
తమ మతాచార పద్ధతిని (కోడ్‌ను) విడిగా ఒక మతంగా వర్గీకరించాలనే ఆదివాసీల డిమాండ్ ఆర్‌ఎస్‌ఎస్, దాని శాఖోపశాఖల్లో గుబులు రేకెత్తిస్తోంది. 'సర్నా' ప్రకృతిని మాత్రమే ఆరాధించే ఒక గిరిజన తెగ అని, 2021 జనాభా లెక్కల్లో వారి మతాన్ని ప్రకృతి ఆరాధకులుగానే రాయాలని నవంబర్ 2020లో జరిగిన జార్ఖండ్ అసెంబ్లీ తీర్మానించింది. జార్ఖండ్ పక్క రాష్ట్రాల్లో కూడా ఈ తెగ ఉంది. తమ సంస్కృతీ సాంప్రదాయాలను విడిగా గుర్తించాలన్న వీరి డిమాండ్ చాలా కాలంగా ఉన్నా ఇటీవల ఊపందుకుంది.
2020 లోనే వీరు తమ డిమాండ్‌ను పరిగణన లోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉద్యమించారు. 2021 ఫిబ్రవరిలో హార్వార్డ్ విశ్వవిద్యాలయంలో మాట్లాడుతూ... జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ 'ఆదివాసీలు ఎప్పుడూ హిందువులు కారు, కాలేరు!'' అని నొక్కి వక్కాణించారు. అది ఆ రాష్ట్రం లోని అనేక మంది మేధావుల ప్రశంసలందుకుంది. 2020 నుండి అనేక రాష్ట్రాల్లోని గిరిజనులు 'గిరిజన మతాన్ని' పరిగణనలోకి తీసుకోవాలని ఆందోళన చేస్తున్నారు. 'సర్నా' మతాచారాన్ని (కోడ్‌ను) లెక్కలోకి తీసుకోవాలని పోరాడుతున్నారు. ఈ డిమాండ్ సాధనకై జార్ఖండ్, చత్తీస్‌గఢ్ వంటి అనేక రాష్ట్రాల గిరిజనులు ఆ మధ్య ఢిల్లీలో ధర్నా చేశారు. 2021 జనాభా లెక్కల ప్రక్రియ ప్రారంభం కాలేదు. 2022 జూన్‌లో 'తదుపరి ఉత్తర్వులు' వెలువడే వరకు జనాభా లెక్కలు ఆలస్యమవుతాయని పార్లమెంటులో ప్రకటించింది మోడీ సర్కార్! కారణం 'కోవిడ్ 19' అని కూడా ఆ ప్రకటనలో పేర్కొంది.
ప్రస్తుతానికి జనాభా లెక్కల్లో హిందు, క్రిస్టియన్, ఇస్లామిక్, సిక్కు, బౌద్ధ, జైన అనే ఆరు మతాల పేర్లు రాసేందుకే అవకాశం ఉంది. ఆదివాసి క్రిస్టియన్లు తమ మతాన్ని క్రిస్టియానిటీగా ప్రకటించుకునే అవకాశం ఉండగా, ఇతరులకు 'ఇతర మత ఆచారాలు' అని రాసుకునే అవకాశముంది. 'సర్నా' అని రాస్తేనే తమ సంస్కృతిని కాపాడుకోగలమనే నమ్మిక ఈ గిరిజనుల్లో ఉంది.
ఈ సర్నా 'కోడ్' డిమాండ్ సంఫ్‌ు పరివార్ ఆలోచనా ధోరణికి విరుద్ధమైంది. గిరిజనులు అడవుల్లో నివసించే హిందువులని (వనవాసులని) ఆర్‌ఎస్‌ఎస్ దశాబ్దాలుగా ప్రచారం చేస్తున్నది. వారి మతాన్ని విడిగా గుర్తించ నిరాకరిస్తున్నది. వేదాల వారసులైన హిందువులే అసలు సిసలైన భారతీయులనే వాదనకు ఈ గిరిజన మతం విరుద్ధమైంది. గిరిజనులను హిందువుల్లోకి తెచ్చేందుకు బాధ్యత తీసుకున్న ఆర్‌ఎస్‌ఎస్ 'అఖిల భారతీయ వనవాసి కళ్యాణ ఆశ్రమం' (ఎబివికెఎ) కృషికి దెబ్బే !
