Jul 28,2023 07:07

మహిళలకు విలువ ఇవ్వని ఈ మనువాద పాలకులు అధికార పీఠాలు పొందారు. కడుపులో చేయిపెట్టి తిప్పినట్లు ప్రతి నిముషం ఎక్కడో ఒకచోట ఆడపిల్ల ఆర్తనాదం. దీనిని ఆపాలని మొత్తుకుంటున్నాం. ఆలకించడంలా? వదిలేద్దామా? వదిలేస్తే మనం బతగ్గలమా? రక్షణ ఉందా? మన బతుకుల కోసం మన బిడ్డల బతుకుల కోసం కదలాలి. బహు రూపాలలో. వంటరిగా కాదు. సమూహంగా. పాలకులకు చెవికెక్కే వరకు. వారు చెవినెక్కించుకోకపోతే గద్దె దించేందుకు.

          మణిపూర్‌లో మహిళలను నగంగా ఊరేగించిన ఘటన భారతీయ ప్రజానీకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. వెన్నులో వణుకు పుట్టించింది. స్త్రీలను గౌరవిస్తాం. మన భారతీయ సంస్కృతి ఇది అని చెప్పుకునే చోట...ఇంతగా బరితెగించి బహిరంగంగా మహిళలను నగంగా ఊరేగించే దుర్మార్గం ఏ రకంగా సాగింది? ''న స్త్రీ స్వాతంత్య్ర మర్హతి'' అంటూ కాలి కింద చెప్పు మాదిరి అణిచివేయాలనే దుర్మార్గపు సాంస్కృతిక నేపథ్యం దీనికి కారణం కాదా? ఈ దుర్మార్గపు సంస్కృతిని ముసుగులా వేసుకున్న పురుషాధిపత్య భావజాలాన్ని, భూస్వామ్య ప్రవృత్తిని మూలాలకంటా ఛేదించాల్సిన అవసరాన్ని మణిపూర్‌ ఘటనలు వెలుగులోకి తెచ్చాయి. ఆర్‌.ఎస్‌.ఎస్‌ సాంస్కృతిక సంస్థ అని చెప్పుకుంటూ కాలం చెల్లిపోయిన భూస్వామ్య పురుషాధిపత్యాన్ని పున:ప్రతిష్టించే ప్రయత్నం చేస్తున్నది.
          బిజెపి అధికారంలోకి వచ్చేవరకు తన భావజాలాన్ని జనం మీద రుద్దడానికి ఆర్‌ఎస్‌ఎస్‌కు పెద్దగా అవకాశం దొరకలేదు. చాప కింద నీరు మాదిరి పని చేస్తున్నా కోరలు పెరగలేదు. కానీ నయవంచక బిజెపి కేంద్రంలో అధికారంలోకి రావడంతో వారి ఎజెండాను అత్యంత చురుగ్గా అమలు చేయడం ప్రారంభించారు. తమ మిత్రులైన క్రోనీ క్యాపిటలిస్టుల లాభాల కోసం భూస్వామ్య సంస్కృతిని జోడించి మరీ ఈ దేశంలో దళితులపై, ఆదివాసీలపై, వెనకబడిన శూద్ర తరగతులపై బుల్డోజర్‌ నడిపిస్తున్నది. ఈ బడుగు బలహీనులను అణిచివేసేందుకు, సమస్త వనరులను కబ్జా చేసేందుకు పూనుకున్నది. కాశ్మీర్‌ భూభాగాన్ని క్రోనీ క్యాపిటలిస్టులకు అప్పజెప్పేందుకు 370 ఆర్టికల్‌ని రద్దు చేయడం చూశాం. ఆర్టికల్‌ 370 రద్దుకు ముందు ఓ ముస్లిం బాలికపై గుడిలో అత్యాచారానికి తెగబడడం గుర్తుండే వుంటుంది. అక్కడ భూమిని కబ్జా చేసేందుకే మైనారిటీ తెగకు చెందిన ఆ చిట్టితల్లిని చిదిమివేశారు. నేడు మణిపూర్‌ కొండల్లో ఉన్న విలువైన ఖనిజ సంపద కోసం రావణ కాష్టం రగిలించారు.
