Jul 20,2022 06:55

రెండు నాలుకల విధానాలతో ప్రజలను దగా చేస్తున్న బిజెపితో కలిసి రాష్ట్రంలో ఏం మార్పు తేనున్నారు? ఆంధ్ర ప్రజలు ఆత్మాభిమానానికి ప్రతీకలు. తోటి మనుషులను ప్రేమించడం, ఆప్యాయతలతో జీవించడం తెలుగు ప్రజల జీవన విధానం. ఇలాంటి రాష్ట్రంలో బిజెపి బలపడేందుకు, అధికారంలో వాటా పొందేందుకు ఏ పార్టీ ప్రయత్నం చేసినా... అది అంతిమంగా ఆ పార్టీ పతనానికే దారితీస్తుంది.

     రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ఇంకా చాలా గడువున్నప్పటికీ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం పెరిగింది. అధికారపక్షం గడప గడపకు, ప్రధాన ప్రతిపక్షం బాదుడే బాదుడు, జనసేన కౌలు రైతుల సంఘీభావ సభలంటూ 'ఎన్నికల హీట్‌' పెంచేస్తున్నాయి. 'వైసిపి లేని' ప్రభుత్వాన్ని రాష్ట్రంలో చూడాలని జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ కోనసీమ అంబేద్కర్‌ జిల్లా లోని మండపేట సభలో ప్రకటించారు. తనకు బిజెపి నుండి ఇంకా రాజకీయ రోడ్డు మ్యాప్‌ రాలేదని గతంలో చెప్పిన పవన్‌...ఈ ప్రకటన ఆ రోడ్డు మ్యాప్‌లో భాగమో కాదో చెప్పలేదు.
    ఎన్నికల సమయంలో వైసిపి ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. పాదయాత్రలో ప్రకటించిన అనేక అంశాలు ఆ పార్టీ ఎన్నికల మానిఫెస్టోలో చేరాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మానిఫెస్టో భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌ తో సమానమన్నారు. ఈ హామీలలో కొన్ని అమలవుతున్నాయి. మరికొన్ని మధ్యస్థంగా నిలిచిపోయాయి. ఇంకొన్ని అమలుకు నోచుకోలేదు. సంక్షేమ పథకాలతో పాటు భారాల మోత కూడా పెరుగుతోంది. విద్యుత్‌, ఆర్టీసి చార్జీలు పెంచింది. పట్టణాల్లో ఆస్తిపన్నులో మార్పు, చెత్తపన్ను, నీటిపన్ను, మున్సిపల్‌ సేవల వినియోగ చార్జీలు పెంచింది. దశాబ్దాల క్రితం ప్రభుత్వ పథకాల కింద కట్టుకున్న ఇళ్లకు ఓటిఎస్‌ పేరుతో డబ్బులు వసూలు చేసుకుంది. వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్‌ మీటర్ల బిగింపు, పాఠశాలల విలీనం, లేబర్‌కోడ్‌ల లాంటి కేంద్ర ప్రభుత్వ వినాశకర విధానాలను అత్యుత్సాహంతో రాష్ట్రంలో అమలు చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజల్‌, గ్యాస్‌ ధరలు పెరచడం వల్ల నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరిగిపోయాయి. ఈ భారాలకు మూలమైన కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ భారాల పెరుగుదలకు తన వంతు కారణమవుతోంది. అంతేకాదు ఆ పెరిగే పెట్రోలియం ధరల్లో తన వాటా కూడా పెరుగుతుందని భావిస్తోంది.
      ఎన్నికల ముందు ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదు. వేతన సవరణ, సిపిఎస్‌ రద్దు హామీ గాలికి వొదిలేశారు. చట్టబద్ధంగా ఉద్యోగులకు అందాల్సిన ఏ ఒక్క సహాయం సకాలంలో చెల్లించలేకపోతున్నారు. నిరుద్యోగ యువత ఎంతో ఆశించిన డిఎస్‌సి, ఇతర ఉద్యోగాల కోసం ప్రకటిస్తానన్న జాబ్‌ క్యాలెండర్‌ అడ్రస్సు లేదు. రాజధానిని వివాదాస్పదం చేసింది. ఇసుక పాలసీ పేరుతో పేద, మధ్యతరగతి ప్రజలను అనేక ఇక్కట్లకు గురిచేసింది. మద్యం పాలసీ వల్ల మద్యం నియంత్రణ జరగకపోగా పేదలపై భారాలు పెరగడం, ప్రాణాలు పోవడంతో పాటు, మహిళలపై హింస పెరిగిపోయింది. అధికార పార్టీ నేతల భూ ఆక్రమణలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు, దందాలు కొనసాగుతున్నాయి. ప్రజా ఉద్యమాలపై పోలీసు నిర్బంధం, ముందస్తు అరెస్టుల పేరుతో కనీస నిరసన తెలిపే పరిస్థితి లేకుండా ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నది. కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన సహాయ చర్యలు, వివిధ తరగతులకు అమలవుతున్న నగదు బదిలీ పథకాల వల్ల ప్రభుత్వం పట్ల ఏర్పడిన సానుకూలత పోయి...ప్రభుత్వ విధానాల వల్ల, పడుతున్న భారాలతో ప్రజల్లో అసంతృప్తి క్రమంగా పెరుగుతోంది. ఈ అసంతృప్తి కొన్ని తరగతుల్లో తీవ్రంగా వుంది. మరికొన్ని తరగతుల్లో ప్రాథమిక దశలో వుంది. ప్రజా వ్యతిరేక విధానాలను వైసిపి ప్రభుత్వం విడనాడాలి.
