
పేద, దిగువ మధ్యతరగతి ప్రజలు బ్యాంకు ద్వారా అప్పు పొందాలంటే ఎన్నో నింబంధనలు. అనేక ఆధారాలు చూపాలి. బ్యాంకులు అడిగిన వాటిని తీసుకురాలేని వారికి అప్పు ఇచ్చే అవకాశమే లేదు. వారంతా ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గరకు వెళ్లాల్సి వస్తుంది. బ్యాంకింగ్ వ్యవస్థను బలహీనం చేయాలనే సరళీకరణ విధానాల వల్ల చిన్న, చిన్న మొత్తాలు బ్యాంకుల్లో ఇచ్చే పరిస్థితి లేదు. లక్షలు, కోట్లు అప్పు తీసుకునే 'విలువైన వినియోగదారుల' సేవలో బ్యాంకులు తరిస్తున్నాయి. ఇలాంటి అప్పులు తీసుకున్న వారు వాటిని చెల్లించకుండా ఎలా దేశాలు దాటిపోతున్నారో, ఎలా ప్రపంచ కోటీశ్వరులు అవుతున్నారో చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో అత్యధికమంది వినియోగదారుల అవసరాలను సొమ్ము చేసుకునేందుకు ఈ రుణయాప్‌లు అందుబాటులోకి వచ్చాయి.
'అప్పు అంటే ముప్పే' అన్న మాట రుణ యాప్‌ల దారుణాలు చూస్తుంటే అక్షర సత్యమనిపిస్తుంది. పేద, మధ్యతరగతి ప్రజల అవసరాలను అవకాశంగా తీసుకొని ఫోన్ల ద్వారా అప్పులు ఇచ్చేందుకు నెట్‌లో వందల సంఖ్యలో రుణయాప్‌లు వున్నాయి. ఈ యాప్‌లు అప్పు తీసుకునే వారి కోసం మొదట వేట ప్రారంభిస్తాయి. ఆ వేటలో చిక్కిన రుణగ్రహీతలను దారుణంగా వేధించి వసూళ్ళు చేస్తాయి. ఈ ఒత్తిళ్ళను తట్టుకోలేని వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మన రాష్ట్రంలో గత రెండు నెలల్లో పది మందికి పైగా రుణ యాప్ బాధితులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ రుణయాప్‌ల గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రిజర్వు బ్యాంకు ఈ నెలలోనే మూడు, నాలుగు సార్లు హెచ్చరికలు, విధాన నిర్ణయాలు చేశాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా వుందో అర్థమవుతుంది.
నిత్యావసరాలు, అత్యవసరాలకు డబ్బు అవసరం అవుతుంది. ఆ డబ్బు మానసిక, శారీరక శ్రమలు చేయడం ద్వారానైనా రావాలి. లేదా ఆ శ్రమలు చేసిన వారిని దోచుకోవడం ద్వారానైనా రావాలి. ఈ వ్యవస్థలో అత్యధికులు శ్రమ చేయడం, అతి కొద్దిమంది శ్రమను దోచుకోవడం జరుగుతుంది. అందువల్ల ఉత్పత్తి, అందుకు అవసరమైన శ్రమ ఈ వ్యవస్థను నడపడంలో అత్యంత ముఖ్యమైన అంశాలు. యంత్ర విజ్ఞానాన్ని అన్ని రంగాల్లో వినియోగించడం వల్ల శ్రమ తేలిక కావాలి. శ్రమ జీవికి విశ్రాంతి కలగాలి. కాని పని చేయగలిగిన వారందరికి పనులు దొరకని పరిస్థితి ఏర్పడడమే ఈ వ్యవస్థ బలహీనతలన్నింటికీ మూలం. ఉన్న కొద్దిపాటి పనులకు పోటీ పెరుగుతుంది. దీన్ని అవకాశంగా తీసుకున్న యజమానులు వేతనాలు తగ్గిస్తారు. ఇది చివరకు నిత్యావసరమైన వాటిని కూడా కొనలేని స్థితికి ప్రజలను దిగజారుస్తుంది. కోవిడ్ సంక్షోభ సమయంలో చేసిన అప్పుల భారం, పనులు తగ్గడం శ్రమజీవుల జీవనాన్ని మరింత వేగంగా దిగజార్చింది. ఈ ప్రత్యేక పరిస్థితుల్లో పేదలందరికీ నెలకు రూ.7,500 ఇవ్వాలనే కనీస డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. అందువల్ల గతంలో చేసే అప్పులకు తోడు కోవిడ్ తర్వాత పేద, దిగువ మధ్యతరగతి ప్రజలు రోజువారీ అవసరాలకు కూడా అప్పులు చేయాల్సి వచ్చింది.
