Dec 14,2022 07:28

వాస్తవానికి అన్ని రాజకీయ పార్టీలు...చట్టసభల్లో 1/3వ వంతు మహిళా రిజర్వేషన్‌ చట్టం చేస్తామని ఎన్నికల ప్రణాళికలలో, ఎన్నికల ప్రచారంలో మహిళా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వాగ్దానాలు చేస్తున్నాయి. ఓట్ల కోసం, రాజకీయ సభల కోసం మహిళలను ఉపయోగించుకుంటున్నాయి. పార్టీలో పదవులు, ఎన్నికల్లో సీట్లు ఇవ్వటంలో మొండిచెయ్యి చూపుతున్నాయి. సంవత్సరాలు గడిచినా రిజర్వేషన్‌ ఊసే ఎత్తటం లేదు. మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం పెరిగితే శాసనాలు రూపొందించడంలో, ప్రభుత్వ పాలనలో కీలక పాత్ర పోషించే వీలు కలుగుతుంది.

ఇంటాబయటా నిర్ణయాధికారాలలో మహిళల స్ధానం మారకుండా సమాజాభివృద్ధి జరగదని చరిత్ర చెబుతోంది. అణిచివేత నుంచి విముక్తి, స్వతంత్ర వ్యక్తిత్వం ఈ దేశంలో మహిళలకు ప్రధానమైనవి. ప్రపంచ లింగ సమానత్వ సూచీ-2022లో భారతదేశం 146 దేశాలకుగాను 135వ స్ధానంలో ఉంది. అత్యధిక లింగ వివక్షత కలిగిన దేశాల్లో భారత్‌ ఒకటిగా ఉందని 'ప్రపంచ ఆర్థిక వేదిక' (వరల్డ్‌ ఎకనామిక్‌ ఫారమ్‌) గణాంకాలు చెబుతున్నాయి. ఈ దశలో మహిళలకు కావలసినది కంటితుడుపు చర్యలు కాదు. రాజకీయ రంగంతో సహా అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలి.
         'మహిళల స్థాయిని చూసి ఒక దేశ పరిస్థితి ఎలా ఉందో చెప్పవచ్చు' అని ప్రథమ ప్రధానమంత్రి పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేర్కొన్నారు. కొంతమంది మహిళలు పలు రంగాల్లో అత్యున్నత స్థానాలు అధిరోహిస్తూ ఉండవచ్చు. ఇందిరాగాంధీ భారత ప్రధానిగా రాజకీయ రంగంపై బలమైన ముద్ర వేయగలిగినప్పటికీ పురుషులతో సమాన అవకాశాలకు వచ్చేసరికి స్త్రీలు ఇప్పటికీ ఎంతో దూరంలో ఉండటం దురదృష్టకరం.
లింగవివక్ష ఉండకూడదని, స్త్రీపురుష సమాన అవకాశాలను రాజ్యాంగం కల్పించింది. కానీ 75 ఏళ్ళ స్వాతంత్య్రం తర్వాత స్త్రీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అమ్మ కడుపులో పడినప్పటి నుంచే ఆడపిల్లను హతమార్చే కుట్ర సాగుతోంది. పురషాధిక్య సమాజంలో సామాజిక కట్టుబాట్లు, దురాచారాలు, స్త్రీల పట్ల పెనుశాపాలుగా మారుతున్నాయి. వరకట్న నిషేధ చట్టం, అత్యాచార నిరోధక చట్టం, నిర్భయ చట్టాలు వచ్చినా నేరాల సంఖ్య తగ్గకపోగా పెరుగుతున్నాయి. ఇంటాబయటా మహిళలు అభద్రతా భావంతో జీవించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
''అభివృద్ధికి గీటురాళ్ళలో రాజకీయాలలో మహిళా సాధికారిత కూడా ఒకటి. జనాభాలో సగభాగమైన మహిళలను విధాన నిర్ణయాల్లో భాగస్వాములను చేస్తేనే ప్రజాస్వామ్యానికి నిజమైన అర్ధం ఉంటుంద''ని ప్రపంచ ఆర్థిక వేదిక పేర్కొంది.
              అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని గొప్పలు చెప్పుకొనే మన దేశంలో మహిళా రిజర్వేషన్‌ బిల్లు దశాబ్దాలుగా తెరమరుగున పడింది. సగభాగంగా ఉన్న మహిళలకు చట్టసభలలో 1/3 వంతు రిజర్వేషన్లు కల్పించాలని మహిళా సంఘాలు సుదీర్ఘ కాలంగా ఉద్యమాలు నిర్వహిస్తున్నాయి. 1996 సంవత్సరంలో లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రభస జరిగింది. ఆర్‌జెడి, ఎస్‌పి లకు సంబంధించిన లల్లూ, ములాయం, శరద్‌ యాదవ్‌లు బిల్లు కాగితాలు చించివేశారు. సభ సజావుగా జరగకుండా గందరగోళం సృష్టించారు. మహిళా రిజర్వేషన్‌ వలన కుటుంబ జీవనం, సామాజిక సంబంధాలు దెబ్బతింటాయని బిజెపి అభ్యంతరం ప్రకటించింది. వామపక్షాలు మినహా రిజర్వేషన్‌ బిల్లుపై రాజకీయ పార్టీలకు ఏకాభిప్రాయం లేదని బిల్లు సెలక్ట్‌ కమిటీకి పంపబడింది. గీతా ముఖర్జీ నాయకత్వాన ఏర్పడిన పార్లమెంటరీ సెలక్ట్‌ కమిటి ఏకగ్రీవంగా యథాతథంగా బిల్లును ఆమోదించమని తెలిపింది.
            మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏడున్నరేళ్ళలో మహిళా బిల్లు ప్రస్తావనే లేదు. మహిళా బిల్లు గురించి మోడీ బెల్లం కొట్టిన రాయిలా ఒక్క మాట కూడా మాట్లాడరు. లోక్‌సభలో ఎస్‌.సి, ఎస్‌.టి లకు రిజర్వేషన్లు ఉన్నాయి. చట్టసభల్లో ఓబిసీలకు రాజ్యాంగం ఎటువంటి రిజర్వేషన్లు కల్పించలేదు. ఈ అంశంపైన పార్లమెంట్‌లో విడిగా చర్చను చేపట్టాలి. పార్లమెంట్‌లో అలా చర్చ చెయ్యకుండా మహిళా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మాత్రం రగడ చేస్తున్నారు.
            వాస్తవానికి అన్ని రాజకీయ పార్టీలు...చట్టసభల్లో 1/3వ వంతు మహిళా రిజర్వేషన్‌ చట్టం చేస్తామని ఎన్నికల ప్రణాళికలలో, ఎన్నికల ప్రచారంలో మహిళా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వాగ్దానాలు చేస్తున్నాయి. ఓట్ల కోసం, రాజకీయ సభల కోసం మహిళలను ఉపయోగించుకుంటున్నాయి. పార్టీలో పదవులు, ఎన్నికల్లో సీట్లు ఇవ్వటంలో మొండిచెయ్యి చూపుతున్నాయి. సంవత్సరాలు గడిచినా రిజర్వేషన్‌ ఊసే ఎత్తటం లేదు. మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం పెరిగితే శాసనాలు రూపొందించడంలో, ప్రభుత్వ పాలనలో కీలక పాత్ర పోషించే వీలు కలుగుతుంది.
           మహిళలు వంటింటికి, పిల్లల్ని కని పెంచటానికి, కుటుంబ ఆలనా పాలనా బాధ్యత వహించాలని...అంతవరకే పరిమితం కావాలనే మనువాద సిద్ధాంతకర్తల ఏలుబడిలో బిల్లుకి మోక్షం కలగదు. పైగా తమ రాజకీయ గుత్తాధిపత్యానికి బీటలు పడతాయనే భయం పాలక వర్గ రాజకీయ పార్టీలలో ఉంది. అనేక ప్రజా వ్యతిరేక బిల్లులు ఏకపక్షంగా ఆమోదింపచేసుకునే పాలక పార్టీలు మహిళా బిల్లును మాత్రం ఏకాభిప్రాయం పేరుతో సంవత్సరాల తరబడి పెండింగ్‌ పెడుతున్నాయి.
