Dec 05,2022 15:52

న్యూఢిల్లీ  :   భారత్‌లో కులం, పురుష, స్త్రీల పేరుతో, భౌగోళిక ప్రాంతాలు, వర్గాల పేరుతో వ్యక్తమౌతోన్న అసమానతల గురించి అందరికీ  తెలిసిందే. అయితే కొత్తగా డిజిటల్‌ (సాంకేతిక వినియోగం) పరంగానూ అసమానతలు వ్యక్తమవుతున్నాయని ఆక్స్‌ఫామ్‌ నివేదిక పేర్కొంది. డిజిటల్‌ విభజనతో మహిళలు, గ్రామీణ ప్రజలు, నిరుద్యోగులు మరింత  వెనకబడుతున్నారని తెలిపింది. 2021లో 61 శాతం మంది పురుషులు మొబైల్‌ ఫోన్‌లను కలిగి ఉండగా, మహిళల్లో కేవలం 31 శాతానికి మాత్రమే పరిమితమైందని ''భారత్‌లో అసమానతలు నివేదిక 2022- డిజిటల్‌ విభజన'' నివేదికలో పేర్కొంది.

డిజిటల్‌ టెక్నాలజీ పరిధి అధికంగా పురుషులతో పాటు పట్టణాలకు, ఉన్నతకులాలు, ఉన్నత తరగతికి చెందిన వ్యక్తులకు మాత్రమే పరిమితమైంది. సాధారణ కులాల్లో 8 శాతం మంది మొబైల్‌, ల్యాప్‌టాప్‌, కంప్యూటర్‌ వంటి డిజిటల్‌ పరికరాలను వినియోగిస్తుండగా, ఒక్కశాతం కంటే తక్కువగా గిరిజనులు (ఎస్‌టి), షెడ్యూల్డ్‌ తరగతులు (ఎస్‌సి) 2 శాతం వినియోగిస్తున్నారు. ఉద్యోగ స్థితి ఆధారంగా డిజిటల్‌ విభజనను నివేదిక వెల్లడించింది. 2021లో వేతనాలు పొందుతున్న 95 శాతం శాశ్వత కార్మికులకు మొబైల్‌ ఉండగా, నిరుద్యోగుల్లో కేవలం 50 శాతం మంది మొబైల్‌లను కలిగి ఉన్నారు. వాస్తవానికి  గ్రామీణ ప్రాంతాల్లో కంప్యూటర్‌ల  వినియోగం తగ్గిందని నివేదిక ఉద్ఘాటించింది. మహమ్మారికి ముందు గ్రామీణ జనాభాలో 3 శాతం సొంత కంప్యూటర్‌లను వినియోగించగా, కరోనా అనంతరం ఒక్క శాతానికి పడిపోయినట్లు తెలిపింది.

డిజిట్‌ విభజన .. పరిణామాలు
విద్య, ఆరోగ్యం వంటి అత్యవసరమైన సేవలను పొందేందుకు డిజిటల్‌ సేవలను వినియోగిస్తుండటం దేశ డిజిటల్‌ విభజనను ప్రతిబింబిస్తోంది. సెప్టెంబర్‌ 2020 లాక్‌డౌన్‌ సమయంలో 82 శాతం మంది తల్లిదండ్రులు తమ చిన్నారులకు విద్యలో డిజిటల్‌ సాంకేతికతను అందించడంలో సవాళ్లను ఎదుర్కొనగా, సిగల్‌, ఇంటర్నెట్‌ స్పీడ్‌ అనేవి ప్రైవేట్‌ పాఠశాలలకు సమస్యలుగా మారాయని ఓ ఎన్‌జివో పేర్కొంది. ఐదు రాష్ట్రాలపై లాక్‌డౌన్‌లో ఈ సర్వే చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల విషయానికొస్తే.. లాక్‌డౌన్‌ సమయంలో తమ విద్యార్థులకు విద్య అందలేదని 80 శాతం మంది తల్లిదండ్రులు తెలిపారు. ఇంటర్నెట్‌, డిజిటల్‌ పరికరాల కొరత కారణంగా డిజిటల్‌ విద్యను అందించడం కష్టతరంగా మారిందని 84 శాతం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు పేర్కొన్నారు. డిజిటల్‌ టెక్నాలజీ అభివృద్ధి చెందుతుండటంతో ప్రజాసేవలు, ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుబాటులో ఉండాలి. కానీ వాస్తవానికి అది జరగడం లేదిన నివేదిక తేల్చింది.

మరోవైపు, ధనికవర్గాలకు డిజిటల్‌ టెక్నాలజీలు ఎలా అందుబాటులో ఉంటున్నాయి. అదనపు ప్రయోజనాలు ఎలా పొందుతున్నారన్న అంశాన్ని ఈ నివేదిక హైలెట్‌ చేసింది. నిరక్షరాస్యులతో పోలిస్తే పిజి విద్యార్థి లేదా పిహెచ్‌డి చేస్తున్న వారికి 60 శాతం ఫోన్‌ను కలిగే అవకాశం ఉందని ఆక్స్‌ఫామ్‌ ఇండియా సిఇఒ అమితాబ్‌ బెహర్‌ తెలిపారు. డిజిటల్‌ విభజన కారణంగా భారత్‌లో పెరుగుతున్న అసమానతలను మరింత తీవ్రతరం చేస్తోంది. డిజిటల్‌ పరికరాలు, ఇంటర్నెట్‌ లేని వ్యక్తులు విద్య, ఆరోగ్యం, ప్రజాసేవలను పొందడంలో వెనకబడి ఉంటున్నారని, తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, అసమానతలను పెంచి పోషిస్తున్న ఈ విష చక్రాన్ని నిలువరించాల్సి ఉందని బెహర్‌ పేర్కొన్నారు.

డిజిటల్‌ రంగంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇంటర్నెట్‌ కనెక్టివిటీని వ్యాప్తి చేయాలని, స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా నెట్‌ను పొందేలా చూడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరోసా ఇవ్వాలని ఎన్‌జిఓ కోరింది. జనవరి 2018 నుండి డిసెంబర్‌ 2021వరకు సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ అందించిన ప్రాథమిక స మాచారం, నేషనల్‌ శాంపిల్‌ సర్వే సెకండరీ సర్వే ల విశ్లేషణ ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది.