
విద్యుత్ డెవలపర్లకు ప్రభుత్వం రాయితీలు, మినహాయింపులు, ప్రోత్సాహకాలు కల్పిస్తే, అందుకయ్యే భారాన్ని ప్రభుత్వమే భరించాలి. అయితే, ప్రభుత్వ విధానాలలో గాని, వాటికి అనుగుణంగా ఎ.పి.ఇ.ఆర్.సి జారీ చేసిన రెగ్యులేషన్లలోగాని అలా స్పష్టం చేయకుండా దాటవేశాయి. దానితో ఆ భారాలన్నీ డిస్కాంలపై, అంటే వాటి వినియోగదారులపై పడుతున్నాయి. ఓపెన్ యాక్సెస్ కింద డెవలపర్లు ఇతరులకు అమ్మే విద్యుత్ లావాదేవీలతో డిస్కాంలకు, వాటి వినియోగదారులకు ఎలాంటి సంబంధం లేదు.
రాష్ట్ర ప్రభుత్వం 2015 ఫిబ్రవరిలో ప్రకటించిన పవన, సౌర విద్యుత్ విధానాలలో ఆ ప్రాజెక్టుల డెవలపర్లు విద్యుత్‌ను డిస్కాంలకు, స్వంత వినియోగానికి, ఓపెన్ యాక్సెస్ కింద విద్యుత్‌ను ఇతరులకు అమ్ముకునేందుకు సంబంధించి అనేక రాయితీలను ప్రకటించింది. ఆ విధానాల స్థానంలో 2019 జనవరి మొదటి తేదీన రాష్ట్ర ప్రభుత్వం సౌర, పవన, సౌర పవన మిశ్రమ విద్యుత్ విధానాలను ప్రకటించింది. అంతకు ముందు ఈ ప్రాజెక్టులకు ప్రకటించిన రాయితీలను, ప్రోత్సాహకాలను, మినహాయింపులను ఉపసంహరిస్తూ, ప్రభుత్వం 2019 నవంబరు 18న 35వ నంబరు జీవో జారీ చేసింది. ఎ.పి డిస్కాంల క్షీణిస్తున్న ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, వాటి ఆర్థిక పరిస్థితిని పటిష్టం చేసేందుకు అమలులో ఉన్న విధానాలను ఆ విధంగా సవరించినట్లు జీవోలో ప్రభుత్వం పేర్కొంది. గత విధానాలకు అనుగుణంగా ఎ.పి.ఇ.ఆర్.సి ఆనాడు చేసిన రెగ్యులేషన్లను సవరించాలని కోరుతూ డిస్కాంల తరపున ఎ.పి.ఎస్.పి.డి.సి.ఎల్ దాఖలు చేసిన అయిదు పిటిషన్లపై కమిషన్ 2020 మార్చిలో బహిరంగ విచారణ ప్రక్రియను చేపట్టింది. రాయితీలు, ప్రోత్సాహకాలను గతం నుండి అమలులోకి వచ్చే విధంగా ఉపసంహరించటాన్ని సవాలు చేస్తూ కొందరు డెవలపర్లు హైకోర్టు నుండి కమిషన్ విచారణపై స్టే పొందారు. ఆ తరువాత, 35వ నంబరు జీవో లో చేసిన సవరణలు ఆ తరువాత కాలంలో అమలులో ఉంటాయని, 2019 నవంబరు 18వ తేదీ తరువాత నెలకొల్పే పునరుత్పత్తి విద్యుత్ (ఆర్‌ఆ) ప్రాజెక్టులకు ఆ సవరణలు (ప్రోత్సాహకాలు, రాయితీల ఉపసంహరణ) వర్తిస్తాయని పేర్కొంటూ 2021 మార్చి ఒకటవ తేదీన 1వ నంబరు జీవోను ప్రభుత్వం జారీ చేసింది. 