Oct 15,2023 06:58

అభివృద్ధి జరగాలంటే అధికార వికేంద్రీకరణ చేయాలి, నిధులు మంజూరు చేయాలి. కానీ వీరి ప్రభుత్వం పంచాయతీలకు, ఎన్నికైన స్థానిక సంస్థలకున్న హక్కులనే హరించి వేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటే, నీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలి. గిరిజన ప్రాంతంలో సహా విద్య, వైద్యం, రవాణా వంటి మౌలిక వసతులు కల్పించాలి. ప్రభుత్వ రంగ సంస్థలను రక్షించడంతో పాటు, ఉత్పత్తి రంగంలో పెట్టుబడులు పెట్టి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి.

           ముఖ్యమంత్రి విశాఖ కేంద్రంగా పని చేయడానికి, సమీక్షలు చేయడానికి క్యాంపు ఆఫీసు ఏర్పాటుకై రాష్ట్ర ప్రభుత్వం జీఓ ఆర్‌.టి నెంబరు 2015ను 11-10-23న ఆగమేఘాల మీద విడుదల చేసింది. ముఖ్య మంత్రి విశాఖపట్నానికి మకాం మార్చితే ఆటోమేటిక్‌గా ఉత్తరాంధ్ర అభివృద్ధి అవుతుందని ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల వెనుకబాటు విద్య, వైద్యం, ఉపాధి వంటి రంగాలలో స్పష్టంగా కనబడుతుంది. ఈ మూడు రంగాల్లో వీరి పరిపాలన నాలుగున్నరేళ్ళ కాలంలో ఏం చేశారో తెలియచేసి, అప్పుడు మిగతా విషయాల గురించి మాట్లాడితే సబబుగా ఉండేది. కానీ ఈ కాలంలో మీరు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏం చేయకుండా, నేడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏదో చేసేస్తామని దాని కోసమే విశాఖ నుండి పాలన చేస్తామని చెప్పడం ప్రజలను మోసగించడమే అవుతుంది. అక్షరాస్యతలో ఉత్తరాంధ్ర జిల్లాలు రాష్ట్రంలోనే అధమంగా ఉన్నాయి. అక్షరాస్యతను పెంచడానికి ఈ కాలంలో మీరు చేసిన కృషి ఏమీ లేదు కానీ ఉన్న ప్రాథమిక పాఠశాలలనే అనేకం మూసివేశారు. ఈ ప్రాంతంలో అత్యధికంగా ఉన్న ఎయిడెడ్‌ విద్యా సంస్థలకు ఎయిడ్‌ను ఎత్తేశారు. ఫలితంగా ప్రాథమిక, ఉన్నత విద్యలు రెండూ ప్రజలకు మరింత దూరం అయ్యాయి. ఇదే జీవోలో గిరిజన ప్రాంతం కోసం ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇక్కడ నిరక్షరాస్యత మరింత అధికంగా ఉంది. మహిళా అక్షరాస్యత ఇంకా ఘోరం. అల్లూరి జిల్లాలోని పెదబయలు మండలంలో అక్షరాస్యత కేవలం 33 శాతం మాత్రమే. అందులోను మహిళా అక్షరాస్యత కేవలం 24 శాతం ఉందీ అంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో తెలుస్తుంది. విచిత్రంగా ఇప్పుడు అభివృద్ధి కోసం మాట్లాడుతున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం వల్ల ఇదే మండలంలో ఉన్న పాఠశాలలు మూతబడ్డాయి. పాఠశాలల మూసివేత అంటే విద్యార్థులకు పాఠశాల మరింత దూరమై, వారు చదువు నుండి డ్రాపవుట్‌ అవుతారు. దీనివల్ల నిరక్షరాస్యత మరింత పెరుగుతుంది. అక్షరాస్యత పెంచడానికి ఏజెన్సీ ప్రాంతంలో మరిన్ని పాఠశాలలను ఏర్పాటు చేయవలసింది పోయి ఉన్నవాటినే మూసివేయడం ఏ రకంగానూ సమర్ధనీయం కాదు.
