Apr 14,2023 07:39

భారతీయ సంస్కృతి భిన్నత్వంతో రూపుదిద్దుకుంది. ఆర్యులు, పర్షియన్లు, గ్రీకులు, అరబ్బులు, ఇండో-పార్థియన్లు వంటి వివిధ రకాల ప్రజలను కలుపుకొని భారతీయ సమాజం అభివృద్ధి చెందింది. హిందూత్వ వాదులతో పాటుగా మతతత్వ జాతీయవాదులను ఎదుర్కోవాలంటే...భిన్నత్వంలో ఏకత్వం నిండిన భారతీయ సంస్కృతికి సంబంధించిన చరిత్ర పాఠాలను రూపొందించడం ఎంతైనా అవసరం. చారిత్రిక అభివద్ధి క్రమంలో ఏర్పడిన అన్ని ఉత్తమ సంప్రదాయాలను మనం ముందుకు తీసుకెళ్లాల్సి వుంది.

భారత స్వాతంత్య్ర పోరాటానికి సంఘపరివార్‌ దూరంగా వుంది. అందువల్ల, బహుళత్వాన్ని నొక్కి చెప్పే జాతీయవాద అభిప్రాయాలను కూడా వారు అంగీకరించరు. దీనికి సంబంధించిన చరిత్ర పాఠాలను చెరిపివేయడం, వక్రీకరించడం అనేది సంఘపరివార్‌ ముఖ్యమైన రాజకీయ ఎజెండాగా మారింది.
       విద్య కాషాయీకరణ చేసినట్లయితే, దేశంలోని అన్ని అంశాలను మతతత్వంతో నింపవచ్చునన్న ఉద్దేశంతోనే సంఘపరివార్‌ విద్యారంగంలోకి జొరబడుతోంది. ఇందులో భాగంగానే మొఘలుల చరిత్రను, గాంధీజీ లౌకిక విధానాన్ని ఇటీవల ఎన్‌సిఇఆర్‌టి పాఠ్యపుస్తకాల నుంచి తొలగించారు. దీనికి కొనసాగింపుగా గుజరాత్‌ మారణహోమం, దళితులపై సాగిన హింస వంటి అంశాలనూ పాఠ్యాంశాల నుంచి తీసివేశారు.
భారతదేశాన్ని బ్రిటిష్‌ వారు పాలించిన సమయంలో జేమ్స్‌ మిల్‌ భారతదేశ చరిత్రను హిందూ కాలం, ఇస్లామిక్‌ కాలం, బ్రిటిష్‌ కాలంగా వర్గీకరించాడు. సంఘ పరివార్‌ కూడా దీన్నే అనుసరించింది. ఈ వలసవాద చరిత్ర పాఠాన్ని జవహర్‌లాల్‌ నెహ్రూ తన ప్రసిద్ధ పుస్తకం 'డిస్కవరీ ఆఫ్‌ ఇండియా'లో బహిర్గతం చేశారు.
        మతతత్వం, మత విశ్వాసం అనేవి రెండు వేర్వేరు అంశాలు. మతతత్వం అనేది రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని ఉపయోగించుకునే మార్గం. హిందువులు ముందుకు తెచ్చింది సంఘ పరివార్‌ హిందుత్వ దృక్పథాన్ని కాదు. స్వామి వివేకానంద 1893లో చికాగో ప్రసంగం ద్వారా భారతదేశం లోని హిందూ మత సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పారన్నాడు. వాస్తవానికి ఆయన ప్రసంగం ఇలా సాగింది. ''సహనాన్ని, సార్వత్రిక ఆమోదాన్ని ప్రపంచానికి ప్రబోధించిన మతాన్ని అనుసరించినందుకు నేను గర్విస్తున్నాను. మేము సార్వత్రిక సహనాన్ని విశ్వసించడమే కాకుండా, ప్రపంచం లోని అన్ని మతాలు, శరణార్థులకు నా దేశం ఆశ్రయం ఇచ్చిందని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను.'' అన్నాడు. ఆ ప్రసంగం లోనే మత మౌఢ్యం మనిషికి అతి పెద్ద శత్రువు అని, అయితే మతోన్మాదం అంతకన్నా దారుణమైనదని గుర్తుచేశాడు. ప్రకృతి భిన్నత్వంలో ఏకత్వాన్ని నిర్దేశించిందని, హిందువులు దీనిని అంగీకరించారని వివేకానంద చెప్పారు. హిందువుకే మోక్షం ఉందని, మరెవరికీ లేదని సంస్కృత శ్లోకాల్లో ఎక్కడైనా ఉందా అని వివేకానంద సవాలు విసిరాడు.