2015 విధానాలలో ప్రసార, వీలింగ్ ఛార్జీల మినహాయింపు, బ్యాంకింగ్ సదుపాయం (తమకు మిగులుగా ఉన్న విద్యుత్‌ను డిస్కాంలకు ఇచ్చి, కమిషన్ నిబంధనలలో పేర్కొన్న కాలంలో తిరిగి తీసుకొనటం లేదా కమిషన్ నిర్ణయించిన మొత్తాన్ని ఆ విద్యుత్‌కు పొందటం), పంపిణీ నష్టాల నుండి మినహాయింపు, ఇతరులకు అమ్మే విద్యుత్‌పై క్రాస్ సబ్సిడీ సర్చార్జి, అదనపు సర్చార్జి చెల్లింపు నుండి మినహాయింపు, వాణిజ్యపరంగా పనిచేయటం ప్రారంభమైన తేదీకి ముందు గ్రిడ్ లోకి పంపిన విద్యుత్‌ను బ్యాంకు చేసిన విద్యుత్‌గా పరిగణించటం, ఈ ప్రాజెక్టుల ఓపెన్ యాక్సెస్ జనరేటర్లు ఒక రోజు ముందు వీలింగ్ షెడ్యూలును ప్రకటించనవసరం లేదని, ఆ ప్రాజెక్టులు గ్రిడ్‌లో చేర్చిన విద్యుత్‌ను షెడ్యూలు చేసిన విద్యుత్‌గానే భావించాలని, ఓపెన్ యాక్సెస్ జనరేటర్లు వాస్తవంగా ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను షెడ్యూలు ఉత్పత్తిగా పరిగణించటం ఆ రాయితీలు, ప్రోత్సాహకాలలో ఉన్నాయి. వాటి వల్ల తమకు సాంకేతికంగా సమస్యలు వస్తున్నాయని, ఆర్థికంగా భారాలు పడుతున్నాయని డిస్కాంలు తమ పిటిషన్లలో వివరించాయి. విద్యుత్ డెవలపర్లకు ప్రభుత్వం రాయితీలు, మినహాయింపులు, ప్రోత్సాహకాలు కల్పిస్తే, అందుకయ్యే భారాన్ని ప్రభుత్వమే భరించాలి. అయితే, ప్రభుత్వ విధానాలలో గాని, వాటికి అనుగుణంగా ఎ.పి.ఇ.ఆర్.సి జారీ చేసిన రెగ్యులేషన్లలోగాని అలా స్పష్టం చేయకుండా దాటవేశాయి. దానితో ఆ భారాలన్నీ డిస్కాంలపై, అంటే వాటి వినియోగదారులపై పడుతున్నాయి. ఓపెన్ యాక్సెస్ కింద డెవలపర్లు ఇతరులకు అమ్మే విద్యుత్ లావాదేవీలతో డిస్కాంలకు, వాటి వినియోగదారులకు ఎలాంటి సంబంధం లేదు.
ప్రభుత్వమే ఆ భారాల మొత్తాన్ని భరించాలని రెగ్యులేషన్లను సవరించి, అమలు చేయాలని కోరినా, గత కమిషన్ పట్టించుకోలేదు. డిస్కాంల పిటిషన్లపై ఆరు సార్లు లిఖిత పూర్వకంగా మేము దాఖలు చేసిన నివేదనలలో ఈ అంశాన్ని వివరంగా లేవనెత్తినా, ప్రస్తుత కమిషన్ కూడా దానిని పట్టించుకోలేదు. రాయితీలు, ప్రోత్సాహకాల ఉపసంహరణ 2019 నవంబరు 18 తరువాత నెలకొల్పిన ప్రాజెక్టులకు వర్తిస్తుందని ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టుకు సమర్పించామని, ఆ కేసు ముగిసిందని డిస్కాంల తరపు సీనియర్ న్యాయవాది పి.శివరావు కమిషన్ దృష్టికి తెచ్చారు. ఈ నెల 21న ఇచ్చిన ఉత్తర్వులో కమిషన్ డెవలపర్లు, వారి సంఘాలు చేసిన నివేదనలను, డిస్కాంలు చేసిన వాదనలను పొందుపరిచింది. ప్రజా ప్రయోజనం దృష్ట్యా మేము చేసిన వివరమైన లిఖిత పూర్వక నివేదనలను పూర్తిగా విస్మరించి, గత నెల 15న జరిగిన బహిరంగ విచారణలో బ్యాంకింగు సదుపాయం కొనసాగించాలని డిస్కాంలు ప్రతిపాదించటంపై మౌఖికంగా మేము గట్టి అభ్యంతరం తెలపడాన్ని, బ్యాంకింగు సదుపాయాన్ని ఉపసంహరించాలని కోరటాన్ని మాత్రమే కమిషన్ తన ఉత్తర్వులో పొందుపర్చింది. ఆ రోజు బహిరంగ విచారణలో ఇతరులెవరూ వాదనలు చేయలేదు.
బ్యాంకింగు సదుపాయం వల్ల ఏర్పడుతున్న ఇబ్బందులకు సంబంధించి డిస్కాంల నివేదనలను తగు సమయంలో నియంత్రణ ప్రక్రియ ద్వారా సమగ్ర డీవియేషన్ సెటిల్మెంట్ రెగ్యులేషన్‌ను జారీ చేసేటపుడు పరిగణిస్తామని కమిషన్ తన ఉత్తర్వులో పేర్కొంది. బ్యాంకింగు సదుపాయాన్ని ఉపసంహరించాలన్న నివేదనను అంగీకరించటం లేదని పేర్కొంది. విచారణ సందర్భంగా పై రాయితీలు, ప్రోత్సాహకాల ఉపసంహరణ 2019 నవంబరు 18 తరువాత నెలకొల్పే ప్రాజెక్టులకు వర్తిస్తుందని ఉత్తర్వు ఇవ్వాలని డిస్కాంల న్యాయవాది కోరగా, దానికి వేరే పిటిషన్ దాఖలు చేయాలని చైర్మన్ జస్టిస్ సి.వి.నాగార్జున రెడ్డి చెప్పారు. కమిషన్ విచారణ జరుపుతున్న పిటిషన్లు దాఖలు చేసింది అందుకోసమేనని శివరావు స్పష్టం చేశారు. అయితే, కమిషన్ తన ఉత్తర్వులో ఆ విధంగా ప్రోత్సాహకాల ఉపసంహరణ అమలులోకి వస్తుందని పేర్కొనలేదు. పైగా, డిస్కాంలు కోరినట్లు 2005, 2006 నాటి రెండవ నంబరు రెగ్యులేషన్లను సవరించాల్సిన అవసరం లేదని కమిషన్ తన ఉత్తర్వులో పేర్కొంది.
ప్రభుత్వ విధానాల ప్రకారం రెగ్యులేషన్లు చేస్తున్న, వాటిని కొనసాగిస్తున్న కమిషన్ ప్రభుత్వ విధానాల ప్రకారమే పై విధంగా ప్రోత్సాహకాలు, రాయితీల ఉపసంహరణ అమలుకు కూడా నిబంధనలను సవరిస్తూ ఉత్తర్వులనీయాలి. తనంత తాను అలా ప్రోత్సాహకాలను కల్పించటానికి, ఉపసంహరించటానికి కమిషన్‌కు అధికారం లేదని ఆచరణ నిర్ధారిస్తున్నది. ప్రభుత్వం అలా రాయితీలను కల్పిస్తూ విధానాలను ప్రకటించినపుడు, అందుకయ్యే ఆర్థిక భారాన్ని డిస్కాంల వినియోగదారులపై మోపకుండా ప్రభుత్వమే భరించాలని కూడా కమిషన్ స్పష్టం చేయాలి. 2019 నవంబరు 18 తరువాత నెలకొల్పే సంబంధిత ప్రాజెక్టులకు పైన పేర్కొన్న రాయితీలు, ప్రోత్సాహకాలు వర్తించబోవన్న ప్రభుత్వ విధానానికి అనుగుణంగా కమిషన్ ఉత్తర్వు ఇవ్వకపోవటం, సంబంధిత రెగ్యులేషన్లను సవరించకపోవటం వల్ల ఆ తేదీ తరువాత నెలకొల్పే ప్రాజెక్టులకు కూడా ఆ రాయితీలు, ప్రోత్సాహకాలు అమలు జరుగుతాయని భావించాలి. అంటే, ప్రైవేటు డెవలపర్లకు ప్రయోజనం కల్పించే రాయితీలు, ప్రోత్సాహకాలు నిర్ణీత కాలం కొనసాగుతాయి. వాటివల్ల ఏర్పడే ఆర్థిక భారాలను డిస్కాంలు, వాటి వినియోగదారులు భరిస్తూనే ఉండాలి. అలాంటి భారాలను నివారించే ప్రభుత్వ విధానంలోని అంశాలు అమలు లోకి రావు. సవరించకుండా కొనసాగే కమిషన్ రెగ్యులేషన్లనే డిస్కాంలు పాటిస్తూ పోవాలి. ఇలాంటి ప్రశ్నార్ధక వైఖరితో జారీ అయిన కమిషన్ ఉత్తర్వును సమీక్షించి, సముచితంగా సవరించాల్సిన అవసరం ఉంది.
(వ్యాసకర్త విద్యుత్ రంగ నిపుణులు, సెల్ : 9441193749)
ఎం. వేణుగోపాలరావు