          ఇక వైద్య రంగంలో పరిస్థితి విషమంగా ఉంది. మొత్తం ఉత్తరాంధ్రలోని ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిలోనూ పూర్తి స్థాయి సిబ్బంది లేరు. ఈ ప్రాంతాల్లో పేరొందిన విశాఖ కెజిహెచ్‌ లో వైద్య సిబ్బంది, నర్సింగ్‌ ఇతర సిబ్బంది చాలా తక్కువగా ఉన్నారు. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లోని పాడేరు, అరకు ఆసుపత్రులలో సిబ్బంది తో సహా కనీస సదుపాయాలు కూడా లేవు. శ్రీకాకుళం రిమ్స్‌, విజయనగరం జనరల్‌ హాస్పిటల్‌, టెక్కలి జిల్లా ఆసుపత్రులతో సహా ఏ ఒక్క వైద్య సంస్థలోనూ, ఆస్పత్రులలోనూ కనీసమైన సిబ్బంది కూడా లేరు. ఉద్దానం ప్రాంతాల్లో అత్యధికంగా ఉన్న కిడ్నీ వ్యాధితో అనేకమంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల కాలంలో ఈ మరణాల సంఖ్య మరింత పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి స్వయంగా శంకుస్థాపన చేసిన పలాస లోని ఉద్దానం కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ కమ్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఐదేళ్లు పూర్తి కావస్తున్నా, ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. ఉత్తరాంధ్రలో ఉపాధి అవకాశాలు లేక ఈ ప్రాంతం నుండి అనేకమంది సుదూర ప్రాంతాలకు పొట్ట చేత పట్టుకుని ఉపాధికై వలసలు పోతున్నారు. గ్రామీణ ప్రాంతం అభివద్ధి చెందాలంటే, వ్యవసాయ రంగం అభివద్ధి చెందాలి. అంటే నీటి ప్రాజెక్టుల నిర్మాణం తప్పనిసరి. కానీ విచిత్రంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నాలుగున్నరేళ్ళ కాలంలోనూ ఉత్తరాంధ్రలోని కనీసం ఒక్కటంటే ఒక్క నీటి ప్రాజెక్టు నిర్మాణం కూడా పూర్తి చేయలేదు. వీరి మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లా తారకరామా తీర్థ సాగర్‌, శ్రీకాకుళం లోని ఆఫ్‌ షోర్‌ ప్రాజెక్టు, వంశధార రెండవ దశ నిర్మాణాలు అడుగు కూడా ముందుకు పడలేదు. ఉత్తరాంధ్రకు జీవనాడిగా ఉండే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు తగినన్ని నిధులు కేటాయించి, రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన పూర్తి చేసే చర్యలు ఈ కాలంలో చేపట్టలేదు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు మరింత క్షీణించి, వలసలు మరింతగా పెరిగాయి. దీనికి తోడు ఉత్తరాంధ్రలో గతం నుండి సాంప్రదాయంగా వస్తున్న వ్యవసాయ ఆధారిత పరిశ్రమలైన జ్యూట్‌, షుగర్‌ ఫ్యాక్టరీలు వంటివన్నీ మూతపడుతూనే ఉన్నాయి. వీరి మంత్రి ఉన్న విజయ నగరం జిల్లాలో ఉన్న దాదాపు అన్ని జ్యూట్‌ మిల్లులు మూత బడి ఉన్నాయి. విశాఖలోని వీరి గత మంత్రే చిట్టివలస జ్యూట్‌ మిల్లును పూర్తిగా మూసివే యడానికి యాజమా న్యానికి దగ్గరుండి సహకరించారు. మరోపక్క ఉత్తరాంధ్రకే గాక రాష్ట్రానికే తలమానికంగా ఉన్న విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే దానిని ప్రతిఘటించి కాపాడుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయకపోగా తిరిగి కేంద్ర ప్రభుత్వానికి సహకరించేలా వ్యవహరిస్తోంది. స్టీల్‌ప్లాంట్‌కు పక్కలో బల్లెంలా ఉంటూ, దీనిని ఎలా తన్నుకు పోవాలా అని చూస్తున్న అదానీ సంస్థకు సహకరించేలా గంగవరం పోర్టులోని రాష్ట్ర ప్రభుత్వ 10.39 శాతం వాటాను కూడా మొత్తంగా ప్రభుత్వం అమ్మేసింది. దీని ఫలితంగా 2852.26 ఎకరాల మొత్తం భూమితో సహా సర్వహక్కులు రాష్ట్ర ప్రభుత్వం వదిలేసుకుని అదానీకి ధారాదత్తం చేసింది. వెరసి నేడు ఉత్తరాంధ్రలో పారిశ్రామికీకరణ ఏమీ జరగలేదు కానీ ఉన్న పరిశ్రమలే మూతబడడం, ఉన్న పరిశ్రమలలో కూడా ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం పరిపాటిగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా విశాఖపట్నంలో సదస్సులు నిర్వహించినా, కొత్తగా వచ్చిన పరిశ్రమలు ఏమీు లేవు. ఈ రకంగా ఉత్తరాంధ్ర ఈ కాలంలో కూడా విద్య, వైద్యం, ఉపాధి వంటి అన్ని రంగాలలోనూ మరింత వెనుకబాటులోకే నెట్టబడింది.
