
అనేకమంది సంఘ సంస్కర్తల ప్రభావం వల్ల జాతీయ ఉద్యమాల్లోనూ, రాజకీయ ఉద్యమాల్లోనూ పాల్గొని మహిళా శక్తిని నిరూపించారు. ఆనాటి స్వాతంత్రోద్యమంలో అసమానమైన తెగువ చూపించారు. స్త్రీలకు ఓటుహక్కు కావాలంటూ చేసిన పోరాటాలు చారిత్రికంగా చెప్పుకోదగినవి. స్త్రీల హక్కుల కోసం ఉద్యమాలు నిర్మించారు. వివాహం, విడాకులు, ఆస్తి హక్కుల కోసం, 22 గంటలు ఫ్యాక్టరీలో పనిచేసిన దుర్మార్గపు పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా పోరాడి పని గంటలు తగ్గించుకున్నారు. ఆయా దేశాల్లో అణచివేతకు లోనైన మహిళలకు సమాన హక్కులు కల్పించాలని చేసిన ఉద్యమాల ఫలితంగా మానవ హక్కులను ఆయా దేశాలు రాజ్యాంగబద్దంగా రూపొందించాయి.
భారత దేశపు మహిళల్లో ఇప్పుడు విద్య సామాజిక, రాజకీయ, ఆర్థిక ప్రసార మాధ్యమం, కళా, సాంస్కతిక, సేవా విభాగాలలోనూ, విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక తదితర కార్యకలాపాలన్నింటా జోక్యం పెరిగింది. భారతీయ మహిళలందరికీ సమానత్వం, వివక్ష లేకుండడం, సమానావకాశాలు కల్పించడం, సమాన పనికి సమాన వేతనం, పిల్లలకు ప్రత్యేక నిబంధనలు అనుమతించటం, మహిళల గౌరవానికి కలిగించే ఆచారాలను లేకుండా చేయడం, పనిలో న్యాయపరమైన పరిస్థితుల్లో రక్షణ కల్పించటం, ప్రసూతి సమయంలో ఉపశమనానికి, మహిళా రిజర్వేషన్ 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం సదుపాయాలను అనుమతించటం వంటి హామీలను భారత రాజ్యాంగం కల్పించింది.
1970 తరువాత మహిళా ఉద్యమాలు విస్తృతంగా పుంజుకున్నాయి. ఆనాడు మధురలో జరిగిన అత్యాచార జాతీయస్థాయిలోనే మొట్టమొదటి అంశంగా ముందుకు వచ్చింది. బాలికపై అత్యాచారం చేసిన పోలీసులను నిర్దోషులుగా విడిచిపెట్టిన వారిని ముద్దాయిలుగా నిలబెట్టడానికి 1979-80 సంవత్సరాల్లో చేపట్టిన నిరసనలు జాతీయ స్థాయిలో బహుళ వ్యాప్తి చెందాయి. దీనితో ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో నేర విచారణ స్మతి, భారత శిక్షా స్మతిలో గల సాక్ష్యం చట్టానికి సవరణలు చేయడం, పోలీసుల ఆధీనంలో అత్యాచారమనేది కూడా ఒక శ్రేణిగా ప్రవేశపెట్టడం జరిగింది.
ఆడశిశువుల హత్యలు, లింగ వివక్ష, స్త్రీ ఆరోగ్యం, ఆడ శిశువుల హత్యలు, లింగ వివక్ష స్త్రీ ఆరోగ్యం, మహిళా అక్షరాస్యత వంటి అంశాల్లో మహిళా ఉద్యమాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. స్త్రీలపై తరచుగా జరిగే హింసాత్మక ఘటనలతో ఆంధ్రప్రదేశ్ ,హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఒరిస్సా, మధ్యప్రదేశ్ ...ఇలా మరికొన్ని రాష్ట్రాల్లో మద్య వ్యతిరేక ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. మహిళా హక్కులకోసం ఉద్యమాలు విస్తృతమైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో 2009లో సాధికారత సంవత్సరంగా ప్రకటించి ..అప్పటినుండి ప్రతి ఏటా అమలు చేస్తున్నారు. వృద్ధులకు పెన్షన్, 2005లో గృహ హింస నిరోధక చట్టం వంటివి మహిళా ఉద్యమాలు సాధించాయి. సమస్య ఏమంటే... భారత రాజ్యాంగం ఎన్నో హక్కులు కల్పించినా వాటిపై సరైన అవగాహన కల్పించే బాధ్యతను ప్రభుత్వాలు తీసుకోవడం లేదు. వాటి గురించి తెలియని మహిళలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారి హక్కులను కాలరాస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
ప్రధానంగా 12 హక్కులు చెప్పుకోదగినవి
1. వారసత్వంలో సమాన వాటా హక్కు( హిందూ వారసత్వ చట్టం 1995)
2. భ్రూణ హత్యల నిరోధక హక్కు ( లింగ నిర్ధారణ పరీక్షల చట్టం 1994
3. గృహ హింస నిరోధక హక్కు ( గృహ హింస నిరోధక చట్టం 2005)
4. ప్రసూతి ప్రయోజనాల హక్కు( ప్రసూతి ప్రయోజనాల హక్కు 1961)
5. న్యాయ సహాయ హక్కు ( లీగల్ సర్వీస్ అథారిటీ 1987 సెక్షన్ 12)
6. గోప్యత హక్కు ( సి ఆర్ పి ఎఫ్ సెక్షన్ 12)
7. ఆన్లైన్లో ఫిర్యాదుల హక్కు ( జీరో ఎఫ్ ఐ ఆర్ )
8. అరెస్టు కాకుండా ( సి ఆర్ పి ఎఫ్ సెక్షన్ 46)
9. పోలీసు స్టేషన్ కి వెళ్లకుండా ( సి ఆర్ పి ఎఫ్ సెక్షన్ 160)
10.సమాన వేతన హక్కు ( ఈక్వల్ రెమ్యునరేషన్ చట్టం 1976)
11. పని ప్రదేశాల్లో వేధింపుల అడ్డుకట్ట ( లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013)
12. పేరు చెప్పకుండా వుండే హక్కు ( సి ఆర్ పి ఎఫ్ సెక్షన్ 228 ఎ)
ఇన్ని హక్కులు రాజ్యాంగం కల్పించినా సమాజంలో స్త్రీల పరిస్థితులు అధ్వానంగానే ఉన్నాయి.
