
సామాజిక కార్యకర్త గౌతమ్ నవలఖను జైలు నుంచి గృహనిర్బంధానికి అనుమతిస్తూ భారత సర్వోన్నత న్యాయస్థానం గురువారం వెలువరించిన ఉత్తర్వులు ఆహ్వానించదగినవి. మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ భీమా కోరేగావ్ కేసులో ఉపా చట్టం కింద నవలఖ అభియోగాలు ఎదుర్కొంటున్న సంగతి విదితమే. ఈ కేసు విచారణ సందర్భంగా వృద్ధాప్య సమస్యలతో, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నవలఖ లాంటివారు దేశాన్ని ధ్వంసం చేయాలని కోరుకుంటున్నారని, వారి సిద్ధాంతం కూడా అదేనని కేంద్ర ప్రభుత్వం వాదించింది. నవలఖను జైలు నుంచి ఇంటికి పంపేందుకు అభ్యంతరం తెలిపింది. జస్టిస్ జోసెఫ్, జస్టిస్ హృశికేష్ రారు నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర వాదనపై తీవ్రంగా స్పందించింది. 'దేశాన్ని ధ్వంసం చేస్తున్నదెవరో మీకు చెప్పమంటారా? అవినీతిలో మునిగితేలుతున్నవారే విధ్వంసకారులు...మీరు ఏ కార్యాలయానికైనా వెళ్లండి. అవినీతి తాండవం చేస్తుంటుంది.' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మతతత్వ చిచ్చు రాజేస్తూ అవాస్తవాలతో ప్రజల దృష్టి మరల్చి కార్పొరేట్ కంపెనీలకు దేశ సంపదను దోచిపెడుతూ..ఎన్నికల బాండ్లతో వారు కుమ్మరించే రూ.కోట్లతో ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కూల్చివేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న సర్కార్‌కు లాగి లెంపకాయలు వేసినట్లు అయింది. దేశ విధ్వంసకారులెవరో ధర్మాసనం తేల్చిచెప్పినట్టే కదా !
మూఢత్వం నుంచి ప్రజలను జాగృతపర్చే హేతువాదులు, ఆదివాసీల మనుగడ కోసం పోరుసల్పే సామాజిక కార్యకర్తలు, మానవ హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమించే హక్కుల కార్యకర్తలు ..వీరంతా పాలకుల దృష్టిలో అర్బన్ నకల్స్. అంతకు మించి ఈ దేశాన్ని ధ్వంసం చేస్తున్న దేశద్రోహులు. గౌరీ లంకేష్, గోవింద్ పన్సారే, నరేంద్ర దభోల్కర్, కల్బుర్గి వంటివారిని సంఫ్‌ు పరివార్ మూకలు ఈ పేరిటే పొట్టనపెట్టుకున్నారు. స్టాన్‌స్వామి లాంటి వయోధిక సంఘ సేవకులను విచారణ పేరిట జైళ్లలో నిర్బంధించి కనీసం మంచినీళ్లు తాగేందుకు కూడా అనుమతించకుండా ప్రాణాలు తీసేంత క్రూరత్వం చాటుకుందీ సర్కారు. ప్రొఫెసర్ సాయిబాబా విషయంలోనూ ఇంతే క్రూరత్వాన్ని ప్రదర్శించింది. 90 శాతం అంగవైకల్యంతో చక్రాల కుర్చీకే పరిమితమైన ఆయనను ఉగ్రవాదులను ఉంచే అండాకార కారాగారంలో బంధించి కసితీరా కక్షతీర్చుకుంది. ప్రజల్లో ప్రగతిశీల, అభ్యుదయ, ఆధునిక భావాలను రేకెత్తించే వారే ప్రభుత్వానికి ప్రధాన శత్రువులు. నేల మొదలు నింగి వరకు సమస్తం ప్రయివేటీకరిస్తూ, లాభదాయక ప్రభుత్వ సంస్థలను తెగనమ్మతూ ప్రజల సంపదనంతా ఏ కార్పొరేట్లకు అయితే దోచిపెడుతున్నారో..ఆ అవినీతి రారాజులే మోడీ సర్కార్ దృష్టిలో దేశభక్తులు. వీరు కుమ్మరించే ఎన్నికల బాండ్ల సొమ్ముతో పట్టపగలు సంతలో పశువులును కొన్న చందాన ప్రజా ప్రతినిధులను కొనేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న వైనాన్ని చూస్తున్నాం. రూ.లక్షల కోట్ల రుణాలు ఎగవేసి ప్రభుత్వ బ్యాంకుల్ని నిండా ముంచేసిన కార్పొరేట్ అధిపతులు నీరవ్ మోడీ, విజరు మాల్యా విదేశాల్లో విలాసాల్లో మునిగితేలుతున్నారంటే అది ప్రభుత్వ చలువే.
భారత సైన్యంలో రాఫెల్ యుద్ధ విమానాలు మొదలుకొని నిన్నటి గుజరాత్‌లోని మోర్బిలో 100 మంది పైగా ప్రాణాలను బలిగొన్న తీగల వంతెన మరమ్మతుల కాంట్రాక్టు వరకు ..అన్నింటా అవినీతి మరకలే. బిజెపి ఏలుబడిలోని కర్ణాటకలో '30 పర్సెంట్ సిఎం' బాగోతం, ఉత్తరప్రదేశ్‌లో నియామకాల కుంభకోణం, ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర నాయకులమంటూ కోట్లు దండుకుంటున్న నేతలు..మొన్న మహారాష్ట్ర, నిన్న ఢిల్లీ, ఇప్పుడు తెలంగాణ ప్రజాప్రతినిధల కొనుగోళ్ల కోసం కోట్ల కుమ్మరింత..దేశంలో అవినీతి రాజ్యమేలుతోందని చెప్పడానికి ఇంతకంటే ఏమి కావాలి? ప్రజల సంపదనంతా దొడ్డిదారిన దోచుకుంటూ కార్పొరేట్ గుత్తాధిపత్య రాజ్యంగా మారుతున్న దేశంలో అసలు విధ్వంసకారులు వీరిని మించిన వారు ఎవరు? అవినీతిపరులకు స్వేచ్ఛ కల్పించి హక్కుల కార్యకర్తలను నిర్బంధిస్తున్న మోడీ సర్కార్ వంచనను అడుగడుగునా నిలదీయాలి. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగం భారత పౌరులకు ప్రసాదించిన హక్కులను కాపాడుకోవాలి.