కుక్కలు.. ఈ మాట వింటేనే కొంతమందికి నచ్చదు. మరికొంత మంది తెగ ఆనందపడిపోతారు. కుక్కల్ని పెంచుకోవడానికి కొందరికి చాలా ఇష్టం. ఇటీవల పెంపుడు జంతువుల్ని పెంచడం పెరిగింది కూడా. తమ కన్నబిడ్డల కంటే కూడా వాటిపై ప్రేమ కురిపించేస్తున్నారు. వాటికి ఓ ముద్ద అన్నం పెడితేనే.. ఇంటికి కాపాలా కాస్తూ, బోలెడంత ప్రేమ చూపిస్తాయి. అది వాటి సహజ లక్షణం. ఒక కుక్క అంతకుమించిన విశ్వాసం చూపింది.. తన యజమానిని వదిలి ఉండలేక ఆ కుక్క గొప్ప సాహసమే చేసింది. అదేంటో.. ఎలాగో ఈ నిజ కథనం చదివితే మీరూ వారేవా.. అంటారు. లాస్ట్‌పావ్స్ ఎంతో ఇష్టంగా గోల్డెన్ రిట్రీవర్ జాతి కుక్కను కొన్నాడు. దానికి 'కూపర్' అని పేరు పెట్టుకొన్నాడు. ఓ ఏడాది దాన్ని చాలా ప్రేమగా పెంచాడు. అయితే కొన్ని కారణాల వల్ల లాస్ట్‌పావ్స్ దాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తనకు ఇష్టమున్నా లేకపోయినా.. కూపర్‌ని వేరొకరికి ఇవ్వాలని అనుకున్నాడు. వాళ్లు తీసుకోవడానికి ఓకే చెప్పడంతో ఆ కుటుంబానికి తను ముద్దుగా పెంచుకున్న కూపర్‌ను ఇచ్చేశాడు. వాళ్లూ లాస్ట్‌పావ్స్ ఇంటికి వచ్చి మరీ కూపర్‌ని తీసుకెళ్లారు.
సుదూర పరుగు..
అయితే కూపర్‌కి ముందు విషయం అర్థంకాలేదు. చాలా సేపు దిగులుగా కూర్చుంది. కొత్త యజమాని ఇల్లు దగ్గరలోకి రాగానే కారులోంచి ఒక్కసారిగా కూపర్ దూకేసింది. వాళ్లకి అందకుండా విపరీతమైన వేగంతో పరుగులు తీసింది. ఎలా అయినా లాస్ట్‌పావ్స్‌ను కలవాలని నిశ్చయించుకుంది. ఆ సుదీర్ఘ పరుగు.. ఆ సుదూరం ఎంతో తెలుసా..? దాదాపు 27 రోజుల పాటు 64 కిలోమీటర్లు. అయితే చివరకు తనను ఎంతో ప్రేమగా పెంచిన లాస్ట్‌పావ్స్‌ను చేరింది.
అయినా.. కొత్త యజమాని వద్దే ..!
అయితే ప్రస్తుతం కూపర్.. నిగెల్ ఫ్లెమింగ్ అనే కొత్త యజమాని దగ్గరే ఉంది. ఇంత ప్రేమగా వెనక్కి వచ్చినా లాస్ట్‌పావ్స్‌కు కూపర్‌ను పెంచుకోలేని పరిస్థితి. అందుకే కొత్త యజమానికే కూపర్‌ను తిరిగి అప్పగించాడు. 'దాదాపు నెల రోజులు ఎలాంటి ఆహారం తీసుకోకపోవడంతో చాలా బలహీనంగా అయిపోయింది. అందుకే దానికి బలమైన ఆహారం అందిస్తున్నాం. లాస్ట్‌పావ్స్ చేసిన సాయం మర్చిపోలేము. ఇంత తెలివైన, ప్రేమ కలిగిన కూపర్‌ని పొందడం నిజంగా చాలా ఆనందంగా ఉంది!' అని నిగెల్ ఫ్లెమింగ్ వివరించారు. అయితే కూపర్‌ను చూసేందుకు చాలాసార్లు లాస్ట్‌పావ్స్ వెళ్లాడు. 'అలా లాస్ట్‌పావ్స్ వచ్చినప్పుడు కూపర్ ఆనందానికి అవధుల్లేవు. తన పాత యజమానిని చూడగానే కూపర్ ఎగిరి గంతులేసేది. తనకు అందిస్తున్న ఆహారం, తనకు కల్పించిన సౌకర్యాలు లాస్ట్‌పావ్స్ పరిశీలించారు. కూపర్‌ను ఎలా చూసుకోవాలో తనకి పలు సూచనలు చేశారు' అని నిగెల్ చెప్పుకొచ్చారు.