
నాణ్యమైన విద్య, ప్రపంచస్థాయి విద్యార్థి, సబ్జెక్ట్ ఆధారిత బోధన... సంస్కరణల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు ఒనగూడే ప్రయోజనాలని ప్రభుత్వం చెబుతున్నది. కాని ఆచరణలో ఉపాధ్యాయుల సంఖ్య కుదింపు, పాఠశాలల విలీనం, భవిష్యత్ ఉద్యోగాలకు ప్రశ్నార్ధకంగా మారబోతున్నది. మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్న పాఠశాల విద్యార్థులకు సబ్జెక్ట్ ఆధారిత బోధన...అదే మూడవ తరగతి విద్యార్థి ప్రాథమికోన్నత పాఠశాలలో వుంటే ఎస్‌జిటిల ద్వారా బోధన. దీనిని ఎలా అర్ధం చేసుకోవాలి. నాణ్యమైన విద్య లక్ష్యమైతే ఏ పాఠశాలలో చదువుతున్న మూడవ తరగతి విద్యార్ధికైనా సబ్జెక్ట్ ఆధారిత బోధన ఉండాలి కదా ?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న సంస్కరణల వల్ల విద్యా వ్యవస్థ వేగంగా మారిపోతోందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి స్వయంగా పలుమార్లు సమీక్షిం చడం, నాడు-నేడు, అమ్మ ఒడి, విద్యా దీవెన, జగనన్న కిట్...లాంటి పథకాలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు చెబుతున్నారు. కాని, ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి కారణాలు ఎవరూ చెప్పడం లేదు.
'నూతన జాతీయ విద్యా విధానం-2020' పేరుతో ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరు రకాల పాఠశాలల వ్యవస్థను తెచ్చారు.ప్రాథమిక పాఠశాలలను విభజించి 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడం పట్ల తల్లిదండ్రుల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. విభజన జరిగిన ప్రాథమిక పాఠశాలల్లో మిగిలిన 1,2 తరగతుల విద్యార్థులు బడికి దూరమై ఆ పాఠశాలలు మూతపడనున్నాయి.
నాణ్యమైన విద్య, ప్రపంచ స్థాయి విద్యార్థి, సబ్జెక్ట్ ఆధారిత బోధన...సంస్కరణల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్ధులకు ఒనగూడే ప్రయోజనాలని ప్రభుత్వం చెబుతున్నది. కాని ఆచరణలో ఉపాధ్యాయుల సంఖ్య కుదింపు, పాఠశాలల విలీనం, భవిష్యత్ ఉద్యోగాలకు ప్రశ్నార్ధకంగా మారబోతున్నది. మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్న పాఠశాల విద్యార్థులకు సబ్జెక్ట్ ఆధారిత బోధన. అదే మూడవ తరగతి విద్యార్థి ప్రాథమికోన్నత పాఠశాలలో వుంటే ఎస్‌జిటిల ద్వారా బోధన. దీనిని ఎలా అర్ధం చేసుకోవాలి. నాణ్యమైన విద్య లక్ష్యమైతే ఏ పాఠశాలలో చదువుతున్న మూడవ తరగతి విద్యార్థికైనా సబ్జెక్ట్ ఆధారిత బోధన ఉండాలి కదా ?
నెల్లూరు జిల్లాలో నాలుగు వందలకు పైగా పాఠశాలలు విలీనం జరగగా అందులో 96 ప్రాథమిక పాఠశాలల్లో 1, 2 తరగతుల విద్యార్థులు ఐదుగురు కంటే తక్కువ ఉన్నారు. అంటే నాల్గవ వంతు పాఠశాలల్లో ఐదు కంటే తక్కువగా విద్యార్థులు ఉంటే అవి ఎలా నడుస్తాయో విద్యా శాఖ చెప్పాలి.
'ఒక్క పాఠశాల కూడా మూత వేయం' అంటూ ప్రకటనలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వ చర్యలు ప్రాథమిక పాఠశాలలు సహజ మరణం చెందేలా ఉన్నాయి.
ఎంత పెద్ద మార్పులైనా ఎవరితో చర్చించరు. ఏకపక్షంగా నిర్ణయిస్తారు. అడిగితే ప్రభుత్వ పాలసీ ప్రశ్నించరాదని అంటారు. పిడిఎఫ్ ఎమ్మెల్సీల బస్సు యాత్ర క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలను బహిర్గతం చేసింది. విద్యాశాఖ అధికారులు, పాలకులు వాస్తవాలను గుర్తించే పరిస్థితుల్లో లేరు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామని, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేస్తామని, ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్‌సి విధానం, బైజూస్ ద్వారా ఆన్‌లైన్‌లో విద్య అంటూ ముందుకు వెళుతున్నారు.
కానీ విద్యార్థులకు బోధన చేయాల్సిన ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయడం లేదు. పైగా ఉన్న పోస్టులు రద్దు చేస్తున్నారు.
ఉపాధ్యాయులకు బోధన కంటే ఇతర పనులు ఎక్కువ అయ్యాయి. శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి చెందే కొలదీ బోధన సులభతరం కావాలి. సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగైన, నాణ్యమైన బోధన చేసేలా చర్యలు ఉండాలి.