         గాంధీ కూడా ఇటువంటి మార్గాన్నే అనుసరించాడు. ప్రార్థనా సమయంలో ఆయనకు గీత, ఖురాన్‌, బైబిల్‌ తప్పనిసరి. ఈ విధానానికి భయపడిన హిందుత్వ శక్తులు ఆయనను తుపాకీతో కాల్చి చంపాయి. హిందూత్వ శక్తులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి గాంధీజీ జీవితం గొప్ప ఉదాహరణ. అందుకే గాంధీజీ జ్ఞాపకాలను ఎన్‌సిఇఆర్‌టి పాఠ్యపుస్తకాల నుంచి తొలగిస్తున్నారు.
          హిందూయిజానికి సంబంధించి వివేకానందుడు, గాంధీజీ ప్రతిపాదించిన అభిప్రాయాలను, విశ్వాసాలను మార్చి ''హూ ఈజ్‌ ఎ హిందువు?'' అనే పుస్తకంలో (1920) సావర్కర్‌ హిందూత్వ రాజకీయ పాఠాలను పరిచయం చేశాడు. గాంధీజీకి, సావర్కర్‌కి మధ్య హిందూ మతావలంభకునికి పచ్చి హిందూత్వ వాదికి వున్నంత తేడా ఉంది.
        భారతదేశ సహనశీలతను కొనియాడుతూ వివేకానంద చికాగోలో ప్రసంగించాడు. మొఘల్‌ కాలం...సంఫ్‌ు పరివార్‌ ప్రచారం చేసిన మత ద్వేషం, మతపరమైన హింసల కాలం మాత్రమే కాదు కాబట్టి వివేకానంద అటువంటి వివరణ ఇవ్వగలిగాడు. 1556 నుండి 1605 వరకు పాలించిన అక్బర్‌ అన్ని మతాలను కలిపి వుంచడానికి, రాజ్య నిర్మాణంలో మతపరమైన జోక్యాన్ని తొలగించడానికి కృషి చేశాడు. ఐరోపాలో బ్రూనో వంటి అనేక మందిని మతపరమైన విచారణ పేరుతో చిత్రహింసలకు గురిచేసి సజీవదహనం చేశారు. ఆ సమయంలో అక్బర్‌ భారతదేశంలో అందరికీ శాంతిని అందించేందుకు గాను 'సుల్‌-హి-కుల్‌' విధానాన్ని అమలు చేశాడు.
          ఎన్‌సిఇఆర్‌టి నుండి తొలగించబడిన మొఘలుల కాలం భారతదేశంలో పురోభివృద్ధి సాధించబడిన కాలమని మర్చిపోకూడదు. దేశీయోత్పత్తి (జిడిపి) 25 శాతం పెరిగిన సమయం అది. ఈ ఆర్థిక వృద్ధే యూరోపియన్‌ శక్తులను భారతదేశం వైపు ఆకర్షించింది. అక్బర్‌ భారతదేశంలోని అన్ని మతాల సామరస్యాన్ని నిలబెట్టాడు. ప్రధాన స్రవంతి హిందూ మతాన్ని, సూఫీతో సహా ఇస్లాం లోని ఇతర శాఖలను, మతాలను ఆదరించాడు. ఈ విధమైన బహుళత్వ సంప్రదాయాలను అంగీకరించని సంఘ పరివార్‌ మొఘలుల కాలాన్ని పాఠ్యపుస్తకాల నుంచి తొలగిస్తోంది.
         మొఘల్‌ రాజులు భారతదేశాన్ని తమ సొంత భూమిగా భావించారు. భారతీయ సంస్కృతిలో ఏర్పడిన ప్రతిదీ వారి వారసత్వంలో భాగంగా వచ్చినదే. అక్బర్‌ ఆస్థానంలో 100,000 శ్లోకాలతో కూడిన మహాభారతం పర్షియన్‌ భాషలోకి అనువదించబడింది. అలా మహాభారత ప్రపంచ యాత్ర మొదలైంది. అక్బర్‌ ఆస్థానంలో యువరాజులకు మహాభారతం లోని శాంతి పర్వాన్ని బోధించేవారు.
