
- మెగా అంటూ ఊరించిన ప్రభుత్వం
- ఎదురుచూస్తోన్న నిరుద్యోగులు
- ఖాళీలు 12వేలకు పైనే
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన డిఎస్‌సి నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం మరిచిపోయింది. ప్రతి ఏటా నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వం పొందుపరిచింది. గడిచిన నాలుగేళ్లలో కేవలం ఒక్క డిఎస్‌సి నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేయలేదు. ఉపాధ్యాయ విద్య పూర్తిచేసిన అభ్యర్థులు ప్రభుత్వ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. విద్యాశాఖలో సుమారు 12 వేల వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏడాదిన్నర వరకు 25 వేల వరకు ఖాళీలున్న పోస్టులను జిఓ 117తో ప్రభుత్వం 7 వేల వరకు తగ్గించింది. మరో 6 వేల పోస్టులను డిఎస్‌సి-1998, డిఎస్‌సి-2008 అభ్యర్థులతో సర్దుబాటు చేసింది. 117 జిఓతో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని పెంచి పోస్టులను కుదించింది. మరోపక్క వచ్చే జనవరి నాటికి మరో 5 వేలమంది ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ చేయనున్నారు.
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఉపాధ్యాయ పోస్టులు 717 మాత్రమే ఖాళీగా ఉన్నాయని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శాసనమండలిలో సమాధానం చెప్పారు. కేంద్రానికి మాత్రం రాష్ట్రంలో సుమారు 50వేల పై చిలుకు పోస్టులు ఖాళీగా ఉన్నాయని పాఠశాల విద్యాశాఖ నివేదిక పంపింది. రాష్ట్రంలో సుమారు 14వేల వరకు ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. ఒక్క టీచరే అన్ని తరగతులకూ బోధించడం ఉపాధ్యాయులకు భారంగా మారింది. ఈ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు సెలవు పెడితే ఇక ఆ రోజు బడిని మూసివేయాల్సిందే. నెలరోజుల క్రితం పోస్టుల సంఖ్య చెప్పకుండా మెగా డిఎస్‌సిని త్వరలో విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స పేర్కొన్నారు. ఇప్పటి వరకు డిఎస్‌సిపై విద్యాశాఖ కసరత్తు చేయలేదు. మరోపక్క ప్రతి మండల కేంద్రంలో రిజర్వుడు టీచర్ల విధానం తీసుకొస్తామని చెబుతున్నారు. దీనిపై కూడా విద్యాశాఖ ఎలాంటి కసర్తు చేయడం లేదు. ప్రతి ఏటా నిర్వహించాల్సిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ను కూడా ప్రభుత్వం నిర్వహించడం లేదు. గడిచిన ఐదేళ్లలో 2018, 2022లో మాత్రమే టెట్ నిర్వహించింది. పాఠశాల విద్యాశాఖ 2022లో నిర్వహించిన టెట్‌కు 5,25,789 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 4,07,329 మంది హాజరయ్యారు. వీరిలో 2.40 లక్షలు (58.07 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. 2018లో నిర్వహించిన టెట్‌లో మరో 3 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. వీరితోపాటు ఉపాధ్యాయ విద్య పూర్తిచేసిన అభ్యర్థులు కూడా డిఎస్‌సి నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు.