
నేడు రాష్ట్రంలోని ఈ మూడు పార్టీలూ, ఒక పక్క వారిలో వారు కలహించుకుంటూ, మరో పక్క అసలు నేరస్తులయిన మోడీ ప్రభుత్వానికి దాసోహమవడం రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేయడమే. దీనితో పిల్లుల తగవును కోతి తీర్చి, రొట్టెంతా తినేసినట్లు, మొత్తం రాష్ట్రాన్ని మింగేయాలని గోతి కాడ నక్కలా బిజెపి కాసుకు కూర్చుంది. అందులో భాగంగానే మోడీ మిత్రుడైన అదానీకి రాష్ట్ర ప్రభుత్వ వాటాను కూడా ఇచ్చేసి మొత్తం గంగవరం పోర్టును అప్పజెప్పారు. అదానీకి చెందిన వ్యక్తిని రాజ్యసభకు కూడా పంపించారు. రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తూ, తానే ఏదో అభివృద్ధి చేసేస్తున్నట్లు నిస్సిగ్గుగా అబద్ధపు ప్రచారాలకు పాల్పడుతూ బలపడాలని బిజెపి చూస్తోంది.
ఉత్తరాంధ్రకు ఇటీవల నాయకుల తాకిడి ఎక్కువయింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సాగు నీటి ప్రాజెక్టుల పేరున యుద్ధభేరి పర్యటన చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన ప్రారంభించారు. ముఖ్యమంత్రి జగన్ ఈ అక్టోబరు నుండి విశాఖపట్నం మకాం మార్చేస్తారని ప్రకటించారు. వీరందరూ చేస్తున్నది ఉత్తరాంధ్ర అభివృద్ధికేనని ప్రకటించుకుంటూ, ఒకరినొకరు పరస్పరం తీవ్ర స్థాయిలో విమర్శించుకుంటున్నారు. ఉత్తరాంధ్రకు మీరు ద్రోహం చేశారంటే మీరు చేశారని, మేమే అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్నారు. ఎవరి గురించి వారు చెప్పుకోవడాన్ని చూసి ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ఇతరులను విమర్శించడం కూడా వింతేమీ కాదు. కానీ, చాలా ఆశ్చర్యకరమైనది, అభ్యంతరకరమైనది, ప్రమాదకరమైనది ఏమిటంటే, వీరెవరూ రాష్ట్రానికి, ఉత్తరాంధ్రకు తీరని ద్రోహం చేస్తున్న కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని పల్లెత్తుమాట కూడా అనకపోవడం.
రాష్ట్ర పునర్విభజన చట్టంలోని ఏ ఒక్క అంశాన్నీ కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా అమలు చేయలేదు. ఉత్తరాంధ్ర, రాయలసీమల ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీలను అటకెక్కించేసింది. గిరిజన యూనివర్సిటీ నిర్మాణమే ఇంకా ప్రారంభం కాలేదు. పెట్రో యూనివర్సిటీ పిట్ట గోడలు కూడా లేపలేదు. రైల్వే జోన్ అయితే కేవలం ప్రకటనలకే పరిమితమయింది. విశాఖ మెట్రో రైల్ మాటే మరిచారు. ఇక రాష్ట్రంలో పోలవరం నిర్మాణం, పునరావాసం ఒక ప్రహసనమే. కడప ఉక్కు ఫ్యాక్టరీ, దుగరాజపట్నం పోర్టు సాధ్యం కాదని మోడీ ప్రభుత్వం తెగేసి చెప్పేసింది. రాజధానిపై నాటకాలాడుతోంది. అయినా ఉత్తరాంధ్రను, రాష్ట్రాన్ని తామే అభివృద్ధి చేయగలమని పోటీ పడుతున్న ఈ మూడు పార్టీలకు మోడీ ప్రభుత్వం చేస్తున్న ఈ ద్రోహం ఎందుకు కనపడలేదో సామాన్యులకు అర్ధం కాని అంశమే. వీరి ఉపన్యాసాలలో కానీ, ప్రకటనలలో కానీ దుర్భిణీ వేసి చూసినా రాష్ట్రానికి ఇంత అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై ఒక చిన్న విమర్శ కూడా కనపడదు, వినపడదు. వీరి దాసోహం ఎంతవరకు దారి తీసిదంటే, తెలుగు ప్రజలు పోరాడి సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంటును అమ్మేస్తామని మోడీ ప్రభుత్వం నిర్ణయించినా, తమలో తాము కలహించుకోవడమే తప్ప వీరెవరూ కిమ్మనడం లేదు.
