
ఇంటర్నెట్‌డెస్క్ : రోజూ మీరు ప్లాస్టిక్ బాటిల్‌లోని నీటిని తాగుతున్నారా? అయితే అనారోగ్య సమస్యల్ని కొని తెచ్చికున్నట్లేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్‌ని వాడడం వల్ల.. పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్లాస్టిక్ బాటిల్‌లో నీటిని తాగితే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వెంటాడతాయన్న విషయం పెద్దగా తెలిసుండకపోవచ్చు. ఒకవేళ తెలిసినా.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండొచ్చు. అందుకే ప్లాస్టిక్ బాటిల్‌లో నీటిని తాగితే ఆరోగ్యానికి పొంచి ఉన్న ప్రమాదమేంటో తెలుసుకుందాం!
కాన్సర్ వచ్చే ప్రమాదముంది
ప్లాస్టిక్ బాటిల్‌లో నీటిని తాగడం వల్ల.. లివర్, రొమ్ము క్యాన్సర్లు వచ్చే ప్రమాదముందని ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ విమల్ సోమేశ్వర్ తెలిపారు. అలాగే అమ్మాయిల్లో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి.. అది వారి రుతుక్రమంపై ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు. ఇక ప్లాస్టిక్ బాటిల్స్‌లో తరచూ నీటిని తాగడం వల్ల మగవారిలో వీర్య కణాల సంఖ్య తగ్గుతుందని ఆయన చెప్పారు.
రాగి లేదా గాజు సీసాల్లో నీటిని తాగాలి
కొన్ని సంవత్సరాల క్రితం రాగి బిందెల్లో నీటిని నిల్వ చేసేవారు. ఆ నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎలాంటి ప్రమాదం ఉండేది కాదు. ఇప్పుడు అందరికీ ప్లాస్టిక్ అందుబాటులోకి వచ్చిన తర్వాత రాగి పాత్రల్లో నీటిని నిల్వ చేయడం లేదు. దీంతో పలు రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ సమస్యలకి చెక్ పెట్టాలంటే.. రాగి లేదా గాజు సీసాల్లో నీటిని తీసుకోవాలని డాక్టర్ విమల్ సూచించారు.