     అయితే ఏ విధానాల వల్ల వైసిపి ప్రభుత్వం పట్ల ప్రజల్లో అంసంతృప్తి పెరుగుతుందో దానికి ప్రత్యామ్నాయ విధానాలు కావాలి. జనసేన ఆశిస్తున్న వైసిపి లేని ప్రభుత్వం అంటే టిడిపి, బిజెపిలతో కలిసిన జనసేన కూటమి ప్రభుత్వం అనుకోవాలా? అలాంటి కూటమికి వైసిపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు భిన్నమైన విధానాలు వున్నాయా? గత పరిపాలనలో తెలుగుదేశం పార్టీ అనుసరించిన విధానాల వల్లే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. ఇప్పటికీ ఆ విధానాలను సమర్థించుకుంటున్నారు. ఈ మధ్య ఒంగోలులో జరిగిన మహానాడులో ప్రకటించిన వారి రాజకీయ తీర్మానం గాని, వివిధ అంశాలపై చేసిన విధానాల ప్రకటనలు గాని అదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. పైగా తనను ఓడించింది తాను అనుసరించిన విధానాలు కాదు. ప్రజలు అమాయకంగా వైసిపిని నమ్మి తమను ఓడించారనే భ్రమలో ఆ పార్టీ నాయకత్వం వున్నట్లు వారి ప్రకటనలు స్పష్టం చేస్తున్నాయి. అంతేగాక ప్రజలకు ప్రస్తుతం అందుతున్న నగదు బదిలీ పథకాలు వారిని సోమరులను చేస్తున్నాయని, ఉచిత పథకాలు అమలు చేస్తే శ్రీలంక తరహాలో పరిణామాలు వస్తాయంటూ ఆ పార్టీ నాయకులు ప్రకటనలు చేస్తున్నారు.
     రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ఇలా ఏ ఒక్క విషయంలో వైసిపి, టిడిపిలు కేంద్రప్రభుత్వాన్ని నిలదీయడం, కనీసం ప్రశ్నించడం చేయకపోగా రెండు పార్టీలు పోటీ పడి కేంద్రానికి మద్దతు ఇస్తున్నాయి. వ్యవసాయ నల్ల చట్టాలు, 370 ఆర్టికల్‌ రద్దు, పౌరసత్వ చట్ట సవరణ బిల్లు, జిఎస్‌టి, ప్రణాళికా సంఘం రద్దు...ఇలా ఒకటేమిటి దాదాపు అన్ని అంశాలను పార్లమెంట్‌లో బలపరచి, అదే విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో జరిగిన ఉద్యమాలను బలపరుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను బలపరచడంలో ఈ రెండు పార్టీలు ఒకే వైఖరితో వున్నాయి కదా! రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిని బేషరతుగా ఈరెండు పార్టీలు పోటీపడి బలపరచాయి కదా.
     పవన్‌ కల్యాణ్‌ ప్రతిపాదిస్తున్న ప్రభుత్వ కూటమిలో బిజెపి భాగస్వామిగా వుంటుందా? ఈ దుస్థితే ఏర్పడితే రాష్ట్ర ప్రజల పరిస్థితి 'పెనం మీది నుండి పొయ్యిలో పడ్డట్టు' అవుతుంది. పవన్‌ కల్యాణ్‌ బలపరచిన బిజెపి, టిడిపిలు గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్తో కలిసి పరిపాలించాయి. ఎనిమిది సంవత్సరాల బిజెపి పాలనను దేశప్రజలంతా చూస్తూనే వున్నారు. దేశాన్ని ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా, విద్యా, వైద్యం, సాహిత్యం ఇలా అన్నిరంగాల్లో పతనావస్థకు చేర్చారు. నోట్ల రద్దు, ప్రైవేటీకరణ విధానాలు, ఆశ్రిత పెట్టుబడిదారులకు సహజ వనరులు, జాతీయ సంపద ఎలా దోచిపెడుతున్నారో చూస్తూనే వున్నాము. కరోనా సమయంలో ఆ ప్రభుత్వం ఎంత అమానవీయంగా ప్రవర్తించిందో ప్రజలందరికీ గుర్తుంది. రూపాయి విలువ పతనమవుతుంటే ప్రధాని స్పందించడంలేదు. ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను అప్రజాస్వామికంగా, కుట్రలతో కూల్చి వేశారు. రాజ్యంగబద్ద సంస్థలను తమ గుప్పిట్లో పెట్టుకొని రాజకీయ పార్టీలను, ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనం చేసి, తాము కోరుకుంటున్న ఫాసిస్టు తరహా ప్రభుత్వాన్ని స్థాపించాలని చూస్తున్నారు. ముఖ్యంగా ప్రజలమధ్య మత చిచ్చు పెట్టి ఉన్మాదాన్ని పెంచి పోషిస్తున్నారు. దళితులు, మైనారిటీలు, గిరిజనులు, స్త్రీల వ్యక్తిగత జీవిత విధానాలు, వారి మత విశ్వాసాల మీద జరుగుతున్న దాడి దేశ ప్రతిష్టను అంతర్జాతీయంగా దిగజార్చింది.
