'సరి'హద్దుల్లోనే ఉండి
మానవత్వాన్ని విస్తరించమనడం
తప్పేమీ కాదు
ముప్పు ముంగిట్లోకి
రానంత వరకూ.
అసలు
మనిషినే గుర్తించని
అమానవీయ శక్తులు ఎవరికి కావాలి!?!
కుయుక్తులు పన్నే
దర్జాల నీడ మనకెందుకు?
ఇప్పుడు
మేధస్సు చంద్రయాన్ 3 కి వేలడుతూ
విశ్వమంతా పరివ్యాప్తం చెందుతుంటే
దుఃఖాన్ని ఎందుకు కౌగిలించుకోవాలి.
విజ్ఞాన గోడకేసి కొట్టుకుంటున్న
అపార సంపద 'దృష్టి'
మారాల్సిందే కదా!
మరణాలను చూస్తున్న మనిషి
మరణాన్ని
మెదడుకు వేలాడేసి ఊరేగడం అవసరమా?!
యుద్ధం మిగిల్చే బూడిద
ఎవరి జ్ఞానమైతేనేమి
మనిషి మనిషిపైనే కక్ష కట్టాకా
ఊరి చివర స్మశానం
ఊరిలో తిష్ట వేస్తే తప్పెవరిది?!
ముప్పు మీద నిలబడి
నీదీ నాదే అనే చెబుతున్నా.
వింటే
యుద్ధం ఎవరి కోసం అనే స్పార్క్
భవిష్యత్‌ను నిర్దేశిస్తుంది.
వినాలి కదా.. వింటావు కదూ?!
కొత్తపల్లి మణీత్రినాథరాజు
7997826662