Nov 01,2022 07:03

ప్రధాని పదవి కోసం పోటీ పడినప్పుడు ప్రకటించిన విధానానికి, పదవి చేపట్టాక ప్రకటించిన విధానానికి తేడా ఏమైనా ఉందా? ఏమిటి ఆమె చేసిన నేరం ? సంపన్నుల కోసం ప్రకటించిన పన్ను రాయితీల వలన కోల్పోయే ఆదాయాన్ని భర్తీ చేయడానికి వీలుగా ప్రభుత్వ వ్యయాన్ని (సంక్షేమ కార్యక్రమాలని) తగ్గించే ప్రతిపాదనలు గాని, శ్రామిక ప్రజల మీద అదనంగా పన్నులు వేసే ప్రతిపాదన గాని ఆమె చేయలేదు. ఇదే లిజ్‌ చేసిన నేరం. అటువంటి ప్రతిపాదనలు గనుక చేసివుంటే వాటిపై లిజ్‌ శ్రామిక ప్రజల నుండి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొనవలసివచ్చేది. ఐనప్పటికీ, అటువంటి వ్యతిరేకతను లెక్కచేయకుండా లిజ్‌ గట్టిగా నిలబడి వుండాలని కార్పొరేట్ల 'మార్కెట్‌' కోరుకుంది. ఆ విధంగా లిజ్‌ వ్యవహరించకపోవడాన్ని 'మార్కెట్‌' జీర్ణించుకోలేకపోయింది.

         లిజ్‌ ట్రస్‌ కేవలం 44 రోజులపాటు మాత్రమే బ్రిటన్‌ ప్రధాని పదవిలో ఉన్నారు. ఇంత తక్కువ కాలంలోనే ఆమె రాజీనామా చేయవలసిరావడం వెనుక ఏమైనా కుట్ర దాగివుందా అన్న అనుమానం చాలామందికి కలిగింది. ఆమె ప్రకటించిన ఆర్థిక ప్రణాళికలో మార్కెట్‌కి (ఇక్కడ మార్కెట్‌ అంటే కార్పొరేట్ల ఆధిపత్యంలోని ద్రవ్య పెట్టుబడి అని మనం అర్ధం చేసుకోవాలి) రుచించనిది ఏమిటి? లిజ్‌ ట్రస్‌ ప్రకటించిన ఆర్థిక ప్రణాళికలో కీలకమైనది సంపన్నులకి ప్రకటించిన పన్ను రాయితీలు. వాస్తవానికి మార్కెట్‌ ఎగిరి గంతేసి మరీ ఆ రాయితీలను స్వాగతించి వుండాలి. ఎటొచ్చీ ఆ పన్ను రాయితీల కారణంగా ప్రభుత్వం కోల్పోయే ఆదాయాన్ని భర్తీ చేయడానికి ఇతరత్రా ఏ విధమైన చర్యలనూ లిజ్‌ ప్రతిపాదించలేదు. అందువలన ఆ రాయితీల ఫలితంగా బడ్జెట్‌లో ద్రవ్యలోటు పెరుగుతుంది. అలా ద్రవ్యలోటు పెరిగిపోవడం ద్రవ్య పెట్టుబడికి రుచించదు. ఐతే, అలా ద్రవ్యలోటు పెరిగినా, సంపన్నులకి భారీగా పన్ను రాయితీలు ఇచ్చినందువలన మార్కెట్‌ ఆ ప్రణాళికను స్వాగతించి వుండాలి. కాని ఆ విధంగా చేయలేదు.
         పన్ను రాయితీలను ప్రకటించినందు వలన ఏర్పడనున్న ద్రవ్యలోటును భర్తీ చేయడానికి ప్రభుత్వం బాండ్లను అమ్మకానికి పెట్టడం తప్ప వేరే దారి లేదని, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉన్నప్పుడు బాండ్ల మార్కెట్‌ భవిష్యత్తులో ఏం కానుందో తెలియని అనిశ్చిత పరిస్థితి ఏర్పడుతుందని, అందుచేత ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేసినవారంతా ఆ బాండ్లను వెంటవెంటనే వొదిలించుకోడానికే సిద్ధపడతారని, అందువలన మార్కెట్‌ అంతా హడలెత్తిపోతుందని కొందరు అంటున్నారు. అటువంటి పరిస్థితి రాకూడదనే మార్కెట్‌ శక్తులు లిజ్‌ ట్రస్‌ ను సాగనంపారని వాళ్ళు విశ్లేషిస్తున్నారు.
