Sep 11,2022 08:04

ఈ ప్రకృతిలో అనేక అద్భుతాలు దాగి వున్నాయి. అప్పుడప్పుడూ అవి మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అలాంటిదే వాటర్‌ స్పౌట్‌. అప్పుడప్పుడు ఆకాశం నుంచి చేపల వర్షం పడుతుంది. చూడ్డానికి, వినడానికి ఒకింత ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. వాతావరణంలో సమతుల్యత ఏర్పడినప్పుడు, తుపానులు ఏర్పడినప్పుడు ఇటువంటి వాటర్‌ స్పౌట్‌లు ఏర్పడతాయి. అయితే సాధారణంగా మనం ఎక్కువగా 'సుడిగాలి' గురించి వినే ఉంటాం. గాలిదుమ్ము వచ్చినప్పుడు నాలుగు దిక్కులా ఒకే విధమైన వేగంతో బలమైన గాలి వీచినప్పుడు ఇవి ఏర్పడతాయి. అలాగే టోర్నడోలూ, వాటర్‌ స్పౌట్‌లు ఏర్పడతాయి.

water


వాటర్‌ స్పౌట్‌ అనేది సముద్రాలు, సరస్సులపై ఏర్పడుతుంది. సముద్రాలు, సరస్సులపై క్యుములస్‌ మేఘం ఏర్పడినప్పుడు వాతావరణంలోని ఉష్ణోగ్రతల్లో సంభవించే మార్పుల వల్ల మేఘంలో నీరు ఘనీభవించి, వాటర్‌ స్పౌట్‌లు తయారవుతాయి. అయితే ఇందులో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి టోర్నాడిక్‌ వాటర్‌ స్పౌట్‌. రెండో ఫెయిర్‌ వెదర్‌ వాటర్‌ స్పౌట్‌. టోర్నాడిక్‌ వాటర్‌ స్పౌట్‌ అనేది సుడిగాలి ద్వారా ఏర్పడుతుంది. ఇది తీవ్రమైన ఉరుములతో కూడిన గాలుల ప్రభావంతో, గాలి నిలువు అక్షం మీద పైకి లేచి తిరుగుతుంది. టోర్నాడిక్‌ వాటర్‌ స్పౌట్‌ అత్యంత శక్తివంతమైన, విధ్వంసకరమైన వాటర్‌ స్పౌట్‌. ఇక ఫెయిర్‌-వెదర్‌ వాటర్‌స్పౌట్‌లు తుపాను వ్యవస్థలతో సంబంధం కలిగి ఉంటాయి. కానీ తుపానులు కాదు. ఇక టోర్నాడిక్‌, ఫెయిర్‌ వెదర్‌ వాటర్‌ స్పౌట్‌లు రెండింటికీ అధికస్థాయి తేమ, సాపేక్షంగా వెచ్చని నీటి ఉష్ణోగ్రత అవసరం. ఫ్లోరిడా కీస్‌, గ్రీస్‌ ద్వీపాలు, ఆస్ట్రేలియా తూర్పు తీరం వంటి ఉష్ణ మండల, ఉప ఉష్ణమండల జలాల్లో తరచూ వాటర్‌ స్పౌట్‌లు ఏర్పడటం సర్వసాధారణం.

