Oct 25,2023 07:06

మరోవైపు చరిత్రలో తమ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్న అనేక అంశాలను మార్చే ప్రయత్నం తీవ్రతరం చేసింది. పాలకులు మారుతుంటారు కానీ చరిత్ర మారదు. మొఘలుల చరిత్రను పాఠ్యపుస్తకాల నుంచి తొలగించినప్పటికీ తాజ్‌మహల్‌, ఫతేపూర్‌ సిక్రీ వంటి అనేక చారిత్రక కట్టడాలు, నిర్మాణాలు, మొఘలుల కాలం నాటి సాంస్కృతిక గుర్తులు ఈ దేశంలో విస్తరించి ఉన్నాయి. వాటిని ఎవరూ మార్చలేరు కదా? చరిత్రకు సంబంధించిన కొన్ని ప్రత్యేక అంశాలను తొలగించడం రెండు రకాల పౌరులను తయారు చేస్తుంది. అదే విధంగా సమాజంలోని చీలికలకు దారి తీస్తుంది-అని మేధావులు, విద్యావేత్తలు, లౌకిక ప్రజాతంత్ర వాదులు హెచ్చరిస్తున్నారు.

         ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఎన్‌.సి.ఇ.ఆర్‌.టి (నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రిసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌) పాఠ్యపుస్తకాల లోని ముఖ్యమైన చారిత్రక, సైన్స్‌ అంశాలను తొలగించి ముద్రించడం దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారింది. ఎన్‌.సి.ఇ.ఆర్‌.టి పాఠశాల విద్యార్థులకు సిలబస్‌ను రూపొందించి పాఠ్య పుస్తకాలను ముద్రిస్తుంది. దేశంలో 24 వేల పాఠశాలలు ఈ పాఠ్య పుస్తకాలను బోధిస్తున్నాయి. లక్షల మంది విద్యార్థులు వీటిని చదువుతున్నారు. 14 రాష్ట్రాలలో 19 స్కూల్‌ బోర్డులు కూడా ఎన్‌.సి.ఇ.ఆర్‌.టి సిలబస్‌ను బోధిస్తున్నాయి. కోవిడ్‌ సందర్భంగా విద్యార్థులపై భారం తగ్గించాలనే నెపంతో తాత్కాలికంగా తొలగించిన కొన్ని అంశాలను సిలబస్‌ రేషనలైజేషన్‌ పేరుతో శాశ్వతంగా తొలగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కొత్త విషయాలను, వర్తమాన అంశాలను, నూతన ఆవిష్కరణలను సిలబస్‌లో చేర్చడం కోసం మార్పులు, చేర్పులు చేయడం సహజమైన విషయం. కానీ కేంద్ర ప్రభుత్వం...తమకు, తమను నడిపించే మాతృ సంస్థ భావజాలానికి అడ్డంకింగా ఉన్న వాటిని తొలగించడమే వివాదానికి కారణమైంది.
           సిలబస్‌ రేషనలైజేషన్‌ పేరుతో తొమ్మిదవ తరగతి, పదవ తరగతి సైన్స్‌ పాఠ్య పుస్తకాల నుండి డార్విన్‌ జీవ పరిణామ సిద్ధాంతాన్ని, రసాయన శాస్త్రంలో అతి ముఖ్యమైన అంశంగా భావిస్తున్న పిరియాడికల్‌ టేబుల్‌ (ఆవర్తన పట్టిక) కూడా తొలగించారు. 12వ తరగతి పాఠ్య పుస్తకం నుండి ముఖ్యమైన చారిత్రక అంశాలు మొఘలుల పరిపాలన, గాంధీజీ హత్య, 2002 గుజరాత్‌ అల్లర్లు, 11వ తరగతిలో లైఫ్‌ ఆన్‌ ఎర్త్‌, 12వ తరగతి రాజనీతి శాస్త్రం లోని ప్రజా ఉద్యమాలు, థీమ్స్‌ ఇన్‌ ఇండియన్‌ హిస్టరీ లోని అండర్‌స్టాండింగ్‌ పార్టిషన్‌ అనే పాఠం, ది స్టోరీ ఆఫ్‌ ఇండియన్‌ డెమోక్రసీ వంటి అంశాలతో పాటు అనేక అంశాలను తొలగించారు.