జగన్ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వానికి సాష్టాంగపడిపోయింది. చివరికి ప్రతిపక్షాలన్నీ కలిసి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని కూడా వ్యతిరేకించి, మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా నిలిచింది. రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట కూడా అనకపోవడం ఏ విధంగా రాష్ట్ర ప్రయోజనాలకు లాభమో వారికే తెలియాలి. మన పొరుగు రాష్ట్రాలయిన తెలంగాణ, తమిళనాడు లోని అధికార పార్టీలు అవిశ్వాస తీర్మానం అవకాశాన్ని వినియోగించుకుని, ఆయా రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాలతో మోడీ ప్రభుత్వాన్ని బోనులో నుంచో పెట్టాయి. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలవడం, రాష్ట్రానికి వారు చేస్తున్న ద్రోహంలో భాగస్వాములవడం తప్ప మరొకటి కాదు.
యుద్ధభేరి పేరున బయలుదేరిన చంద్రబాబు రాష్ట్ర విభజన తరువాత ఉత్తరాంధ్ర నీటి ప్రాజక్టులు ఎన్ని పూర్తి చేశారు? తోటపల్లి తానే పూర్తి చేశానని అవాస్తవాలు, గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ, వాస్తవంగా 2003లో దాని శంకుస్థాపన, 2015లో దాని ప్రారంభం తప్ప వేరేమీ చేయలేదు. 2004, 2014 మధ్యే నిర్మాణం జరిగింది. ఇప్పటికి నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడంలో వైఫల్యం వుంది. అంటే వీరు అధికారంలో లేని కాలంలోనే దీని పనంతా జరిగింది. అయితే, శంకుస్థాపన, ప్రారంభం చేయడం ఈయనకు కలిసొచ్చిన అంశం. ఉత్తరాంధ్రకు జీవనాడి అని చెప్పుకునే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజక్టుకు 2009లో నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేయగా, 2014లో వీరి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తరువాత, ఇది ఆచరణ సాధ్యం కాదని తెలిపి అటకెక్కించేయాలని చూశారు. ఈ ప్రాంత ప్రజల నుండి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో ఎన్నికల ముందు 2018లో మరోసారి శంకుస్థాపన చేయడం తప్ప, వీరు చేసిందేమీ లేదు. వంశధార, నాగావళి అనుసంధానం వంటి ప్రకటనలే తప్ప ఆచరణలో ఆ అయిదేళ్లలో ఒరిగిందేమీ లేదు. వంశధార నిర్వాసితుల సమస్యలు నేటికీ కూడా అపరిష్కృతంగానే వున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల ఫలితంగా మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలు, జూట్‌మిల్లులు, చిన్న పరిశ్రమలు అనేకం వున్నప్పటికీ వాటి గురించి పట్టలేదు. శ్రీకాకుళం ఉద్దానంలో కిడ్నీ వ్యాధులతో ప్రజలు అల్లాడుతుంటే పట్టించుకున్న పాపాన పోలేదు. తిరిగి, విభజన చట్టాన్ని అమలు చేయకుండా ద్రోహం చేసిన ఆ మోడీ ప్రభుత్వాన్నే భుజాన మోశారు. చివరలో ఎన్నికల ముందు ఏవో కొంగ జపాలు చేసినా అప్పటికే జరగవలసిన అన్యాయం జరిగిపోయింది.