క్రిస్టియన్ మతంలోకి పెద్ద ఎత్తున గిరిజనుల మత మార్పిడులను అడ్డుకునే సాకుతో ఈ ఎబివికెఎను 1952లో స్థాపించారు. గిరిజనులు తగు సంఖ్యలో ఉన్న దేశంలోని అన్ని జిల్లాల్లో చిన్న చిన్న ఎబివికెఎ కేంద్రాలను ఆర్‌ఎస్‌ఎస్ స్థాపించింది. 'సర్నా కోడ్' కావాలనే పేర జరిగే ఉద్యమం హిందూ సమాజాన్ని 'చీల్చే కుట్ర' అని జార్ఖండ్‌లో పాలాము జిల్లా వనవాసి కళ్యాణ కేంద్ర కార్యదర్శి అశ్విని కుమార్ మిశ్రా చెప్పుకొచ్చారు. 'వనవాసీల్లాగ మేమూ చెట్లని, నదుల్ని, కొండల్ని పూజిస్తాం. ఏమీ తేడా లేదు. మేమంతా హిందువులమే' అన్నారు.
ఇప్పుడు జరిగే ఉద్యమంలోని ఆదివాసీలను వ్యతిరేకం చేసుకోకుండా ఆర్‌ఎస్‌ఎస్ నిశ్చలంగా ఉంది. ఇటీవల బెంగళూరులో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ జాతీయ సమ్మేళనం సందర్భంగా కూడా ఈ విషయంపై పెదవి విప్పలేదు. నవంబర్ 15న జన్ జాతీయ గౌరవ్ దివస్ నాడు మోహన్ భగవత్ చత్తీస్‌గఢ్‌లో ఒక ఉపన్యాసం చేశారు. ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా భారతదేశం తమ మాతృభూమి అనుకునే వారంతా భారతీయులే వంటి సాదా మాటలతోనే మోహన్ భగవత్ ఉపన్యాసం ముగిసిపోయింది. ప్రపంచం మొత్తం మీద భిన్నత్వంలో ఏకత్వం కలది హిందుత్వం మాత్రమే'' అన్నారు మోహన్ భగవత్. విడిగా మతం కావాలనే డిమాండ్ కాకుండా హిందువుల్లోనే వారుండాలనే సలహా మినహా గిరిజనుల మనోభావాలను దెబ్బ తీసే ఏ మాటా ఆయన ఉపన్యాసంలో లేదు. అయితే... దేశ అత్యున్నత రాజ్యాంగ పదవి లోకి ద్రౌపది ముర్ము ఎన్నికైన తర్వాత ఆదివాసి మతం కోసం డిమాండ్ మరింత ఊపందుకుంది.
గిరిజనుల డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా వ్యతిరేకిస్తుందనే భరోసా ఆర్‌ఎస్‌ఎస్ లో కనపడుతోంది. సర్నా కోడ్ కోసం పెద్ద సంఖ్యలో గిరిజనులు ఆందోళన చేస్తున్న మరో రాష్ట్రం చత్తీస్‌గఢ్. అక్కడి ఒక ఆర్‌ఎస్‌ఎస్ నేత ఈ పరిస్థితిని ఏదో ఒక రకంగా మోడీ సర్కార్ సరిచేస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు. 'ఎట్టి పరిస్థితిలోనూ మరో మతాన్ని కొత్తగా సెన్సస్ లెక్కల్లో చేర్చరు' అన్న గట్టి నమ్మకం తనకుందన్నాడీ మహానుభావుడు. ఈ లోపు హిందువులుగా ఉన్న మనల్ని చీల్చే ఏ కుట్రలనూ సాగనీయరాదని తాము వనవాసీలను 'ఒప్పిస్తా'మన్నాడు.
