Aug 20,2023 06:47

తిరుగుబాటుకు ప్రజలు మద్దతు ఇవ్వరని ఫ్రాన్స్‌ భావించింది. కానీ కొత్త నాయకుడికి ప్రజల మద్దతు రోజురోజుకు పెరుగుతుండటం మాక్రాన్‌ను ఉలిక్కిపడేలా చేసింది. అంతేకాదు, పాశ్చాత్య శక్తుల జోక్యానికి వ్యతిరేకంగా అల్జీరియాతో సహా పలు దేశాలు బహిరంగంగా ముందుకు వచ్చాయి. పాశ్చాత్య శక్తుల పట్టు నుంచి నైగర్‌ జారిపోతోందని 'వాషింగ్టన్‌ పోస్ట్‌' అంచనా వేసింది.

          పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైగర్‌లో గత నెల 26న తిరుగుబాటు జరిగింది. ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చిన మహమ్మద్‌ బెజూమ్‌ను ప్రెసిడెన్షియల్‌ గార్డులు అరెస్టు చేశారు. ప్రెసిడెన్షియల్‌ గార్డుల చర్యను సైన్యం వ్యతిరేకిస్తుందని పాశ్చాత్య మీడియా, తదితరులు ప్రచారం చేశారు. కానీ అలా జరగలేదు. 'రక్తపాతాన్ని నివారించడానికి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సైన్యం సిద్ధంగా ఉంది'' అని జనరల్‌ అబ్దౌ సుదికోన్‌ ఇస్సా జులై 27న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రెసిడెన్షియల్‌ గార్డులకు, సైన్యానికి మధ్య ఘర్షణ జరుగుతుందని కలలుగన్న పశ్చిమ దేశాలకు ఈ ప్రకటన శరాఘాతంలా తగిలింది. సైన్యం మద్దతుతో, చియాని స్వయంగా బ్రిగేడియర్‌ జనరల్‌ అబ్దుర్‌ రహ్మాన్‌ను నూతన అధ్యక్షుడిగా ప్రకటించారు.
ప్రజాస్వామ్యానికి తిరుగుబాటు ఎదురుదెబ్బే అయినప్పటికీ, నయా వలసవాదం, పాశ్చాత్య శక్తులపై భారీ విమర్శలు కూడా వచ్చాయి. సామ్రాజ్యవాద శక్తులపైన, నయా వలసవాదం పైన కట్టలు తెంచుకున్న ప్రజాగ్రహం తిరుగుబాటుకు దారితీసిందనే కథనం వెలువడింది. 2020లో అదే ప్రాంతంలోని మాలిలో ప్రారంభమైన తిరుగుబాటు తర్వాత బుర్కినా ఫాసోలో, గినియాలో పునరావృతమైంది. ఇప్పుడు నైగర్‌లో కూడా.
సాహెల్‌ ప్రాంతంలోని ప్రముఖ దేశమైన నైగర్‌ ఒకప్పుడు ఫ్రెంచ్‌ కాలనీగా వుండేది. ఫ్రాన్స్‌ నుండి స్వాతంత్య్రం పొందిన తరువాత కూడా, నైగర్‌ పాలకులు సంపూర్ణ సార్వభౌమాధికారాన్ని నిలుపుకోలేకపోయారు. అమెరికా, ఐరోపా సమాఖ్య మొదలైన మాజీ వలసవాద, పాశ్చాత్య శక్తులు తమ రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడానికి నైగర్‌ వంటి పూర్వ వలస కాలనీలను సమర్థవంతంగా ఉపయోగించుకోసాగాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఖనిజాలను తవ్వే బహుళజాతి గుత్తాధిపత్య సంస్థలు తమ దోపిడీని నిరాటంకంగా కొనసాగించాయి. నైగర్‌తో సహా అనేక దేశాల్లోని సహజ ఖనిజ సంపద సామ్రాజ్యవాద శక్తులను అక్కడ ఉండడానికి ప్రేరేపించింది. ఉదాహరణకు, నైగర్‌ అత్యధిక నాణ్యత గల యురేనియం నిక్షేపాలకు నిలయం. ఇక్కడ బంగారం, చమురు నిక్షేపాలు ఉన్నాయి. ప్రపంచ యురేనియం ఉత్పత్తిలో ఐదు శాతం ఈ దేశం నుంచే వస్తోంది. నైగర్‌ నుండి పొందిన యురేనియం ఫ్రాన్స్‌కు ప్రధాన ఇంధన వనరుగా వుంది. మాజీ వలస రాజ్యాల శక్తిగా ఫ్రాన్స్‌ నైగర్‌ను దోపిడీ చేసేందుకు తెగబడింది. నాలుగు దశాబ్దాలలో కనీసం 50 సార్లు ఆఫ్రికాలో ఫ్రాన్స్‌ సైనిక జోక్యం చేసుకుంది.
        వలస పాలన ముగిసినప్పటికీ, నైగర్‌లో ఇప్పటికీ ఫ్రెంచ్‌ దళాలు ఉన్నాయి. ఫ్రాన్స్‌ తన రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకునేందుకు గాను సైనిక సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి ఎన్నడూ వెనుకాడలేదు. ప్రధానంగా సహజ వనరులను దోపిడీ చేయడానికి సైనిక సామర్ధ్యాన్ని ఉపయోగి స్తుంది. ఉదాహరణకు, ఫ్రెంచ్‌ యురేనియం మైనింగ్‌ కంపెనీ 'ఒరానో'ను రక్షించడానికి ఫ్రెంచ్‌ దళాలు ఇర్లిట్‌ నగరంలో ఉన్నాయి. ఫ్రెంచ్‌ దోపిడీకి మరొక రూపమే ఫ్రెంచ్‌-నైజీరియన్‌ జాయింట్‌ వెంచర్‌ సోమర్‌ కంపెనీ. ఫ్రాన్స్‌కు చెందిన ఆటమిక్‌ ఎనర్జీ కమిషన్‌, రెండు ఫ్రెంచ్‌ ప్రైవేట్‌ కంపెనీలకు సోమర్‌లో 85 శాతం వాటా ఉంది. నైగర్‌ ప్రభుత్వానికి 15 శాతం వాటా మాత్రమే ఉంది. ఐక్యరాజ్యసమితి మానవ అభివృద్ధి సూచీలో 189వ స్థానంలో ఉంది. ఇప్పటికీ 42 శాతం జనాభా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. అటువంటి బీద దేశంలో...మాజీ వలస రాజ్యాధిపతి ఈ విధమైన దోపిడీకి పాల్పడుతోంది.
            ఇది ఒక్క నైగర్‌కే పరిమితం కాలేదు. గతంలో ఫ్రాన్స్‌ పాలనలో ఉన్న అనేక ఆఫ్రికన్‌ దేశాలన్నిటి పరిస్థితి ఇదే. అమెరికా మరోవైపు ఈ కొత్త వలసవాద ఆసక్తికి పూర్తి ప్రోత్సాహాన్ని ఇచ్చింది. నైగర్‌లో ఫ్రాన్స్‌ కంటే అమెరికా సైన్యమే ఎక్కువగా ఉంది. నైగర్‌లోని అగాడెజ్‌లో ప్రపంచంలోనే అతి పెద్ద డ్రోన్‌ సెంటర్లలో ఒకదాన్ని అమెరికా నిర్మించింది. దీంతో పాటు అమెరికాకు మూడు సైనిక స్థావరాలున్నాయి. ఫ్రాన్స్‌, యు.ఎస్‌, యూరోపియన్‌ యూనియన్‌, పశ్చిమ ఆఫ్రికా దేశాల ఆర్థిక సంఘం (ఇ.సి.ఒ.డబ్ల్యు.ఎ.ఎస్‌) వంటి సంస్థలు నైగర్‌ సార్వభౌమాధికారాన్ని తుంగలో తొక్కుతున్నాయి.
          సహజంగానే, దీనికి వ్యతిరేకంగా ఆఫ్రికా అంతటా నిరసనలు జరిగాయి. ఫ్రెంచ్‌ కాలనీలుగా ఉన్న మాలి, గినియా, బుర్కినా ఫాసోలలో తిరుగుబాట్లు జరిగాయి. ఈ తిరుగుబాట్లన్నీ ఇప్పటికీ కొనసాగుతున్న ఫ్రాన్స్‌ ఆధిపత్యాన్ని కూలదోయడానికి చోటుచేసుకున్నవే.
         ప్రపంచ రాజకీయాలపై అమెరికా పట్టు సడలుతోం దనడానికి ఈ అధికార మార్పులు ఒక సంకేతం. ఆఫ్రికాలో చైనా, రష్యాల ప్రభావం పెరగడం దీనికి ఒక ముఖ్య కారణం. నైగర్‌లో తిరుగుబాటు జరిగిన వెంటనే, అమెరికా, ఫ్రాన్స్‌, యూరోపియన్‌ యూనియన్‌ దానిని ఖండించాయి. సైనిక పాలకుడ్ని ఆ పదవి నుంచి వైదొలగాలని ఆఫ్రికన్‌ యూనియన్‌ అల్టిమేటమ్‌ ఇచ్చింది. నైగర్‌లో పాశ్చాత్య శక్తులు జోక్యం చేసుకుంటాయని పుకార్లు వచ్చాయి. కానీ ఏమీ జరగలేదు. ఒక నెలలోగా తమ సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని నైగర్‌ కొత్త పాలకులకు ఫ్రాన్స్‌ హుకుం జారీ చేసింది. ఫ్రాన్స్‌కు యురేనియం ఎగుమతిని నిలిపివేస్తున్నట్లు సైనిక ప్రభుత్వం ప్రకటించింది. నైగర్‌లో ఫ్రాన్స్‌ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. తిరుగుబాటుకు సైనిక మద్దతు ఉండదనే లెక్క తప్పు అని ఆదిలోని తేలింది. తిరుగుబాటుకు ప్రజలు మద్దతు ఇవ్వరని ఫ్రాన్స్‌ భావించింది. కానీ కొత్త నాయకుడికి ప్రజల మద్దతు రోజురోజుకు పెరుగుతుండటం మాక్రాన్‌ను ఉలిక్కిపడేలా చేసింది. అంతేకాదు, పాశ్చాత్య శక్తుల జోక్యానికి వ్యతిరేకంగా అల్జీరియాతో సహా పలు దేశాలు బహిరంగంగా ముందుకు వచ్చాయి. నైగర్‌ పాశ్చాత్య శక్తుల పట్టు నుంచి జారిపోతోందని 'వాషింగ్టన్‌ పోస్ట్‌' అంచనా వేసింది.
          నైగర్‌లో తిరుగుబాటు జరిగిన మరుసటి రోజే సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో రష్యా-ఆఫ్రికా శిఖరాగ్ర సమావేశం జరిగింది. 18 దేశాధినేతలతో సహా 46 ఆఫ్రికా దేశాల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. రష్యాకు బకాయిపడిన 23 బిలియన్‌ డాలర్ల (2300 కోట్ల డాలర్ల)లో 90 శాతాన్ని ఆఫ్రికన్‌ దేశాలకు మాఫీ చేస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటించడం రష్యా-ఆఫ్రికా మధ్య బంధం బలోపేతం కావడానికి సంకేతం. మాలి, బుర్కినా ఫాసో సహా ఆరు దేశాలకు 50,000 టన్నుల ధాన్యాన్ని ఉచితంగా ఇస్తామని కూడా పుతిన్‌ ప్రకటించారు. పాశ్చాత్య శక్తులు ఆఫ్రికాను మునుపటిలా దోపిడీ చేయలేరనే వాస్తవాన్ని ఇవన్నీ సూచిస్తున్నాయి. బహుళ ధ్రువ ప్రపంచం ఆఫ్రికాకు గొప్ప అవకాశాలకు ద్వారాలు తెరుస్తున్నది.

/'దేశాభిమాని' సౌజన్యంతో/
వి.బి. పరమేశ్వరన్‌

వి.బి. పరమేశ్వరన్‌