వడమాలపేట (చిత్తూరు) : పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఉపాధ్యాయుడు మృతి చెందిన సంఘటన వడమాల పేట మండలం వేమాపురం వద్ద శుక్రవారం రాత్రి జరిగింది. శనివారం రేణిగుంట రైల్వే ఎస్సై రవి తెలిపిన వివరాల మేరకు ... వడమాల పేట మండలం తిరుమండ్యం గ్రామానికి చెందిన బాలకృష్ణ (44) పుత్తూరు మండలంలోని తడుకు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. నిన్న సాయంత్రం సొంత పనుల కోసం వడమాలపేటకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా వేమాపురం రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వర్షపు నీరు నిలిచిపోవడంతో రైలు పట్టాలను దాటుతుండగా రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. రేణిగుంట రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.