వీటికి తోడు బిజెపి పాలనా కాలంలో వేగంగా అమలవుతున్న సరళీకరణ విధానాలు ఒకవైపు ఉపాధిని తగ్గించి, మరోవైపు ధరల భారాన్ని పెంచాయి. వీటికితోడు వస్తు వ్యామోహాన్ని విపరీతంగా పెంచేస్తున్నారు. తమ ఆర్థిక పరిస్థితితో సంబంధంలేని జీవనాన్ని ఈ ఆర్థిక విధానాలు అలవాటు చేస్తున్నాయి. అత్యధిక మందిని ఆధునిక జీవన ఆశల ఊహల్లో పోటీ పడేటట్లు, భౌతిక జీవనాన్ని మధ్యయుగాల నాటి మూఢనమ్మకాలు, విశ్వాసాల్లో నిలిచేటట్లు పాలక వర్గాలు ఉద్దేశ్యపూర్వకంగానే చేస్తున్నాయి. ఈ సరళీకరణ విధానాల కత్తికి రెండు పక్కలా పదును వుంది. ఒకవైపు కార్పొరేట్ కంపెనీల సరుకులను ఎగబడి కొనేటట్లు చేయడం, మరోవైపు మతతత్వ శక్తుల భావజాలాన్ని ఆచరించేటట్లు చూడడం. అందుకే ఈ విధానాలను అన్ని వైపుల నుండి పాలక పార్టీలు ప్రోత్సహిస్తున్నాయి. విచిత్రమేమిటంటే ఎవరైతే ఉపాధి తగ్గించి, వేతనాలు తగ్గించి ప్రజల కష్టాలకు కారణమవుతున్నారో వారే తమ సరుకులను అమ్ముకోవడానికి, కొనుగోలుదార్లను ఆకర్షించడానికి తీవ్రంగా పోటీ పడుతున్నారు. సీరియళ్లు, సినిమాలు, మీడియా ప్రకటనలు, హోర్డింగులు, అందమైన షాపింగ్ మాల్స్, ఆకర్షణీయమైన రాయితీలతో పాటు రుణ సదుపాయాలు ఇచ్చి కృత్రిమ కొనుగోలు పెంచి సరుకులు అమ్ముకోవాలని చూస్తున్నారు.
అప్పుల ఊబిలో...
పని వల్ల ఆదాయం, ఆదాయం వల్ల సరుకులు కొనడం కాకుండా, అప్పుల వల్ల కృత్రిమ ఆదాయం, ఆ ఆదాయం వల్ల కొనుగోలు పెంచడం అనే పద్ధతి నేడు పెద్దఎత్తున విస్తరించింది. ఈ అప్పులు ఇచ్చే పద్ధతి అనేక మార్పులు చెందుతూ విస్తరిస్తున్నది. మొదట, ఇళ్ల దగ్గరకు వాహనాల్లో సరుకులు తెచ్చి ముందు సరుకు ఇచ్చి తర్వాత కంతుల వారీగా వసూళ్లు చేసే చిన్న, చిన్న వ్యాపారాలతో ప్రారంభమైంది. తర్వాత పేద, దిగువ మధ్యతరగతి లక్ష్యంగా కంతులు కట్టడానికి, ఇతర అవసరాలకు నేరుగా నివాస ప్రాంతాల్లో డబ్బులు అప్పు ఇచ్చి...రోజు, వారం, నెల వారీగా వసూలు చేసుకోవడం జరిగింది. మధ్యతరగతిని లక్ష్యంగా చేసుకొని పెద్దపెద్ద షాపుల దగ్గరే అప్పులు ఇచ్చే ఫైనాన్స్ (బజాజ్ ఫైనాన్స్ లాంటివి) సంస్థలు వుండి అక్కడ కొనే సరుకుకు అక్కడే అప్పు ఇచ్చే పద్ధతి వచ్చింది. ఇప్పుడు చిన్న, మధ్యతరహా షాపుల దగ్గర కూడా ఈ రుణ సదుపాయం అందుబాటులో వుంచారు. ప్రస్తుత రుణ యాప్‌లు పేద, దిగువ, ఎగువ మధ్యతరగతి వర్గాలన్నింటినీ లక్ష్యంగా చేసుకొని తక్షణ అవసరాలకు అప్పు ఇస్తున్నాయి. ఇందులో అప్పు తీసుకునే వారు, ఇచ్చేవారు ఒకరికొకరు కనిపించకుండానే నిమిషాల్లో ఫోన్ ద్వారా అప్పులు ఇచ్చే విధానం వచ్చింది. ఈ రుణ యాప్‌ల ద్వారా సంవత్సరానికి ఫైనాన్స్ రూపంలో, సరుకుల అమ్మకం రూపంలో వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నది.