ఆదివాసీలను ఆర్‌ఎస్‌ఎస్ నుండి కచ్చితంగా వేరు చేసే గీత ఈ 'సర్నా' కోడ్. 'ఆర్‌ఎస్‌ఎస్ సర్నా కోడ్‌ను వ్యతిరేకిస్తున్నది. వనవాసీల పేర ఆదివాసీలను హిందువులుగా మార్చేందుకు అది ప్రయత్నిస్తోంది. ఇంతకాలం ఆదివాసీలను ఒకరికి వ్యతిరేకంగా మరొకర్ని రెచ్చగొట్టి అది తన పబ్బం గడుపుకుంది' అంటారు జార్ఖండ్ లోని ఆదివాసి గ్రూపుల కేంద్రీయ సమితి నాయకుడు అజరు టిర్కే. సర్నా కోడ్ కోసం సాగే ఉద్యమానికి నాయకత్వం వహించే సంస్థ ఇది. ఈ ఉద్యమం ఊపందుకునే సరికి ఆర్‌ఎస్‌ఎస్ మరో పల్లవి లంకించుకుంది. మరో మతాన్ని (సర్నాను) గనుక ఎంచుకునేట్లయితే హిందువులుగా ఇప్పటిదాకా అందుకున్న రాయితీలేవీ వర్తించవని ప్రచారం చేస్తున్నారు. ఆదివాసీల సాంస్కృతిక అస్తిత్వాన్ని దిగమింగే చర్య ఇది. 'ఆర్‌ఎస్‌ఎస్ ఆదివాసీలను హిందువులుగా పేర్కొనడాన్ని నేను అంగీకరించను' అంటారు జార్ఖండ్‌కు చెందిన ప్రఖ్యాత ఆదివాసి కవి అనుజ్ లుగూన్. 'ఆదివాసీలు ప్రత్యేక అస్తిత్వం ఉన్నవారు. హిందువుల నమ్మకాల కంటే మా విశ్వాసాలు వేరు. మా తాత్విక చింతనే వేరు' అంటారాయన. వర్ణాశ్రమ ధర్మం హిందువులకు కీలకం. ఆదివాసీలకు దానికి సంబంధమే లేదు. వర్ణాశ్రమ పద్ధతికి వెలుపల వారుంటారు.
'సర్నా' మతాన్ని అనుమతించకపోతే తానే జనాభా లెక్కల్లో ఒ.ఆర్.పి (అదర్ రెలిజియస్ ప్రాక్టీసెస్) అని రాస్తాన'ని లుగూన్ తెగేసి చెప్పారు. 'ఆదివాసీల సాంస్కృతిక వారసత్వం, మతపరమైన తాత్విక చింతన, ఆదివాసీ గ్రూపులు ఎంత భిన్నమైనవైనా అవన్నీ 'జల్, జంగల్, జమీన్'తో ముడిపడి వున్నాయి'' అంటారు లుగూన్. 'ఆదివాసీల డిమాండ్‌ను అంగీకరించడం మంచిది. ఎందుకంటే అది రాజకీయాలతో సంబంధం లేనిది. అది ఆదివాసీల సాంస్కృతిక అస్తిత్వంతో ముడిపడి ఉంది' అని లుగూన్ తేల్చి చెప్పారు.
ఒక మతం వారిని మరో మతంలో బలవంతంగా కలిపే ప్రయత్నం గాని, లేదా ఒప్పించే ప్రయత్నంగాని సంక్లిష్టమైనవి. ఇది ఊహించలేని పరిణామాలకు దారితీయవచ్చు. లోతులు తెలియనంత క్రోధాన్ని రగిలించవచ్చు. తనపై సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా గిరిజనులను హిందువుల్లో కలిపేసుకోవచ్చని ఆర్‌ఎస్‌ఎస్ భావిస్తోంది. ఇంత తీవ్రమైన ప్రతిఘటన రావడంతో సర్ సంఫ్‌ు చాలక్ నుండి సామాన్య కార్యకర్త వరకు ఆర్‌ఎస్‌ఎస్ పరివారం గందరగోళంలో పడింది.
/'కారవాన్' సౌజన్యంతో/
ధీరేంద్ర కె ఝా