ఈ నేలన నువ్వు పొడిచింది లేదు
ఇదో రాజ్యమనే సోయా లేదు
చరిత్ర తెలియదు.. చదవనూ లేరు..
భౌగోళిక సరిహద్దులూ ఎరుగరు
పోరాటం ఉనికిలో లేరు
ఒక్కడంటే ఒక్కడూ లేడా పోరులో
బందూకు పట్టింది లేదు
రజాకార్ల నెదిరించిందీ లేదు
గెరిల్లా యుద్ధం ఓనమాలు తెలీదు
కులమూ మతమూ ఎరుగని
మహత్తర పోరాటమది
హైజాక్ చేయాలనుకున్నా
ఎవడి తరం కానంత
ప్రజల మెదళ్లలో నాటుకుపోయిన ఘట్టాలు
ఒకటా రెండా
పల్లెలన్నీ బండ్లు గట్టి
గడీల వణుకు పుట్టించిన
ఎరుపు దళాలు రాజ్యం నిండా
విమోచనం విలీనమంటూ
విద్యలెన్నో ప్రదర్శిస్తున్న కోతులెన్నో
కోతి కొమ్మచ్చి ఆటలు ఆడుకోవాలేగానీ
ఈ నేల బిడ్డలెవ్వరూ విశ్వసించరు
చైతన్యం నేలలో ఇంకా సజీవం
ఘోరీలు కట్టే సత్తా ఇంకా జనంలో
చైతన్య బీజాలు నాటి మొలకెత్తించే
నాయకత్వం సజీవం
అబద్దాల వలలు విసిరి
వక్రీకరిస్తూ.. రాజ్యం ప్రజల రగడని
మతాల ఘర్షణలా చిత్రీకరించే నయా కుట్రల
ఎరుగలేని కుంచిత మనస్తత్వం
ఈ నేలలో లేదు
విముక్తి పోరాటమంటే
ఈ నేల మోదుగుపూల వనంలో పూసిన ఎరుపు
ఈ నేల తంగేళ్లలో తచ్చాడిన కుందేళ్లు
పట్టిన తుపాకులకు తెలుసు
లోపలేం జరుగుతుందో తెలియని గడీల
ప్రాకారాల నేల మట్టంలో బిగిసిన పిడికిళ్ల
వారసత్వం ఊరూరా
గుట్టల నిండా పూసిన గునుగుపూల నిండా
పులుముకున్న రక్తపు మరకలింకా
ఇంకనే లేదు
మా కంచెల నిండా రోకలిబండ పూలు
సైతం రోకలిబండలతో విరుచుకుపడ్డ తీరు
మాకళ్లల్లో ఇంకా మెరుస్తున్నాయి
మా శనగ చేల నిండా పూసిన తెల్లని
సోంపువ్వే రాత్రుళ్లు
దళాలకు దారులు పరిచేవి
ఇది రా మా చరిత్ర
అడవి నిండా కామంచి పూలు
గద్ద గోరింట పూలు ఇంకా
ఆ పోరాటాన్ని స్మరిస్తుంటే
జనమెలా మరుస్తార్రా!! ఖబడ్దార్!!
- గిరి ప్రసాద్ చెలమల్లు
94933 88201