Nov 23,2022 07:17

దేశంలోని ఐ.టి కంపెనీల్లో అతి పెద్దవైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌, ఇన్ఫోసిస్‌ రెవిన్యూలో దాదాపు 80 శాతానికి పైగా ఉత్తర అమెరికా, యూరోపియన్‌ మార్కెట్ల నుంచే వస్తుంది. ఈ దేశాల్లో వచ్చే సంక్షోభ ప్రభావం భారత ఐ.టి రంగంపై తీవ్రంగా వుంటుంది. ఇప్పటికే గత ఏడాదితో పోలిస్తే 18 శాతం నియామకాలు ఐ.టి రంగంలో తగ్గాయి. కేవలం ఐ.టి రంగానికే ఇది పరిమితం కాలేదు. విద్యా రంగానికి చెందిన ఎడ్‌ టెక్‌ కంపెనీలు కూడా ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో దేశ ప్రజల కొనుగోలు శక్తి మరింతగా తగ్గి ఆర్థిక సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తున్నది. అయినప్పటికీ ఈ విపత్తు గురించి మన పాలకులకు ఏ మాత్రం పట్టడంలేదు. ఈ పరిస్థితులను కూడా ఉపయోగించుకొని మత రాజకీయాలు చేయడానికి సిద్ధం అవుతున్నట్లు కనిపిస్తుంది. దేశ ప్రధాని అనేక దేవస్థానాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పద్ధతి, ఆ సందర్భంగా ఆయన చేస్తున్న ప్రసంగాలు ఇందుకు నిదర్శనాలు. అయోధ్యలో 2024 జనవరి నాటికి రామాలయ నిర్మాణం ఆయన లక్ష్యంగా వుంది.

త వారం రోజుల్లో ట్విట్టర్‌ 50 శాతం ఉద్యోగులను (12 వేల మందిని), అమెజాన్‌ 10 వేల మందిని, ఫేస్‌బుక్‌ ఆధ్వర్యంలోని మెటా కంపెనీ 3 వేల మందిని తొలగించాయి. ఇంతేకాదు, లక్ష పదిహేను వేల మంది పని చేస్తున్న ఇంటెల్‌ 20 శాతం, స్నాప్‌ 20 శాతం, రాబిన్‌హుడ్‌ 13 శాతం ఉద్యోగులను, సేల్స్‌ఫోర్స్‌ 2 వేల మందిని, ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌ 2,500 మందిని, మైక్రోసాఫ్ట్‌ వెయ్యి మంది ఉద్యోగులను ఇంటికి పంపాయి. వీరు కాకుండా మరో లక్ష మంది లే ఆఫ్‌ల ద్వారా పని, జీతం లేకుండా త్రిశంకు స్వర్గంలో వున్నారు. వివిధ కంపెనీలు కొత్త నియామకాలకు ఇంటర్వ్యూలు పూర్తి చేసి ఆఫర్‌ లెటర్లు ఇచ్చి, జాయినింగ్‌ లెటర్లు ఇవ్వకుండా సుమారు లక్ష మంది భవిష్యత్తును ఆందోళనలో వుంచాయి. టిసిఎస్‌ సంస్థ ఉద్యోగులకు లే ఆఫ్‌ ప్రకటించనున్నదని వార్తలు వస్తున్నాయి. మూన్‌ లైటింగ్‌, ఫేక్‌ సర్టిఫికెట్స్‌ లాంటి పేర్లతో గత సెప్టెంబర్‌ నుండి ఐ.టి ఉద్యోగుల తొలగింపు భారీగా పెరిగింది. ఈ విషాద క్రమం ఇంతటితో పూర్తయినట్లు కాదు. అసలు మాంద్యం ప్రభావం ముందుంది అంటున్నారు నిపుణులు. ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు రానున్న ప్రమాద హెచ్చరికలు చేసేస్తున్నాయి. 'ఉన్న డబ్బును కార్లకు, టీవీలకు, జల్సాలకు ఖర్చు చేయకండి...' అంటూ పెట్టుబడిదారీ ఆర్థికవేత్తలతో పాటు అమెజాన్‌ చీఫ్‌ జెఫ్‌ బెజోస్‌ లాంటి దిగ్గజ వ్యాపార సంస్థల అధినేతలు ఆపత్కాల ప్రవచనాలు చేస్తున్నారు. ఈ ప్రళయం మనలను తాకదు అంటూ చెప్పిన మన దేశ పాలకులు, ఆర్థిక నిపుణులు గొంతులు సవరించుకుంటున్నారు. శనివారం హైదరాబాద్‌లో రిజర్వు బ్యాంక్‌ నిర్వహించిన ఒక సెమినార్‌లో సాక్షాత్తు ఆర్‌బిఐ గవర్నర్‌ రానున్నది ముప్పేనని, అందుకు అందరూ సిద్ధం కావాలన్నారు. ఇవన్నీ ఎందుకంటే...ప్రపంచ ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడానికి అనడం...'తాటి చెట్టు ఎందుకెక్కావంటే దూడ గడ్డి కోసం' అనే కాకమ్మ కథ లాగా వుంది. ఆర్థిక సంక్షోభం ఎందుకు వస్తుంది? దాన్ని ఎలా పరిష్కరించాలి? అని పెట్టుబడిదారీ వ్యవస్థకు వుండదు. అందుకే సమస్యలన్నింటికీ ఉద్యోగుల తొలగింపే పరిష్కారమనుకుంటారు.
 

