Nov 07,2023 07:29

         ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయాన కేంద్ర అధికార పార్టీ బిజెపి తీవ్ర సంక్షోభంలోకి వెళ్తున్నట్లు వారి చర్యలు తెలియజేస్తున్నాయి. గత తొమ్మిదేళ్లుగా అవలంబిస్తున్న ప్రచార వ్యూహాలు అంతగా పని చేయకపోవడం బిజెపికి నిరాశ మిగిల్చింది. హిందీ మాట్లాడే మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో బిజెపి వ్యతిరేక సెంటిమెంట్‌ బలంగా, స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ మూడు రాష్ట్రాల్లో మోడీ-అమిత్‌ షా ద్వయం ఇష్టం లేకపోయినా...శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ (మధ్యప్రదేశ్‌), వసుంధర రాజె సింధియా (రాజస్థాన్‌), రమణ్‌సింగ్‌ (ఛత్తీస్‌గఢ్‌)కు టికెట్లు ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చింది. మిజోరంలో అధికార పార్టీ 'మిజో నేషనల్‌ ఫ్రంట్‌' బిజెపిని దూరం పెడుతోంది. తెలంగాణలో బిజెపి కి ఆశ లేదు. అక్కడ బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్యే ప్రధాన పోరు నెలకొంది.
         తొమ్మిదేళ్ల క్రితం కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ బిజెపి స్టార్‌ క్యాంపైనర్‌గా ప్రధాని వ్యవహరిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల లోనే కాదు, అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక ఎన్నికలు, ఉప ఎన్నికల్లో కూడా మోడీనే ప్రధాన ప్రచారకర్త. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు రోజుల పాటు ప్రచారం చేసిన ప్రధాని 19 ర్యాలీలు, ఆరు రోడ్‌ షోలలో పాల్గొన్నారు. మోడీకి పాలన కంటే సొంత పార్టీ ప్రచారమే ముఖ్యం. అలాంటిది మిజోరంలో ఈసారి ప్రచారానికి ప్రధాని దూరంగా ఉండడం సహజంగానే వార్తగా మారింది. అక్టోబర్‌ 30న మిజోరంలో ప్రధాని ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సి ఉంది. మిజో యేతర జనాభా అధికంగా ఉన్న మామిత్‌లో ప్రధాని బహిరంగ సభకు ఏర్పాట్లు జరిగాయి. అయితే ప్రధానితో వేదిక పంచుకోవడానికి తాను సిద్ధంగా లేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎన్డీయే నేత జోరమ్‌ తంగ చెప్పడంతో మోడీ సిగ్గుతో ప్రచారం నుంచి తప్పుకున్నారు. మణిపూర్‌లో డజన్ల కొద్దీ క్రైస్తవ చర్చిలను తగలబెట్టారు. అలాంటి బిజెపి ప్రధానితో వేదికను ఎలా పంచుకుంటామని జోరమ్‌ తంగ ప్రశ్నించారు. మిజోరం క్రైస్తవుల మెజారిటీ ఉన్న రాష్ట్రం. మయన్మార్‌ శరణార్థుల బయోమెట్రిక్‌ డేటా సేకరించాలని కేంద్రం చేసిన అభ్యర్థనను మిజోరం ప్రభుత్వం పట్టించుకోలేదు. మిజో నేషనల్‌ ఫ్రంట్‌ కూడా ఏకరూప పౌర స్మృతి (యుసిసి)ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ప్రకటించింది. ఎన్డీయే పక్షమైనప్పటికీ మోడీ ప్రభుత్వాన్ని విశ్వాసంలోకి తీసుకోవడానికి ఎంఎన్‌ఎఫ్‌ సిద్ధంగా లేదు. ఈ స్థితిలో మోడీ మిజోరం పర్యటనకు దూరంగా ఉన్నారు.మిజోరంలో ప్రచారానికి దూరంగా ఉండేందుకు ప్రధానిని ప్రేరేపించిన మరొక అంశాన్ని కూడా ప్రస్తావించుకోవాలి. మిజోరం వెళితే మణిపూర్‌లో ఎందుకు పర్యటించ డంలేదన్న ప్రశ్న ఉత్పన్నమౌతుంది. మే 3వ తేదీన మణిపూర్‌లో మారణహోమం ప్రారంభమైంది. నవంబర్‌ 3కి ఆరు నెలలు పూర్తవుతుంది. మోడీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మణిపూర్‌లో పర్యటించలేదు. బ్రిడ్జిలు, రోడ్లు, వందేభారత్‌ రైళ్లకు పచ్చ జెండా ఊపేందుకు తీరిక వుంది కానీ...డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం ఉన్న మణిపూర్‌లో పర్యటించడానికి ప్రధానికి తీరిక దొరకలేదని ప్రతిపక్షం ఇప్పటికే ఎద్దేవా చేసింది. ఒకవేళ మోడీ మిజోరం పర్యటించినట్లయితే... పక్కనే వున్న మణిపూర్‌ బాధితులను పరామర్శించాలన్న విపక్షాల డిమాండ్‌ ఊపందుకుంటుంది. ఈ కారణంగానే మోడీ మిజోరం ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఇది మోడీకి, బిజెపి కి గట్టి దెబ్బ.
