
వలస కార్మికులు తాము నివసిస్తున్న చోటు నుంచి రిమోట్ ఓటింగ్ మిషన్ (ఆర్‌విఎం) ద్వారా ఓటు వేసే విధానాన్ని ఎటువంటి చర్చ లేకుండానే ఎన్నికల కమిషన్ (ఇసి) ఏకపక్షంగా ప్రతిపాదించడం పలు సందేహాలకు కారణమైంది. సోమవారం నాటి అఖిలపక్ష సమావేశంలో బిజెపి మినహా దాదాపు అన్ని పార్టీలూ ఆర్‌విఎం విధానాన్ని, ఇసి వాదనల్ని అంగీకరించకపోవడం సరైనదే. దేశంలో 30 కోట్ల మంది వరకూ ఉన్న వలస కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నారని, వారందరినీ ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం చేసి, ఓటింగ్ శాతాన్ని మెరుగుపరిచేందుకే ఆర్‌విఎం అన్న ఇసి వాదనకు ఎలాంటి ఆధారమూ లేదు. ముఖ్యంగా అంత భారీ సంఖ్యలో వలస కార్మికులున్నారనేది అవాస్తవం. అసలు రాజకీయ పార్టీలతో ఎటువంటి చర్చపెట్టకుండా ఆర్‌విఎంను ఒక్కసారిగా ముందుకు తేవడం వెనకున్న కారణాలేమిటనే ప్రశ్నకు సైతం ఇసి నుండి సమాధానం కరువైంది. నియోజకవర్గంలోని పోలింగ్ బూత్‌లలో ఆయా పార్టీల ఏజెంట్లు ఉండి స్లిప్పులోనున్న ఓటరును గుర్తిస్తారు. నూతన ప్రక్రియలో ఆర్‌విఎంల ద్వారా ఒక నియోజకవర్గానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఓట్లు నమోదవుతాయి. అభ్యర్థి ఆ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ బూత్‌లలో ఏజెంట్లను నియమిస్తారు తప్ప దేశమంతటా నియమించగలరా? ఇలాంటి ఎన్నో సమస్యలున్నాయి. అందువల్ల ఆ ఓటరు నిజమైన ఓటరో, దొంగ ఓట్లు వేయిస్తున్నారో గుర్తించే అవకాశమే ఉండదు. ఇప్పటికే డబ్బు, మద్యం, కులం, మతం... ఇలా ఎన్నో ప్రలోభాలతో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అధికార పార్టీతోపాటు పాలకవర్గ పార్టీలు ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేయవచ్చునన్న రాజకీయ పార్టీల వాదన సహేతుకమే.
ఎన్నికల ప్రక్రియలో అన్ని పార్టీలకూ సమాన అవకాశాలు లభించకపోవడం, ఇవిఎంలపై ఇప్పటికీ కొనసాగుతున్న అనుమానాలపై ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే. ఇవిఎంలలో ఓటరు తను వేసిన ఓటు సక్రమంగా పడిందో లేదో గుర్తించే అవకాశం లేకపోవడం ఒక లోపం. ఇవిఎంలలో ఓటు వేశాక (బటన్ నొక్కిన తరువాత) అది పేపర్‌పైనా నమోదై ఒక పెట్టెలో నిక్షిప్తం చేసే వివి ప్యాట్ విధానం ఉంది. ప్రతి నియోజకవర్గంలో పది శాతం ఓట్లు ఆ విధంగా వెరిఫై చేయాలన్నదీ ఉంది. కానీ ఆచరణలో అంతంతమాత్రమే! ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఓటర్లలో ఈ ప్రక్రియపై అనేక సందేహాలున్నాయి. వీటన్నింటికీ సమాధానాలిచ్చి, ఓటర్లకు భరోసా కల్పించాల్సిన ఆవశ్యకత ఉంది.
ఎలక్టోరల్ బాండ్ల పేరిట కార్పొరేట్ల నుండి నిధులు వసూలు చేసి, అత్యధిక భాగం అధికార పార్టీ ఖాతాలో జమవుతున్న పరిస్థితి ఇప్పటికే నెలకొంది. అందుకోసం నిబంధనలనూ ఎప్పటికప్పుడు సవరించడం, గడువులను పొడిగించడం జరుగుతోంది. ఇటీవల హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించి, గుజరాత్ ప్రకటనను జాప్యం చేయడంలో అధికార పార్టీకి ఇసి లబ్ధి చేకూర్చిందన్నది జగమెరిగిన సత్యం. హడావుడిగా ఆర్‌విఎంలను తేవడం వెనుక కూడా అలాంటిదేమైనా ఉందా అన్న సందేహాలను పూర్తిగా కొట్టిపారేయలేం.
మన దేశంలో 15 కోట్ల మంది అంతర్గత వలసదారులున్నారని ఓ అంచనా. వారు ఓటు వేసేందుకు ఇబ్బందిపడుతున్న మాట వాస్తవం. అదే సమయంలో తొందరపాటుతో వ్యవహరిస్తే ప్రజాస్వామ్య ప్రక్రియే అపహాస్యం పాలయ్యే ప్రమాదం ఉంది. ఇందుకు సంబంధించి చట్టబద్ధమైన, పరిపాలనా పరమైన అంశాలతోపాటు వలస కార్మికులను నిర్వచించే అంశంపైనా అనేక ప్రశ్నలున్నాయి. ఈ ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలను కనుగొన్నప్పుడే ఎన్నికల ప్రక్రియలో సంస్కరణలు సత్ఫలితాలనిస్తాయి. ఓటింగ్‌శాతం పెరగడం అవసరమే. అదే సమయంలో ఆతృత వల్ల తప్పులు జరగకుండా చూడడం మరింత అవసరం. ఇటువంటి సంస్కరణలకు చొరవ చూపుతున్న ఇసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం గావించే దామాషా ఎన్నికల విధానం గురించి మాటమాత్రంగానైనా ప్రస్తావించకపోవడం సబబు కాదు.