Oct 29,2023 08:47

శీతాకాలంలో చల్లటి వాతావరణాన్ని ఆనందిస్తూనే ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. సీజన్‌ మారే సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారుతుంటుంది. ఈ మార్పుని శరీరం ఒక్కసారిగా గుర్తించి సర్దుబాటుచేసుకోవటం కాస్త కష్టమే. ఒక్కోసారి ఒక్కసారిగా చలిగాలులు విజృంభిస్తాయి. కేవలం ఈ సమయంలోనే కొన్ని రకాల బ్యాక్టీరియాలు, వైరస్‌లుగా చురుగ్గా మారతాయి. చలిగాలిలో తిరుగుతుంటే ఈ సూక్ష్మక్రిములు శరీరంలోకి చేరతాయి. తగినంత రోగ నిరోధక శక్తి ఉన్నట్లయితే ఈ క్రిములు ఏమీ చేయలేవు. లేనిపక్షంలో ఈ క్రిములు వ్యాధుల్ని కలుగ జేస్తాయి. ఈక్రమంలో సూక్ష్మక్రిములకు వ్యాధి నిరోధక కారకాలకు శరీరం లోపల ఘర్షణ చెలరేగుతుంది. దీని ఫలితంగా జ్వరం, నొప్పులు బయటపడతాయి. సాధారణంగా ఈ కాలంలో కొన్ని అనారోగ్య సమస్యలు ఎక్కువవుతాయి. ముందస్తు చర్యలు, జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా వాటిని నివారించొచ్చు.

22


            శీతాకాలంలో గాలి, నీటిలో క్రిమికీటకాల వ్యాప్తి ద్వారా కూడా వ్యాధులు వ్యాపిస్తుంటాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు, ప్లూ వంటి ఇన్ఫెక్షన్లు అతిత్వరగా వ్యాప్తిచెందుతుంటాయి. మరికొన్ని ఇన్ఫెక్షన్లు పొట్ట, రోగ నిరోధక వ్యవస్థపైనా ప్రభావం చూపుతుంటాయి. వీధుల వెంబడి విక్రయించే కలుషిత ఆహారం తినటం ద్వారానూ, కల్తీ ఆహార పదార్థాలను స్వీకరించటం ద్వారాను వ్యాధులు సోకే ప్రమాదం ఉంటుంది. వివిధ రకాల కాలుష్యాలు, సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల గాలి ద్వారా, వర్షపునీటి ద్వారా వచ్చే దోమల కారణంగా రోగాలు వ్యాప్తిచెందుతాయి. ఈ సమస్యలు చుట్టుముట్టినప్పుడు అలసట, నీరసంతో ఇబ్బందులు పడతారు. ఏ పని చేయాలన్నా చురుకుదనం ఉండదు. ఎంతసేపు ఒంటినొప్పులు, ఇతర సమస్యలతో మంచం నుంచి లేవాలని అనిపించదు. పిల్లలు తరచుగా, వృద్ధులు జలుబు, దగ్గు, గొంతునొప్పి, ప్లూ వంటి వ్యాధులతో బాధపడుతుంటారు. రాత్రి మొదలు ఉదయం వరకూ విపరీతమైన మంచు కురిసే పరిస్థితులు కూడా ఉంటాయి. చలికాలంలో సరిగా దాహం వేయదు. అయినా సరే, తగిన మోతాదులో నీటిని తాగాలి. వేడి ఆహార పదార్థాలు, తాజాపండ్లు, కూరలు తీసుకోవటం మంచిది. ఒత్తిడికి దూరంగా ఉండటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం అలవాటు చేసుకోవాలి. చలికాలంలో సాధారణంగా గొంతునొప్పి, తలనొప్పి, దగ్గు, ప్లూ, జ్వరం, జలుబు వంటివి వ్యాప్తి చెందుతాయి. అయితే కాచి చల్లార్చిన నీటిని తాగటం, వేడివేడి ఆహార పదార్థాలను తీసుకోవటం ద్వారా వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్‌ను సంప్రదించటం ఉత్తమం.

55

జ్వరం : శీతాకాలంలో సాధారణంగా ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోతాయి. అందువల్ల వైరస్‌లకు వ్యాప్తి చెందే శక్తి పెరుగుతుంది. విష జ్వరాలు కూడా ఎక్కువగా వస్తుంటాయి. వాతావరణంలో మార్పు కారణంగా చాలామందిలో తరచుగా జ్వరం వస్తుంది. శరీర ఉష్ణోగ్రత 98.6-101 డిగ్రీల ఫారెన్‌ హీట్‌ వరకూ ఉంటే దానిని సాధారణ జ్వరంగానే పరిగణించొచ్చు.

feature

ఆస్తమా (ఉబ్బసం) : ఆస్తమాతో బాధపడేవారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. గొంతునొప్పి, కఫం, ఛాతీబిగుతు శ్వాస ఆడకపోవటానికి కారణమవుతుంది. ఇది ఉబ్బసానికి కూడా దారితీస్తుంది.

న్యూమోనియా : ఊపిరితిత్తులకు కలిగే వ్యాధే న్యూమోనియా. ఈ వ్యాధి వైరస్‌, బ్యాక్టీరియా, క్షయవాధి వల్ల వ్యాప్తిచెందుతుంది. పొగతాగడం, చలిగాలిలో తిరగడం, కుటుంబ పరంగా అస్తమా, అనారోగ్య పరిస్థితుల వల్ల ఈ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. రెండేళ్లలోపు చిన్నారుల్లోనూ, 65 ఏళ్లు పైబడిన వారిలో ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ.

ప్లూ : చాలామందిని ఇబ్బంది పెడుతుంది. రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉన్న వారికి ప్లూ వ్యాధి ఎక్కువగా వస్తుంది. ఈ వ్యాధిగ్రస్తులు తరచుగా ముక్కు, కళ్ళు, చెవులను తాకటాన్ని మానుకోవాలి.

జలుబు : సీజన్‌ మారే క్రమంలో చాలామందికి గొంతునొప్పి తరువాత దగ్గు, జలుబు వస్తాయి. శీతాకాలంలో చిన్న పిల్లలు, పెద్దవారు అనే తేడా లేకుండా వచ్చే సీజనల్‌ జలుబు, దగ్గుతో ఇబ్బందిపడుతుంటారు. వాతావరణంలో మార్పులు, తాగేనీటిలో మార్పులతో కూడా పిల్లల్లో జలుబు లక్షణాలు పెరుగుతాయి.

33

చర్మవ్యాధులు : చర్మవ్యాధులైన సొరియాసిస్‌, దురద లాంటివి ఎక్కువగా వస్తాయి. ముఖంపై మొటిమలు, కాళ్ల పగుళ్లు, చర్మంపై మచ్చలు పడటం, చెడిపోవడం వంటి ఇబ్బందులు ఉంటాయి. పలు రకాల ఫంగస్‌ ఇన్ఫెక్షన్లు కూడా సోకుతాయి. దీనిని నివారించటానికి శరీరాన్ని ఎప్పుడూ తేమగా ఉంచుకోవాలి. 

గొంతునొప్పి : చలికాలంలో చాలామందిని ఇబ్బంది పెట్టే ప్రధాన సమస్యల్లో గొంతునొప్పి ఒకటి. సీజన్‌ మారే సమయంలో చాలామందికి ముందుగా ఈ నొప్పి వస్తుంది. గొంతులో ఇన్‌ఫెక్షన్‌ కారక సూక్ష్మక్రిములు చేరటం వల్ల ఈ నొప్పి మొదలవుతుంది. దానివల్ల సరిగ్గా మాట్లాడలేకపోవటం, గొంతులో గరుకుగా ఉండటం వంటి ఇబ్బందులు వస్తాయి.

ఆహార పదార్థాలు కల్తీ : ఈకాలంలో ఆహార పదార్థాలు బాగా కలుషితం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కలుషిత ఆహారం తిన్నప్పుడు, నీటిని తాగినప్పుడు కడుపులో నొప్పి, వికారం కలుగుతుంది. వాంతులు అవుతుంటాయి. శరీరంలో బలహీనంగా అనిపించటం మొదలవుతుంది.
కడుపులో నొప్పి : జీర్ణక్రియ బలహీనంగా ఉండటం వల్ల కడుపునొప్పి సాధారణంగానే వస్తుంది. విరేచనాలు, వాంతులు ఈ సీజనల్‌లో తరచుగా వస్తుంటాయి. తినే ఆహారం, తాగే పానీయాలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.

పాదాల పగుళ్లు : చాలామందికి పాదాల పగుళ్ల సమస్య ఎదురవుతుంది. దీనివల్ల పాదాలు నొప్పిగా ఉండటం, నడవడం ఇబ్బందిగా ఉంటుంది. కాళ్లు పొడిబారుతాయి. ఈ పరిస్థితి ఎక్కువకాలం కొనసాగిసే మడమల దగ్గర చర్మానికి పగళ్లు వస్తాయి.
సేకరణ : కొంచాడ మహేశ్వరరావు,
పొందూరు మండల విలేకరి,
శ్రీకాకుళం జిల్లా


11

డాక్టర్‌ జి.రమేష్‌నాయుడు,
తాడివలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,
పొందూరు మండలం,
శ్రీకాకుళం జిల్లా.