Dec 28,2022 07:42

జల విద్యుత్‌ ప్రాజక్టు వల్ల 4800 మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది వాస్తవం కాదు. సీలేరు, మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ ప్రాజెక్టులో కేవలం 5 వందల మంది మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నారు. అందులో స్థానిక గిరిజనులు నామమాత్రమే. ప్రభుత్వ సంస్థ లోనే అంతంతమాత్రపు ఉపాధి ఉన్నప్పుడు ప్రైవేటు అదానీ కంపెనీలో నాణ్యమైన టెక్నికల్‌ ఉద్యోగాలు పొందగలమా అనేది ప్రశ్న. జోలపుట్‌ డ్యాం, మాచ్‌ఖండ్‌ పవర్‌ ప్రాజెక్టు నిర్మాణం 1955లో జరిగినప్పుడు సుమారు 250 గ్రామాల ప్రజలు నిర్వాసితులైతే వారిని ఆదుకునేవారే కరవయ్యారు.

          అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో అపారమైన సహజ వనరుల నిలయమైన అడవులను అదానీ సంస్థకు, అంతర్జాతీయ బహుళ జాతి కంపెనీలకు అమ్మకానికి పెట్టిన మోడీ, జగన్‌ ప్రభుత్వాలను తిప్పికొట్టాలని, అడవుల అమ్మకాన్ని నిషేధించాలని ఆదివాసీలు ఆందోళనలు ముమ్మరం చేశారు. చింతపల్లి, కొయ్యూరు మండల పరిధిలో ఎర్రవరం లోని 1200 మెగావాట్ల, అనంతగిరి మండలం పెదకోట లోని 1500 మెగావాట్ల, చిట్టివలస లోని 800 మెగావాట్ల, గుజ్జెలి వద్ద 1400 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిక్‌ విద్యుత్‌ ప్లాంట్లను అదానీ కంపెనీకి అప్పగించాలని రాష్ట్ర క్యాబినెట్‌ నిర్ణయించింది. జల విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణం వలన చింతపల్లి, కొయ్యూరు మండల పరిధిలో 4 పంచాయితీలు, 32 గ్రామాలకు చెందిన వెయ్యి కుటుంబాలకు చెందిన 5 వేల మంది గిరిజన ప్రజలు నిర్వాసితులవుతారు. అనంతగిరి మండల పరిధిలోని పెదకోట, కర్రివలస, గుజ్జెలి ప్రాంతంలోని మరొక 5 వేల మంది గిరిజన ప్రజలు నిర్వాసితులు అయ్యే ప్రమాదముంది.
 

                                                                          ఉపాధి పేరుతో మోసం

జల విద్యుత్‌ ప్రాజక్టు వల్ల 4800 మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది వాస్తవం కాదు. సీలేరు, మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ ప్రాజెక్టులో కేవలం 5 వందల మంది మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నారు. అందులో స్థానిక గిరిజనులు నామమాత్రమే. ప్రభుత్వ సంస్థ లోనే అంతంతమాత్రపు ఉపాధి ఉన్నప్పుడు ప్రైవేటు అదానీ కంపెనీలో నాణ్యమైన టెక్నికల్‌ ఉద్యోగాలు పొందగలమా అనేది ప్రశ్న. జోలపుట్‌ డ్యాం, మాచ్‌ఖండ్‌ పవర్‌ ప్రాజెక్టు నిర్మాణం 1955లో జరిగినప్పుడు సుమారు 250 గ్రామాల ప్రజలు నిర్వాసితులైతే వారిని ఆదుకునేవారే కరవయ్యారు.
ఇప్పుడు మాత్రం 'కేవలం 10 కుటుంబాలున్న 25 మంది జనాభాగల కొయ్యూరు మండలంలోని చిన్నయ్యకొండ అనే ఊరు మాత్రమే మునుగుతుంది. అందులో కేవలం 22 హెక్టార్ల ప్రైవేటు భూమి నష్టపోతున్నారు. 279 హెక్టార్ల భూమి అవసరం కాగా అందులో 257 హెక్టార్ల అటవీ భూమి ఉంద'ని ప్రభుత్వ సంస్థ ఎన్‌.ఆర్‌.ఇ.డి.సి.ఏ.పి చెప్పడం మోసం. అధిక సంఖ్యలో అడవిపై ఆధారపడి జీవిస్తున్న చుట్టుపక్కల నిర్వాసిత గ్రామాల ప్రజల వివరాలను పూర్తిగా దాస్తున్నది.
          రాష్ట్ర క్యాబినెట్‌ సత్య సాయి గ్రీన్‌ ఎనర్జీని అదానీ కంపెనీకి అప్పగించడంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. రాజ్యాంగం ప్రకారం ఆదివాసీ ప్రాంతంలోని ఆదివాసీ ప్రాంత సహజ వనరులు ఆదివాసీలకు చెందాలని, ఆదివాసీ ప్రాంతంలో అదానీ ప్రవేటు సంస్థల ప్రవేశాన్ని నిషేధించాలని డిమాండ్‌ చేస్తూ... చింతపల్లి, జి.కె వీధి, కొయ్యూరు మండలంలో గిరిజన సంఘం నాయకత్వంలో మిగతా గిరిజన సంఘాలు, ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో డిసెంబర్‌ 14న మూడు మండలాల్లో బంద్‌ నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు.
 