మహిళా సాధికారత ఎక్కడ : మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి పాలకులకు ఏ మాత్రమూ ఇష్టం లేదు. పురుషులకు సీట్ల సంఖ్య తగ్గిపోతుందని. ఏ పార్టీలు అధికారంలోకి వచ్చినా ఇదే వైఖరిని ప్రదర్శిస్తున్నాయి. 545 స్థానాలున్న లోక్‌సభలో 60 మంది మాత్రమే మహిళలున్నారు. 33 శాతం రిజర్వేషన్ అమలుకు తూట్లు పొడుస్తున్నారు.
తగ్గుతున్న మహిళల సంఖ్య : యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్, లైంగిక పునరుత్పత్తి ఆరోగ్య సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన 2020 నివేదిక ప్రకారం లింగ నిర్ధారణ పరీక్షల వల్ల కనుమరుగైన వారు మొత్తం సంఖ్యలో 2/3 వ వంతు కాగా, 2013 -17 మధ్య మనదేశంలో ప్రసవ సమయానికి 4 లక్షల 60 వేల మంది బాలికలు అంతరించారు. 2055 నాటికి ఇది గరిష్ట స్థాయిలో ఉంటుందని, ఈ అసమానత తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. జీవించే ప్రాధమిక హక్కును వారు కోల్పోతున్నారు.
అమలుకాని కనీస చట్టం : అసంఘటిత రంగంలో దాదాపుగా 94 శాతం మహిళలు పనిచేస్తున్నారు. వీరికి కనీస వేతనం గానీ, సమాన పనికి సమాన వేతనం గానీ అమలు జరగడం లేదు. మహిళలే పోషిస్తున్న కుటుంబాలు 2.69 కోట్లు దేశంలో ఉన్నాయి. మన రాష్ట్రంలో అయితే 30 లక్షలకు పైగా ఉన్నాయి. కనీస వేతనాలు అమలు కాకపోవడం వల్ల పోషకాహారం సరిగ్గా అందక 48 శాతం శ్రామిక మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. ప్రతి ఏటా లక్షల మంది మరణిస్తున్నారు. ఈ దుర్భర జీవనానికి కారణమైన విధానాలు హక్కులను హరిస్తున్నాయి.
విద్యా హక్కును కోల్పోతున్న బాలికలు : రాజ్యాంగంలో విద్యా హక్కును కల్పించారు. అయితే ఆ హక్కులు కూడా నూతన విద్యా విధానం పేరుతో తెచ్చిన సంస్కరణలతో ఈరోజు కోల్పోయే స్థితిలో ఉన్నారు. ఇది బాలల పాలిట శాపంగా మారింది. పాఠశాలల మూసివేత, దూర ప్రాంతాల నుండి బడికి వెళ్లవలసి రావడంతో డ్రాప్‌ఔట్స్ పెరుగుతారు. విలువలు లేని శ్రామికులుగా బాలికలుగా మారతారు. ఈవిధంగా విద్యా హక్కును కోల్పోతారు. నిరక్షరాస్యత తిరిగి పెరుగుతుంది. చైతన్యానికి దూరమవుతారు.
ఈ విధంగా మానవహక్కుల్లో భాగంగా అనేక ఉద్యమాల నేపథ్యంలో సాధించుకున్న మహిళా హక్కులపై దాడి జరుగుతోంది. ప్రస్తుత పాలకులు మనువాద అంశాలను పాఠ్యాంశాల్లో పొందుపరుస్తున్నారు. మహిళల వస్త్ర ధారణలపై, ఆహారపు అలవాట్లపై, అనుచిత వ్యాఖ్యలు ప్రభుత్వంలో వుండే పెద్దలే చేస్తున్నారంటే రాజ్యాంగం కల్పించిన హక్కులను విస్మరించడమే. సమాజంలో అభ్యుదయ భావాలు గల రచయితలను హత్యలు చేయిస్తున్నారు. ప్రశ్నించే హక్కును హరిస్తున్నారు.
అయితే మహిళల సమస్యలు కేవలం వారికి సంబంధించినవి మాత్రమేకావు. మొత్తం సమాజాన్ని ప్రభావితం చేసేవి. కనుక మనలో ప్రతిఘటన, పోరాటాలు పెరగాలి. ఉద్యమాలతో సాధించుకున్న హక్కులు, చట్టాలు నిర్వీర్యం కాకుండా వుండాలంటే రాజ్యాంగ పరమైన హక్కుల రక్షణకు పోరాడాలి. అందువల్లే....మహిళల హక్కులూ- మానవ హక్కులే.
యుటిఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,
ఎన్. ఎఫ్.డబ్ల్యు. టి స్టేట్ కన్వీనర్
89853 83255
కె. విజయగౌరి