ముస్లిం పఠాన్‌ రాజుల కాలంలో మహాభారతం స్థానిక భాషలోకి అనువదించబడింది. ఉపనిషత్తులను పర్షియన్‌ భాషలోకి అనువదించి ప్రపంచానికి అందించింది మొఘల్‌ యువరాజు దారా సుకోవ్‌. మొఘల్‌ రాజుల దగ్గర సైన్యాధిపతులు, మంత్రులుగా పనిచేసిన వారందరూ హిందువులే. జహంగీర్‌, షాజహాన్‌ రాజపుత్ర స్త్రీలకు జన్మించిన వారే. 1857లో స్వాతంత్య్ర సమరం మొదటి దశలో మొఘల్‌ రాజు బహదూర్‌ షా భారత చక్రవర్తిగా ప్రతిష్టించబడే నాటికి మొఘలులు అనుసరిస్తున్న విధానం ఇది.
మొఘల్‌ పాలకులలో అనేక మంది జీవితాలు పరిపాలన, త్యాగం, ప్రేమ వంటి అనేక అధ్యాయాలతో నిండి ఉన్నాయి.
        మొఘలుల కాలంలో శక్తిమంతులైన స్త్రీలు అనేకమంది వున్నారు. సూరత్‌ ఓడరేవుపై ఆధిపత్యం సంపాదించిన జహనారా బేగం వారిలో ఒకరు. హుమాయున్‌కు ప్రియమైన భార్య, అక్బర్‌కు తల్లి అయిన హమీదా బాను బేగం, జహంగీర్‌ కోసం రాజ్యాన్ని పరిపాలించిన నూర్జహాన్‌ లకు కూడా చరిత్రలో సుస్థిరమైన స్థానం ఉంది.
        సంఘ పరివార్‌ చేస్తున్న ప్రచారానికి భిన్నమైనది ఔరంగజేబు చరిత్ర. ఆయన ఖురాన్‌, ఇతర గ్రంథాల ప్రతులను తయారు చేయడం ద్వారా వచ్చే ఆదాయంతో జీవించాడు. ఆయన చివరి యుద్ధం గోల్కొండ సుల్తాన్‌తో జరిగింది. సుదీర్ఘ యుద్ధంతో గోల్కొండను జయించాడు. శివాజీ, ఔరంగజేబు మధ్య జరిగిన యుద్ధాలు మాత్రం ప్రచారంలో వున్నాయి. ఔరంగజేబు గోల్కొండలో చేసినటువంటి యుద్ధాలను వలసవాదులు దాచిపెట్టారు. రాజుల చరిత్రలో అధికారం కోసం నిత్యం పోటీ వుండేది. అన్నదమ్ముల మధ్య, తండ్రీకొడుకుల మధ్య, రాజుల మధ్య ఘర్షణలు జరిగాయి. వాటిని మత విద్వేషాలుగా చిత్రించడాన్ని మనం తిరస్కరించాలి. జాత్యహంకారి హిట్లర్‌ను చరిత్ర చెత్తబుట్టలో పడేసిన సంగతి మర్చిపోవద్దు.
         భారతీయ సంస్కృతి భిన్నత్వంతో రూపుదిద్దుకుంది. ఆర్యులు, పర్షియన్లు, గ్రీకులు, అరబ్బులు, ఇండో-పార్థియన్లు వంటి వివిధ రకాల ప్రజలను కలుపుకొని భారతీయ సమాజం అభివృద్ధి చెందింది. హిందూత్వ వాదులతో పాటుగా మతతత్వ జాతీయవాదులను ఎదుర్కోవాలంటే... భిన్నత్వంలో ఏకత్వం నిండిన భారతీయ సంస్కృతికి సంబంధించిన చరిత్ర పాఠాలను రూపొందించడం ఎంతైనా అవసరం. చారిత్రిక అభివృద్ధి క్రమంలో ఏర్పడిన అన్ని ఉత్తమ సంప్రదాయాలను మనం ముందుకు తీసుకెళ్లాల్సి వుంది.

/ వ్యాసకర్త 'దేశాభిమాని' చీఫ్‌ ఎడిటర్‌ /
పి. దినేశన్‌

పి. దినేశన్‌