Aug 15,2023 07:17

మనస్మృతి ప్రస్తావన లేదు కాబట్టి రాజ్యాంగం మెజారిటీ మతస్తులైన హిందువులకు ఆమోదయోగ్యం కాదని ప్రకటించింది. ఇప్పుడు అనేక కారణాల రీత్యా బలం పుంజుకున్న ఆర్‌ఎస్‌ఎస్‌ హిందుత్వ ఫాసిస్ట్‌ శక్తులు తాము 70ఏండ్ల క్రితం చెప్పిన మాటలను నిజం చేయబూనుకుంటున్నాయి. ప్రముఖ చరిత్ర విశ్లేషకులు ప్రొఫెసర్‌ ఐజాజ్‌ అహ్మద్‌ చెప్పినట్లు ''వీరు రాజకీయ వ్యవస్థని, రాజ్యాంగాన్ని, లోపల నుంచి తొలుచుకుంటూ వస్తున్నారు.''

             అది తెలుసుకోవడం అసాధ్యం కాదు. కానీ ప్రస్తుత పరిస్థితులలో చాలా కష్టం. కారణం గత పది సంవత్సరాలుగా అధికారం వెలగబెడుతున్న బిజెపి సర్కార్‌ అబద్దాలతో, అసత్యాలతో, ఉద్వేగాలతో, విద్వేషాలతో తప్పుడు సమాచారంతో దేశాన్ని మొరటుగా వందల సంవత్సరాల వెనక్కి నడిపిస్తున్నది. స్వాతంత్య్ర ఉద్యమం వెలికి తీసిన సమస్యల పరిష్కారానికి, స్వాతంత్య్రానంతరం జరుగుతున్న (అందులో అనేక లోపాలున్నప్పటికీ) ప్రయత్నాలు అన్నింటిని అడ్డం కొట్టి దేశాన్ని పచ్చి మితవాద ఫాసిస్టు తరహా పరిష్కారాల వైపు లాగేస్తున్నది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, దానికి ప్రాణవాయువు అందించే లౌకికతత్వం జవసత్వాలనిచ్చే సామాజిక న్యాయంపై ఈ మనువాదులు ముప్పేట దాడికి దిగారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి, భారత రాజ్యాంగంలో పొందుపరచిన వ్యవస్థలన్నింటినీ హిందుత్వ శక్తులు తొలిచేస్తున్నాయి.
 

                                                                            తిరోగమనం దిశగా ...

