Apr 25,2023 07:57

ఇప్పటి వరకూ ఉన్న చరిత్ర వారి మతతత్వ వ్యాప్తికి అనుకూలం కాదు. కాబట్టే చరిత్రను మార్చడం ద్వారా రానున్న భవిష్యత్తు తరాన్ని మతమౌఢ్యంలోనే పుట్టి పెరిగేలా చేయడం వారి ప్రధాన ఆశయం. ఇందుకోసమే సంఫ్‌ు పరివార్‌ శక్తులు దేశ చరిత్రను తమకు అనుకూలంగా తిరగరాయాలనుకుంటున్నారు. చరిత్రను కాషాయ రంగులోకి మార్చడమే తమ అధికారానికి పరమావధిగా ఎంచుకున్నారు.

మానవ చరిత్రను ఒక జాతి చరిత్రగా చూడడానికి వీల్లేదు. ఏ దేశంలోనైనా ప్రత్యేకంగా ఒక జాతి జన్మించదు. రూపొందుతుంది. భారతదేశం ఇందుకు మినహాయింపు కాదు. అయితే నేడు దేశంలో హిందూ జాతి ఉన్నతమైనదని, అది దైవ నిర్మితమనే భావనల్ని కొన్ని మతతత్వ శక్తులు తమ ఊహలతో కూడిన వ్యాఖ్యానాలతో నిర్ధారించాలని చూస్తున్నాయి. ఈ జాతి ఆధారంగా మతపరమైన జాతీయవాదాన్ని ముందుకు తెచ్చి మతాన్ని, జాతిని సమానార్థకాలుగా చేసి తమ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇందుకోసం 1960 నుంచే రాజకీయంగా ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఎన్‌డిఎ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడే సంఫ్‌ు పరివార్‌ శక్తులు తమ అభూత కల్పనలతో కూడిన మతతత్వ చరిత్రను దేశ చరిత్రగా మార్చేందుకు విద్యా వ్యవస్థను వినియోగించుకోవాలని తీవ్రంగా ప్రయత్నాలు చేశాయి. ఈ కుట్రను పసిగట్టిన ప్రజాస్వామిక శక్తులు, చరిత్రకారులు, పౌరసమాజం ఏకమై గొంతు సవరించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నాటి ప్రభుత్వం మూకుమ్మడిగా చరిత్ర వక్రీకరణ చర్యల్ని నిలిపివేసింది. నాలుగు దశాబ్దాలుగా తాము అనుకున్నది ఒకేసారి జరగలేదనే అసహనం, తమ రాజకీయ ముసుగు అయిన బిజెపి పూర్తి స్థాయిలో అధికారంలోకి రావడంతో 2014 నుంచి విద్యావ్యవస్థను కేంద్రంగా చేసుకుని దేశ చరిత్రను మతపరమైన చరిత్రగా మార్చేందుకు మరోసారి కుట్రలకు పాల్పడుతున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అందరి నోళ్లు మూయించి తాము అనుకున్న పని చేసుకుపోవాలని తలస్తున్నాయి. చరిత్రను మార్చడం ద్వారా తమ హిందుత్వ పునాదుల్ని బలోపేతం చేసుకోవాలన్న తలంపే ఇందుకు కారణం. దేశ చరిత్రలో మతోన్మాద శక్తులకు స్థానం లేదు. ఇప్పటి వరకూ ఉన్న చరిత్ర వారి మతతత్వ వ్యాప్తికి అనుకూలం కాదు. కాబట్టే చరిత్రను మార్చడం ద్వారా రానున్న భవిష్యత్తు తరాన్ని మతమౌఢ్యంలోనే పుట్టి పెరిగేలా చేయడం వారి ప్రధాన ఆశయం. ఇందుకోసమే సంఫ్‌ు పరివార్‌ శక్తులు దేశ చరిత్రను తమకు అనుకూలంగా తిరగరాయాలనుకుంటున్నారు. చరిత్రను కాషాయ రంగులోకి మార్చడమే తమ అధికారానికి పరమావధిగా ఎంచుకున్నారు.