          ఐతే వాస్తవానికి ప్రభుత్వం బాండ్లను అమ్మకానికి పెట్టడం అసలు మొదలుపెట్టనేలేదు. ఇంతలోపే మార్కెట్‌ ఎందుకు హడలెత్తిపోయింది? ఒకవేళ బాండ్ల అమ్మకం ఆకర్షణీయంగా ఉండేందుకు ప్రభుత్వం వాటిపై వడ్డీ రేట్లను ఎక్కువగా ఇవ్వజూపితే దానివలన బ్రిటిష్‌ మార్కెట్‌ లోకి అదనంగా ధనం వచ్చిపడుతుంది. అప్పుడు బ్రిటిష్‌ పౌండు బలం పుంజుకుంటుంది. ఆ విధంగా జరిగితే మార్కెట్‌కి ఏమిటి అభ్యంతరం? ఎందుకు లిజ్‌ ప్రకటించిన ఆర్థిక ప్రణాళికకు ప్రతిస్పందనగా బ్రిటిష్‌ పౌండు విలువ పతనం చెందింది?
తాను ప్రకటించిన పన్నురాయితీల విధానం చాలా స్పష్టంగా పచ్చి మితవాద ఆర్థిక విధానం అని లిజ్‌ కి బాగా తెలుసు. అటువంటి విధానం ప్రకటించడం ద్వారా తాను మార్కెట్‌ మద్దతు పొందగలనని ఆమె భావించారు. బ్రెగ్జిట్‌ అనంతరం బలహీన పడిన బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థను తాను తిరిగి పునరుద్ధరిస్తానని లిజ్‌ ప్రకటించారు. నిజంగా బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థ కోలుకోవాలంటే ప్రభుత్వ వ్యయాన్ని భారీగా పెంచి స్థూల డిమాండ్‌ పెరిగేటట్టు చేసివుండాలి. ఐతే వాస్తవంగా లిజ్‌ కోరుకున్నది వేరు. ఆమె సంపన్న కార్పొరేట్‌ వర్గాలలో తన పట్టు పెంచుకోవాలని, తద్వారా తన పార్టీ విధానాన్ని (సంపన్నుల పక్షాన వ్యవహరించడమే కన్జర్వేటివ్‌ పార్టీ విధానం) కొనసాగించాలని ఆమె భావించారు. కాని ఆమె వ్యూహం ఎందుకు బెడిసికొట్టింది ?
        ఇక్కడ ఇంకో సంగతి కూడా ఉంది. లిజ్‌ తన విధానాన్ని ఎప్పటి నుంచో ప్రచారంలో పెట్టారు. రిషి సునాక్‌తో ప్రధాని పదవికి పోటీ పడ్డప్పుడు ఆమె ఈ విధానాన్నే ప్రకటించారు. తద్వారా రిషి సునాక్‌ ను వెనక్కి నెట్టి, ప్రధాని పదవిని దక్కించుకోగలిగారు. ఆ రోజుల్లో ఆమెను బలపరిచిన ఆ ''నిపుణులే'' తీరా తన విధానాన్ని ప్రకటించాక దానిమీద దాడికి పూనుకున్నారు. ప్రధాని పదవికోసం పోటీ పడినప్పుడు ప్రకటించిన విధానానికి, పదవి చేపట్టాక ప్రకటించిన విధానానికి తేడా ఏమైనా ఉందా? ఏమిటి ఆమె చేసిన నేరం ? సంపన్నుల కోసం ప్రకటించిన పన్ను రాయితీల వలన కోల్పోయే ఆదాయాన్ని భర్తీ చేయడానికి వీలుగా ప్రభుత్వ వ్యయాన్ని (సంక్షేమ కార్యక్రమాలని) తగ్గించే ప్రతిపాదనలు గాని, శ్రామిక ప్రజల మీద అదనంగా పన్నులు వేసే ప్రతిపాదన గాని ఆమె చేయలేదు. ఇదే లిజ్‌ చేసిన నేరం. అటువంటి ప్రతిపాదనలు గనుక చేసివుంటే వాటిపై లిజ్‌ శ్రామిక ప్రజల నుండి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొనవలసి వచ్చేది. ఐనప్పటికీ, అటువంటి వ్యతిరేకతను లెక్కచేయకుండా లిజ్‌ గట్టిగా నిలబడి వుండాలని కార్పొరేట్ల 'మార్కెట్‌' కోరుకుంది. ఆ విధంగా లిజ్‌ వ్యవహరించకపోవడాన్ని 'మార్కెట్‌' జీర్ణించుకోలేకపోయింది.
           సంపన్నులకిచ్చే పన్ను రాయితీల వలన కలిగే ద్రవ్య లోటు ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది. కార్పొరేట్ల దృష్టిలో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ఉన్న ఏకైక, ఉత్తమ మార్గం నిరుద్యోగాన్ని పెంచడమే (నిరుద్యోగం పెరిగితే తక్కువ వేతనాలకే పని చేయడానికి కార్మికులు సిద్ధపడతారు. అందువలన మార్కెట్‌లో వారి వినిమయం తగ్గుతుంది. మార్కెట్‌ లోకి వచ్చే ధనం తగ్గుతుంది. అప్పుడు ధరలు తగ్గుతాయి. అదే సమయంలో కార్పొరేట్ల లాభాల మార్జిన్‌ మాత్రం ఏమాత్రమూ తగ్గదు.).