60 సంవత్సరాలు బిజెపి యేతర బూర్జువా పార్టీల ప్రభుత్వాలు దేశానికి చేసిన నష్టానికి పదింతలు నష్టం ఈ తొమ్మిదేళ్ల బిజెపి పాలనలో జరిగింది. దీని నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం దానికి తెలిసినంతగా మరే ఇతర పాలక పార్టీకి తెలియదు. అది ఒక ఫాసిస్టు కళ. అధికారంలోకి రాగానే ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసింది. దాని స్థానంలో నీతి ఆయోగ్‌ని కూర్చోబెట్టారు. జాతీయ గణాంకాల కమిషన్‌ (ఎన్‌ఎస్‌సి) రూపొందించిన గణాంకాలను తారుమారు చేస్తున్నదని ఆ సంస్థ చైర్మన్‌, ఇతర సభ్యులు 2019లో రాజీనామా చేశారు. ఈ సంస్థ క్రమానుగతంగా చేసే శ్రామికశక్తి సర్వే-2018ని నిరుద్యోగం పెరుగుతుందని చూపించినందుకు నిలిపివేశారు. తాజాగా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌) ద్వారా ఆరోగ్య శాఖకి సమాచారం అందిస్తున్న ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ పాపులేషన్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌గా ఉన్న కె.ఎస్‌. జేమ్స్‌ను పదవి నుండి తొలగించారు. కారణం ఆ సంస్థ 2019-21 మధ్య మోడీ ప్రభుత్వం బహిరంగ మలవిసర్జన జరిగే గ్రామాలు లేవని చేసిన ప్రకటనను తప్పుపడుతూ ఇప్పటికీ 19శాతం గ్రామాలకు మరుగుదొడ్ల సౌకర్యంలేదని ప్రకటించింది. అలాగే గ్రామీణ కుటుంబాలలో రక్తహీనత పెరిగిందని, 57శాతం కుటుంబాలకి ఎల్పీజి గ్యాస్‌ అందడం లేదని తేల్చి చెప్పింది. ఈ విధంగా ప్రభుత్వ ప్రచార బండారం వివిధ రూపాలలో ప్రజలకు తెలుస్తున్నది. నీతి ఆయోగ్‌ 29 రకాల ప్రపంచ సూచికలకి సమాచారం తెలియజేయాలని సంకల్పించింది. ఒకటి, రెండు మినహాయిస్తే అన్ని సూచికలలో భారతదేశ పరిస్థితి మోడీ తొమ్మిదేళ్లలో అధోగతిలో పయనిస్తున్నదని స్పష్టం కావడంతో కంగుతిన్నది. వాస్తవాల కన్నా ప్రతిష్ట పెంచుకోవడానికి ప్రాధాన్యత నివ్వాలని సూచించింది. అందుకు అనుగుణంగా గణాంకాలు తయారు చేసే కార్యక్రమాలు ప్రారంభించారు. దేశమంతా బీసీ జనగణన కోరుతుంటే అసలు పది సంవత్సరాలకు జరగాల్సిన జనగణన ప్రక్రియనే ఎత్తేశారు.
               ఈ బండారమంతా బయట పెడుతూ ప్రముఖ రచయిత, ఆర్థిక రాజకీయ విశ్లేషకులు ఆకార్‌ పటేల్‌ తన 500 పేజీల గ్రంథం ''ప్రైస్‌ ఆఫ్‌ ది మోడీ ఇయర్స్‌''లో 58 రకాల అంతర్జాతీయ సూచికలను తీసుకొని విశ్లేషించారు. ఇందులో మానవ అభివృద్ధి, మతపరమైన ఆంక్షలు, పౌర హక్కులు, శాంతిభద్రతలు, పత్ర్రికా స్వేచ్ఛ, వాక్‌ స్వాతంత్రం, మేధావి వర్గంపై దాడులు, అణచివేతలు, బహుళత్వం, రాజకీయ సంస్కృతి, పాలనలో ప్రజల భాగస్వామ్యం, అవినీతి, నేరాలు, ఎన్నికల ప్రక్రియ వంటి అనేక అంశాలను పరిశీలించడం జరిగింది. అన్నింటిలోనూ ఈ తొమ్మిది సంవత్సరాల బిజెపి పాలన దేశాన్ని దిగజారుస్తున్నదని తేలుతున్నది. ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ, మానవ హక్కుల వంటి వాటిలో మన దేశం శ్రీలంక, పాకిస్తాన్‌ల కంటే వెనకబడటం చిన్న విషయం కాదు. అలాగే పేదరికం, ఆకలి, మహిళలలో రక్తహీనత, తలసరి ఆదాయం వంటి వాటిలో కూడా మనం అట్టడుగుకి చేరాము. డెమోక్రసీ ఇండెక్స్‌ భారతదేశాన్ని ''విఫలమైన ప్రజాస్వామ్యం'' (ఫ్లాఫ్‌ డెమోక్రసీ)గా వర్ణించింది. ఎందుకంటే 2015 నుండి భారత దేశంలో ప్రజాస్వామ్య విధానాలన్నీ తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నాయి. మోడీ ప్రభుత్వంలో అన్ని రంగాల్లోనూ మత జోక్యం పెరిగింది. ముస్లిం వ్యతిరేక భావాలు విస్తరిస్తున్నాయి. దీనితో భారతదేశం యొక్క రాజకీయ రంగం పూర్తిగా దెబ్బతిని పోయిందని ఆ సంస్థ పేర్కొన్నది. సిలికాస్‌ డాట్‌ ఆర్గ్‌ అనే సంస్థ భారతదేశాన్ని ''ప్రజల్ని అణిచివేచే దేశం''గా పేర్కొంది. కారణం భారతదేశంలో పౌర స్వేచ్ఛ తీవ్రంగా దెబ్బతింటున్నది. భావ ప్రకటన స్వేచ్ఛను దెబ్బతీస్తూ అనేక నిర్బంధ చట్టాలని మోడీ ప్రభుత్వం తీసుకు వస్తున్నదని ఆ సంస్థ ప్రకటించింది. అలాగే యాక్సెస్‌ నౌ ఆర్గ్‌ అనే సంస్థ భారత దేశంలో ప్రజల నోరు నొక్కడానికి ''ఇంటర్నెట్‌ బ్లాక్‌ చేయడం'' ఒక విధానంగా మారింది అని చెప్పింది. కాశ్మీర్లో 17నెలలు, ఢిల్లీ రైతాంగ పోరాటంపై సంవత్సరం పాటు ఇంటర్నెట్‌ నిలిపివేయడం జరిగింది. 2014లో ఆరుసార్లు షట్‌డౌన్‌ జరిగితే 2020లో మోడీ ప్రభుత్వం 19సార్లు నిర్వహించింది. ఇప్పుడు మణిపూర్‌లో అదే జరుగుతున్నది. ప్రపంచ ఆకలి సూచికలో 2014లో 76 దేశాలకు గాను 55వ దేశంగా ఉన్న భారత్‌, మోడీ ప్రభుత్వం పుణ్యాన 107దేశాలలో 101వ స్థానానికి పడిపోయింది. మనం ఈ విషయంలో పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌ కన్నా వెనకబడి ఉండటం దుర్మార్గం. మరో సూచిక భారతదేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా జరుగుతున్నట్లు కనపడుతున్నా అక్కడ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కన్నా నియంతృత్వ ఎన్నికల విధానం నడుస్తున్నదని ప్రకటించింది. ఈ విధంగా అన్ని రంగాలలో మన దేశం మోడీ విధానాల వలన తీవ్రంగా దిగజారుతున్నా రకరకాల ఉద్వేగ భరిత అంశాల చుట్టూ, వేల కోట్ల రూపాయల ప్రచార ఆర్భాటంతో ప్రజల దృష్టిని మరలుస్తున్నది. గత ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నట్లు ''మోడీ ప్రధానిగా ఈ దేశానికి ఓ పెద్ద విధ్వంసం'' అన్నది నిరూపితం అవుతున్నది.
 

