
తిరుమలలో పులులు గాండ్రిస్తున్నాయి. కొండ చిలువలు బుసలు కొడుతున్నాయి. ఏనుగులు ఘీంకరిస్తున్నాయి. ముక్కుపచ్చలారని ఒక చిన్నారి తిరుమల మెట్ల మార్గంలో ఇటీవల పులి నోట చిక్కి ప్రాణాలు కోల్పోయారు. అటవీశాఖ ఏర్పాటు చేసిన బోనుల్లో చిరుత పులులు, ఎలుగుబంట్లు చిక్కుకుంటున్న ఘటనలు చూస్తునేవున్నాం. తిరుమల ఒకచోటే కాదు.. రాష్ట్రవ్యాప్తంగానూ విశాఖ, విజయనగరం మన్యం ప్రాంతాలు మొదలు కోస్తాంధ్రలోని కొండపల్లి ఏరియా, రాయలసీమలోని మడకశిర లాంటి ప్రాంతాల వరకు పలుచోట్ల వన్యప్రాణులు జనావాసాల్లో తారసపడుతూనేవున్నాయి. కోవిడ్ ఆంక్షల సమయంలో నిర్మానుష్యంగా మారిన రహదారుల మీదుగా సమీప అటవీ ప్రాంతాల్లోని వన్యప్రాణులు స్వేచ్ఛగా సంచరిస్తున్న వీడియోలు అప్పట్లో హల్‌చల్ చేశాయి. దాహర్తి తీర్చుకోవడానికి ఏకంగా ఒక చిరుత కాంక్రీక్టు కీకరాణ్యమైన హైదరాబాద్ మహానగరంలో ఎంతటి అలజడి సృష్టించిందో చూశాం. దేశవ్యాప్తంగానూ అనేక చోట్ల జనావాసాల్లోకి వన్యప్రాణులు వస్తున్న ఘటనలు తరుచూ చోటుచేసుకుంటూనేవున్నాయి. అభయారణ్యంలోనూ, కొండ, కోనల్లోనూ స్వేచ్ఛగా సంచరించాల్సిన వన్యప్రాణాలు ఇలా జనారాణ్యంలోకి చొరబడటం తీవ్ర ఆందోళన కలిగించే పరిణామమే. కానీ ఇలా ఎందుకు జరుగుతోంది. చొరబడుతున్నది వన్యప్రాణాలు..మానవుడా? జీవావరణం మొత్తం ఇంతలా అతలాకుతలం కావడానికి కారణమెవ్వరు అంటే ముమ్మాటికీ మనుషులే.
ఎడారిలో చలికి వణుకుతున్న ఒంటెకు తలదాచుకోవడానికి అవకాశమిచ్చిన అరబ్బు చివరకు తానే నిర్వాసితుడు కావడం మనం నీతి కథల్లో చదివే ఉంటాం. ఆ నీతి కథ మనిషి లిఖితం కాబట్టి నీతి అలా ఏడ్చింది. అదే కథను వన్యప్రాణాలు తిరగరాస్తే కథనం మారుతుంది. నీతి మారుతుంది. అనాదిగా మనిషి స్వార్థానికి, ఆధిపత్యానికి బలైపోతున్నది మానవేతర జంతుజాలమే. ఒకప్పుడు భూ విస్తీర్ణంలో 70 శాతంతో కళకళలాడిన అడవులు నేడు 23 శాతానికే పరిమితమయ్యాయి. ఫలితంగా వన్యప్రాణుల మనుగడకు ముప్పు వాటిల్లింది. మనిషి జీవన అవసరాల కోసం అడవులను ధ్వంసం చేస్తూనే ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా 'పెట్టుబడి' దాహర్తికీ ఇటు మానవాళి కష్టాల సుడిగుండంలో చిక్కుకుపోవడమే గాకుండా అటు ప్రకృతి, జీవావరణం కూడా ధ్వంసమైపోతున్నాయి. కార్పొరేట్ కంపెనీల లాభాల కోసం అడవుల్లోకి చొరబడిపోవడం, మైనింగ్ కోసం నిత్యం ధ్వంసరచన సాగుతోంది. బ్రెజిల్‌లో బోల్సనారో హయంలో బంగారు గనుల మాఫియా అమెజాన్ అడవుల్లో సృష్టించిన విధ్వంసం, కార్పొరేట్ రాజేసిన కార్చిచ్చుకు బలైపోయిన వృక్షసంపద, కోట్లాది వన్య ప్రాణుల హననం ఇప్పటికీ కళ్ల ముందు కదలాడుతూనేవుంది. మనదేశంలో మణిపూర్ మొదలు ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలా ప్రతి రాష్ట్రంలోనూ యురేనియం, బాక్సైట్ ఖనిజాల పేరిట, సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల మాటున అదానీ, జిందాల్ లాంటి కార్పొరేట్ కంపెనీల లాభాల కోసం వన్యప్రాణులను, గిరిజనాలను, అటవీ సంపదను పాలకులు బలిపెడుతూనేవున్నారు. సుస్థిరాభివృద్ధి, ఎకో టూరిజం వంటి ముందు పేర్లతో సమస్త ప్రాణికోటిని కడగండ్ల పాల్జేస్తున్నారు.
అభయారణ్యాలు, కొండలు, గుట్టలు, కోనలు, సముద్ర గర్భాలు ..కార్పొరేట్ లాభాన్వేషణ వేటుకు జీవావరణం మొత్తం అతలాకుతలమవుతోంది. అందుకనే ఈ విపరీత పరిణామాలు. వన్యప్రాణాల ఆవాసాల్లోకి మనిషి చొరబడినందునే జీవారణ్యంలోకి అవి బలవంతంగా రావాల్సిన దైౖన్య పరిస్థితి నెలకొన్నది అందుకనే. రాష్ట్రంలోని పరిస్థితులు కూడా ఈ క్రమంలో చోటుచేసుకుంటున్నవే. ఎర్ర చందనం కోసం, రాళ్ల కోసం శేషాచలాన్ని, యురేనియం కోసం నల్లమల అడవులను, బాక్సైట్ కోసం మన్యం ప్రాంతాన్ని ధ్వంసం చేస్తున్న వైనాన్ని చూస్తున్నాం. ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరవాలి. కానీ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అటవీ సంరక్షణ చట్టానికి తూట్లు పొడిచి కొత్త సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. గ్రామసభను కూడా పరిగణలోకి తీసుకోకుండా లక్షలాది అటవీ సంపదను కార్పొరేట్ కంపెనీలకు పంచేందుకు దుర్మార్గమైన సవరణలు ఆమోదింపజేసుకుంది. అంటే ఇక నుంచి అటవీ ప్రాంతాల్లో కార్పొరేట్ కంపెనీల చొరబాటు మరింతగా విస్తృతమవుతుంది. అటవీ ఆధారిత జీవకోటికి మరింత మప్పు తప్పదన్నమాట. ఈ వినాశకర విధానాలకు పాలకులకు ఇప్పటికైనా స్వస్తి పలికి జీవావరణ పరిరక్షణకు నడుంబిగించాలి.