
మణిపూర్‌లో గిరిజన తెగల మధ్య ఐదు మాసాల కిందట ఎగసిన హింసాత్మక మంటలు రావణకాష్టంలా రగులుతూనే వున్నాయి. మన దేశాన్నే కాదు ప్రపంచాన్ని సైతం మణిపూర్ నరమేధం దిగ్భ్రమగొల్పుతుండగా ప్రధాని నరేంద్ర మోడీ అటుకేసి కన్నెత్తి చూడకపోవడం, ఆ రాష్ట్రంలో కాలూని ప్రజలను ఓదార్చి కేంద్రం తరఫున వారిలో ఆత్మవిశ్వాసం కల్పించేందుకు సుతరాం ఇష్టపడకపోవడం దారుణం. ఈ కాలంలో ప్రధాని కాలు కదపకుండా ఢిల్లీలోనే పాతుకొని కూర్చున్నారా అంటే అదేమీ లేదు. దేశాలు చుట్టి వచ్చారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలున్న రాష్ట్రాల్లో అధికారం కోసం కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు. వాస్తవానికి ఈ ఏడాది మే 3న మణిపూర్‌లో ఘర్షణలు చెలరేగగా ఆ సమయంలో జరిగిన కర్ణాటక ఎన్నికల్లో బిజెపి విజయం కోసం కలియ తిరిగారు. మొన్న శనివారం ఛత్తీస్‌గఢ్‌లో పార్టీ ర్యాలీలో పాల్గొన్నారు. తెలంగాణలో ఆదివారం బహిరంగసభకు హాజరై పలు హామీలిచ్చి బిజెపిని గెలిపించాలని ఓట్లడిగారు. కానీ 'డబుల్ ఇంజన్' సర్కారు అంటూ ఊదరగొట్టే మోడీకి, బిజెపి ఏలుబడిలో దమనకాండ సాగుతున్న మణిపూర్‌లో పాదం మోపడానికి మాత్రం మనసు రాకపోవడంతో అక్కడి దుర్మార్గాలకు కేంద్రం ప్రోత్సాహం, మద్దతు దండిగా ఉందన్న విమర్శలు నిజమని నమ్మాల్సి వస్తుంది.
మణిపూర్ అగ్ని కీలలపై తొలి నుంచీ మోడీ ప్రవర్తనలో కర్కశమే తాండవిస్తోంది. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు మొత్తం ఆ అంశంపైనే స్తంభించాయి. కేంద్ర ప్రభుత్వాధినేత హోదాలో పార్లమెంట్‌కు జవాబుదారీగా వ్యవహరించాల్సిన ప్రధాని మోడీ సభలో తొలుత నోరు మెదపలేదు. మణిపూర్ కల్లోలం తలెత్తిన 77 రోజుల తర్వాత అదీ పార్లమెంట్ వెలుపల ముక్తసరిగా విచారం తెలిపారు. పార్లమెంట్‌కు ప్రధానిని రప్పించి మౌన భగం కావించేందుకు విపక్షాలు ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాల్సి వచ్చింది. అప్పుడూ మణిపూర్ ప్రజలకు గట్టి భరోసా ఇవ్వలేదు. హింసను అదుపు చేయడంలో పూర్తిగా విఫలమైన, మెజార్టీ తెగకు కొమ్ముకాసిన ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌ను తొలగించాలన్న డిమాండ్‌ను తిరస్కరించారు. దాంతో అక్కడి ఘోరాలకు పరోక్ష మద్దతు పలికినట్లయింది. అనంతరమూ మణిపూర్‌లో హింస ఆగలేదు సరికదా భీతికొల్పే ఉదంతాలు బయటికొస్తున్నాయి. హింసాత్మక కార్యకలాపాలను అణచివేయడంలో ప్రఖ్యాతిగాంచిన కేంద్ర పారామిలటరీ దళం అస్సాం రైఫిల్స్‌పై మైనార్టీ తెగ పక్షం వహిస్తున్నదంటూ బీరేన్ సర్కారు కేసు పెట్టిందంటే పరిస్థితి ఎంత వరకూ వచ్చిందో, అక్కడి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ వత్తాసు ఏ స్థాయికి చేరిందో అర్థమవుతుంది.
మణిపూర్‌లో పౌర సమాజం నిలువునా చీలిపోయింది. మైదాన ప్రాంత గిరిజన తెగ మెయితీ, కొండ కోనల్లో నివసించే కుకీ తెగల మధ్య సాయుధ ఘర్షణలు సాగుతున్నాయి. మహిళలు, చిన్నారుల లక్ష్యంగా హింస ప్రేరేపితమవుతోంది. సామూహిక లైంగిక దాడులు, గ్యాంగ్ రేప్‌లు, మహిళలను నగంగా వీధుల్లో ఊరేగించడాలు, కొట్టి చంపడం, గృహ దహనాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. 200 మంది చనిపోయారు. ఎంతోమంది గాయాలపాలయ్యారు. వేలల్లో నిరాశ్రయులై క్యాంపుల్లో తలదాచుకుంటున్నారు. పోలీసుల చేతుల్లో నుంచి మాయమైన తుపాకులు ఘర్షణలకు ఉపకరిస్తున్నాయంటే కచ్చితంగా రాజ్యం ప్రేరేపితంగానే చూడాలి. నిజనిర్ధారణ చేసిన ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంస్థ అక్కడ మానవ హక్కుల్లేవని ఆందోళన వెలిబుచ్చింది. విశ్వగురుగా చెప్పుకునే మోడీకి మాత్రం ఇవేమీ కనిపించట్లేదు, వినిపించట్లేదు. మణిపూర్ ఈ దేశంలో లేదన్నట్లు, ఆ రాష్ట్రానికి తాను ప్రధాని కాదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇంఫాల్ లోయ మినహా రాష్ట్రం మొత్తాన్నీ కల్లోలిత ప్రాంతంగా ప్రకటించారు. ఇంకో ఆర్నెల్లపాటు సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. కొన్ని నెలల తర్వాత ఇంటర్నెట్‌ను పునరుద్ధరించి 48 గంటలు గడవకముందే నిలిపేశారు. పరిస్థితి అదుపులోకొస్తోందని 60 వేల కేంద్ర బలగాలను మోహరించిన అమిత్‌షా చెప్పగా పరిస్థితి చక్కబడింది లేదు. ఈ పర్యవసానాలన్నీ మణిపూర్ మంటలకు దోషిగా కేంద్ర బిజెపినే చూపుతున్నాయి.