                                                                         గుణ పాఠాలు - కర్తవ్యాలు

నేడు 77వ స్వాతంత్రదినోత్సవం. దీని వెనకాల గడచిన 77సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్ర ఉంది. అంతకుముందు నడిచిన 200 సంవత్సరాల స్వాతంత్య్ర పోరాట చరిత్ర ఉంది. ఓ లెక్క ప్రకారం 1857 ప్రధమ స్వతంత్ర సంగ్రామం నుండి 1947 ఆగస్టు 15 మధ్యలో 3కోట్ల 50లక్షల మంది స్వాతంత్య్ర పోరాటంలో మరణించారు. దేశ విభజన సందర్భంగా జరిగిన మతమారణకాండలో ఒక్క సంవత్సరంలోనే 10లక్షల మంది ఊచకోత కోయబడ్డారు. కోట్లాది మంది భారతీయుల బలిదానం వృధా కాకూడదు. వారందరూ కోరుకున్నది, ఈ దేశంలో ఒక ప్రజాతంత్ర, గణతంత్ర రాజ్యం రావాలని. 1857 ప్రధమ స్వతంత్ర సంగ్రామం అణిచివేయబడిన తరువాత మూడు దశాబ్దాల అనంతరం ఏర్పడిన కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వాన ప్రజాతంత్ర రిపబ్లిక్‌ వైపు అడుగులు పడ్డాయి. మరో మూడు దశాబ్దాల తర్వాత సోషలిస్టు రిపబ్లిక్‌ స్థాపన ద్వారానే ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని కమ్యూనిస్టు పార్టీ ప్రకటించింది. ఆ విధంగా భారతదేశం లౌకిక, ప్రజాతంత్ర, గణతంత్ర రాజ్యంగా రూపొందించడంలో సోషలిస్టు భావాలు, విధానాల ప్రభావం కూడా పెద్ద ఎత్తున పడింది. అందుకు రష్యాలో అత్యంత ఆదర్శవంతంగా నిర్మితమవుతున్న సోషలిస్టు వ్యవస్థ కూడా ఓ బలమైన కారణం.
            బ్రిటిష్‌ సామ్రాజ్యవాదుల కుట్రల ఫలితంగా వారికి వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడిన భారతదేశం 1947 ఆగస్టు 15తో రెండు ముక్కలైంది. పాకిస్తాన్‌్‌ ముస్లిం మత రాజ్యాంగా అవతరించింది. దానికి ప్రతిగా భారతదేశం హిందూ రాజ్యం కావాలని ఆర్‌ఎస్‌ఎస్‌ ఉబలాటపడింది. కానీ, కాంగ్రెస్‌, కమ్యూనిస్టులే కాకుండా దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు, సంస్థలు, మేధావులు, నిజానికి అశేష ప్రజానీకం ఈ దేశం మతరాజ్యం కాకూడదని, ఇది ఒక లౌకిక రాజ్యంగా ఉండాలని, అప్పుడే ఆధునిక ప్రపంచంలో దేశం సముచిత స్థానం సంపాదించగలుగుతుందని, వేగంగా అభివద్ధి చెందగలుగుతుందని బలంగా కోరుకున్నారు. తాత్కాలికంగా తమ వాదనకు బలం రాలేదని ఆర్‌ఎస్‌ఎస్‌ నక్కి కూర్చుంది. నంగి నంగిగా తాము రాజ్యాంగాన్ని అంగీకరించమని, జాతీయ పతాకాన్ని అంగీకరించమని, మనస్మృతి ప్రస్తావన లేదు కాబట్టి రాజ్యాంగం మెజారిటీ మతస్తులైన హిందువులకు ఆమోదయోగ్యం కాదని ప్రకటించింది. ఇప్పుడు అనేక కారణాల రీత్యా బలం పుంజుకున్న ఆర్‌ఎస్‌ఎస్‌ హిందుత్వ ఫాసిస్ట్‌ శక్తులు తాము 70ఏండ్ల క్రితం చెప్పిన మాటలను నిజం చేయబూనుకుంటున్నాయి. ప్రముఖ చరిత్ర విశ్లేషకులు ప్రొఫెసర్‌ ఐజాజ్‌ అహ్మద్‌ చెప్పినట్లు ''వీరు రాజకీయ వ్యవస్థని, రాజ్యాంగాన్ని, లోపల నుంచి తొలుచుకుంటూ వస్తున్నారు.''
 

                                                                  ఈ శక్తులను అంతం చేయాలి.

ఈరోజు మనం చూస్తున్న హిందూత్వ ఫాసిస్టు శక్తులను తిప్పికొట్టడం ద్వారానే మన దేశం సర్వతోముఖాభివృద్ధి జరుగుతుంది. తరతాలుగా మనదేశ అభివృద్ధికి ఆటంకంగా తయారైన ఈ మనువాద సంస్కృతి, కుల వ్యవస్థ, అది వెదజల్లుతున్న విషపూరిత భావజాలం శాశ్వతంగా అంతం కావాలి. అందుకు లౌకికవాదులు, ప్రజాతంత్ర వాదులు, దేశభక్తియుత జనం, కర్ణాటకలోలా పౌర సమాజం ఒక్కటి కావాలి. పోరుబాట పట్టాలి. ఎన్నికలలో బిజెపిని ఓడించినంత మాత్రాన హిందుత్వ నశించదు. రచయితలు, కవులు, సామాజిక కార్యకర్తలు, మేధావుల పరిరక్షణకు, వారికి మద్దతుగా అశేష కార్మిక ప్రజానీకాన్ని, కార్మిక కర్షక జనాన్ని కదిలించాలి. లేకుంటే మన దేశాన్ని ఈ శక్తులు హిందూ తాలిబన్‌ల రాజ్యంగా మారుస్తాయి. వారి ప్రతి అడుగులోనూ ఇది నిరూపితం అవుతున్నది.

ఆర్‌. రఘు

raghu