                                                                     సహజ వనరులున్నా వెనకబాటే

అడవుల విస్తీర్ణంలో అల్లూరి సీతారామరాజు జిల్లా రాష్ట్రంలోకెల్లా మొదట స్థానంలో ఉంది. అయితే మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. నేటికీ గిరిజన గ్రామాలలో వైద్యం కోసం డోలీ మోతలు కొనసాగిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఉపాధి లేక మైదాన ప్రాంతంలో వలసలు వెళుతున్నారు. రక్తహీనతతో గిరిజన బాలింతలు, చిన్నపిల్లల మరణాలు సర్వసాధారణంగా ఉన్నాయి. అక్షరాస్యత చాలా తక్కువ. సహజ వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ గిరిజన ప్రజలు పేదరికంతో ఉన్నారు. పాడేరు ఏజెన్సీలో సుమారు 5 లక్షల కోట్ల రూపాయల విలువైన 515 మిలియన్‌ టన్నుల బాక్సైట్‌ మైనింగ్‌ వనరులు పుష్కలంగా ఉన్నాయి. చైనా క్లే, గ్రానైట్‌, లేటరైట్‌, రంగు రాళ్ళు, క్వార్ట్డ్జ్‌, లైమ్‌ స్టోన్‌ తదితర సహజ వనరులతో లక్షల కోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపద నిలయంగా ఉంది.
            ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన ఆర్గానిక్‌ కాఫీ పంట పండే దట్టమైన అడవులు, సుగంధ ద్రవ్యాలు, పసుపు, పిప్పళ్లు, అల్లం, మిరియాల పంటలకు అనువైన ప్రాంతం. జీడి, అటవీ ఉత్పత్తులు, వనమూలికలు, రాజ్మా విస్తారంగా దొరికే తూర్పు కనుమల అటవీ ప్రాంతమిది.
ప్రఖ్యాతిగాంచిన టూరిజం ప్రాంతాలైన బొర్రా గుహలు, కె.కె లైన్‌ ట్రైన్‌ ప్రయాణం, కటికి జలపాతం, అరకు వ్యాలీ, పద్మాపురం గార్డెన్‌, ట్రైబల్‌ మ్యూజియం, తజంగి, వంజంగి అందాలు, రణజిల్లెడ, కొత్తపల్లి, చాపరాయి, పాపికొండలు జలపాతాలు, మరోవైపు సీలేరు, మాచ్‌ఖండ్‌ విద్యుత్‌ ప్రాజెక్టులు వున్నాయి. ఇంకోవైపు దేశంలోనే అత్యంత ఎక్కువ మంది గిరిజనులను నిరాశ్రయులను చేసిన పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతం.
ఈ జిల్లాలో గిరిజనులు 82.67 శాతం. రాజ్యాంగం లోని 5వ షెడ్యూల్‌ ప్రాంతంలోని గిరిజన ప్రాంత హక్కులు, విద్య, వైద్యం, ఉపాధిని ... గిరిజన సలహా మండలి, రాష్ట్ర గవర్నర్‌, దేశ రాష్ట్రపతి ఆధ్వర్యంలో కాపాడాల్సి వుంది. ఆదివాసీల హక్కులు, సహజ వనరులు, అటవీ భూముల రక్షణ చూడాల్సి ఉంది. కానీ దేశ విదేశీ బహుళజాతి సంస్థల ఒత్తిడితో కేంద్రం లోని బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి ప్రభుత్వం మోనిటైజేషన్‌ పైప్‌లైన్‌లో భాగంగా 2024 వరకు ఆదివాసీ అడవులను అమ్మకానికి పెట్టి డబ్బు సంపాదించడానికి పూనుకున్నాయి. రాజ్యాంగం ప్రకారం ఆదివాసీ ప్రాంతంలోని అడవులు, భూములలో ప్రైవేటు కంపెనీల ప్రవేశంపై నిషేధం ఉన్నది. ఐదవ షెడ్యూల్‌ ప్రాంత అడవుల్లో బడా బహుళ జాతి కంపెనీలు సులభంగా ప్రవేశించడానికి వీలుగా పర్యావరణ అటవీ సంరక్షణ చట్టం-1980ను సవరించి మరింత సులభతరం చేసింది.
            అటవీ పర్యావరణ పరిరక్షణ చట్టం-1980 ప్రకారం అటవీ ప్రాంతంలోని భూములను అటవీయేతర కార్యక్రమాలకు కేటాయించరాదు. మైనింగ్‌, భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి అటవీ భూములు కేటాయించరాదు. డిసెంబర్‌ నెలలో జరిగిన పార్లమెంటు సమావేశంలో ఫారెస్ట్‌ కన్జర్వేషన్‌ రూల్స్‌ను సవరించి ఆదివాసీ ప్రాంత అడవులను బహుళ జాతి కంపెనీలకు అప్పజెప్పేందుకు సులభతరం చేసింది. దీంతో ఆదివాసీ ప్రాంత అడవులు, భూముల రక్షణకు ఉన్న చట్టాలు ప్రశ్నార్థకంగా మిగిలాయి.
ఆదివాసీ ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో ఎలాంటి మైనింగ్‌ గాని, భారీ ప్రాజెక్టుల నిర్మాణం గాని చెయ్యాలన్నా గ్రామసభ ఆమోదం పొందడం తప్పనిసరి అన్న నిబంధన గతంలో వుండేది. ప్రభుత్వ ప్రాజెక్టు అయితే 70 శాతం గ్రామ సభలో ఆమోదం పొందడం తప్పనిసరి. ప్రైవేటు కంపెనీలకు 80 శాతం గ్రామ సభ ఆమోదం పొందడం తప్పనిసరి. అయితే ఇప్పుడు సవరించిన నిబంధనల ప్రకారం ఎటువంటి ఆమోదం పొందనవసరం లేదు.
 

