
ఒక తెలుగు పాట రచయితను ప్రపంచమే గుర్తించి హారతి పడుతున్న వేళ...కవులు, రచయితలు, కళాకారులతో ఈ తెలుగు నేల కళకళలాడాల్సిన చోట...ఒక ప్రకృతి పండుగ అందునా కవుల పండుగగా చెప్పుకునే తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలు కూడా చేయలేని భావ దారిద్య్రంలో ఆంధ్ర రాష్ట్రం ఉండటం సిగ్గుచేటు. ఈ నాలుగేళ్లలో సాహిత్య, సాంస్కృతిక ఉత్సవాలకు అంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు మచ్చుకైనా ఒక కార్యక్రమం జరిపిన దాఖలా లేదు. కవులు, కళాకారులు, రచయితలు, సాహితీవేత్తల వివరాలు కూడా ఈ ప్రభుత్వం దగ్గర పూర్తిగా ఉన్నట్టు లేదు. లబ్ధప్రతిష్టులకు వైయస్సార్ లైఫ్ టైం అఛీవ్‌మెంట్ అవార్డు ఇవ్వటం తప్ప మరి ఇతర కార్యక్రమాల్ని జరపడం లేదు. సాహిత్య సాంస్కృతిక ఉత్సవం అంటే కేవలం వైయస్సార్ పురస్కారం ఒక్కటే కాదు. సాంస్కృతిక శాఖ, దానికి చైర్మన్లు, అధికార భాషా సంఘాలు, సాహిత్య అకాడమీలు, డైరెక్టర్లు అంతా అలంకారప్రాయమైన వ్యవస్థగా ఉండంతో కవులు, రచయితలు కళాకారులకు శాపంగా మారింది.
అంతర్జాతీయ కవితా దినోత్సవాలు జరపడం లేదు. మాతృభాషా దినోత్సవాలు కూడా మొక్కుబడి కార్యక్రమాలు అయిపోయాయి. ఈ ప్రభుత్వం కవులు, కళాకారులు, రచయితలను ఎందుకు పక్కన పెట్టేసింది? ఎందుకు ఈ ప్రభుత్వానికి సాహిత్య, సాంస్కృతిక విషయాల పట్ల అంత నిర్లక్ష్యం? మీరు స్కూళ్లల్లో పిల్లలు చదువుకునే పాఠ్యాంశాలు రాయడానికి, వాళ్ల క్రమశిక్షణకు, ఉన్నతికి, వ్యక్తిత్వానికి అవసరమైన కథలు రచనలు అందించడానికి కవులు, రచయితలు, కళాకారులు కావాలి. కానీ పురస్కారాలు ఇవ్వడానికి వీరు అర్హులు కాదు. బహుశా కవుల్ని, సాహితీవేత్తల్ని, రచయితల్ని, కళాకారులని నిషేధించిందా ఈ ప్రభుత్వం? ఎందుకింత వివక్ష? తెలుగు భాషకి, ప్రజల ఆచార సాంప్రదాయాలకు సంస్కృతికి మూలమైన ఈ సాహిత్య, సాంస్కృతిక శాఖలను ఎందుకు చీకటిలోకి నెట్టారు. రాష్ట్రమంతా ఉగాది కవి సమ్మేళనాలతో, పురస్కారాలతో కవులు, సాహితీవేత్తల సంబరాలతో సంతోషంగా ఉండాల్సిన ఈ ఉగాదిని చూస్తుంటే ప్రతి కవీ కళాకారుడు సాహితీవేత్త నేడు మాకు ఉగాదులు లేవు..ఉషస్సులు లేవు...అన్నట్టు రస హీనంగా, కళావిహీనంగా ఆంధ్రదేశముంది. కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలోనూ ఉగాది వేడుకలు జరిగేవి. ఆయా జిల్లా కవులు, రచయితలు, కళాకారులు, సాహితీవేత్తలతో సంతోష సంబరాలు సాగేవి. ఇప్పుడు అవి ఏమీ లేక కోకిల కూయని వసంతంలా మిగిలిపోయింది ఆంధ్ర రాష్ట్రం. ఆంధ్ర రాష్ట్ర మొత్తం తిరిగినా 5,000 మంది కవులకు మించి ఉండరు. అంతమందికి సన్మాన సత్కారాలు, పురస్కారాలు ఇచ్చినా, సంబరాలు జరిపినా సంవత్సరానికి ఒక్కసారి కోటి రూపాయలు కూడా కావు. అందరి సంక్షేమం కోరే ఈ ప్రభుత్వం కవులు, కళాకారుల, రచయితల, సాహితీవేత్తల ఆదరణను ఎందుకు విస్మరించింది? ప్రతి కళాకారుడికి రచయితకు, కవులకు, గుర్తింపు కార్డులు ఇచ్చి వారికి ప్రతి నెలా గౌరవ వేతనం ఇచ్చి, వారంతా రాష్ట్ర వ్యాప్తంగా సాహితీ సభలు, సమావేశాలకు వెళ్లేందుకు వీలుగా బస్సు, రైలు వంటి ప్రయాణాలు కోసం ఉచిత పాసులు ఏర్పాటు చేయడం ఈ ప్రభుత్వానికి ఏమంత భారం ?
కరోనా అనంతరం గొప్ప గొప్ప కవులు, కళాకారులు, రచయితలు, సాహితీవేత్తలు ఒక్కొక్కరుగా అనారోగ్యాల పాలై కనుమరుగు అవుతున్నారు. ఇట్లాంటి సందర్భంలోనైనా రాబోయే తరాలకు వారసులుగా యువ కవుల్ని, రచయితల్ని, కళాకారుల్ని, మధ్యతరం కవుల్ని, కళాకారుల్ని, రచయితల్ని, వృద్ధ కళాకారుల్ని, కవులు రచయితల్ని ఒక పూర్తి కాల ప్రభుత్వ పాలనలో ఒక్కసారైనా గౌరవించుకోవాల్సిన బాధ్యత, సత్కరించుకోవాల్సిన ఆవశ్యకత ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదా? దళిత బహుజన మైనార్టీ వంటి అస్తిత్వవాద కవులకు రచయితలకు కళాకారులకు సాహితీవేత్తలకు పూర్తిగా ఆదరణ లేకుండా పోయింది. వారు పుస్తకాలు అచ్చు వేసుకోవడానికి కూడా ఈ ప్రభుత్వం ఆసరా కాలేకపోతున్నది. వేసిన పుస్తకాల్ని కూడా మొక్కుబడిగానే గ్రంథాలయాలకు 5 లేక 10 కాపీలు చొప్పున తీసుకుని వారి కళ్ళ నీళ్లు తుడిచారు. ఆ విషయాన్ని ఈ ప్రభుత్వం గుర్తించాల్సిందిగా కోరుతున్నాం. ఒకసారి ఈ వైపుగా ఆలోచన చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం.
- శిఖా ఆకాష్,
అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు.