
ఈ సమస్య కేవలం రైతులు, ఉద్యోగులకు చెందినదిగా చూడకూడదు. ఇది రైతుల ఆధ్వర్యంలోని పిఎసిఎస్‌ల పరిధిని కూడా దాటిపోతోంది. ఇది గ్రామీణ ప్రాంతాల ఆర్థిక వ్యవస్థలో తీవ్రమైన మార్పులకు దారితీస్తుంది. దీనంతటికీ అసలు మూలం పిఎసిఎస్‌ల ప్రైవేటీకరణలోనే ఉంది. మోడీ మనసును ముందే కనిపెట్టి తదనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. మోడీ ప్రభుత్వం నుండి ఆదేశం వచ్చీరాగానే అది ఇక్కడి ప్రభుత్వ జీవో రూపంలో బయటకు వస్తోంది.
రాష్ట్ర వైసిపి ప్రభుత్వం 'ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల చట్టం-1964'కు 2022 సెప్టెంబర్‌లో సవరణలు చేసి చట్టసభలలో పాస్ చేసింది. ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల(పి.ఎ.సి.ఎస్)లో 50 శాతం వాటాలను ప్రైవేటు వ్యక్తులకు, కంపెనీలకు ఇచ్చింది. కనీసం రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టాలని నిబంధన పెట్టింది. 50 శాతం అంతకంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టినవారు సహజంగానే తాము పెట్టిన పెట్టుబడికి ఆదాయం రావాలని కోరుకుంటారు. ఈ సంఘాలలో పెట్టుబడులు పెట్టేవారు రూ.4 లేదా రూ.5 కోట్ల పెట్టుబడులు పెట్టాలి. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో రూ. 4 లేదా 5 కోట్లు షేర్ క్యాపిటల్ కలిగిన సంఘాలు కూడా వున్నాయి. ఈ స్థాయిలో పెట్టుబడులకు ఆదాయం రావడమంటే రైతులకు ఇచ్చే సర్వీసులకు చార్జీలు, వడ్డీలు పెంచాలి. ఉద్యోగుల సంఖ్యను కూడా తగ్గించి వారి వేతనం మీద దాడి చేయాలి. అందుచేత ఈ ప్రైవేటీకరణ ప్రభావం తీవ్రంగా వుంటుంది.
రైతు భరోసా కేంద్రాలు రైతులకు మంచి సేవలు అందిస్తున్నాయని వివిధ రాష్ట్రాలు, సంస్థలతో కితాబులు ఇప్పించుకున్న వైసిపి ప్రభుత్వం ఇదే చట్ట సవరణ ద్వారా వాటిని పిఎసిఎస్ లలో విలీనం చేసింది. వృత్తి నిపుణులను, ఫైనాన్స్ బ్యాంక్ ప్రతినిధులను మేనేజింగ్ బోర్డుల లోకి ఓటింగ్ హక్కులతో ప్రవేశపెట్టింది. 50 శాతం వాటాలతో ప్రవేశించే ప్రైవేటు వ్యక్తులు, కంపెనీలకు వచ్చే ఓటింగ్ హక్కులకు ఇవి అదనం. ఇప్పటి వరకు రైతుల చేతుల్లో ఉన్న వ్యవసాయ పరపతి సహకార సంఘాలు ప్రైవేటుపరం కానున్నాయి. ఇప్పుడు వాటిని కేంద్ర మోడీ ప్రభుత్వ ఆదేశాల మేరకు కామన్ సర్వీస్ సెంటర్లుగా మారుస్తోంది.
ఈ పరిణామాలపై వాటాదారులుగా ఉన్న రైతులు, మేనేజ్‌మెంట్ బోర్డుల్లోని వారి ప్రతినిధులు, పిఎసిఎస్ లలో పనిచేసే ఉద్యోగులు ఆందోళనతో ఉన్నారు. దక్షిణాదిలో ఉన్న కేరళ రాష్ట్రంలో చాలా కాలం నుండి వ్యవసాయ పరపతి సహకార సంఘాలు ప్రాథమిక వ్యవసాయ బ్యాంకుల పేరుతో రైతుల యాజమాన్యంలోనే నడుస్తున్నాయి. ఇప్పుడు మోడీ, ఆయనకు జోడీగా ఉండే జగన్ మోహన్ రెడ్డి చెప్తున్న కామన్ సర్వీస్ సెంటర్ల (సిఎస్‌సి)లో లభించే అన్ని సర్వీస్‌లు కేరళలో రైతుల యాజమాన్యంలోనే లభిస్తున్నాయి. తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలలో సిఎస్‌సి లలో లభించే అన్ని సర్వీస్‌లు పిఎసిఎస్ లలో ఏర్పాటు చేసే ప్రయత్నం జరుగుతోంది. కానీ ఈ రాష్ట్రాలలో ఎక్కడా కూడా పిఎసిఎస్‌ల ప్రైవేటీకరణ చెయ్యలేదు. పైగా అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాయి. వీటికి విరుద్ధంగా రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం ప్రైవేటీకరణతో ముందుకు పోతోంది. చంద్రబాబు నాయుడు సహకార రంగాన్ని ధ్వంసం చేశాడని, తాము దాన్ని పునరుద్ధరిస్తామని చెప్పిన వైసిపి ప్రభుత్వం పిఎసిఎస్ లను ప్రైవేటు చేతుల్లో పెడుతోంది.