        ఆ జ్వాలల్లో ఆడపిల్లలు సమిధలవుతున్నారు. ఒకరా? ఇద్దరా? ముగ్గురా? ఎందరు? లెక్కలు తేలాల్సి ఉంది. అసలు తేలుతాయా? అన్నది ఈ రోజు అందరూ అడుగుతున్న ప్రశ్న. ఈ ఘటనలు చోటుచేసుకున్న రెండు నెలల వరకు, వీడియో వెలుగులోకి వచ్చేవరకు, సుప్రీంకోర్టు హెచ్చరిక చేసే వరకు ప్రధానికి తెలియదా? తెలుసని ఈ దేశ ప్రజలు ఈ రోజు నమ్ముతున్నారు. తెలియడం మాత్రమే కాదు, వాటికి ప్రధాని, ఆయనను నడిపించే ఆర్‌ఎస్‌ఎస్‌ ఆమోదం కూడా ఉందని. ఆమోదం లేదా? దీనికి వారు సమాధానం చెప్పగలిగే ఖలేజా ఉందా? బిల్కిస్‌ బానో మన ఆడపడుచు. పోరాడి గెలిచింది. ఏం చేశారు? ఆగస్టు 15 అమృతోత్సవాల సంబరాల్లో నిందితులకు స్వేచ్ఛనిచ్చారు. పైగా ఏమన్నారు? బ్రాహ్మణులు-సంస్కారవంతులు. అంటే ఏమిటి అర్థం. ఇతర కులాలకు చెందిన వారు సంస్కారవంతులు కారనా! అత్యాచారానికి పాల్పడిన వారు సంస్కారవంతులెలా అవుతారు? 'ఈ దేశంలో స్త్రీ బ్రాహ్మణులకు మొదటి హక్కు. స్త్రీకి స్వతంత్రత లేదు'-అని మనుధర్మం చెప్తుంది. దాన్నే వీరు తమ చేతల్లో చూపిస్తున్నారు. సంఘీయుల ప్రకారం కోర్టులు మను ధర్మాన్ని తప్ప ఐపిసిని అనుసరించకూడదు. హత్రాస్‌లో కోర్టు ఆ మనుధర్మాన్నే పాటించింది. ఎవరైనా చనిపోయినప్పుడు కొన్ని సాంప్రదాయాలు పాటిస్తుంటాం. అయితే అవి అందరికీ లేవు. దళితులకు అసలే లేవు. అందుకే మనీషా వాల్మీకిని అర్థరాత్రి దహనం చేశారు. ప్రజాప్రతినిధి సింగార్‌ అత్యాచారం చేసిన కేసులో జైలుకు వెళ్ళాడు. కానీ బిజెపి నాయకత్వం పూలదండలతో స్వాగతించి భుజాన మోశారు. రెజ్లర్లు మన బిడ్డలు. కఠోర దీక్షతో విజయాలను ముద్దాడిన ప్రియపుత్రికలు. ఈ దేశ ప్రతిష్టను ప్రపంచ పటంలో నిలబెట్టిన ఆడపిల్లలు. భద్రంగా కాపాడుకోవాల్సిన బిడ్డలు. తమ మీద లైంగిక దాడి జరిగిందని, న్యాయం చేయమని వారు రోడ్డెక్కినా ప్రధాని మోడీ మాట్లాడలేదని మన దేశ ప్రజలు ఆశ్చర్యపోయారు. ఔరా! ఇంతటి దుర్మార్గానికి పాల్పడిన తమ సొంత పార్టీ మనిషిని మోడీ వెనకేసుకొస్తున్నాడేమని ఆశ్చర్యపోయారు అమాయకపు ప్రజలు. స్త్రీలు నో అంటే నో అనే అర్థమని అమితాబ్‌ బచన్‌ సినిమాలో చెప్తే మాకేంటి? మేం కోరుకున్న మహిళ మా చెంత ఉండాల్సిందే! అనే ధోరణే దీనికి కారణం కాదా.