water


వాటర్‌ స్పౌట్‌లలో ఐదు దశలు ఉన్నాయి. 1. డార్క్‌ స్పాట్‌, 2. స్పైరల్‌ నమూనా, 3. స్ప్రేరింగ్‌, 4. పరిపక్వ సుడి, 5. క్షయం.
అయితే సుడిగుండంలో వెచ్చని గాలి ప్రవాహం బలహీనపడినప్పుడు వాటర్‌ స్పౌట్‌ కూలిపోతుంది. ఇది సుమారు 50 మీటర్ల వ్యాసం వరకూ చిమ్ముతుంది. గాలి వేగం గంటకు 80 కిలోమీటర్లు ఉంటుంది. అతిపెద్ద వాటర్‌ స్పౌట్‌లు 100 మీటర్ల వ్యాసం కలిగి ఉంటాయి. వీటి సగటు జీవిత కాలం 5 నుంచి 10 నిమిషాలు అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో గంట వరకూ ఉంటుంది. వీటివల్ల కలిగే ప్రమాదాలను 'నేషనల్‌ వెదర్‌ సర్వీస్‌' తీవ్రమైన స్థానిక తుపాను జాబితాల్లో వాటర్‌ స్పౌట్‌లను గుర్తించింది. వాటర్‌ స్పౌట్‌లు ఈతగాళ్లను, బోటింగ్‌ చేసేవారిని ప్రమాదాలకు గురిచేస్తుంది. అంతేకాదు వాటర్‌ స్పౌట్‌లు విమానాలకు, హెలికాఫ్టర్లకు కూడా ముప్పు కలిగిస్తాయి.
సింగూరు ప్రాజెక్టులో..
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం 'నిర్జప్ల' వద్ద మంజీరా నదిలో అరుదుగా కనిపించే వాటర్‌ స్పౌట్‌ ఏర్పడింది. గత ఆదివారం సాయంత్రం సమయంలో ఒక్కసారిగా మబ్బులు కమ్ముకున్న వాతావరణం ఏర్పడి, సింగూరు ప్రాజెక్ట్‌ బ్యాక్‌ వాటర్‌ నీరు సుడులు తిరుగుతూ పైకి లేచి మేఘాల వైపు వెళ్లింది. సుమారు మూడు నిముషాల పాటు ఈ దశ్యం కనిపించింది. ఈ వాటర్‌ స్పౌట్‌ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. సాధారణంగా సముద్ర ప్రాంతాలు, నదులు లాంటి పెద్ద నీటివనరుల దగ్గర ఎక్కువగా వాటర్‌ స్పౌట్‌లు ఏర్పడటం చూస్తుంటాం. ఈ మధ్య కాలంలో తెలంగాణలో ఇలాంటి దశ్యాలు అడపాదడపా కనిపిస్తున్నాయి. గతంలోనూ రెండుసార్లు వాటర్‌ స్పౌట్‌ ఏర్పడ్డాయి.
దీనిపై విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ ఓషియానోగ్రఫీ, మెటియొరాలజీ విభాగం ప్రొఫెసర్‌ సునీత మాట్లాడుతూ 'ఉదయం, మధ్యాహ్నం ఉష్ణోగ్రతల్లో పెద్దమొత్తంలో తేడాలు ఉండి, వాతావవరణంలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు ''కన్వెక్టివ్‌ ఇన్‌ స్టెబిలిటీ'' అనే ప్రత్యేక పరిస్థితులు ఏర్పడతాయి. దీనివల్ల వాటర్‌ స్పౌట్లు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. వాతావరణంలో థర్మల్‌ ఇన్‌ స్టెబిలిటీ దీనికి కారణం. సముద్ర ఉపరితలం వేడెక్కడం, అదే సమయంలో వాతావరణంలోని తేమ, గాలి వేగం అన్నీ కలిసి ఒక స్పూన్‌లాంటి ఆకారం ఏర్పడుతుంది. దీన్నే వాటర్‌ స్పౌట్‌ అని పిలుస్తాం. సాధారణంగా వేసవి కాలంలో ఇవి ఎక్కువగా ఏర్పడే అవకాశాలు ఉంటాయి' అని వివరించారు. 'ప్రస్తుతం బ్రేక్‌ కండీషన్స్‌ వల్ల ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు గాలి వేగం కూడా పెరుగుతుంది. ఒక్క తెలంగాణలోనే అని కాదు కొంతకాలంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతాల్లోని నదులు, చెరువులు, డ్యామ్‌లలో కూడా వాటర్‌ స్పౌట్లు ఏర్పడుతున్నాయి' అని ప్రొఫెసర్‌ సునీత తెలిపారు.

చేపల వర్షం-వాటర్‌ స్పౌట్‌..
ఆకాశం నుండి చేపల వర్షం కురిసిందన్న వార్తలు మనం వినే ఉంటాం. ఈ మధ్య కాలంలో కృష్ణాజిల్లా నందిగామలో, అమలాపురంలో, కాళేశ్వరం, జగిత్యాల, వైరాలో చేపల వర్షం కురిసిందన్న వార్తలు వచ్చాయి. నిజానికి ఆకాశం నుండి చేపలు వర్షంలా పడటం అంటూ ఉండదని, చేపల వర్షానికి వాటర్‌ స్పౌట్లకు మధ్య సంబంధం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు.
'బలమైన గాలులతో ఏర్పడ్డ వాటర్‌ స్పౌట్లు సాధారణంగా మూడు కిలోమీటర్ల దూరం వరకూ ప్రయాణిస్తాయి. ఆ రోజు ఉండే వాతావరణ పరిస్థితులను బట్టి ఆ సమయంలో ఉండే బలంతో తనతో పాటూ చేపలను పైకి తీసుకెళ్లి, బలహీనపడ్డాక దూరంగా కిందకు వదిలేస్తాయి. దీంతో అది చేపల వర్షం అని అంటుంటారు.