                                                      ఆర్థిక సంక్షోభం ఎందుకు వస్తుంది ?

క్లుప్తంగా అర్థం చేసుకోవాలంటే సరుకుల ఉత్పత్తికి, వాటి వాడకానికి మధ్య ఏర్పడే వ్యత్యాసమే సంక్షోభానికి మూల కారణం. ఉత్పత్తి అయిన సరుకులన్నీ ఎందుకు అమ్ముడు పోవంటే పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉత్పత్తికి ఉపయోగించే యంత్రాలు, పరికరాలు, ముడి సరుకు, ఇంధనం లాంటి ఉత్పత్తి సాధనాలు వ్యక్తిగత ఆస్తిగా మారి కొద్దిమంది చేతుల్లోకి చేరాయి. ఉత్పత్తి కోసం అయిన మొత్తం శ్రమ ఖర్చుకు సరిపడ వేతనాలు ఇవ్వకుండా యాజమాన్యం శ్రామికుల (మేధో శ్రమ, శారీరక శ్రమ) నుండి అదనపు విలువను కొల్లగొట్టి సంపన్నులు అవుతారు. ప్రజలు బికారులు అవుతారు. అందువల్ల ఉత్పత్తి అయిన సరుకులన్నింటిని ప్రజలు కొనలేరు. దీంతో సరుకుల నిల్వ ఏర్పడుతుంది. ఈ నిల్వలను అమ్ముకోవడానికి పెట్టుబడిదారులు అనేక ఎత్తులు వేస్తారు. ఉత్పత్తి తగ్గిస్తారు, కొత్త యంత్రాలతో తక్కువ మందితో ఎక్కువ ఉత్పత్తి చేస్తారు. వీటివల్ల కార్మికుల తొలగింపు పెరుగుతుంది. చిన్న చిన్న పరిశ్రమలు, ప్రభుత్వాల ఆశీస్సులు లేని పరిశ్రమలు పెద్ద కంపెనీల పోటీకి నిలబడలేక దివాళా తీస్తాయి. లేదా పెద్ద కంపెనీలలో విలీనం అయిపోతాయి. దీనివల్ల మరికొంత మంది ఉపాధి కోల్పోతారు. అప్పటికే వున్న నిరుద్యోగులకు వీరు తోడవుతారు. ఇలా ఉపాధి లేని వారి కొనుగోలు శక్తి తీవ్రంగా తగ్గిపోతుంది. పెట్టుబడిదారీ సంక్షోభం మరింత తీవ్రమై ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది. 2008లో ఇలాంటి స్థితే అమెరికాలో వచ్చి ప్రపంచ సంక్షోభంగా మారింది. మరల 14 సంవత్సరాల లోపే ప్రపంచం ఆర్థిక సంక్షోభం ముగింట నిలిచింది.
 