కేంద్ర మోడీ ప్రభుత్వం కూడా నిజాయితీతో వ్యవహరించకుండా సహకార రంగ ధ్వంసానికి పూనుకుంటోంది. ప్రతి గ్రామంలో పిఎసిఎస్ లను ఏర్పాటు చేస్తామని కేంద్ర సహకార మంత్రి అమిత్ షా ప్రకటనలు చేశారు. కానీ అదే కేంద్ర ప్రభుత్వం పిఎసిఎస్ లను కామన్ సర్వీస్ సెంటర్లుగా మార్చమని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం ఇచ్చింది. కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా పౌరులకు కావలసిన అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తాలుకా సర్వీసులు, పథకాలు అమలవుతాయని, పౌరులకు అవసరమైన అన్ని సరుకుల వ్యాపారాలను సిఎస్‌సి లు నిర్వహిస్తాయని, 300 రకాల ఆన్‌లైన్ సర్వీస్‌లు లభిస్తాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నాయి. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, వ్యవసాయం, రుణాలు, పెన్షన్లు, ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ, పాన్‌కార్డులు, పాస్‌పోర్టులు తదితర సర్వీసులన్నీ అందుబాటులో ఉంటాయని ఊదరకొడుతున్నాయి.
ఈపాటికే రాష్ట్రంలో 20,069 కామన్ సర్వీస్ సెంటర్లు ప్రైవేటు వ్యక్తుల (విలేజ్ లెవల్ ఎంటర్‌ప్రూనర్స్) ఆధ్వర్యంలో ఏర్పడ్డాయని ప్రభుత్వ సమాచారం చెపుతున్నది. వీటిలో 15,080 కేంద్రాలు గ్రామాల్లో ఏర్పడ్డాయి. వీటి పరిస్థితి ఏమిటి, అవి ఎలా నడుస్తున్నాయి? ఎన్ని సర్వీసులు అందించ గలుగుతున్నాయి? అనే సమాచారం ఎక్కడా లేదు. ప్రభుత్వం కూడా చెప్పటం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో సహకార సంఘాలను కామన్ సర్వీస్ సెంటర్లుగా మారుస్తున్నారు. ప్రైవేటు పెట్టుబడుల యాజమాన్యంలోని పిఎసిఎస్ లు కామన్ సర్వీస్ సెంటర్లుగా మారితే వాటి ప్రభావం ఇప్పటికే ఉన్న సెంటర్లపై ఎలా ఉంటుందో రాబోయే కాలంలో తెలుస్తుంది. ప్రైవేటీకరించబడే పిఎసిఎస్ లు కార్పొరేట్ పెట్టుబడుల చేతుల్లోకి పోతాయి. వాటిలో అందే సర్వీసులు రైతులు భరించే స్థాయిలో ఉంటాయని అనుకోలేము. పిఎసిఎస్‌ల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి కూడా అగమ్యగోచరం అవుతుంది. వారి వేతనాలు, పని పరిస్థితులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఉద్యోగ భద్రత గాలికి పోతుంది.
రాష్ట్రంలో 2600కు పైగా పిఎసిఎస్‌లు ఉన్నాయి. అదే సమయంలో 6000-7000 లోపు రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. రైతు భరోసా కేంద్రాల్లో సగానికి పైగా సొంత ఆఫీసులు లేవు. పిఎసిఎస్ లలో కూర్చొని పని చేసే జిల్లాలు కూడా ఉన్నాయి. రైతు భరోసా కేంద్రాలు అలంకార ప్రాయంగా నడుస్తున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రైతు భరోసా కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేసి ప్రతి గ్రామంలోనూ రైతులకు అందుబాటులోకి తేవలసిన బాధ్యత ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం వీటిని నడపలేక పిఎసిఎస్ లలో విలీనం చేస్తోంది.