         తొలగించిన అంశాలను పరిశీలిస్తే...శాస్త్రీయ ఆలోచనలను పెంపొందింపజేసే సైన్స్‌, చారిత్రక అంశాలను మార్చడం ద్వారా భావితరాల ఆలోచనా విధానాన్ని తమ సిద్ధాంతానికి అనుగుణంగా మార్చడమే లక్ష్యంగా ఈ సిలబస్‌ తొలగింపులు సాగాయనే అనుమానాలు వస్తున్నాయి. ఈ భూమి మీద జీవి పుట్టుక గురించి, మానవుని పరిణామ క్రమం గురించి శాస్త్రీయంగా వివరించే ఏకైక సిద్ధాంతం, ఈ ప్రపంచంలో అత్యధిక మంది శాస్త్రవేత్తలు ఆమోదించే సిద్ధాంతం డార్విన్‌ జీవ పరిణామ సిద్ధాంతం. జీవ పరిణామ సిద్ధాంతం అనేది బయాలజీలో ఒక విభాగంగానే కాకుండా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి అతి ముఖ్యమైనది. విద్యార్థులు ఈ జీవ పరిణామ సిద్ధాంతం గురించి, డార్విన్‌ గురించి తెలుసుకోకుండా పాఠశాల విద్యను పూర్తి చేయడమంటే జీవి పుట్టుక గురించి పురాణాలు, మత గ్రంథాలలో తెలియజేసే అశాస్త్రీయ అంశాలతో వారి మెదళ్లను నింపేందుకే. ఇది భవిష్యత్తు తరాలు శాస్త్రీయ ఆలోచనల వైపు వెళ్లకుండా చేసే పెద్ద కుట్రలో భాగంగానే జరుగుతుందా? 2018లో మానవ వనరుల శాఖ మంత్రి ''డార్విన్‌ జీవ పరిణామ సిద్ధాంతం పూర్తిగా తప్పు. మనిషి భూమి మీద పుట్టినప్పటి నుండి మనిషిగానే ఉన్నాడు. కోతి నుండి మనిషిగా మారడం అనేది ఎవరూ చూడలేదు. అందువలన దీన్ని కరిక్యులం నుండి తొలగించాలి'' అని పార్లమెంటు సాక్షిగా మాట్లాడారు. ఆంధ్ర యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌...ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ లోనే డార్విన్‌ జీవ పరిణామ సిద్ధాంతం కంటే దశావతార సిద్ధాంతం గొప్పదని మాట్లాడారు. అదేవిధంగా కోవిడ్‌ సమయంలో ఆవు పేడ, ఆవు మూత్రం కోవిడ్‌ని తగ్గిస్తాయని
          అనేక మంది బిజెపి ఎంపీలు అశాస్త్రీయ అంశాలను ప్రచారం చేయడం చూశాం. కానీ సైన్స్‌ ద్వారా కనిపెట్టిన వ్యాక్సిన్‌ మాత్రమే మానవ సమాజాన్ని కాపాడగలిగింది. నేడు మానవుడు తన జ్ఞానంతో, శ్రమతో కనిపెట్టిన అనేక నూతన ఆవిష్కరణలను పురాణాల కాలంలో ఉన్నాయని ప్రచారం చేస్తున్న నేటి పాలకులు వాటిని చిన్నారుల మెదళ్ళలోకి ఎక్కించేందుకు అనువుగా పాఠ్యపుస్తకాల లోని శాస్త్రీయ అంశాలను కూడా తొలగించే కుట్ర చేస్తున్నది.