                                                             ప్రపంచ ఆర్థిక సంక్షోభం

ప్రపంచ అభివృద్ధి 2021లో 6.0 శాతం నుండి 2022లో 2.7 శాతానికి, 2023లో 2.3 శాతానికి తగ్గిపోతున్నట్లు 2022 అక్టోబర్‌లో ఐఎంఎఫ్‌ ప్రకటించిన ప్రపంచ ఆర్థిక నివేదిక తెలిపింది. గత పది సంవత్సరాల్లో ఇదే అత్యంత బలహీనమైన ప్రపంచ అభివృద్ధి. 2023 అక్టోబర్‌ నాటికి అమెరికాలో ఆర్థిక మాంద్యం రావడం నూరు శాతం జరగవచ్చునని బ్లూమ్‌బెర్గ్‌ అంచనా వేసింది. ప్రపంచ ద్రవ్యోల్బణం 2021లో 4.7 శాతం నుండి 2022లో 8.8 శాతానికి పెరుగుతుందని అంచనా. 2008లో ప్రపంచ ఆర్థిక సంస్థలు కుప్పకూలిపోవడంతో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నుంచి ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ కోలుకోలేకపోతుంది. ప్రపంచ జిడిపి వృద్ధి 2009లో 5.4 శాతం వుండగా, 2019 నాటికి 2.8 శాతానికి దిగజారింది. ఈ పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి రావడంతో ఆర్థిక వ్యవస్థలు ఘోరంగా పతనమయ్యాయి. కరోనా పోయినా ప్రపంచ అభివృద్ధి మాత్రం 2.7 శాతం దగ్గరే నిలిచిపోయింది. మన దేశంలో 2019-20లో స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) రూ.71,28,238 కోట్లు ఉంటే, 2021-22 నాటికి రూ. 68,11,471 కోట్లకు పడిపోయింది. 2023 నాటికి 8.7 శాతం అభివృద్ధి సాధిస్తామని మార్చిలో రిజర్వు బ్యాంకు అంచనా వేసింది. నెలలు గడుస్తున్న కొద్దీ ఈ సంఖ్య క్షీణిస్తున్నది. ఏప్రిల్‌లో 7 శాతం, అక్టోబర్‌లో 6.5 శాతానికి తగ్గించుకున్నారు. మార్చి వచ్చే నాటికి ఈ సంఖ్య రూపాయి విలువ లాగా ఎక్కడి వరకు దొర్లుతూ పోతుందో చూడాలి.

                               కార్పొరేట్లకు ప్యాకేజీలు ఇస్తే... ప్రజల కొనుగోలు ఎలా పెరుగుతుంది ?

