Aug 28,2023 16:47

ప్రజాశక్తి కాకినాడ : కాకినాడ జిల్లాలో 2023, ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికానికి జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా మొత్తం 40,397 మంది విద్యార్థులకు రూ. 27.43 కోట్ల మేర లబ్ధి జరుగుతోందని కలెక్టర్‌ డా.కృతికా శుక్లా వెల్లడించారు. 2023, ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తాన్ని నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమచేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తూరు జిల్లా నగరిలో సోమవారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో జగనన్న విద్యా దీవెన జిల్లాస్థాయి కార్యక్రమం కాకినాడ కలెక్టరేట్‌ వివేకానందహాల్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ కృతికా శుక్లా, ఛైర్‌పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి డీవీ రమణమూర్తి తదితరులతో పాటు వివిధ కళాశాలల విద్యార్థులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి బటన్‌ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఫీజు మొత్తాన్ని జమచేసిన అనంతరం కలెక్టర్‌ డా. కృతికా శుక్లా, కుడా ఛైర్‌పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి అధికారులతో కలిసి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తం మెగా చెక్‌ను విద్యార్థులకు అందించి, శుభాకాంక్షలు తెలియజేశారు.