           ఈ రోజు గుంటూరులో ఓ రమ్య, విశాఖలో ఓ వరలక్ష్మి, విజయవాడలో ఓ దీపిక...ఇలా ఎన్ని పేర్లని చెప్పుకోవాలి? ఆడపిల్లను కోరుకున్నప్పుడు కాదంటే చంపటం ఈ భావజాలం వల్లే కదా! మహిళలకు విలువ ఇవ్వని ఈ మనువాద పాలకులు అధికార పీఠాలు పొందారు. కడుపులో చేయిపెట్టి తిప్పినట్లు ప్రతి నిముషం ఎక్కడో ఒకచోట ఆడపిల్ల ఆర్తనాదం. దీనిని ఆపాలని మొత్తుకుంటున్నాం. ఆలకించడంలా? వదిలేద్దామా? వదిలేస్తే మనం బతగ్గలమా? రక్షణ ఉందా? మన బతుకుల కోసం మన బిడ్డల బతుకుల కోసం కదలాలి. బహు రూపాలలో. వంటరిగా కాదు. సమూహంగా పాలకులకు చెవికెక్కే వరకు. వారు చెవి నెక్కించుకోకపోతే గద్దె దించేందుకు. మహిళల రక్షణ కోసం ఆర్తితో, ఆవేదనతో, ఆగ్రహంతో మహిళా సంఘం ఓ బృహత్తర కార్యక్రమం చేపట్టింది. మహిళా సంఘాలు కలిసి రూపొందించిన కోర్కెల పత్రాన్ని ప్రజల ఎజెండాగా ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
           మహిళల రక్షణ కోసం నేడు పోరాట గడ్డ ఉక్కు నగరం విశాఖ నుండి ఒక యాత్ర, హిందూపురం నుండి మరో యాత్ర ప్రారంభమైంది. హింస లేని సమాజం కోసం అన్ని జిల్లాల్లోనూ విస్తృతంగా ప్రచార సభలు జరగనున్నాయి. ఆగస్టు 8న విజయవాడలో జరగనున్న బహిరంగ సభ నుంచి మహిళా రక్షణ కోసం చేయి చేయి కలిపి నడుద్దాం. ఈ మహఉద్యమంలో భాగస్వాములమవుదాం. మనువాద రాచరిక సంస్కృతిని, దానిని కాపాడే వారిని నిలదీద్దాం. వెలివేద్దాం.
 

                                                                       ఇవి డిమాండ్లు ...

  • మహిళలపై జరుగుతున్న నేరాలను అధ్యయనం చేయటానికి, చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం న్యాయ నిపుణులతో కమిషన్‌ ఏర్పాటు చేయాలి.
  • మహిళలపై హింసను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని మహిళా సంఘాలు స్వచ్ఛంద సంస్థలను ఆహ్వానించి కార్యాచరణను రూపొందించాలి.
  • మహిళలకు, చిన్నారులకు రక్షణ కల్పించే చట్టాలను కఠినంగా అమలు చేయాలి.
  • నిందితులను ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల ద్వారా త్వరితగతిన విచారణ జరిపి కఠినమైన శిక్షలు విధించాలి. చెరుకుపల్లి మండలంలో అమర్నాథ్‌ హత్య కేసును ఫాస్ట్‌ ట్రాక్‌కు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేయాలి.
  • ప్రభుత్వం మీడియా మానిటరింగ్‌ కమిటీ ఏర్పాటు చేయాలి. హింస, అశ్లీలత, అసమానతలను ప్రేరేపించే చలనచిత్రాలు, టీవీ సీరియల్స్‌, ఇంటర్నెట్‌ కార్యక్రమాలను నిషేధించాలి.
  • సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ లపై చర్యలు ఉండాలి.
  • కాలేజీల్లో, పని ప్రదేశాల్లో వేధింపులను నిరోధించేందుకు అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చేయాలి, అమలు చేయాలి.
  • అన్ని విద్యాలయాల్లో లింగ సమానత్వాన్ని పెంపొందించే సిలబస్‌ ను రూపొందించాలి. బాల బాలికల మధ్య స్నేహపూర్వక అవగాహనను కల్పించాలి.
  • పాఠశాలల్లో శారీరక దారుఢ్యాన్ని పెంచే ఆటలు, ఆత్మరక్షణ శిక్షణ కార్యక్రమాలు... అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి.
  • వన్‌ స్టాప్‌ సెంటర్లు, హెల్ప్‌ లైన్లు ఉమ్మడిగా సమన్వయంతో పని చేసే ఏర్పాటు చేయాలి. తగిన సిబ్బందిని నియమించాలి. ఏ నెలకానెల జీతాలు చెల్లింపు చేయాలి.
  • మద్యం, మత్తు పదార్థాలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలి. మండలానికి ఒక మద్యం షాపును మాత్రమే అనుమతించాలి.
  • మద్యం, మత్తుమందులకు వ్యతిరేకంగా ప్రభుత్వం విస్తృత ప్రచారం చేయాలి. మద్యం మీద వస్తున్న ఆదాయంలో కనీసం ఒక్క శాతమైనా మద్య నియంత్రణకు కేటాయించాలి.
  • డి-అడిక్షన్‌ కేంద్రాలు ప్రతి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో ఏర్పాటు చేయాలి.
  • బాల్య వివాహాల నిరోధానికిగాను బాలికలకు నిర్బంధ విద్య 19 సంవత్సరాల వరకు పెంచాలి.
  • ఒంటరి మహిళలకు, వారి కుటుంబాల్లోని పిల్లలకు అదనపు రక్షణ సదుపాయాలు ఏర్పాటు చేయాలి.
  • అనాథ బాలలు, ఆడపిల్లలు ఉన్న హాస్టళ్లలో, గెస్ట్‌ హౌస్‌లో పురుష సిబ్బంది ఉండరాదు.
  • పోలీసులకు జండర్‌ సెన్సిటివిటీ పెంచడానికి క్రమబద్ధంగా శిక్షణ కార్యక్రమాలు ఉండాలి. సక్రమంగా లేని పోలీసు ఆఫీసర్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి.
  • మహిళల సమానత సాధనకు చర్యలు ముమ్మరం చేయడం ద్వారానే హింసను కూడా అరికట్టడం సాధ్యమవుతుంది. కనుక అన్ని రంగాల్లో సమానత సాధనకు ప్రభుత్వం పూనుకోవాలి.
  • బాధితుల పునరావాసం కోసం కంపెన్సేషన్‌ ఇవ్వవలసిన నిధులను నెలలోగా అందించే విధంగా చర్యలు తీసుకోవాలి.
  • ఉపాధి గ్యారంటీ పథకాలు రూపొందించి అమలు చేయాలి. పెద్ద సంఖ్యలో ఉన్న అసంఘటిత మహిళా కార్మికులకు కార్మిక చట్టాలు అమలు పరిచేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి.
  • ప్రతి వారం ఒక ప్రాంతంలో మండల అధికారులు మహిళల హక్కులను వివరిస్తూ అమలుకు పూనుకునే విధంగా ప్రచారం, కార్యాచరణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి.
  • మహిళలకు విద్య, రక్షణ, ఉపాధి భద్రత కల్పించేందుకు రాజ్యాంగ విలువలను కాపాడే పద్ధతులను అమలు చేసేందుకు ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించి అమలు చేయాలి.

/ వ్యాసకర్త ఐద్వా రాష్ట్ర కార్యదర్శి /
డి. రమాదేవి

డి. రమాదేవి