పెరుగుతున్న ఒత్తిళ్ళు, ఆత్మహత్యలు
రుణ యాప్‌ల్లో అప్పులు తీసుకొని ఆ సంస్థల వేధింపులు తట్టుకోలేక ఇటీవల రాష్ట్రంలో అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలను పరిశీలిస్తే రుణ యాప్ బాధితుల్లో అన్ని వర్గాల వారు వున్నట్లు తెలుస్తుంది. ఇవి కనిపించే చావులు. కనిపించని వేధింపులు, అవమానాలు, మానసిక ఒత్తిళ్ళకు గురవుతున్న వారు లక్షల సంఖ్యలో వుంటున్నారు.
రుణ యాప్‌ల దారుణాలు
అప్పులు చేసినంత మాత్రాన ఇంతగా కుంగిపోవలసింది, ఆత్మహత్యలు చేసుకోవలసింది ఏముంది? అనేది సహజంగా వచ్చే అనుమానం. ఈ రుణయాప్‌ల నిర్వహణ తీరుతెన్నులు చూస్తే ఆశ్చర్యపోతాం. ఈ యాప్‌ల్లో తీసుకునే అప్పుల్లో అత్యధిక భాగం చిన్న చిన్న మొత్తాలు. వీటి చెల్లింపు కూడా తక్కువ సమయంలోనే చేయాల్సి వుంటుంది. రుణం ఇచ్చేటప్పుడే వడ్డీ మొత్తం మినహాయించుకొని ఇస్తున్నారు. ఉదాహరణకు రూ.7 వేలు అప్పు తీసుకుంటే రూ.1,200 మినహాయించుకొని రూ.5,800 ఇస్తారు. చెల్లించేటప్పుడు మాత్రం రూ.7 వేలు కట్టాలి. నిర్ణయించిన సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అపరాధ రుసుం వేస్తారు. తీసుకునే మొత్తంపై 15 నుండి 25 ప్రాసెసింగ్ చార్జీలు, 30 నుండి 200 శాతం వడ్డీ వసూలు చేస్తున్నాయి. కొన్ని యాప్‌లు 2 వేల శాతం వడ్డీ వసూలు చేస్తున్నాయి. అప్పు సకాలంలో చెల్లించకపోతే వ్యక్తి ఫోన్ నెంబర్ ఆధారంగా అతడి మిత్రుల వాట్సప్ డీపీ నుంచి ఫోటోలు సేకరిస్తున్నారు. వాటిని నగచిత్రాలుగా మార్ఫింగ్ చేసి గ్రూపుల్లో పెడతారు. హైద్రాబాద్‌లో ఒక యువతి రూ. రెండు లక్షలు అప్పు తీసుకొని చెల్లించడంలో ఆలస్యం కావడంతో, ఆమె ఫోన్ నెంబర్‌ను 500 మంది యువకులకు ఇచ్చి అసభ్యంగా మాట్లాడేలా చేశారని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మలక్‌పేటలో ఒక యువకుడు రూ.1.5 లక్షల అప్పు చెల్లించకపోవడంతో అతడు మరణించినట్లు శవానికి దండ వేసిన మార్ఫింగ్ ఫోటోను కుటుంబ సభ్యులు, మిత్రుల ఫోన్ నెంబర్లకు వాట్సప్ ద్వారా పంపారు. అనంతపురం నగర కార్పొరేషన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగి రూ.2,500 అప్పు తీసుకొని చెల్లించడంలో ఆలస్యమైంది. ఆయన ఫోటో మీద అసభ్యంగా రాసి మిత్రులకు పంపారు. అప్పు తీసుకున్న మిత్రుల ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి అవమానపరుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఒకరికి ఇలాంటి ఫోన్ వచ్చిన విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు.
బ్యాంకింగ్ వ్యవస్థ బలహీనతలు- రుణయాప్‌ల బలాలు
పేద, దిగువ మధ్యతరగతి ప్రజలు బ్యాంకు ద్వారా అప్పు పొందాలంటే ఎన్నో నింబంధనలు, అనేక ఆధారాలు చూపాలి. జామీన్లు పెట్టాలి. షరతులు అంగీకరించాలి. ఇన్ని చేస్తే అప్పు సకాలంలో ఇస్తారనే గ్యారంటీ ఏమీ లేదు. బ్యాంకులు అడిగిన వాటిని తీసుకురాలేని వారికి అప్పు ఇచ్చే అవకాశమే లేదు. వారంతా ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గరకు వెళ్లాల్సి వస్తుంది. బ్యాంకింగ్ వ్యవస్థను బలహీనం చేయాలనే సరళీకరణ విధానాల వల్ల చిన్న, చిన్న మొత్తాలు బ్యాంకుల్లో ఇచ్చే పరిస్థితి లేదు. లక్షలు, కోట్లు అప్పు తీసుకునే 'విలువైన వినియోగదారుల' సేవలో బ్యాంకులు తరిస్తున్నాయి. ఇలాంటి అప్పులు తీసుకున్న వారు వాటిని చెల్లించకుండా ఎలా దేశాలు దాటిపోతున్నారో, ఎలా ప్రపంచ కోటీశ్వరులు అవుతున్నారో చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో అత్యధికమంది వినియోగదారుల అవసరాలను సొమ్ము చేసుకునేందుకు ఈ రుణయాప్‌లు అందుబాటు లోకి వచ్చాయి.
