Nov 05,2023 12:07

విశ్వం ఉద్భవం.. జీవం పుట్టుక.. ప్రాణి మనుగడ.. ఒకటేమిటి సమస్తం సైన్సు మయం. సూర్యకిరణాల ప్రతాపం.. చంద్రుని వెలుగుల ప్రశాంతం.. ఆ కిరణాల ప్రసరణ.. పరావర్తనం.. వికిరణం.. ఇవన్నీ మన జీవనంలో నిబిడీకృతమైన సైన్సు ప్రాభవమే. నిగూఢాన్ని నిగ్గుదేల్చడం సైన్సు లక్షణం. నిజాన్ని నిరూపించడం సైన్సు విధి. సైన్సుకు కేరాఫ్‌ అడ్రస్‌ శాస్త్రీయ దృక్పథం. పరిణామంలో ప్రతి ప్రక్రియ సైన్సు పరివర్తనమే. ప్రకృతిలోని అందాలు సైన్సు. ఆ అందాలను ఆస్వాదించకుండా ఆక్రమించాలనుకుంటే వికృతరూపం దాల్చేదీ సైన్సే. నిన్నమొన్నటి చంద్రయానమూ.. ఆదిత్య ఎల్‌ -1 ప్రయోగమూ.. శాస్త్రీయ పరిశోధనలే కదా..! మరి వీటన్నింటిపై ప్రజలకు అవగాహన ఉంటేనే సుస్థిరమైన జీవనం కొనసాగుతుంది. ఆ ఉద్దేశ్యంతోనే నవంబరు 10న జరుపుకునే 'శాంతి- అభివృద్ధి కోసం ప్రపంచ సైన్స్‌ దినోత్సవం' సందర్భంగా ఈ సంక్షిప్త కథనం.

సైన్సు మన జీవితంలో భాగం. నిత్యం వాడే చిన్న వస్తువుల నుంచి నిన్న మొన్నటి చంద్రయానం వరకూ సైన్సు మనకిచ్చిన కానుకలే. ఈ సైన్సు దినోత్సవం కొన్ని లక్ష్యాలతో ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం ఒక థీమ్‌తో నిర్వహించుకుంటున్నాం. 'స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడం', 'శాంతియుత జీవనం కొనసాగించడానికి సైన్సుపై అవగాహన, శాస్త్రీయ, సాంకేతికపరిజ్ఞాన వినియోగం, 'అంతర్జాతీయ సంఘీభావం', 'సైన్సు ఎదుర్కొంటున్న సవాళ్లపై దృష్టి' లాంటి లక్ష్యాలపై ప్రతి పౌరుడికి అవగాహన ఉండాలనేది ఈ ఉత్సవ ఉద్దేశ్యం.
 

                                                                       స్థిరమైన అభివృద్ధి లక్ష్యంగా..

మానవాళికిగానీ, నింగి, నేల, ఇతర జీవరాశులకుగానీ ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా అభివృద్ధి జరగాలనేది ఒక లక్ష్యం. దీనిని ప్రజలకు అందివ్వాలంటే ప్రభుత్వాలే పట్టం గట్టాలి. శాస్త్రీయ అక్షరాస్యతను అందించాలి. అప్పుడే ప్రజలకు సైన్సు పట్ల విశ్వాసం కలుగుతుంది. స్థిరమైన అభివృద్ధికి పునాది ఏర్పడుతుంది.
 

                                                                                 అలా కాకపోతే..

'డార్విన్‌ పరిణామ సిద్ధాంతం మిథ్య.. రసాయన శాస్త్రంలో ప్రధానమైన ఆవర్తన పట్టిక అవసరం లేదు..!' అంటూ పాఠ్యాంశాల నుంచి తొలగించి సంవత్సరానికొకసారి పండగలా జరుపుకున్నంత మాత్రాన అభివృద్ధి మెట్లు ఎక్కలేము.
 

                                                                               శాంతియుత జీవనం..

ఇక రెండో లక్ష్యం.. విశ్వం ఆవిర్భవించినప్పటి నుండి జరిగిన పరిణామాలన్నింటినీ సైన్సు నినదిస్తోంది. అయినా అశాంతి రాజ్యమేలుతోంది. అందుకే 'శాంతి' అనే మాట వినగానే రోమాలు నిక్కబొడుచుకుని 'ఎక్కడుందది' అని ప్రశ్నిస్తున్నాయి. ఇజ్రాయిల్‌-పాలస్తీనా భీతావహ యుద్ధం.. జాతి వైరాలు పెచ్చరిల్లిన మణిపూర్‌ భయానక సంఘటనలు పదే పదే ఇదే ప్రశ్నను వల్లె వేస్తున్నట్లున్నాయి.

11


                                                            శాస్త్రీయ, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం..

'సామాజిక అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా.. శాస్త్రీయ, సాంకేతిక పరిజ్ఞానం ప్రయాణించాలి. సామాజిక అవసరాలు.. సాంకేతికత.. నిబద్ధతలపై అవగాహన ప్రభుత్వాల నుండి, పాలకుల విధానాల నుండి ప్రజలకు చేరతాయి.
 

                                                               జాతీయ - అంతర్జాతీయ సంఘీభావం..

'దేశాల మధ్య శాస్త్రీయ పరిణతి, స్నేహ భావం ఉండాలి. అప్పుడే ప్రపంచ దేశాలన్నీ సంఘీభావంతో ఉంటాయి. ముందుగా దేశంలో ప్రజల మధ్య సంఘటిత వాతావరణం నెలకొనాలి. తదనుగుణంగా, అంతర్జాతీయ సంఘీభావం దాని వెంటే ఉంటుంది. పాలక వర్గాలు.. జాతి, మత, రంగు, లింగ, ప్రాంత విభేదాలు లేకుండా పాలించగలిగిన నాడు జాతీయ-అంతర్జాతీయ సంఘీభావం తథ్యం.
 

                                                                       అందరిలో అవగాహన..

శాస్త్రీయ అవగాహన కొరవడినప్పుడు మనిషి ఆలోచనలను అత్యాశ ఆక్రమిస్తుంది. అదే అత్యాశ అభివృద్ధి స్థానాన్ని కబళిస్తుంది. ఆ పరిస్థితులే ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నాం. పర్యావరణంపై కాలుష్య రక్కసి.. మంచు పర్వతాలు, మంచు సముద్రాలు కరిగి నీరవటం.. సముద్రమట్టాలు పెరిగి ఊళ్ళకు ఊళ్ళే మునిగిపోవటం.. జీవరాశికి రక్షణ కవచమైన ఓజోన్‌ పొర తూట్లు పడిపోవటం.. రుతుపవనాలు సకాలంలో రాకపోవటం.. ఇన్ని అనర్థాలు మన ముందు తాండవం ఆడుతున్నాయి.
 

                                                                             కనీస ఆలోచన..

మన చుట్టుపక్కల పరిసరాలపై కనీస అవగాహన ప్రతి వ్యక్తికీ ఉండాలి. అది లేకపోవటం వల్లనే.. అననుకూల వాతావరణంతో అట్టుడికిపోతోంది ధరిత్రి. సస్యశ్యామలంగా వెలుగొందాల్సిన నేలతల్లి పురుగు మందుల ప్రవాహంలో కొట్టుకుపోతోంది. స్వచ్ఛమైన పంటలు నిస్సారంగా, నిస్తేజంగా కొట్టుమిట్టాడుతున్నాయి. మమ్మల్ని అంతమొందించాలనుకుంటే మీ అంతు తేలుస్తాం అంటూ కరోనా రూపంలో విజృంభిస్తున్నాయి క్రిమికీటకాలు. ఇప్పటికైనా సైన్సుపై నమ్మకం పెంచుదాం. మనల్ని మనం కాపాడుకుందాం.
 

                                                                               అశాస్త్రీయ చర్యలు..

చప్పట్లు కొట్టడం.. పళ్ళాలు మోగించడం.. దీపాలు వెలిగించడం లాంటి అశాస్త్రీయ పనులకు వైరస్‌లు వికటాట్టహాసం చేస్తున్నాయి. శాస్త్రవిజ్ఞానమే అస్త్రంగా వాటిని ఎదుర్కోవాలే గానీ, ఇలాంటివి సైన్సు ఎప్పటికీ ఆమోదించదు.. ఆహ్వానించదు.. పైగా వారే ప్రపంచ సదస్సు (జి 20) లు నిర్వహించడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు లేదూ..!
 

                                                                      ఎదుర్కొంటున్న సవాళ్ళు..

'శాస్త్రీయ దృక్పథ విధానంలో సైన్సు అనాది నుండి అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. వాటిపై దృష్టి కేంద్రీకరించి అర్థవంతంగా నడుచుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత. శాస్త్రీయ దృక్పథం అంటే నిజాన్ని చెప్పడం మాత్రమే కాదు.. నిరూపించడం కూడా. శాస్త్రీయ దృక్పథానికి, సనాతన ధర్మానికి అనాదిగా సమాంతర వైరం కొనసాగుతూనే ఉంది.
          విశ్వానికి భూమి కేంద్ర బిందువుగా భావించింది అప్పటి మతమౌఢ్య పాలన. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతోంది.. సూర్యుడు విశ్వానికి కేంద్రమని చెప్పిన కారణంగా గెలీలియోని పాలకులే మట్టుపెట్టారు. నిజాన్ని నిర్భయంగా చెబితే అప్పుడూ.. ఇప్పుడూ.. దేశ విద్రోహులుగా శిక్షింపబడుతున్నారు. సనాతన ధర్మాన్ని భుజాలకెత్తుకున్న వారికి అభూత కల్పనలే ఆధారాలవుతాయి. రౌతు కొద్దీ గుర్రం. ప్రజలే ఆ గుర్రాలను సరైన మార్గంలో నడిపించాలి.. లేదా తప్పించాలి.
         ఇకనైనా ఏకీకృతంగా అందరిలో అవగాహన కల్పిద్దాం. శాస్త్రీయతకు ఆహ్వానం పలుకుదాం. ప్రపంచంలోని సంస్థలు, కాన్ఫరెన్స్‌లు, లెక్చర్‌లు, సెమినార్‌లు, గ్రూప్‌ డిస్కషన్‌లు, సోషల్‌ మీడియా క్యాంపెయిన్‌లలో పాల్గొందాం. ప్రజల్లో అవగాహన పెంపొందిద్దాం. సైన్స్‌పై నమ్మకాన్ని పెంచుదాం.

33


                                                                             ఈ ఏడాది థీమ్‌ !

ప్రతి సంవత్సరం సైన్సుపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడానికి ఒక థీమ్‌ను ప్రకటిస్తుంది యునెస్కో. ఈ సంవత్సరం థీమ్‌.. 'సైన్స్‌పై నమ్మకాన్ని పెంచడం'. అవును. సైన్సు ఎంత అర్థవంతమో.. అపనమ్మకాలు, మూఢనమ్మకాలు అంత అనర్ధదాయకం. వీటిని పారదోలాలంటే సైన్స్‌పై నమ్మకాన్ని పెంచాలి. అంటే నిజాన్ని నిరూపించాలి. వివరణకు సిద్ధంగా ఉండాలి. సహేతుకమైన, సమాజహితమైన పరిశోధనలు చేయాలి.

22

                                                         శాస్త్రీయ ఆలోచనపై ప్రచారోద్యమం : జెవివి

ఈ నెల 10న ప్రపంచ సైన్స్‌ దినోత్సవంగా పాటించాలని యునెస్కో పిలుపునిచ్చింది. ప్రపంచమంతటా శాంతి కోసం, అభివృద్ధి కోసం సైన్సును ఆధారం చేసుకోవాలనేది దీని ఉద్దేశం. యునెస్కో ఇచ్చిన పిలుపు సాకారం కావాలంటే, సైన్స్‌ పట్ల, శాస్త్రీయ ఆలోచనల పట్ల ఒక సానుకూల ధోరణి సమాజంలో పెరగాల్సిన అవసరం ఉంది. మన రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 51ఎ (హెచ్‌) ఉద్దేశం కూడా అదే. దేశంలోని అన్ని ప్రాంతాలలో స్కూళ్ళు, కాలేజీలు, గ్రామీణ ప్రాంతాల్లో శాస్త్రీయ ఆలోచనలపై జాతీయ ప్రచారం చేయాలని ఆల్‌ ఇండియా పీపుల్స్‌ నెట్‌వర్క్‌ (ఎఐపిఎస్‌ఎన్‌) ఇచ్చిన పిలుపులో భాగంగా జనవిజ్ఞాన వేదిక ఈ నెల 7వ తేదీ నుండి 2024 ఫిబ్రవరి 28 వరకు నాలుగు నెలల పాటు కార్యక్రమాన్ని రూపొందించింది. నవంబర్‌ 7వ తేదీ నోబెల్‌ గ్రహీతలైన సి.వి.రామన్‌, మేరీక్యూరీ జన్మదినాలను పురస్కరించుకుని ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రారంభమవుతుంది. రాష్ట్ర కేంద్రమైన విజయవాడలోనూ, అన్ని జిల్లా కేంద్రాలలోనూ ప్రారంభ కార్యక్రమాలు జరపడానికి జన విజ్ఞాన వేదిక సన్నాహాలు చేస్తోంది. ఈసారి చెకుముకి సైన్స్‌ సంబరాలు కూడా ఈ శాస్త్ర ప్రచార ఉద్యమంతో అనుసంధానం చేస్తున్నారు. ప్రపంచ సైన్సు దినోత్సవమైన నవంబరు 10న, దాదాపు ఐదు లక్షల మంది హైస్కూలు విద్యార్థులు ఇందులో పాల్గొంటున్నారు. మండల స్థాయి సైన్సు సంబరాలు నవంబరు 30, డిసెంబరు 17న జిల్లా స్థాయిలో జరుగుతాయి. వచ్చే జనవరి 27న రాష్ట్ర స్థాయిలో జరిగే ఈ చెకుముకి సైన్స్‌ ఉత్సవాలలో పిల్లలకు శాస్త్రీయ ఆలోచనలను ప్రేరేపించేలా కార్యక్రమాలను జన విజ్ఞాన వేదిక (జెవివి) రూపొందిస్తోంది. ఈ నాలుగు నెలలూ సైన్స్‌లో ప్రాధాన్యత గల 25 రోజులను జన విజ్ఞాన వేదిక గుర్తించింది. వాటి ఆధారంగానే కాలేజీలలో, స్కూళ్లలో చేసే శాస్త్ర విజ్ఞాన ప్రచార కార్యక్రమాలను వివిధరూపాలలో రూపొందించింది జెవివి. సాంస్కృతిక కార్యక్రమాలు, పోస్టరు ప్రదర్శనలు, ఉపన్యాసాలు, రకరకాల పోటీలు, చర్చా వేదికలు, ఇందులో ఉన్నాయి. సమాజంలోని వివిధ వర్గాలను కలుపుకొని విస్తృతమైన నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. విశ్వం ఆవిర్భావం, జీవ పరిణామం, చరిత్ర పరిణామం లాంటి అనేక అంశాలపై చర్చలను ప్రేరేపించనున్నారు. దేశంలో మౌలికమైన శాస్త్రీయ పరిశోధనలు జరగకపోవడానికి, నోబెల్‌ ప్రైజ్‌ లాంటివి మనకు రాకపోవడానికి కారణాలపైనా చర్చ జరగనుంది. తగిన వనరులు లేకున్నా, శాస్త్ర పరిశోధనలు చేసి, దేశానికి పేరు తెచ్చిన జగదీష్‌ చంద్రబోస్‌, రామానుజన్‌లాంటి వారి స్ఫూర్తిని విద్యార్థుల్లోకి తీసికెళ్ళనున్నారు. మన దేశంలో ఉన్న వైవిధ్య భరితమైన జీవన సంస్కృతులనూ, బహుళత్వాన్నీ విశ్లేషిస్తూ కార్యక్రమాలను ప్రజల్లోకి జన విజ్ఞాన వేదిక తీసికెళ్లనున్నది. ఫిబ్రవరి నెల రెండో వారంలో రెండు సైన్స్‌ కళా యాత్రలు శ్రీకాకుళం నుండి ఒకటి, అనంతపురం నుండి మరొకటి ప్రారంభమవుతాయి. రెండు యాత్రల ముగింపు ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్‌ దినోత్సవం నాడు విజయవాడలో జరుగుతుంది. ఈ నాలుగు నెలల కార్యక్రమాలలో జాతీయ సైన్స్‌ సంస్థల్లో, యూనివర్సిటీల్లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, ఇతర మేధావులు పాల్గొననున్నారు. సైన్స్‌కు ఎదురవుతున్న సవాళ్లు, సమాజంలో కనిపిస్తున్న సూడో సైన్సు, సైన్సు వ్యతిరేక ఆలోచనలు, ప్రభుత్వాల అశాస్త్రీయ ధోరణులు- ఇలా అనేక అంశాలను చర్చనీయాంశాలుగా చేసి, సరైన చైతన్యాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి అందరి సహకారమూ అవసరం. ప్రతి ఒక్కరూ ఏదో ఒకవిధంగా ఈ ప్రచారోద్యమంలో భాగస్వాములు కావాలి. శాస్త్రీయ ఆలోచన పెంపొందితేనే సమాజం ముందుకు వెళుతుంది.

టి. టాన్యా
7095858888