        హిందూ రాష్ట్ర అనే భావనను ప్రతిపాదించిన మహారాష్ట్రకు చెందిన భిడే గురూజీ చేసిన ప్రసంగం సంఫ్‌ు శక్తులకు ఒక ప్రేరణ. దేశ చరిత్రను ఆయన మూడు భాగాలుగా చూపించారు. ఇందులో ముస్లిం యుగం, బ్రిటీష్‌ యుగం, స్వాతంత్య్రానంతరం అనే విభజన చూపించి ఈ యుగాలకు ముందు భారత దేశంలో అత్యున్నమైన హిందూ రాజ్యం ఉండేదని, ఈ మూడు యుగాలు దాన్ని సర్వనాశనం చేశాయని పేర్కొన్నారు. ఇవి హిందూ సంస్కృతిపై తీవ్రమైన దాడి చేసి అప్పటికే విరాజిల్లుతున్న పురాతన హిందూ సంస్కృతిని తుడిచిపెట్టాయని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే పురాతన హిందూ సంస్కృతిని పునరుద్ధరించడం హిందుత్వ లక్ష్యం కావాలని కోరుకున్నారు. ఈ ఊహాజనితమైన వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని సంఫ్‌ు పరివార్‌కు చెందిన రచయితలు తమ మెదళ్లకు పని పెట్టారు. తమ ఆశయ సాధన కోసం నిత్యం ఊహలతో కూడిన అంశాలతో చరిత్రలోని ఘట్టాలను వక్రీకరించి రూపొందించిన చరిత్రను వివిధ రూపాల్లో జనంలోకి జొప్పించినా అది నిజమైన చరిత్ర అనిపించుకోలేకపోయింది. వారు రూపొందిస్తున్న చరిత్రకు ఆధారాలు లేకపోవడమే ఇందుకు కారణం.
           చరిత్రకు కొన్ని స్పష్టమైన ఆధారాలు ఉండాలి. ఆధార రహితమైంది, ఊహాజనితమైంది చరిత్ర కాజాలదు. కాబట్టే పాఠ్యపుస్తకాల్లోకి తమ వక్రీకరణలతో కూడిన అంశాలను జొప్పించడం ద్వారా దాన్ని స్థిరపరచాలని విద్యావ్యవస్థను ఎంపిక చేసుకున్నారు. పాలకుల అండతో ఉన్నత విద్యా వ్యవస్థ లోని యుజిసి, ఎన్‌సిఇఆర్‌టి వంటి సంస్థల ఆలంబనగా తమ పనిని మొదలు పెట్టాయి. తమకు కంటగింపుగా ఉన్న చరిత్రను, తమ నిజస్వరూపాన్ని బహిర్గతం చేస్తున్న అంశాలను ఎంపిక చేసి వాటి స్థానంలో తమ అనుకూల విధానాలతో కూడిన వ్యక్తుల చరిత్రను చొప్పిస్తున్నాయి. ఇందులో బాగంగానే బిజెపి అధికారంలో ఉన్న కర్ణాటక పాఠ్యపుస్తకాల్లో ఏకంగా స్వాతంత్య్ర సమర యోధుడైన భగత్‌సింగ్‌ పాఠ్యాంశాన్ని తొలగించి హిందుత్వ సావర్కర్‌ చరిత్రను చొప్పించారు. ఇటువంటి ఘటనల్ని ఈ ఎనిమిదేళ్ల బిజెపి పాలనలో అనేకం చూడవచ్చు.
తాజాగా హేతుబద్దీకరణ పేరుతో చరిత్ర పుస్తకాల్లో మొఘల్‌ సామ్రాజ్యం గురించి ఉన్న అన్ని అధ్యాయాలను తొలగించడానికి నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌సిఇఆర్‌టి) కసరత్తు చేసింది. మరో అడుగు ముందుకేసి గాంధీ హత్య, ఆ హత్యకు కారణమైన గాడ్సేకు రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎస్‌)తో ఉన్న సంబంధాన్ని, హత్యానంతరం ఆ సంఘంపై నాటి ప్రభుత్వం విధించిన నిషేధాన్ని తెలిపే అంశాలను చరిత్ర పుస్తకాల నుంచి మాయం చేసేందుకు కసరత్తు జరుగుతోంది. అసలు గాంధీ హత్యోదంతాన్నే చరిత్ర నుంచి పూర్తిగా చెరిపేయాలనేది వారి ఆశ. ఇందుకు ఒక ప్రయత్నం జరిగింది. బిజెపి పాలిత ఒక రాష్ట్రంలో చరిత్రకు సంబంధించి గాంధీ ఆత్మహత్య చేసుకున్నాడనే భావన వచ్చేలా ప్రశ్నాపతం రూపొందిన విషయం తెలిసిందే.