అన్యాయాన్ని ప్రశ్నించడమే తన లక్ష్యమని బయలు దేరిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఎందుకో ఈ అన్యాయాన్ని ప్రశ్నించడాన్ని మాత్రం ఆపేశారు. తాజాగా ఈ నెల 10వ తేదీన విశాఖపట్నంలో జరిగిన సభలో విశాఖకు, ఉత్తరాంధ్రకు ఇంత ద్రోహం చేస్తున్న బిజెపి గురించి, తన గంట ఉపన్యాసంలో ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు. పైగా తనకు మోడీతోనూ, అమిత్ షాతోనూ మంచి సంబంధాలున్నాయని గొప్పగా చెప్పుకున్నారు. మరి అలాంటప్పుడు, తన పలుకుబడిని ఉపయోగించి, స్టీల్ ప్లాంట్ అమ్మకం నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా చేయవచ్చు కదా! ఎవరు ఆపేరు? ఎందుకు చేయడం లేదు? విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు వెంటనే చేపట్టేలా చూడవచ్చు కదా! రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకపడ్డ ప్రాంతాలకు ప్రత్యేక నిధులు, చట్ట ప్రకారం వివిధ సంస్థల నిర్మాణం చేపట్టకపోతే ఉరుకునేది లేదని గట్టిగా చెప్పొచ్చు కదా! ఇవేవీ చేయకుండా తిరిగి ద్రోహం చేస్తున్న ఆ బిజెపి చంక ఎక్కడం ఏ రకంగా రాష్ట్రానికి మేలు చేస్తుందో అర్ధం చేసుకోలేని అమాయకులా ప్రజలు? మోడీ ప్రభుత్వం ఇచ్చిన రోడ్ మ్యాపుతో ముందుకు పోవడం అంటే రాష్ట్రానికి మరింత అన్యాయం చేయడమే. దీనికేనా జనసేనాని ఉన్నది. రాష్ట్రాభివృద్ధి సాధించడమా? మోడీకి సేవ చేయడమా? వీరి రోడ్ మ్యాపు రూట్ ఎటు అన్నది స్పష్టంగా తెలుస్తూనే ఉంది.
నేడు రాష్ట్రంలోని ఈ మూడు పార్టీలూ, ఒక పక్క వారిలో వారు కలహించుకుంటూ, మరో పక్క అసలు నేరస్తులయిన మోడీ ప్రభుత్వానికి దాసోహమవడం రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేయడమే. దీనితో పిల్లుల తగవును కోతి తీర్చి, రొట్టెంతా తినేసినట్లు, మొత్తం రాష్ట్రాన్ని మింగేయాలని గోతి కాడ నక్కలా బిజెపి కాసుకు కూర్చుంది. అందులో భాగంగానే మోడీ మిత్రుడైన అదానీకి రాష్ట్ర ప్రభుత్వ వాటాను కూడా ఇచ్చేసి మొత్తం గంగవరం పోర్టును అప్పజెప్పారు. అదానీకి చెందిన వ్యక్తిని రాజ్యసభకు కూడా పంపించారు. రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తూ, తానే ఏదో అభివృద్ధి చేసేస్తున్నట్లు నిస్సిగ్గుగా అబద్ధపు ప్రచారాలకు పాల్పడుతూ బలపడాలని బిజెపి చూస్తోంది. రామతీర్థాలు, అంతర్వేది, గుంటూరు, తిరుపతి వంటి అనేక సందర్భాలలో అవకాశం దొరికినప్పుడల్లా తన మతోన్మాద విధానంతో ముందుకు వస్తోంది. దీనికి ఈ పార్టీలే అవకాశం కలిస్తున్నాయి. మరే రాష్ట్రంలోనూ లేని మన రాష్ట్రంలోనే ఉన్న ఈ ప్రత్యేక పరిస్థితిని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకునేలా చైతన్యవంతులను చేయవలసిన అవసరం, బాధ్యత నేడు విద్యావంతులు, అభివృద్ధి కాముకులపైనే ఉంది.
/ వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు /
కె. లోకనాధం