                                                            ప్రాజెక్టు నిర్వహణపై నివేదిక అక్కర్లేదంట

ప్రాజెక్టు నిర్వహణలో సామాజిక, ఆర్థిక, పర్యావరణ ప్రభావంపై నివేదికను ప్రజలకు పబ్లిక్‌ హియరింగ్‌ ద్వారా తెలపాలన్న నిబంధన గతంలో వుండేది. ఇప్పుడు సవరించిన రూల్స్‌ ప్రకారం ఏ నివేదిక ఇవ్వక్కరలేదు. గతంలో దీనిపై ప్రభుత్వం వివిధ ఎక్స్‌పర్ట్‌ కమిటీలు నియమించి నివేదిక ఇచ్చేది. సవరించిన రూల్స్‌ ప్రకారం కంపెనీ నుండి మెజారిటీ సభ్యులు ఉంటారు. ప్రజల తరపున ఉండరు. ఏజన్సీ ప్రాంతంలో గిరిజన భూములు, అడవుల రక్షణకు ఉన్న 1/70 చట్టం, అటవీ హక్కుల చట్టం, పెసా చట్టానికి అధికారం లేకుండా విచ్చలవిడిగా ఆదివాసీ ప్రాంత అడవులు, భూములు, సహజ వనరులలోకి ప్రైవేటు కంపెనీలు ప్రవేశించడాన్ని సులభతరం చేసింది. దీనివలన ఆదివాసీ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆదివాసీలు అడవుల నుండి గెంటివేయబడతారు. నిలువ నీడ లేకుండా వారి జీవన విధానం విచ్ఛిన్నం అవుతుంది.
         కేంద్ర బిజెపి, రాష్ట్ర వైసిపి ప్రభుత్వం గిరిజనుల రాజ్యాంగ హక్కులను సుప్రీం కోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ ఆదివాసీ ప్రాంత అడవులు, భూమి, సహజ వనరులను అదానీకి ధారాదత్తం చేస్తున్నాయి.
          అనంతగిరి మండలం నిమ్మలపాడు గ్రామంలో బిర్లా మైనింగ్‌ కంపెనీ తవ్వకానికి వ్యతిరేకంగా (బిర్లా వర్సెస్‌ సమత కేసులో) సుప్రీం కోర్టు 1997 సంత్సరంలో స్పష్టమైన తీర్పునిచ్చింది. 5వ షెడ్యూల్‌ ప్రాంతంలో ప్రైవేటు కంపెనీలకు మైనింగ్‌ లీజు పొందే హక్కు లేదని, ఆదివాసీ ప్రాంతంలో మైనింగ్‌ తవ్వకాలు జరపాలంటే కేవలం గిరిజన సహకార సంఘాలకే అర్హత ఉందని, ప్రభుత్వాన్ని కూడా గిరిజనేతర సంస్థగానే చూడాల్సి ఉంటుందని పేర్కొంది.
          ఒడిషా లోని రాయగఢ్‌ జిల్లాలోని నియంగిరి ప్రాంతంలో (2013లో) వేదాంత వర్సెస్‌ ఆదివాసీల మధ్య బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. 5వ షెడ్యూల్‌ ప్రాంతంలో గ్రామ సభల ఆమోదం లేకుండా మైనింగ్‌ కార్యక్రమాలు నిషేధం. ఆదివాసీ ప్రాంతంలో గ్రామసభల అధికారం సుప్రీంకోర్టు కన్నా గొప్పదని పేర్కొంది. ఈ తీర్పును కూడా జగన్‌-మోడీ ప్రభుత్వాలు ఉల్లంఘిస్తున్నాయి.
