
కేంద్ర ప్రభుత్వం ఆగష్టు 24న నూతన ఎరువుల విధానం ప్రకటించింది. ''ఒకే దేశం-ఒకే ఎరువు'' నినాదంతో 2.10.2022 నుండి మార్కెట్‌లో భారత్ బ్రాండ్ ఒక్కటే ఉండాలని నిర్ణయించింది. దీనిని 'ప్రధానమంత్రి భారతీయ జన్ ఉర్వరక్ పరి యోజన' పథకంగా ప్రకటించింది. ఈ పథకం ప్రకారం దేశంలోని ఏ ఎరువుల కంపెనీ అయినా భారత్ యూరియా, భారత్ డి.ఎ.పి, భారత్ యం.ఓ.పి భారత్ ఎన్.పి.కె పేర్లతో అమ్మాలి. ఎరువుల సంచులపై మూడింట రెండు వంతుల భాగంలో ఎరువుల పేరుతో పాటు పథకం పేరు ప్రముఖంగా ముద్రించాలి. కంపెనీ పేరు మిగి లిన వివరాలన్నీ మూడింట ఒక వంతు భాగంలోనే ఉండాలి. 15.9.2022 నుండి కొత్త సంచులు వినియోగించాలని, పాత సంచులు డిసెంబరు 31 అనంతరం వాడరాదని ఎరువుల కంపెనీలకు మెమో ఇచ్చింది.
ఈ పథకం వల్ల రైతులకు గాని, కంపెనీలకు గాని ఒనగూడే ప్రయోజనం ఏమీ లేదు. గత ఏడాది సకాలంలో ఎరువులు సరఫరా కాలేదు. రైతులు బ్లాక్ మార్కెట్‌లో కొనుగోలు చేసుకోవాల్సి వచ్చింది. రైతులకు ఎరువులు అందని విషయాన్ని పార్లమెంటరీ స్థాయీ సంఘమే చెప్పింది. రూ.267 అమ్మాల్సిన యూరియా రూ.430కు అమ్మినట్లు వార్తలు వచ్చాయి. హెచ్చు ధరతో అమ్మడంతో పాటు ఎరువుల వ్యాపారులు రైతులకు అవసరమైన ఎరువు ఇవ్వాలంటే ...తక్షణం అవసరం లేని ఇతర ఎరువులను లేదా క్రిమిసంహారక మందులను కొంటేనే అవసరమైన ఎరువులు ఇచ్చారని స్థాయీ సంఘం దృష్టికి వచ్చినట్లు పేర్కొంది. 2021-22 బడ్జెట్ కన్నా 2022-23 బడ్జెట్‌లో ఎరువుల సబ్సిడీ కేటాయింపులను భారీగా తగ్గించడంపై స్థాయీ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్-1985 ప్రకారం ఎరువుల సరఫరాలో, అమ్మకాలలో జరుగుతున్న అవకతవకలను అరికట్టాలి. సంబంధించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. అయినప్పటికీ ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ నిబంధనలకు విరుద్ధంగా ఎరువుల నిల్వలన్నీ ఎన్నికలు జరుగుతున్న ఉత్తరప్రదేశ్‌కు తరలి వెళ్ళాయని పత్రికలలో వార్తలు వచ్చాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన విధానంలో...'ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్-85'ను సక్రమంగా అమలు చేయడం గురించిగాని, బ్లాక్ మార్కెట్టును అరికట్టే చర్యల గురించి గాని, అవసరానికి అనుగుణంగా బడ్జెట్‌లో నిధులు కేటాయించే అంశం గాని లేకుండా...'ఒకే దేశం ఒకే ఎరువు' నినాదం ఎవరి ప్రయోజనం కోసమో ఏలిన వారికే తెలియాలి. మన దేశం స్వాతంత్య్రం పొందేనాటికి తీవ్రమైన ఆహార కొరత ఉంది. ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకునే స్థితిలో ఉంది. ఆహారధాన్యాలు పండించడానికి భూమితో పాటు నీరు, ఎరువులు, విత్తనం అవసరం. ఆ నాటికి దేశంలో ఒకే ఒక్క ఎరువుల కంపెనీ ఉన్నది. ప్రభుత్వ రంగంలో ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్‌కోర్ లిమిటెడ్ (ఎఫ్‌ఎసిటి) మాత్రమే ఉన్నది. స్వాతంత్య్రం అనంతరం ప్రణాళికా విధానంలో భాగంగా ప్రభుత్వరంగం లోనూ సహకార రంగం లోనూ పది ఎరువుల కర్మాగారాలు నెలకొన్నాయి. ప్రభుత్వ రంగంలోని రాష్ట్రీయ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ''మణిరత్నం''గా ప్రఖ్యాతి గాంచింది.