వేల కోట్ల వ్యాపారం
క్యాష్‌బీన్, క్యాష్ బోయింగ్, మినిట్ క్యాష్, ఈజీ లోన్, లక్కీ రూపీ, ఇన్ఫినిట్ క్యాష్, రూపీ కింగ్, ఓకే, క్యాష్ అడ్వాన్స్...ఇలా రకరకాల పేర్లతో రుణయాప్‌లు గూగుల్‌లో వున్నాయి. గూగుల్ ప్లే స్టోర్‌లో 600కు పైగా ఇన్‌స్టంట్ లోన్ యాప్‌లు వున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా మన దేశంలో ఈ రుణయాప్‌లు వున్నట్లు అంచనా వేస్తున్నారు. సుమారు 1110కి పైగా రుణ యాప్‌లు వున్నట్లు ఇందులో 600 ఎలాంటి లైసెన్స్‌లు లేకుండా ఆర్థిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రిజర్వు బ్యాంక్ రెండు సంవత్సరాల క్రితమే ప్రకటించింది. ఈ వ్యవహారాలపై 2012 జనవరి 13న ఒక కమిటీని నియమించింది. గత నెలలో 27 యాప్‌లను కేంద్రప్రభుత్వం బ్లాక్ చేసింది. మరో 137 ను అనుమానాస్పదమైనవిగా ఆర్.బి.ఐ ప్రకటించింది. ఒక్క సంవత్సరంలోనే రూ.12 వేల కోట్ల వ్యాపారం ఈ రుణయాప్‌ల ద్వారా జరిగినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అంచనా వేసింది. అక్రమంగా సంపాదించిన ఈ డబ్బును యాప్ నిర్వాహకులు విదేశాలకు తరలించేస్తున్నారని ఇ.డి అనుమానించింది. ఈ జులైలో కొన్ని యాప్‌లకు చెందిన రూ. 86 కోట్లను ఫ్రీజ్ చేసింది. ఇప్పటి వరకు రూ.1569 కోట్ల ఆస్థి అటాచ్ చేసింది. అయినా వీటి నిర్వహణ ఆగడంలేదు. దీనంతటికి ''గూగుల్‌దే తప్పు'' అని సేవ్ ఇండియా ఫౌండేషన్ డైరెక్టర్ ప్రవీణ్ కలైసెల్వన్ అంటున్నారు. ఈ ఫౌండేషన్ రుణ యాప్‌ల బాధితుల కోసం హెల్ప్‌లైన్ నిర్వహిస్తుంది. 2021లో ఈ హైల్ప్‌లైన్‌ను 49 వేల మంది సంప్రదిస్తే, ఈ సంవత్సరం జూన్ నాటికే 70 వేల మంది సంప్రదించారట.
విధానాల్లో మార్పు రావాలి
ఈ రుణ యాప్‌లు ఇంత వికృతంగా వుండడానికి కారణమైన సరళీకరణ విధానాలు మారాలి. ఉపాధి లేని, ఉపాధి తొలగించే కార్పొరేట్ అభివృద్ధి నీటి బుడగ లాంటిదే. ప్రభుత్వ రంగాన్ని బలహీనం చేసి, ప్రైవేట్ దోపిడీకి శ్రమజీవులను బలి ఇస్తూ, అంతులేని వినిమయదారీ తత్వాన్ని పెంచి పోషించి లాభపడాలనే వినాశకర విధానాలను మార్చాలి. ఈ విధానాల చాటున మతతత్వ ఎజెండాను అమలు చేస్తున్న బిజెపి ని ప్రజల్లో ఒంటరిపాటు చేయాలి. రుణ యాప్‌ల బారిన పడకుండా తక్షణం ప్రజలను చైతన్యం చేయడం, దీర్ఘకాలంలో విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించడం చేయాలి.
/ వ్యాసకర్త : సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు /
వి. రాంభూపాల్