పిఎసిఎస్ ల ప్రైవేటీకరణ విరమించాలని, రైతు భరోసా కేంద్రాలను విడిగా నడిపి రైతులకు అందుబాటు లోకి తెచ్చి అన్ని రకాల రైతుల అవసరాలను తీర్చేవిధంగా వాటిని అభివృద్ధి చెయ్యాలని రైతు సంఘాలు, ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. దీని కోసం ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల చట్టం-1964 కు చేసిన సవరణలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. రైతు సంఘాలతో, ఉద్యోగ సంఘాలతో, రైతులు వాటాదారులుగా ఉన్న పిఎసిఎస్ జనరల్ బాడీలతో చర్చించి ఆ తరువాతనే ముందుకు వెళ్ళాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతు న్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు అవసరమైన ఆందోళనా కార్యక్రమాన్ని రూపొందించే పనిలో ఉన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం 2013 తరువాత ఇంత వరకు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల మేనేజింగ్ కమిటీలకు ఎన్నికలు జరపలేదు. గతంలో టిడిపి ప్రభుత్వం, ప్రస్తుత వైసిపి ప్రభుత్వం సహకార సంఘాలను రైతుల యాజమాన్యంలో ప్రజాతంత్రయుతంగా నడపడానికి సిద్ధ్దపడటంలేదు. వైసిపి ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం సహకార సంఘాలను వాడుకుంటోంది. తన అనుయాయులను సహకార సంఘాల పర్సనల్ ఇన్‌చార్జీలుగా నియమించింది. వీరు తమ ప్రభుత్వ నిర్ణయాన్ని ధిక్కరించలేరు. దీనిని అవకాశంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం నేరుగా సంఘాలలో పనిచేస్తున్న కార్యదర్శుల ద్వారా పిఎసిఎస్ లను కామన్ సర్వీస్ సెంటర్లుగా మార్చేందుకు పూనుకుంది. కార్యదర్శుల, సహకార సంఘాల ఐడీ లను తీసుకొని సమావేశాలకు రమ్మంటూ జిల్లా సహకార అధికారులు తాకీదులు ఇస్తున్నారు. ఈ ప్రయత్నాలను వెంటనే విరమించి ముందుగా రైతు సంఘాలతో, ఉద్యోగ సంఘాలతో చర్చించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. తన చిత్తశుద్ధిని నిరూపించుకోవటానికి సహకార సంఘాల చట్టానికి చేసిన సవరణలను వెనక్కి తీసుకోవాలి.
ఈ సమస్య కేవలం రైతులు, ఉద్యోగులకు చెందినదిగా చూడకూడదు. ఇది రైతుల ఆధ్వర్యంలోని పిఎసిఎస్‌ల పరిధిని కూడా దాటిపోతోంది. ఇది గ్రామీణ ప్రాంతాల ఆర్థిక వ్యవస్థలో తీవ్రమైన మార్పులకు దారితీస్తుంది. దీనంతటికీ అసలు మూలం పిఎసిఎస్‌ల ప్రైవేటీకరణలోనే ఉంది. మోడీ మనసును ముందే కనిపెట్టి తదనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. మోడీ ప్రభుత్వం నుండి ఆదేశం వచ్చీరాగానే అది ఇక్కడి ప్రభుత్వ జీవో రూపంలో బయటకు వస్తోంది.
రాష్ట్రంలో ఎవ్వరితోనూ సంప్రదించాల్సిన అవసరం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ప్రైవేట్ కార్పొరేట్ పెట్టుబడుల ప్రయోజనాల కోసం మోడీ అడుగుజాడల్లో జగన్ ప్రభుత్వం నడుస్తోంది. సమీప భవిష్యత్ లోనే ప్రైవేటు కార్పొరేట్ పెట్టుబడుల చేతుల్లోకి పోయే అన్ని రకాల సర్వీసులు గ్రామీణ ప్రజా జీవనంపై ప్రతికూల ప్రభావాన్ని తీసుకు వస్తాయి. ధనికులు మాత్రమే బాగుపడే పరిణామాలు వస్తాయి. దీనికి తోడు మోడీ రద్దు చేసిన వ్యవసాయ నల్ల చట్టాలలో ఉన్న ప్రతికూల అంశాలన్నీ ఏదో ఒక రూపంలో వ్యవసాయ రంగంలోకి ప్రవేశిస్తే రైతులు, గ్రామీణ ప్రజానీకం నష్టపోతారు. ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా పోరాడి వాటిని ఓడించి సహకార రంగాన్ని, ఆ రంగం రగిలించిన స్ఫూర్తిని కాపాడుకొని, సహకార రంగ విస్తరణకు పూనుకోవడమే దీనికి ప్రత్యామ్నాయం.
/ వ్యాసకర్త సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు/
పి.అజయ కుమార్