          వీటన్నిటికీ తోడు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రంతో పాటు ఉత్తరాంధ్రకుా తీరని ద్రోహం చేసింది. చేస్తోంది. రాష్ట్ర విభజన చట్టంలోని ఏ ఒక్క అంశాన్నీ కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా పదేళ్లు గడుస్తున్నా నేటికీ అమలు చేయలేదు. ఉత్తరాంధ్ర ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని ఒక ప్రహసనంలా మార్చివేసింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీ కూడా వెనక్కి తీసుకెళ్ళింది. ఉత్తరాంధ్ర సాధించిన అభివద్ధి అంతకంటే లేదు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తా మని కేంద్ర ప్రభుత్వ పదేళ్లుగా ప్రకటనలే గాని, నేటికీ ఆచరణ రూపం దాల్చలేదు. పెట్రో యూనివర్సిటీ నిర్మాణం ఇంకా ప్రాద ¸మిక దశలోనే ఉంది. గిరిజన యూనివర్సిటీకైతే రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం వల్ల మరింత ఆలస్యం జరిగింది. ఇక ఎప్పటికి పూర్తవుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విశాఖలో చట్టం ప్రకారం ఏర్పాటు చేయవలసిన విశాఖ మెట్రో రైల్‌ నిర్మాణం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం చెప్పేసింది. దీనిని వ్యతిరేకించి, మనకు హక్కుగా రావలసిన మెట్రో రైల్‌ను సాధించుకోవాల్సింది పోయి, రాష్ట్ర ప్రభుత్వం ఆశ్చర్యకరంగా కేంద్ర ప్రభుత్వం చేయకపోతే తామే నిర్మాణం చేపడతామని చెప్తోంది.
            ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కాలంలో ఉత్తరాంధ్ర అభివృద్ధికి చేసింది ఏమీ లేదు కానీ, స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకంతో సహా ఉత్తరాంధ్రకు ద్రోహం చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వా నికి సహకరించడం ఏమాత్రం క్షంతవ్యం కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ద్రోహ చర్యలలో భాగస్వామ్యం కావడం తప్ప మరొకటి కాదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి క్యాంప్‌ ఆఫీసు విశాఖలో ఏర్పాటు చేసే ముందు ఉత్తరాంధ్రకు వీరి పాలనా కాలంలో ఏం చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలి.

  • ఉత్తరాంధ్ర ప్రజలకు తాగునీరు, సాగునీరు కోసం చేపట్టే సుజల స్రవంతి ప్రాజెక్టు పనుల కోసం ఎంత నిధులు కేటాయించారో, రైతులకు ఏం మేలు చేశారో తెలపాలి.
  • ఉత్తరాంధ్రలో కోఆపరేటివ్‌ షుగర్‌ ఫ్యాక్టరీలు, ఫెర్రో అలాయిస్‌, జూట్‌ కంపెనీలు తెరిపించడానికి ఏం చేశారు? అప్పటికే మూతపడిన చిన్న, మధ్యతరహా పరిశ్రమలు తెరిపించడానికి ఎటువంటి చర్యలు తీసుకున్నారు?