        రాజ్యసభలో ఆమోదం పొందిన మహిళా బిల్లు గత 12 ఏళ్ళుగా పార్లమెంట్‌ గోడలకు వేలాడుతోంది. మనకన్నా వెనుకబడిన రువాండా, టాంజానియా, ఉగాండా, ట్యునీషియా, దక్షిణ సూడాన్‌ వంటి ఆఫ్రికా దేశాలే కాదు. మన పొరుగున ఉన్న పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌ వంటి దేశాల చట్టసభల్లో మనకన్నా మహిళల సంఖ్య మెరుగ్గా ఉంది. దేశ జనాభాలో సగభాగం మహిళలు ఆ మేరకు రాజకీయ రంగంతో సహా అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలి. కానీ చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లకు ఉద్దేశించిన బిల్లునే గట్టెక్కించలేక మూలనపడేసిన ఘనత మన నాయకులది. మహిళలు సాధికారిత సాధించారని ఎవరెన్ని కబుర్లు చెప్పినా వాస్తవ పరిస్ధితులు అపహాస్యం చేస్తున్నాయి. ఉన్నత పదవుల్లో ఉన్న రాష్ట్రపతి, ఒకరిద్దరు మంత్రులను చూపించి మహిళలందరూ సాధికారిత సాధించారని ప్రచారం చేస్తున్నారు.
మహిళలు సుదీర్ఘ పోరాటాల ఫలితంగా ఓటుహక్కు సాధించుకున్నారు. 1962 నుండి 2014 వరకు పాలనలో మహిళా ఓట్ల శాతం పెరుగుతూ వచ్చింది. పాలనలో మహిళల భాగస్వామ్యం కొరకు జరిగిన ఉద్యమాల ఫలితంగా 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిన రిజర్వేషన్లను వినియోగించుకొని స్థానిక సంస్థల్లో మహిళలు 14 లక్షల మంది పాలన సాగిస్తున్నారు. ఎన్నికైన మహిళా ప్రతినిధులను పక్కన పెట్టి వారికి బదులుగా భర్త లేదా కుటుంబ సభ్యులే అన్ని వ్యవహారాలూ చక్కబెడుతున్నారు.
            భారత రాజ్యాంగం ఏం చెప్తోంది? చట్టం ముందు అందరూ సమానులే. కుల, మత, లింగ ప్రాంతాల పేరుతో వివక్ష నిషేధం... అని 14,15 అధికరణాలు చెప్తున్నాయి. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన పాలకులు రాజ్యాంగ హక్కులు కాలరాస్తున్నారు. మహిళా సాధికారిక కనుచూపుమేరలో కనిపించటంలేదు. చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళల సంఖ్యపై కేంద్ర ప్రభుత్వం తాజాగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన గణాంకాలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. లోక్‌సభలో 14.94 శాతం, ఇటీవల జరిగిన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 8.2 శాతం మంది మహిళలు శాసనసభకు ఎన్నికయ్యారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఒకే ఒక మహిళ గెలుపొందింది. దేశ వ్యాప్తంగా అసెంబ్లీల్లో 8 శాతం మాత్రమే మహిళలు. 17వ లోక్‌సభలో మహిళల శాతం 14.9 శాతం మాత్రమే. బిల్లు కనుక చట్ట రూపం దాల్చితే లోక్‌సభలో మహిళా సభ్యులు 181కి పెరుగుతారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో 175 స్థానాలకుగాను 15 మంది మాత్రమే మహిళలు. 1/3 వ వంతు రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందితే అసెంబ్లీలో 58 మంది మహిళలు ఎన్నికవుతారు.
         మహిళా బిల్లుపై జరుగుతున్న చర్చల ప్రక్రియ మహిళల సమానత్వానికి, మహిళాభివృద్ధికి ఆటంకాలుగా ఉన్న ఫ్యూడల్‌ సంస్కృతికి అద్దం పడుతున్నది. నిర్ణయాధికారాల్లో సమాన భాగస్వామ్యం కోసం ఐక్యంగా ఉద్యమిద్దాం. పార్లమెంట్‌లో పూర్తి మెజారిటీ ఉన్న బిజెపి మహిళా బిల్లును పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టకుండా తొక్కిపెడుతోంది. బిల్లును శీతాకాల సమావేశాల్లో ఆమోదానికి పెట్టకుండా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ కాలయాపన చేస్తున్న పార్టీలకు మహిళలు రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెబుతారు.

(వ్యాసకర్త : ఐద్వా పూర్వ రాష్ట్ర కార్యదర్శి)
కె. స్వరూపరాణి

కె. స్వరూపరాణి