పెట్టుబడిదారీ వ్యవస్థలో అంతర్భాగంగా వున్న ఆర్థిక సంక్షోభాన్ని కరోనా పైకి నెట్టి, ప్రపంచ కుబేర సంస్థలు వివిధ దేశాల ప్రభుత్వాల నుండి ఆర్థిక ప్యాకేజిల (ఉద్దీపన పథకాలు) పేరుతో భారీగా ప్రజల సంపదను కాజేశాయి. అమెరికా 1.9 లక్షల కోట్ల డాలర్లు (1.9 ట్రిలియన్‌ డాలర్లు), యూరోపియన్‌ యూనియన్‌ 1.8 లక్షల కోట్ల యూరోల (2.2 ట్రిలియన్‌ డాలర్లు) ప్యాకేజీలలో కార్పొరేటు కంపెనీలు అత్యధికం దోచుకున్నాయి. ఇలా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు ప్రకటించిన ప్యాకేజీల విలువ 16.9 ట్రిలియన్‌ డాలర్లు ఉంటుందని ఐఎంఎఫ్‌ ప్రకటించింది. మన దేశంలో బిజెపి ప్రభుత్వం ఉద్దీపన పథకాలలో భాగంగా కార్పొరేట్‌ పన్ను రేటును 30 శాతం నుండి 22 శాతానికి తగ్గించింది. కరోనాకు సంబంధం లేకుండానే గత ఐదు సంవత్సరాల్లో 10.72 లక్షల కోట్ల బడా కార్పొరేట్‌ రుణాలు రద్దు చేశారు. ఇది కాకుండా 13 కంపెనీలు వివిధ బ్యాంకుల్లో తీసుకున్న రూ.4.5 లక్షల కోట్ల రుణాలను కేవలం 1.61 లక్షల కోట్లకు 'సెటిల్‌' చేశారు. కరోనా కాలంలో ప్రజలు తీవ్రమైన కష్టాల్లో వుంటే కార్పొరేట్‌ దిగ్గజాలు మాత్రం మరింత బలపడ్డాయి. ముఖేష్‌ అంబానీ, ఆదానీలు గంటకు రూ. 90 కోట్లు సంపాదిస్తూ ప్రపంచ కుబేరులుగా మారారు. దేశంలోని 24 శాతం మంది భారతీయులు నెలకు రూ. 3000 కంటే తక్కువ ఆదాయం పొందుతుంటే వారి కొనుగోలు శక్తి ఎలా పెరుగుతుంది? ప్రపంచంలో ప్రతి నిమిషం 11 మంది ఆకలితో మరణిస్తున్నారని ఆక్స్‌ఫాం తెలిపింది. ప్రపంచ జనాభాలో సుమారు 82 కోట్ల మంది పోషకాహారం అందక బాధపడుతున్నారు. 15 కోట్ల మంది పిల్లలు సరైన ఎదుగుదల లేకుండా జీవిస్తున్నారు. 2019లో 18.7 కోట్ల మంది నిరుద్యోగులుగా వుంటే 2022 నాటికి 20.5 కోట్లకి పెరిగారు. కరోనా సమయంలో ప్రపంచం మొత్తంలో పేదరికం లోకి దిగజారిన పేదల సంఖ్యలో భారతదేశం లోనే 60 శాతం మంది వున్నారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. 2021లో 68 లక్షల మంది వేతన జీవులు ఉపాధి కోల్పోయారు. 2013లో ఉద్యోగాలు వున్న భారతీయుల సంఖ్య 44 కోట్లు వుంటే 2021 నాటికి 38 కోట్లకు పడిపోయింది. ఈ కారణాల వల్లనే ప్రపంచం లోనూ, భారతదేశంలోనూ ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రమవుతుంది.
 

                                                                  దేశంలో ఐ.టి రంగం

దేశంలో ఐ.టి ఉద్యోగులు 30 లక్షల మంది వున్నారు. కరోనా సమయంలో ఆన్‌లైన్‌ వ్యాపార లావాదేవీలు పెరగడంతో భారతదేశం లోని ఐ.టి కంపెనీల్లో ఉపాధి అవకాశాలు పెరిగాయి. కంపెనీలు భారీగా లాభపడ్డాయి. భారత ఐ.టి రంగం అభివృద్ధిని చూసి ఇదంతా మా గొప్పే అని కేంద్ర పాలకులు భుజాలు చరుచుకున్నారు. దేశంలోని ఐ.టి కంపెనీల్లో అతి పెద్దవైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌, ఇన్ఫోసిస్‌ రెవిన్యూలో దాదాపు 80 శాతానికి పైగా ఉత్తర అమెరికా, యూరోపియన్‌ మార్కెట్ల నుంచే వస్తుంది. ఈ దేశాల్లో వచ్చే సంక్షోభ ప్రభావం భారత ఐ.టి రంగంపై తీవ్రంగా వుంటుంది. ఇప్పటికే గత ఏడాదితో పోలిస్తే 18 శాతం నియామకాలు ఐ.టి రంగంలో తగ్గాయి. కేవలం ఐ.టి రంగానికే ఇది పరిమితం కాలేదు. విద్యా రంగానికి చెందిన ఎడ్‌ టెక్‌ కంపెనీలు కూడా ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. లాక్‌డౌన్‌ కాలంలో విద్యాలయాలు మూతపడడంతో ఆన్‌లైన్‌ విద్యతో ఈ కంపెనీలు భారీగా లాభపడ్డాయి. బైజూస్‌ లాంటి ఎడ్‌ టెక్‌ కంపెనీలకు గిరాకీ బాగా ఉండేది. ప్రస్తుతం ఈ సంస్థ రూ.4,500 కోట్ల నష్టాల్లో వున్నట్లు ప్రకటించి, 2,500 మంది ఉద్యోగులను తొలగించింది. వేదాంతు, లిడో లెర్నింగ్‌, అన్‌ అకాడమీ లాంటి ఎడ్‌ టెక్‌ కంపెనీలూ ఇదే తరహాలో తొలగింపులు తీవ్రం చేశాయి. అలాగే బ్లింకిట్‌ 1600 మందిని, కార్స్‌ 24 కంపెనీ, ట్రెల్‌, మీషో, ఫ్రంట్‌ రో, ఫార్‌ ఐ, రూఫీక్‌, లిడో లాంటి అనేక కంపెనీలు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి.
         ఈ నేపథ్యంలో దేశ ప్రజల కొనుగోలు శక్తి మరింతగా తగ్గి ఆర్థిక సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తున్నది. అయినప్పటికీ ఈ విపత్తు గురించి మన పాలకులకు ఏ మాత్రం పట్టడంలేదు. ఈ పరిస్థితులను కూడా ఉపయోగించుకొని మత రాజకీయాలు చేయడానికి సిద్ధం అవుతున్నట్లు కనిపిస్తుంది. దేశ ప్రధాని అనేక దేవస్థానాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పద్ధతి, ఆ సందర్భంగా ఆయన చేస్తున్న ప్రసంగాలు ఇందుకు నిదర్శనాలు. అయోధ్యలో 2024 జనవరి నాటికి రామాలయ నిర్మాణం ఆయన లక్ష్యంగా వుంది. ప్రపంచంలో అనేక దేశాల్లో ఉద్యోగుల తొలగింపునకు, వేతనాల కుదింపునకు, పెన్షన్‌ సౌకర్యాల కోతలకు వ్యతిరేకంగా సంఘటిత పోరాటాలు పెరుగుతున్నాయి. సంక్షోభం ప్రపంచ వ్యాప్తమైనపుడు పోరాటాలు ప్రపంచ వ్యాప్తం అవుతాయి. తక్షణ సమస్యలపై పోరాడుతూనే ఆర్థిక సంక్షోభానికి మూలమైన పెట్టుబడిదారీ వ్యవస్థలో వచ్చే సంక్షోభం గురించి అధ్యయనం చేసే శక్తులు పెరుగుతున్నాయి. ఈ వ్యవస్థ సమూల మార్పు కోసం అనేక కొత్త తరాలు, కొత్త పద్ధతుల్లో ప్రయత్నాలు చేస్తున్నాయి. వాటిలో భాగస్వాములు కావడం అభ్యుదయ శక్తుల కర్తవ్యం.

/ వ్యాసకర్త : సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు /
వి. రాంభూపాల్‌

వి. రాంభూపాల్‌