May 23,2023 07:44

         లామణిలో ఉన్న రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణకు రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మే 23 నుంచి సెప్టెంబర్‌ 30 లోపు తమ వద్ద రెండు వేల నోట్లున్నవారు బ్యాంకుల్లో, ఆర్‌బిఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మార్చుకొనే అవకాశం కల్పించింది. అందుకు కొన్ని పరిమితులు విధించింది. క్లీన్‌ నోట్‌ పాలసీ కింద 2 వేల నోటు రద్దు చేశామంటున్నారు ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌. క్లీన్‌ పాలసీ అంటే ప్రజలకు మంచి నాణ్యమైన నోట్లు అందుబాటులోకి తేవడం. ప్రస్తుత కరెన్సీలో రద్దు పరిచిన రెండు వేల నోట్ల విలువ రూ.3.62 లక్షల కోట్లు. మొత్తం కరెన్సీ నోట్లల్లో 10.18 శాతం. 2016 నవంబర్‌లో ఉన్నపళాన రూ.500, రూ.1,000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేశాక జనాల్లోకి త్వరితగతిన నోట్లను చొప్పించడానికి రెండు వేల నోటు ప్రవేశపెట్టారు. 2018 మార్చి నాటికి చలామణిలో రూ.6.73 లక్షల కోట్ల విలువైన రెండు వేల నోట్లున్నాయి. మొత్తం అన్ని రకాల నోట్లలో అవి 37.3 శాతం. 2018-19లోనే రెండు వేల నోట్ల ముద్రణను ఆర్‌బిఐ నిలిపేసింది. అందుకే చలామణిలో 2 వేల నోట్లు గణనీయంగా తగ్గాయని ఆర్‌బిఐ చెపుతోంది.
          2016 నవంబర్‌ 8 రాత్రి నుంచే పెద్ద నోట్లు రద్దు (డీ-మోనిటైజేషన్‌) చేసినట్లు స్వయంగా ప్రధాని మోడీ ప్రకటించారు. నల్లధనం, అవినీతి, ఉగ్రవాద కార్యకలాపాల నిధుల సమీకరణకు పరిష్కారంగా డీ-మోనిటైజేషన్‌ను పేర్కొన్నారు. ఆచరణలో ఆ లక్ష్యాలేవీ నెరవేరలేదు సరికదా పెద్దలు నేలమాళిగల్లో దాచుకున్న పెద్ద నోట్లన్నీ ఖజానాకు చేరాయి. కనీసం రూ.నాలుగైదు లక్షల కోట్ల నల్లధనం పట్టుబడుతుందని చెప్పగా చలామణిలో వున్నదాని కంటే ఎక్కువ బ్యాంకులకు చేరి తెల్లధనంగా మారిపోయింది. కానీ పేదలు, సామాన్యులు, కష్ట జీవుల జీవనోపాధులు ఘోరంగా దెబ్బతిన్నాయి. అసంఘటిత, సూక్ష్మ, చిన్నతరహా, సన్నకారు పరిశ్రమలు ధ్వంసమయ్యాయి. నోట్ల మార్పిడి కోసం క్యూలైన్లలో గంటల తరబడి బ్యాంకులు, ఎటిఎంల వద్ద బారులు తీరిన నాటి భయంకర దృష్టాంతాలు ఇప్పటికీ కళ్లల్లో మెదులుతున్నాయి. క్యూలైన్లలోనే వందలాది మంది ప్రాణాలు విడిచారు. ఒత్తిడి తట్టుకోలేక బ్యాంకు అధికారులు సైతం కౌంటర్లలో మరణించిన విషాద ఘటనలున్నాయి. డీ-మోనిటైషన్‌ తాలూకు ప్రతికూల ప్రభావాలు నేటికీ కనిపిస్తున్నాయి. దేశం, ఆర్థిక వ్యవస్థ ఇంకా కోలుకోలేదు. మన కరెన్సీ వ్యవస్థ విశ్వాసాన్ని నోట్ల రద్దు నాశనం చేసింది.
నాటి డీ-మోనిటైజేషన్‌ అవాంఛిత బిడ్డనే 2 వేల నోటు అని సాక్షాత్తు ఆర్‌బిఐ గవర్నర్‌ వెల్లడించారంటే ప్రభుత్వ చర్య వాంఛితం కాదని అర్థమవుతూనే ఉంది. నాటి పెద్ద నోట్ల రద్దు చర్యకు ఇప్పటి 2 వేల నోట్ల ఉపసంహరణకు పెద్దగా తేడా ఏమీ లేదు. తేడా అల్లా అప్పుడేమో ప్రధాని మోడీ ప్రకటన చేయగా ఇప్పుడు ఆర్‌బిఐ గవర్నర్‌ ఆ పాత్ర పోషించారు. డీ-మోనిటైజేషన్‌ కేసుపై ఇటీవల సుప్రీంకోర్టు ఆ పని చేయాల్సింది ఆర్‌బిఐ గవర్నర్‌ అని సూచించింది. అందుకే ఈ మార్పు. ఇక అప్పుడు రద్దు చేసిన నోట్లు 84 శాతంకాగా ప్రస్తుతం 10 శాతం. ఒక దేశ ప్రభుత్వం తన సొంత ప్రజలను, దేశ ఆర్థిక వ్యవస్థను అసంఖ్యాక సంక్షోభాల లోతుల్లోకి నెట్టిన ఆ రోజులు మళ్లీ గుర్తుకొస్తున్నాయి. భారత కరెన్సీ వ్యవస్థలో అత్యధికంగా చలామణిలో ఉన్న రూ.500, 1,000 నోట్లను నిషేధిస్తూ చేసిన ప్రకటన మానవ నిర్మిత విపత్తుకు నాంది పలికింది. ప్రపంచం మునుపెన్నడూ చూడని దుస్థితికి మోడీ సర్కారు తీసుకెళ్లింది. క్షణాల్లో జేబులో ఉన్న నోటు రద్దు చేసిన విచిత్రం. కేంద్ర ప్రభుత్వం సృష్టించిన సంక్షోభానికి విరుగుడుగా 2 వేల నోట్లు ముద్రించారు. ఇప్పుడు చలామణి నుంచి ఆ నోటును ఉపసంహరించడమంటే అప్పటి చర్య లోని వ్యర్ధం, వైఫల్యం మరోసారి రుజువైంది. నష్ట నివారణకే కేంద్రం ఏడేళ్ల తర్వాత 2 వేల నోటును రద్దు చేసింది. గత అనుభవాలరీత్యా నల్లధనం ప్రక్షాళన కంటే నల్లధనం చట్టబద్ధతకే 2 వేల నోటు రద్దు పనికొస్తుంది. ఈ సత్యం మోడీ ప్రభుత్వానికి తెలీకకాదు. కార్పొరేట్ల కోసమే పని చేస్తున్న బిజెపి ప్రభుత్వ చర్యలను ప్రజలు వ్యతిరేకించాలి.