  • స్టీల్‌ప్లాంట్‌ ఉత్తరాంధ్రకే కాకుండా ఆంధ్ర రాష్ట్రానికే తలమానికం. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత 970 రోజులుగా పోరాటం జరుగుతున్నది. లక్ష కుటుంబాలకు పైగా ఉపాధి కల్పిస్తున్న స్టీల్‌ప్లాంట్‌ను రక్షించడంలో వీరి ప్రభుత్వ పాత్ర ఏమిటి?
  • గంగవరం పోర్టును అదానీకి ఎందుకు ధారాదత్తం చేశారు? పైగా స్టీల్‌ప్లాంట్‌కు రావాల్సిన ముడిసరుకును ఎందుకు ఆపించేశారు?
  • విశాఖపట్నం ఏజెన్సీలో ఆదిమ తెగ ఉంది. బాగా వెనుకబడినవారు, వారి కోసమే ముఖ్యమంత్రి విశాఖపట్నం మకాం మార్చుతున్నామని జీవోలో పేర్కొన్నారు. వీరంతా వామపక్ష ఉగ్రవాదం వైపు వెళ్ళిపోతున్నారని ఆ జీవోలో పేర్కొనడం దుర్మార్గమైనది. గిరిజన ప్రాంతంలో మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవటమే కాకుండా ఆదిమ గిరిజనులకు అంత్యోదయ కార్డుల ద్వారా ఇచ్చే ఉచిత రేషన్‌ ఎందకు సక్రమంగా పంపిణీ చేయడంలేదు? గిరిజన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎంతమందికి కల్పించారు? గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పనకై ఏం చర్యలు చేపట్టారు? 1/70 చట్టానికి భిన్నంగా హైడ్రో ప్రాజక్టు పేరున గిరిజనుల భూమిని కార్పొరేట్లకు ఎందుకు ధారపోస్తున్నారు ?
  • ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా 6116 ఎకరాల భూమిని రైతుల నుండి బలవంతంగా ఎందుకు లాక్కున్నారు?
  • రైల్వే జోన్‌, వాల్తేరు డివిజన్‌, మెట్రో రైలు, గిరిజన యూనివర్శిటీ వంటి విభజన హామీలు, వెనుకుబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకు కేంద్ర నుండి రావాల్సిన నిధులు కోసం ఏం ప్రయత్నం చేసారు ?

ఈ ప్రశ్నలకు సమాధానం రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. అలా కాకుండా విశాఖపట్నం మకాం మార్చడమంటే, ఉత్తరాంధ్రలో ఉండే కోట్ల రూపాయల విలువ చేసే భూములను దోచుకోవడానికి, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయడానికి తప్ప ఇంకొకటి కాదు అని భావించవలసి ఉంటుంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర వెనుకబడింది తప్ప ఈ ప్రాంతంలో ఉండే రాజకీయ పార్టీల నాయకులు వెనకబడిలేరు. ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీస్‌ వచ్చినంత మాత్రాన అభివృద్ధి జరగదు. పైగా చిరు వ్యాపారులు, అసంఘటిత రంగ కార్మికుల ఉపాధి పోయే ప్రమాదముంది.
        అభివృద్ధి జరగాలంటే అధికార వికేంద్రీకరణ చేయాలి, నిధులు మంజూరు చేయాలి. కానీ వీరి ప్రభుత్వం పంచాయతీలకు, ఎన్నికైన స్థానిక సంస్థలకున్న హక్కులనే హరించి వేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటే, నీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలి. గిరిజన ప్రాంతంలో సహా విద్య, వైద్యం, రవాణా వంటి మౌలిక వసతులు కల్పించాలి. ప్రభుత్వ రంగ సంస్థలను రక్షించడంతో పాటు, ఉత్పత్తి రంగంలో పెట్టుబడులు పెట్టి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి.

/ వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు /
కె. లోకనాధం

lokanatham