Nov 13,2023 17:31

అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజు ఉన్నాడు.ఆయనకు ముగ్గురు కొడుకులు. ఒకరోజు రాజ్యంలో ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడానికి మంత్రి తో పాటు రాజు బయలుదేరాడు. వెళ్తూ వెళ్తూ ఒక ఊరిలో ఒక ఇంటి దగ్గర ఆగారు. ఒక స్త్రీ ఏడుపు వినబడడంతో ఆ పక్కగా నిలబడి చాటుగా ఆలకిస్తూ ఉన్నారు.ఆ స్త్రీ భర్త లేక నలుగురు ఆడపిల్లలతో బాధపడుతూ ఉంది. వెంటనే రాజు వారి ఇంటికి వెళ్లి ఆమెతో '' నేను ఈ దేశపు రాజుని, మీ నలుగురు అమ్మాయిల్లో ఒక అమ్మాయిని నేను తీసుకెళ్ళిపోతాను. మిగిలిన అమ్మాయిలకి తగినంత ధనం ఇస్తాను, వివాహం చెయ్యి'' అని చెప్పారు. మరుసటి రోజు రాజు వచ్చి ఆ నలుగురి ఆడపిల్లల్ని పరిశీలనగా చూసి, చిన్న అమ్మాయి అయిన చిన్నీని తీసుకెళ్తానంటాడు. మిగిలిన ముగ్గురికి కావాల్సిన ధనాన్ని ఇచ్చి, చిన్నీని రాజ్యానికి తీసుకెళ్ళిపోతాడు. రాజ్యానికి వెళ్లేసరికి ముగ్గురు కొడుకులు, చిన్నిని తీసుకురావడానికి ఒప్పుకోరు. అప్పుడు రాజు వారిని ఒప్పిస్తాడు. ఆరోజు నుండి నలుగురు కలిసిమెలిసి ఉంటారు. నలుగురు పెరిగి పెద్దవారు అవుతారు. చిన్నీ అంటే ముగ్గురికి చాలా ఇష్టం ఏర్పడింది. ముగ్గురు కూడా చిన్నీ ని పెళ్లి చేసుకోవడానికి పోటీ పడతారు. తండ్రి దగ్గరికి వెళ్లి విషయం చెప్తారు. అప్పుడు తండ్రి ముగ్గురికి మూడు బంగారు నాణేలు మూటలు ఇచ్చి, వాటితో గొప్ప బహుమతి ఎవరు తెస్తారో వారికి చిన్నీ నిచ్చి పెళ్లి చేస్తాను అంటాడు. ముగ్గురు మూడు గుర్రాలపై బయలుదేరారు. ఒక నెల రోజుల తర్వాత ఒక గుడి దగ్గర కలుసు కుందామని అనుకొని, మూడు మార్గాల్లో బయలుదేరారు. పెద్దవాడు వెళ్తూ వెళ్తూ ఒక సంతలో ఒక బండిని కొనుగోలు చేస్తాడు. ఆ బండి ప్రత్యేకత ఏమంటే, దానిమీద కూర్చొని ఎక్కడికి వెళ్లాలన్నా రెప్పపాటులో వెళ్ళొచ్చు.ఆ బండిని కొని పెద్దవాడు చాలా సంతోషంగా ఉంటాడు. రెండోవాడు ఒక అద్దాల షాపులో ఒక విచిత్రమైన అద్దం కొంటాడు. దాని ప్రత్యేకత ఏమంటే అద్దంలో మనం ఏ సన్నివేశం చూడాలన్నా వెంటనే చూడొచ్చు. ఇక మూడోవాడూ వెళ్తూ వెళ్తూ ఒక పండ్ల దుకాణంలో ఒక యాపిల్‌ కొనుగోలు చేస్తాడు. దాని ప్రత్యేకత ఏమంటే ఆ యాపిల్‌ తినిపిస్తే చనిపోతారు అనుకున్న వాళ్లు కూడా, తిరిగి ఆరోగ్యవంతులు అవుతారు. ముగ్గురూ కూడా చిన్నీ నాదే చిన్నీ నాదే అని మనసులో అనుకొని ఆనందంతో బయలుదేరుతారు. గుడి దగ్గర కలుసుకుంటారు. అందులో ఒకడు చాలా రోజులైంది.. ఇంటిదగ్గర ఎలా ఉన్నారో? ఏంటో? అనగానే రెండోవాడు అద్దంలో చూపిస్తాడు. అద్దంలో చూడగా రాజు గారు చావు బతుకుల్లో ఉన్నారు. రాజ్యమంతా అల్లకల్లోలంగా ఉంది. వెంటనే పెద్దవాడు బండిమీద ఇద్దరినీ కూర్చోబెట్టుకొని ముగ్గురు కూడా రెప్పపాటులో రాజుగారి మంచం దగ్గరకు చేరుకుంటారు. వెంటనే మూడోవాడు ఆలస్యం చెయ్యకుండా రాజు గారిచే ఆపిల్‌ తినిపిస్తాడు. రాజుగారు ఆరోగ్యవంతులవుతారు.

ఇప్పుడు మీకు ఒక ప్రశ్న.
1. ముగ్గురిలో ఎవరిది గొప్ప బహుమతి? 2. రాజుగారు ఎవరికి చిన్నీ నిచ్చి పెళ్లి చేస్తారు?
జవాబు : ఆపిల్‌ తెచ్చిన మూడోవాడికి. ఎందుకంటే మొదటి ఇద్దరి బహుమతులు వారి దగ్గరే ఉన్నాయి. మూడో వాడి ఆపిల్‌ని రాజు తినేశారు. కాబట్టి మూడో వాడి త్యాగానికి మెచ్చి చిన్ని నుంచి పెళ్లి చేస్తారు.

కర్రా రిషితాశ్రీ
4వ తరగతి
ధర్మవరం, ఎస్‌. కోట (మండలం)
విజయనగరం జిల్లా.