్వాసిత కాలనీల్లో ఈ అవకాశాలు ఏవీ లేవు. నేడు ఆదివాసుల భాష కూడా క్రమంగా అంతరించే ప్రమాదం పొంచి వున్నది. షెడ్యూల్డ్ హక్కులను భంగం వాటిల్లుతున్నది. వారిని కాపాడే బాధ్యత నుండి ప్రభుత్వం క్రమంగా తప్పుకుంటోంది. పునరావాస కాలనీల్లో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, శ్మశానాలు కూడా లేకుండా ఇళ్లు నిర్మించి సరిపెట్టుకుంది ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్టు పేరుతో ఆదివాసీల సాంస్కృతిక విధ్వంసానికి పాల్పడింది ప్రభుత్వమే. అందుకే తిరిగి ఆదివాసుల సంస్కృతిని పునర్ నిర్మించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలి.
(వ్యాసకర్త ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు)
పి. మంగరాజు