          చరిత్రను ఒక జ్ఞాన శాస్త్రంగా యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యుజిసి) అభివర్ణించింది. గతంలో ఎన్నడూ లేని పద్ధతుల్లో ఐడియా ఆఫ్‌ భారత్‌ పేరుతో కొత్త సిలబస్‌ను తయారు చేసింది. ఇందులో భారతీయ శౌర్యం అనే ప్రత్యేక చాప్టర్‌ ద్వారా ఏం చెప్పబోతున్నారో హిందుత్వ ఎజెండా తెలిసిన వారికి సులభంగా అర్థమవుతుంది. తాజాగా డిగ్రీ చరిత్ర పాఠ్యపుస్తకాల్లో ఆర్యుల చరిత్రకు అత్యధిక ప్రాధాన్యత లభిస్తోంది. అదే సమయంలో ద్రావిడుల చరిత్రను తక్కువ చేసింది. బౌద్ధం పట్ల తీవ్రమైన వ్యతిరేకత కారణంగానే అప్రాధాన్యతాంశంగా మారింది. కేవలం ముస్లింల పట్ల ద్వేషం మరింత బలం పుంజుకునేందుకు అవకాశం ఉన్న చరిత్రను ఉంచేసి మితగా అంశాలను తొలగించింది. ఉదాహరణకు మత సహనం ప్రదర్శించిన అక్బర్‌ను చరిత్ర లోంచి తోసేసి, ఆ స్థానంలో రాణా ప్రతాప్‌కు పెద్ద పీట వేశారు. వాస్తవానికి తన చేతిలో ఒటమి పాలై కన్నుమూసిన రాణా ప్రతాప్‌ను గురించి అక్బర్‌ సమ ఉజ్జీ అయిన వీరుడు మరణించాడు, నేను ఇక ఎవరితో యుద్ధం చేయాలని కన్నీరు కార్చాడనేది చరిత్ర. ఇవన్నీ కనిపించకుండా అక్బర్‌, షాజహాన్‌ వంటి వారి చరిత్రకు పాఠ్యపుస్తకాల్లో రిక్త హస్తం చూపించేస్తున్నారు.
          సంఫ్‌ు చరిత్ర, వారి కార్యశాలల్లో జరిగే కార్యక్రమాలు, మతపరమైన చరిత్రను బోధించే సమయంలో ఔరంగ జేబును వర్ణించే తీరు తెలిసివారు లోగుట్టును సులభంగానే పసిగట్టవచ్చు. దేశ చరిత్ర పరిణామక్రమంలో మత చిహ్నాల విధ్వంసం, ఆలయాలు-విగ్రహాల ధ్వంసం అనేవి ముస్లింల పాలనా కాలంలోనే జరిగాయనడం సంఫ్‌ు శక్తులు చేస్తున్న ప్రచారానికి బలం చేకూర్చేందుకే.
    నూతన విద్యావిధానం పేరుతో విద్యా సంస్థలన్నిటినీ మతతత్వ వాదులతో నింపేస్తున్నారు. భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రకు దక్కవలసినంత ప్రాధాన్యత లభించడం లేదు. కారణం సంఫ్‌ు శక్తులు...స్వాతంత్య్రోద్యమానికి వ్యతిరేకంగానే పని చేశారు. జాతీయ స్వాతంత్య్ర ఉద్యమం అంతా ఒక డ్రామా అని, అనంతర కాలంలో అంబేద్కర్‌ అందించిన రాజ్యాంగం బూటకమనే తమ భావనను చరిత్రగా చూపించాలని తపిస్తున్నారు. ఇదంతా సంఫ్‌ు పరివార్‌ ఎజెండాను సమర్థించేందుకే. సంఫ్‌ు వక్రీకరణలతో, ఊహలతో కలగలిపిన ఈ చరిత్ర అధికారికంగా పుస్తకాల్లో చేరినట్లయితే భవిష్యత్తు తరాన్ని మతమౌఢ్యంలోకి నెడుతుంది. ఈ వక్రీకరణలకు గురైన అంశాలు రానున్న రోజుల్లో ఆధునిక చరిత్రగా మారితే జరగబోయే నష్టం పూడ్చుకోలేనిదవుతుంది. ప్రజల మతపరమైన మనోభావాలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్న శక్తుల నిజస్వరూపాన్ని బహిరంగంగా చర్చకు పెట్టడం ద్వారానే వారి కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కోగలం.

( వ్యాసకర్త సెల్‌ : 9059837847 )
డా|| సి.ఎన్‌. క్షేత్రపాల్‌ రెడ్డి