కానీ మన ప్రభుత్వ సాంకేతికత యాప్ లకే పరిమితం అయింది. బోధన కంటే బోధనేతర పనులకు ప్రాధాన్యత ఇస్తున్నది. ఉపాధ్యాయులు సుమారు 14 రకాల యాప్‌లతో సతమతం అవుతుండడంతో బోధనా సమయం అంతా వృధా అవుతోంది.
ఇటీవల ప్రవేశపెట్టిన ఫేషియల్ యాప్ ను ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకించారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేదు. అయినా విద్యాశాఖ యాప్‌ల తోనే పాలన సాగిస్తోంది. మొత్తం యాప్‌లు రద్దు చేసే వరకు పోరాడాల్సిన అవసరం ఉంది.
మరోవైపు 117 జీఓ ద్వారా వేలాది పోస్టులు రద్దు అయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 8343 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. విలీనంతో ఇంకా పెరగనున్నాయి. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తగ్గిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. కరోనా కాలంలో ఆన్‌లైన్ చదువులు ముందుకు తెచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన ఫలితాలు సర్వేలు ఏం చెబుతున్నాయి? ఆన్‌లైన్ విధానం వల్ల విద్యార్థులలో విపరీతమైన ప్రవర్తనా పరమైన ఇబ్బందులు తలెత్తుతాయని, ఉపాధ్యాయులతోనే బోధన ఉండాలని, తల్లిదండ్రులు ముక్తకంఠంతో చెబుతున్నారు. ఆన్‌లైన్ విద్య ఉపాధ్యాయునికి ప్రత్యామ్నాయం కాదని అనేక సర్వేలు చెబుతున్నాయి. మన రాష్ట్రంలో బైజూస్‌తో గొప్ప మార్పులు తెస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. తల్లిదండ్రుల నుండి, ఉపాధ్యాయుల నుండి వ్యతిరేకత వస్తున్నా ప్రభుత్వం ఎందుకు? ఎవరి కోసం? ముందుకు వెళుతోంది !
సంస్కరణలు అభివృద్ధికా...? విద్యారంగ బడ్జెట్ మిగుల్చుకోవడానికా...? అనే అనుమానం కలుగుతుంది. ప్రభుత్వ వైఖరి, ప్రస్తుత పరిణామాలు గమనిస్తే బడ్జెట్ మిగుల్చుకోవడానికే విద్యారంగ సంస్కరణలు వున్నాయి తప్ప నాణ్యమైన విద్య అందించటం లక్ష్యంగా లేదు.
విద్యా వ్యవస్థలో ఏ మార్పులు తేవాలన్నా వాటిని అమలు చేయాల్సింది ఉపాధ్యాయులు. మరి ఉపాధ్యాయులతో సంఘాలతో, విద్యావేత్తలతో ఎందుకు చర్చించరు ?
పాలసీ విషయాలు అయితే ఎవరు ప్రశ్నించకూడదా! విద్యారంగ అభివృద్ధికి ఉపయోగపడే సంస్కరణలు అయితే అందరితో ప్రజాస్వామికంగా చర్చించి నిర్ణయాలు చేయవచ్చు కదా.
ఎక్కడో నిర్ణయించి ఇక్కడ అమలు చేస్తున్నట్లుగా ఉంది. ఒకటి స్పష్టంగా కనబడుతోంది. పాఠశాలల సంఖ్య తగ్గింపు, టీచర్ పోస్టుల కుదింపు, బడ్జెట్ మిగుల్చుకోవడం ఇవన్నీ ఆలోచించి ఈ నిర్ణయాలు అమలు చేస్తున్నట్లు ఉంది.
నీతి ఆయోగ్, ప్రపంచబ్యాంకు ఇప్పటికే ఇలాంటి సలహాలు ఇచ్చాయి. కొత్తగా 'సాల్ట్ ఒప్పందం' కూడా అమలు లోకి వచ్చింది. అభివృద్ధి పేరుతో ప్రపంచ బ్యాంకు సంస్కరణలు అమలు చేయడానికే మొగ్గు చూపుతోంది.
విద్యారంగంలో మార్పులు సంస్కరణలు రాజ్యాంగ లక్ష్యాలను నెరవేర్చే దిశగా, అందరికీ విద్య అందించే విధంగా ఉండాలి. కానీ ఆంధ్రప్రదేశ్ సంస్కరణలు విద్యా రంగాన్ని మార్కెట్ దిశగా వెళుతున్నాయి.
ఈ రూపంలో జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ ప్రమాదకర ధోరణులను ప్రజాస్వామిక శక్తులు, విద్యారంగ ప్రముఖులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదుర్కోవాలి.
ప్రభుత్వం వెంటనే ప్రాథమిక పాఠశాలలను విడదీయడం విరమించుకోవాలి. ప్రతి పంచాయతీలో మంచి బడిని ఏర్పాటు చేయాలి. ప్రతి తరగతికి ఒక టీచరు ఇవ్వాలి. అందరికీ బడి అందుబాటులో ఉండాలి. సమాంతరంగా తెలుగు, ఇంగ్లీష్ మీడియం కొనసాగించాలి. ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు తొలగించాలి.
/ వ్యాసకర్త : యుటిఎఫ్ రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి /
పి. బాబురెడ్డి