లాపాజ్ : ఘర్షణల నేపథ్యంలో నాలుగేళ్ళ క్రితం అధికారం నుండి పదవీచ్యుతుడైన వామపక్షవాది, బొలీవియా మాజీ అధ్యక్షుడు ఇవో మొరేల్స్ వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఎక్స్‌లో పోస్టు పెట్టారు. నాలుగోసారి పోటీ చేయాలంటూ తన మద్దతుదారులు కోరుతున్నారని, వారి అభ్యర్ధనను అంగీకరిస్తానని చెప్పారు. ''నేను చేయగలిగినదంతా చేస్తాను. ఇప్పటికీ మనకు బలం వుంది. మనపై జరుగుతున్న దురాక్రమణను వాస్తవాలు, నిజాయితీతో ఎదుర్కొనాలని భావిస్తున్నా'' అని ఆయన ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. 2006లో మొదటిసారిగా అధ్యక్షుడిగా ఎన్నికైన మొరేల్స్ 2019లో బలవంతంగా గద్దె దిగాల్సి వచ్చింది. దేశంలో అశాంతి చెలరేగిన తరుణంలో దేశం వీడి వెళ్లాల్సి వచ్చింది. అమెరికా ఆదేశాలతోనే తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నారని ఆయన విమర్శించారు.