ప్రస్తుతం బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం రేటు 10 శాతాన్ని దాటిపోయింది. ఇప్పుడు ద్రవ్యలోటు పెరిగితే దాని ఫలితంగా ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుంది. దాని వలన బ్రిటిష్‌ పౌండు విలువ డాలర్‌తో పోల్చుకున్నప్పుడు మరింత తగ్గుతుంది. బ్రిటన్‌లో ఉన్నంత ద్రవ్యోల్బణం అమెరికాలో లేదు. ఇలా పౌండు విలువ తగ్గవచ్చును అన్న ముందస్తు అంచనాకు రాగానే బ్రిటన్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు తమ పెట్టుబడులను అమెరికాకు తరలించడం మొదలెడతారు. ఆ పరిస్థితుల్లో బ్రిటన్‌ ప్రభుత్వం బాండ్ల అమ్మకం చేపడితే అవి తమ విలువను కోల్పోతాయి. మార్కెట్లు కుదేలౌతాయి.
         లిజ్‌ ట్రస్‌ సంపన్నులకు పన్ను రాయితీలు ప్రకటించినప్పటికీ, అదే ప్రకటనలో నిరుద్యోగాన్ని పెంచి తద్వారా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసే ప్రతిపాదనలను చేర్చకపోవడం వలన కార్పొరేట్లకు లిజ్‌ ప్రతిపాదనలు సంతృప్తిని ఇవ్వలేకపోయాయి. ద్రవ్యోల్బణం అదుపులో ఉండకపోతే ద్రవ్యపెట్టుబడులలో తమ సంపదను పెట్టిన కార్పొరేట్ల సంపద విలువ తగ్గిపోతుంది. దాని ప్రతికూల ప్రభావం బ్యాంకులమీద, ఇతర ఆర్థిక సంస్థల మీద చాలా తీవ్రంగా పడుతుంది.
మార్గరెట్‌ థాచర్‌ వ్యవహరించిన తీరుకు, లిజ్‌ అనుసరించిన విధానానికి ఇక్కడే తేడా ఉంది. లక్షలాదిమంది కార్మికులను పనుల్లో నుంచి తొలగించడానికి గాని, కార్మికోద్యమాన్ని అణచివేయడానికి గాని థాచర్‌ ఏమాత్రమూ సంకోచించలేదు. అందుకే కార్పొరేట్‌ వర్గాలు థాచర్‌ పట్ల విశేషమైన ప్రేమను ప్రదర్శించాయి (ఐతే ధాచర్‌ అనుసరించిన విధానాల వలన యూరప్‌ లో ప్రధాన ఆర్థిక కేంద్రంగా ఉన్న లండన్‌ స్థానాన్ని జర్మనీ లోని ఫ్రాంక్‌ఫర్ట్‌ ఆక్రమించుకునే పరిస్థితి అనంతర కాలంలో వచ్చినప్పుడు ఇవే కార్పొరేట్‌ వర్గాలు థాచర్‌ ను పదవినుంచి తప్పించడానికి ఏమాత్రమూ వెనుకాడలేదు) థాచర్‌ మాదిరిగా లిజ్‌ ట్రస్‌ వ్యవహరించలేక పోయినందువలన ఆమె లండన్‌ కార్పొరేట్‌ వర్గాల మద్దతు స్వల్పకాలం లోనే కోల్పోయారు.
        లిజ్‌ ట్రస్‌ ప్రతిపాదించిన పన్ను రాయితీల విధానం (ద్రవ్యోల్బణం పెంచుతుంది) అయినా, లండన్‌ కార్పొరేట్‌ మార్కెట్‌ కోరుకున్న పన్ను రాయితీల విధానం (శ్రామికులపై భారాన్ని మోపడం ద్వారా ద్రవ్యోల్బణం పెరగకుండా చూసే విధానం) అయినా, రెండూ సంపన్న కార్పొరేట్లకు అనుకూలమైన విధానాలే. శ్రామికవర్గం మీద ఏ మోతాదులో దాడి చేయాలన్న అంశంలోనే కాస్తంత తేడా ఈ రెండింటి మధ్యా ఉంది తప్ప వేరే ఏమీ లేదు. నిజంగా ఆర్థిక వ్యవస్థ కోలుకోవాలంటే మాత్రం ఒక్కటే దారి. సంపన్న కార్పొరేట్ల మీద అదనంగా పన్నులను విధించి.... ప్రభుత్వ సంక్షేమ వ్యయాన్ని పెంచి.... ప్రభుత్వమే నేరుగా వినిమయ సరుకుల ధరలను నియంత్రించాలి. అదే సరైన ప్రత్యామ్నాయ విధానం కాగలదు.

(స్వేచ్ఛానువాదం)
ప్రభాత్‌ పట్నాయక్‌

ప్రభాత్‌ పట్నాయక్‌