Jul 22,2023 15:15

ప్రజాశక్తి - మైలవరం(ఎన్‌టిఆర్‌) : అసైన్డ్‌ భూముల ముసాయిదా చట్ట సవరణలో చేసిన మార్పులను వ్యతిరేకిస్తూ ఈనెల 27న మైలవరంలో జరిగే భూ సదస్సును జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కోట కళ్యాణ్‌ పిలుపునిచ్చారు. భూ సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ శనివారం మైలవరం భూ పోరాట కమిటీ సభ్యులకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన పేదలకు వెంటనే భూ పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. అసైన్డ్‌ భూములపై యాజమాన్య హక్కు కల్పిస్తామని ఈనెల 12వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారని ఈ నిర్ణయం వల్ల అసైన్డ్‌ భూములు పొందిన నిజమైన దళితులు ఇతర పేదలకు నష్టం జరుగుతుందన్నారు. మా అభ్యంతరాలను ప్రభుత్వం దష్టికి తీసుకురావాలని ఉద్దేశంతోనే సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అత్యధిక భాగం అసైన్డ్‌ భూములు పేదల చేతుల నుండి ధనవంతులు, సంపన్నుల చేతుల్లోకి వెళ్లాయన్నారు. ఆ భూములన్నింటిని అసలైన లబ్ధిదారులు పేదలకు బదలాయించాలన్నారు. పేదలకు పంచడానికి లక్షలాది ఎకరాలు ఉందని గతంలో కోనేరు రంగారావు భూ కమిటీ చెప్పిందని దీనికోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యక్రమం రూపొందించి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి చాట్ల సుధాకర్‌, అబ్రహం, రమేష్‌, చంటి, యోహాను, యేసు, తదితరులు పాల్గొన్నారు.