       మోడీ, అమిత్‌ షాలు ఇప్పుడు హిందీ భాషా రాష్ట్రాల్లో బిజెపి వ్యతిరేక సెంటిమెంట్‌ను ఎలా అధిగమించాలనే అంశంపై పరిశోధనలు చేస్తున్నారు. హిందీ ప్రాంతంలోని మూడు రాష్ట్రాల్లో మత విద్వేషాలను తీవ్రం చేసే తన రెగ్యులర్‌ ఎజెండాకు తిరిగి వెళ్లేందుకు బిజెపి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే మోడీ-మందిరం, సనాతన ధర్మం వంటి అంశాలను బిజెపి నేతల చేత లేవనెత్తించారు. ఈ ఎన్నికల వ్యూహంలో భాగంగానే రామక్షేత్ర అంశం తిరిగి ముందుకొచ్చింది. జనవరి 22న అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభిస్తామని మోడీ ప్రకటించారు. అయితే ఈ అంశం మునుపటి లాగా ఓటర్లను ప్రభావితం చేయకపోవడం, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపలేక పోవడం బిజెపిని కలవరపెడుతోంది. అయినప్పటికీ మధ్యప్రదేశ్‌, ఇతర చోట్ల బిజెపి ఎన్నికల ప్రచారంలో అయోధ్య ఆలయ అంశాన్ని విస్తృతంగా ఉపయోగించారు. అక్టోబర్‌ 28 నుండి 30 వరకు మధ్యప్రదేశ్‌లో ప్రచారం చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా లేవనెత్తిన ప్రధాన అంశం రామమందిరమే. గతంలో డిఎంకే మంత్రి సనాతన ధర్మానికి వ్యతిరేకంగా తెరపైకి రాగానే...దాన్ని ప్రధాన ఎన్నికల అంశంగా మార్చేందుకు మోడీ సహా ముఖ్య నేతలంతా సిద్ధమయ్యారు. కానీ అది కూడా తగినంత దృష్టిని ఆకర్షించలేదు. హిందీ భాష వంటి వివాదాస్పద అంశాలను తెరపైకి తెచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాన్నివ్వకపోవడం బిజెపి వర్గాలను నిరాశకు గురిచేసింది. ఇలాంటి అంశాల కంటే నిరుద్యోగం, ధరల పెరుగుదల, అవినీతి తదితరాలపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. దీంతోపాటు కుల గణన చేయాలనే విపక్షాల డిమాండ్‌ కూడా చర్చనీయాంశం అవుతోంది. అయితే అధికారం, డబ్బు బిజెపికి అనుకూల అంశాలు. బిజెపి కి ఎలాంటి రాజకీయ విలువలపైనా నమ్మకం లేదు. ఎలాగైనా గెలుపు సాధించాలన్నదే లక్ష్యం.
            అఖిల భారత స్థాయిలో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విశాల ప్రతిపక్ష వేదిక 'ఇండియా'ను ఏర్పాటు చేసినప్పటికీ, అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ చొరవతో ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధంగా లేకపోవడం శోచనీయం. ఉదాహరణకు మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసేందుకు సమాజ్‌వాది పార్టీ సిద్ధమైంది. ఉత్తరప్రదేశ్‌కు ఆనుకుని ఉన్న మధ్యప్రదేశ్‌ జిల్లాల్లో సమాజ్‌వాది పార్టీ ప్రభావం ఉంది. గతసారి ఎస్‌.పి కి ఒక్క సీటు వచ్చింది. నాలుగు నుంచి ఆరు సీట్లు ఇస్తే పొత్తు పెట్టుకోవచ్చని ఎస్‌.పి తెలియజేసింది. ఎస్‌.పి నేత అఖిలేష్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ నేత దిగ్విజరు సింగ్‌ కూటమి ఏర్పాటు కానుందని సమాచారం. అయితే ఎస్‌.పి సిట్టింగ్‌ సీటుతో సహా ఏకపక్షంగా కాంగ్రెస్‌ అభ్యర్థిని ప్రకటించడంతో పొత్తు కుప్పకూలింది. దాంతో అఖిలేష్‌ యాదవ్‌ మరింత ముందుకెళ్లిపోయి....లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు సీటు ఇచ్చేందుకు తాను సిద్ధంగా లేనన్నారు. దీన్ని బట్టి, కాంగ్రెస్‌ ఇతర పార్టీలను అంగీకరించలేకపోతోంది. వాటితో కలిసి ముందుకు సాగడం లేదన్న వాస్తవం అర్థమౌతున్నది. రాజస్థాన్‌లోనూ ఇదే పరిస్థితి. తెలంగాణ సంగతి సరేసరి. కాంగ్రెస్‌ ఒక్కటే బిజెపి ని గద్దె దించలేదనే రాజకీయ వాస్తవాన్ని అంగీకరించడానికి వారు ఇప్పటికీ సిద్ధంగా లేరు. లోక్‌సభ ఎన్నికలలో కూడా కాంగ్రెస్‌ ఇదే విధానాన్ని అవలంబిస్తే ఆత్మహత్యా సదృశ్యమే అవుతుంది.

/'దేశాభిమాని' సౌజన్యంతో/
వి.బి. పరమేశ్వరన్‌

22