     గత ఎనిమిది సంవత్సరాల కాలంలో రాష్ట్రానికి బిజెపి అనేక అంశాల్లో ద్రోహం చేస్తూనే వుంది. విభజన చట్టంలోని ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. తానే చట్టసభల్లో, బహిరంగ సభల్లో ఇచ్చిన హామీలను కూడా అమలు చేయకుండా ఆంధ్రప్రజలను అవమానిస్తోంది. రాష్ట్రంలోని అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలను తన అదుపాజ్ఞల్లో పెట్టుకొని రాష్ట్రాన్ని వినాశనం వైపు నడిపిస్తోంది. కుట్రలు, కుతంత్రాలతో రాష్ట్రంలో బలపడాలని చూస్తోంది. రెండు నాలుకల విధానాలతో ప్రజలను దగా చేస్తున్న బిజెపితో కలిసి రాష్ట్రంలో ఏం మార్పు తేనున్నారు? ఆంధ్ర ప్రజలు ఆత్మాభిమానానికి ప్రతీకలు. తోటి మనుషులను ప్రేమించడం, ఆప్యాయతలతో జీవించడం తెలుగు ప్రజల జీవన విధానం. ఇలాంటి రాష్ట్రంలో బిజెపి బలపడేందుకు, అధికారంలో వాటా పొందేందుకు ఏ పార్టీ ప్రయత్నం చేసినా అది అంతిమంగా ఆ పార్టీ పతనానికే దారితీస్తుంది.
     మార్పు రాజకీయమంటూ జనసేన తొలుత బయలుదేరింది. పవన్‌ కల్యాణ్‌ అభిమానులు ఎంతో ఉత్సాహంతో ఆనందించారు. 2014 ఎన్నికల్లో బిజెపి, తెలుగుదేశం కూటమిలో భాగమైంది. ఒకవైపు నరేంద్ర మోడి, మరోవైపు చంద్రబాబు నాయుడు మధ్యలో పవన్‌ కూర్చొని అనేక సభల్లో ఉపన్యసించారు. ఆ తరువాత కొంత కాలానికి ఆ కూటమిని పవన్‌ వీడారు. మరికొంత కాలం తర్వాత వామపక్షాలతో కలిశారు. గత ఎన్నికల్లో వామపక్ష పార్టీలతో కలిసి పోటీ చేశారు. ఎన్నికల అనంతరం వామపక్షాలను వదిలి, మరల బిజెపి తో స్నేహం చేశారు. తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల్లో బహిరంగంగా బిజెపి అభ్యర్థికి మద్దతుగా జనసేన నేత పాల్గొని ప్రచారం చేశారు. అంతకు ముందు జరిగిన బద్వేల్‌, ఆ తరువాత ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బిజెపికి మద్దతు ఇవ్వడం కాని, ప్రచారం చేయడం కాని జరగలేదు. రాజకీయాల్లో మార్పు రావడమంటే తమ జీవితాల్లో మార్పు వస్తుందని యువత ఏదైతే ఆశించారో...ఆ ఆశ నీరుగారేటట్లు పవన్‌ కల్యాణ్‌ రాజకీయ వైఖరులు తీసుకున్నారు. అగ్నిపథ్‌ సమస్యపై దేశమంతా యువత భగ్గుమంటే పవన్‌ ఒక్క మాట మాట్లాడకుండా వుండిపోయారు.
   మార్పు రావడమంటే పార్టీల ప్రభుత్వాలు మారడం కాదు, అవి అనుసరించే విధానాలకు ప్రత్యామ్నాయం కావాలి. ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాల్లో స్పష్టమైన ప్రత్యామ్నాయ విధానాలు వామపక్షాలకు మాత్రమే వున్నాయి. కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక, మహిళ, విద్యార్థి, యువత, ఉద్యోగుల హక్కుల కోసం, వారిపై పడుతున్న భారాలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడుతున్నది ఆ విధానాల వెలుగులోనే. దళిత, గిరిజన, మైనారిటీ, బలహీన వర్గాలకు అండగా నిలుస్తున్నది అందులో భాగంగానే. అలాంటి విధాన ప్రత్యామ్నాయం రూపొందాలి.

/ వ్యాసకర్త : సిపిఎం ఎ.పి రాష్ట్ర కమిటీ సభ్యుడు /
వి. రాంభూపాల్‌

వి. రాంభూపాల్‌