రాజ్యాంగ హక్కుల ద్వారానే పోరాట విజయాలు
పాడేరు ఏజెన్సీ చింతపల్లి అడవుల్లో బాక్సైట్‌ తవ్వకాలను దుబారు కంపెనీకి అప్పచెప్పేందుకు 1/70 చట్టాన్ని సవరించాలని గిరిజన సలహా మండలి సమావేశంలో 2000లో అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష కాంగ్రెస్‌ తదితర పార్టీలు తీర్మానించినప్పుడు ఒక్క సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య మాత్రమే వ్యతిరేకించారు. సిపిఎం మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన పక్షాన పోరాడి రద్దు చేసే వరకు నిలిచింది.
            పాడేరు ఏజెన్సీ చింతపల్లి బాక్సైట్‌ తవ్వకాలకు, అనంతగిరి, అరకు ప్రాంతంలో బాక్సైట్‌ తవ్వకాలకు 2006లో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి ...రాస్‌ అల్‌ ఖైమ ప్రైవేట్‌ సంస్థలకు ఒప్పందం చేసినప్పుడు గిరిజన సంఘం, సి.పి.ఎం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాయి. 2008లో చింతపల్లి ఎస్‌.కోట గ్రామం వద్ద జరిగిన బాక్సైట్‌ ప్రజాభిప్రాయ సేకరణలో అప్పటి భద్రాచలం ఎం.పి డాక్టర్‌ బాబూరావు పార్లమెంటులో, ఎంఎల్‌సి ఎం.వి.ఎస్‌.శర్మ అసెంబ్లీలో, అప్పటి గిరిజన ప్రాంత సిపిఎం ప్రజాప్రతినిధులు జిల్లా పరిషత్‌, ఐటిడిఎ పాలక మండలి, గ్రామ, మండల పరిషత్‌ సమావేశంలో బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా తీర్మానం చేసి గిరిజనులకు అండగా నిలబడ్డారు. 2016లో చింతపల్లి ప్రాంతం జర్రెల బ్లాక్‌లో 3 వేల ఎకరాల అటవీ ప్రాంతంలో బాక్సైట్‌ తవ్వకాల కోసం ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధికి కేటాయిస్తూ ఇచ్చిన జీవో 97 రద్దు చేసే వరకు గిరిజన ప్రజానీకం రాజీ లేని పోరాటం నడిపింది.
              పాడేరు ఏజన్సీలో జల విద్యుత్‌ ప్రాజెక్టులను అదానీ ప్రవేటు సంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ, ఆ ఒప్పందాలు రద్దు చేసే వరకు మరో బాక్సైట్‌ తరహా పోరాటానికి ప్రజలంతా సన్నద్ధం కావాలి.

(వ్యాసకర్త గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
సెల్‌ : 9490630715)
కిల్లో సురేంద్ర

కిల్లో సురేంద్ర