          మరోవైపు చరిత్రలో తమ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్న అనేక అంశాలను మార్చే ప్రయత్నం తీవ్రతరం చేసింది. పాలకులు మారుతుంటారు కానీ చరిత్ర మారదు. మొఘలుల చరిత్రను పాఠ్యపుస్తకాల నుంచి తొలగించినప్పటికీ తాజ్‌మహల్‌, ఫతేపూర్‌ సిక్రీ వంటి అనేక చారిత్రక కట్టడాలు, నిర్మాణాలు, మొఘలుల కాలం నాటి సాంస్కృతిక గుర్తులు ఈ దేశంలో విస్తరించి ఉన్నాయి. వాటిని ఎవరూ మార్చలేరు కదా? చరిత్రకు సంబంధించిన కొన్ని ప్రత్యేక అంశాలను తొలగించడం రెండు రకాల పౌరులను తయారు చేస్తుంది. అదే విధంగా సమాజంలోని చీలికలకు దారి తీస్తుంది-అని మేధావులు, విద్యావేత్తలు, లౌకిక ప్రజాతంత్ర వాదులు హెచ్చరిస్తున్నారు. గాంధీజీ హత్యకు ప్రధాన కారణం మతోన్మాదం. హిందూ ముస్లింల ఐక్యత కోసం తన చివరి శ్వాస వరకు పోరాడిన గాంధీజీని ఆర్‌ఎస్‌ఎస్‌ మతోన్మాదంతో ప్రభావితమైన గాడ్సే కాల్చి చంపాడు. ప్రధాన ముద్దాయి అయిన ఆర్‌ఎస్‌ఎస్‌ని ప్రభుత్వం 1948లో నిషేధించింది. ఈ అంశాలను తొలగించడం ద్వారా...నేటి ప్రభుత్వం, దాన్ని నడిపిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌...నాటి తమ విద్రోహ చరిత్రను, రక్తపు మరకలను వదిలించుకోవాలని చూస్తున్నాయి. భారతదేశ విభజన పాఠ్యాంశాన్ని తొలగించడం కూడా దీనిలో భాగంగానే చూడాలి. గోద్రా ఘటన అనంతరం నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2002 గుజరాత్‌ అల్లర్లలో 2000 పైగా ముస్లింలు ఊచకోతకు గురికావడం ఇంకా దేశం మరిచిపోలేదు. ఈ మధ్యకాలంలోనే బిబిసి డాక్యుమెంటరీ కూడా ప్రచురించింది. దానిని నేటి ప్రభుత్వం బ్యాన్‌ చేసింది. ఇప్పుడు పాఠ్య పుస్తకాల నుండి దానిని తొలగించింది. చివరికి భారతదేశ ప్రజాస్వామ్యం వంటి పదాలను కూడా తొలగించింది. రాచరికానికి చిహ్నంగా భావిస్తున్న రాజదండాన్ని ప్రజాస్వామ్యానికి ప్రతీక ఆయన పార్లమెంట్‌ నందు ప్రతిష్టించడం దీనికి కొనసాగింపుగానే భావించాలి. గతంతో ప్రారంభించి, వర్తమానాన్ని తయారుచేసి, భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసేదే చరిత్ర. మానవుని చర్యలు, వాటి వెనకున్న ఆలోచనలను తెలుపుతుంది చరిత్ర. విద్యార్థులకు చరిత్ర గతంలో ఏం జరిగిందనే అవగాహన కల్పిస్తుంది. వారి ఆలోచనా విధానానికి, వారి సొంత భావనలకు ఒక కొత్త రూపాన్ని ఇస్తుంది. సమాజంలో అశాస్త్రీయ అంశాలను పెంపొందించడం, చరిత్ర వక్రీకరణల ద్వారా సమాజంలో విభజనను తీసుకురావడం అనేది ఆ సమాజం అభివృద్ధికి తీవ్ర ఆటంకంగా మారుతుంది. అందువలన నేటి పాలకులు సిలబస్‌లో తీసుకు వస్తున్న మార్పులను...పౌర సమాజం, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, శాస్త్రవేత్తలు, అభ్యుదయ వాదులు వ్యతిరేకించి ...శాస్త్రీయ భావాలను, వాస్తవ చరిత్రను భావితరాలకు అందించటమే నేటి కర్తవ్యం.

/ వ్యాసకర్త యుటిఎఫ్‌ గుంటూరు జిల్లా కార్యదర్శి, సెల్‌:9966135289 /
జి. వెంకటేశ్వరరావు

2