ఎరువుల తయారికీ అవసరమైన నైట్రోజన్, ఫాస్పరస్, పొటాష్ మూడు ప్రధానమైన ముడి పదార్థాలు. ఈ మూడూ నేటికీ 90 శాతం దిగుమతి చేసుకోవాల్సిన స్థితిలోనే ఉన్నాయి. ఈ కాలంలో క్రమంగా ఎరువుల రంగంలో ప్రయివేటు పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. కాంప్లెక్స్ ఎరువులకు మిక్సింగ్ ప్లాంట్లు వచ్చాయి. ఈ ప్లాంట్లు దిగుమతి చేసుకున్న సందర్భంలోనూ మిక్సింగ్ చేసిన సందర్భంలోనూ రెండు సార్లు సబ్సిడీ పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కాలంలో ఎరువులకు అవసరమైన ముడి సరుకుల దిగుమతి, ఎరువుల తయారీ, పంపిణీ, ఎరువుల ధరలు వంటి సమస్యలు ముందుకు వచ్చాయి. ఈ సమస్యల పరిష్కారానికి సూచనలు చేయడం కోసం డజనుకు పైగా ఎక్స్‌పర్ట్ కమిటీలను వేశారు. ఈ క్రమంలోనే ఫెర్టిలైజర్ కంట్రోలు ఆర్డరు, ఎరువుల ధరల నియంత్రణ చట్టం, ఎరువుల పంపిణీ విధానం, సబ్సిడీల విధానాలు రూపొందాయి.
సరళీకరణ విధానాల నేపథ్యంలో ద్వంద్వ ధరల విధానం, కంట్రోలు సడలింపులు వంటి ప్రయోగాలు బాగా జరిగాయి. సరళీకరణ విధానాలు అన్ని రంగాలలో వచ్చినా ఆంక్షలు తొలగించని రంగం ఎరువుల రంగంగా ఉందని పేర్కొన్నారు. అయినా ఎరువుల కొరత సృష్టించడం, బ్లాక్ మార్కెట్ వంటి సమస్యలు తరచూ వస్తూనే ఉన్నాయి. ఎరువుల రంగంలో ప్రయివేటు రంగం ఏర్పడినప్పటి నుండి ప్రభుత్వ రంగం చిన్న చూపుకు గురవుతూనే ఉన్నది. ఈ కాలంలో ముడి కెమికల్స్ కన్నా, శుద్ధి చేసిన కెమికల్స్ దిగుమతి లాభసాటిగా మారింది. ప్రయివేటు కంపెనీల వారు, మిక్సింగ్ ప్లాంట్ల వారు, శుద్ధిచేసిన కెమికల్స్‌ను దిగుమతి చేసుకోవడం ప్రారంభించడంతో ఎగుమతి చేసే దేశాలు ఎక్కువ లాభాలు పోగేసుకున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ సంస్ధలు అనేక వడిదుడుకులకు గురయ్యాయి. 1997-98 నాటికి ఉత్పత్తి సామర్ధ్యానికి మించి 118 శాతం ఉత్పత్తి చేసిన ప్రభుత్వ కంపెనీలు...2009-10 నాటికి 79 శాతం ఉత్పత్తికి, 2014-15 నాటికి 66 శాతం ఉత్పత్తికి తగ్గిపోయాయి.

ఈ నెల 13వ తేదీన ప్రభుత్వ రంగంలోని ఎనిమిది ఎరువుల కర్మాగారాలను ప్రెవేటీకరించడానికి కేంద్రమంత్రి వర్గం నిర్ణయించినట్లు వార్తలు వెలువడ్డాయి. మణిరత్నంగా పేరుగాంచిన రాష్ట్రీయ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్, నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్, ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్‌కోర్, ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఎఫ్.సి.ఐ ఆరావళి జిప్సమ్ అండ్ మినరల్స్, మద్రాస్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్, హిందుస్తాన్ ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఫ్యాక్టరీలు ప్రెవేటుపరం కానున్న జాబితాలో ఉన్నాయి. ప్రభుత్వ రంగంలోని ఈ కంపెనీలన్నీ కార్పొరేట్ కంపెనీల వశమైతే వ్యవసాయానికి కీలకమైన ఎరువుల సరఫరా యావత్తూ కార్పొరేట్ల గుప్పిట్లోకి వెళ్ళిపోతుంది. ఆ తదుపరి ఎరువుల రంగంపై ఉన్న ఆంక్షల తొలగింపు జరిగిపోతుంది. ఇప్పటికే ఈ ఏడాది సబ్సిడీల తగ్గింపు, ఎరువుల ధరలపై ఆంక్షల సడలింపు జరిగింది. ఏటా ధరలు పెంచుకునే వీలు కల్పించారు. ఇప్పటికే సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రైతాంగంపై మరింత భారం పడుతుంది. ప్రభుత్వ రంగంలోని ఎరువుల కర్మాగారాలను కాపాడుకోవాల్సి ఉంది.
/ వ్యాసకర్త : ఎ.పి రైతుసంఘం సీనియర్ నాయకులు /
వై. కేశవరావు