
జాతీయ ఐక్యతను యుసిసి బలోపేతం చేస్తుందనేది ఏమాత్రం పసలేని వాదన. లింగ న్యాయం చేకూరాలంటే ఏకరూపతే మార్గం అనే ఆలోచన నుండి అనేక మహిళా గ్రూపులు తప్పుకున్నాయి. విడాకులు, వారసత్వం, పిల్లల సంరక్షణలో లింగ న్యాయం ఎలా ఉంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. మరో ప్రశ్న ఏమంటే, యుసిసిని కేవలం అధికారిక ఉత్తర్వులతో రుద్దవచ్చా? యుసిసిని విధించడం ద్వారా సాంప్రదాయాలు, ఆచారాలు మటుమాయమైపోతాయా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. సామాజిక మార్పు తేవాలన్నా, లింగ న్యాయం చేకూరాలన్నా సంబంధిత కమ్యూనిటీల్లో మార్పు కోసం చాలా కృషి జరగాలి.
భారత లా కమిషన్ నోటిఫికేషన్, ఏకరూప పౌర స్మృతి (యూనిఫాం సివిల్ కోడ్-యుసిసి) కావాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ గట్టిగా చేస్తున్న వాదనలు...ప్రజల మధ్య చీలికలు తీసుకొచ్చే విచ్ఛిన్నకర అంశంపై మరోసారి చర్చను లేవదీశాయి. యుసిసి అనేది బిజెపి ఎన్నికల మ్యానిఫెస్టోలన్నిటిలోనూ భాగంగా ఉంటోంది. 1996 నాటి ఆ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో నారీశక్తి (మహిళా శక్తి) అనే శీర్షికతో ఏకరూప పౌర స్మృతిని ప్రత్యేకంగా ప్రస్తావించింది. అయినప్పటికీ యుసిసి ముసాయిదాలో పొందుపరచాల్సిన అంశాలపై ఎన్నడూ దృష్టి పెట్టలేదు.
విడాకులు, భరణం, వారసత్వపు హక్కులు, పిల్లల సంరక్షణకు సంబంధించి యుసిసిలో ఎలాంటి చట్టాలున్నాయి? ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నుండి, యుసిసిని వ్యతిరేకిస్తున్న గుర్తింపు పొందిన మైనారిటీ సంస్థల నుంచి మాత్రమే ఇప్పటివరకు చెప్పుకోదగిన ప్రతిస్పందన వచ్చింది. ఈసారి యుసిసి ప్రతిపాదనపై ఆదివాసీలు, సిక్కు గ్రూపులు, ఇంకా ఇతర వర్గాల ప్రజల నుండి కూడా వ్యతిరేకత వస్తున్నది.
''వివాహం, విడాకులు, వారసత్వం, భూమి బదిలీకి సంబంధించిన మా సాంప్రదాయ చట్టాలను యుసిసి ఉల్లంఘిస్తుంది...'' అని 'కేంద్రీయ సర్నా సమితి' కార్యకర్త సంతోష్ టిర్కీ అభిప్రాయపడ్డాడు. ''మేము లా కమిషన్‌కు ఈ మెయిల్ ద్వారా నిరసన తెలియజేయడమే కాదు. క్షేత్రస్థాయిలో నిరసన ప్రదర్శనలు కూడా నిర్వహిస్తాం. మా వ్యూహాలను రూపొందించుకునేందుకు సమావేశాలు నిర్వహిస్తాం. రాజ్యాంగంలో పేర్కొన్న ఐదవ, ఆరవ షెడ్యూల్ లోని నిబంధనలను యుసిసి నీరుగార్చుతుంది...'' అని జార్ఖండ్‌కు చెందిన ఆదివాసీ గ్రూప్ నాయకుడు రతన్ టిర్కీ పేర్కొన్నారు.
నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) లోని భాగస్వామ్య పార్టీల్లో ఒకటైన శిరోమణి అకాలీదళ్, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కొంతమంది బిజెపి నాయకులు తాము ఈ యుసిసిని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ బిజెపికి చెందిన సుశీల్ మోడీ, ఈశాన్య రాష్ట్రాలతో సహా గిరిజన ప్రాంతాల్లో యూనిఫాం సివిల్ కోడ్ అమలులోని సాధ్యాసాధ్యాలను ప్రశ్నించారు.
యుసిసిని రద్దు చేయమని అడగకుండా లా కమిషన్‌తో చర్చలు జరపాలని శిరోమణి అకాలీ దళ్ నేత గుర్జీత్ సింగ్ తల్వాండీ సిక్కు మత అత్యున్నత కమిటీ అయిన 'శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ'ని కోరారు. అలా అని ఒప్పందానికి ప్రయత్నించమన్నట్టుగా భావించరాదని, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకతను తెలిపే అవకాశాన్ని వదులుకోకుండా వుండేందుకు ఈ చర్చలను చూడాలని చెప్పారు.
వ్యక్తిగత, కుటుంబ చట్టాలు పౌర, నేర చట్టాలకు చాలా భిన్నంగా వున్నాయనే విషయాన్ని మరోసారి తప్పక ప్రస్తావించుకోవాలి. భారతదేశంలో బ్రిటిష్ పాలకులు అన్ని మతాలకు చెందిన పెద్దలతో సంప్రదింపులు జరిపి, వ్యక్తిగత చట్టాలను రూపొందించారు. ఉదాహరణకు, హిందూ చట్టాలకు సంబంధించిన మితాక్షర, దయాభాగ స్రవంతులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కాబట్టి హిందువుల పౌర చట్టాలలోను, చివరికి హిందువుల్లోను ఏకరూపత లేదు. వ్యక్తిగత చట్టాలలో అంతర్లీనంగా వున్న లింగ అన్యాయం పట్ల కలత చెందిన భారత ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ...హిందువుల కోసం హిందూ కోడ్‌లో సంస్కరణలను ప్రారంభించాలని తొలి న్యాయశాఖ మంత్రి డా.బి.ఆర్.అంబేద్కర్‌ను కోరారు. హిందూ వ్యక్తిగత చట్టాలన్నీ మహిళలపై పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించేవిగా ఉన్నాయని గ్రహించిన అంబేద్కర్, సమానత్వాన్ని కోరుకునే వ్యక్తిగా ముందుగా హిందూ కోడ్ బిల్లు ముసాయిదాను రూపొందించారు. ముందుగా మెజారిటీ మత సంస్కరణలతో ప్రారంభించి తరువాత మిగిలిన మతాల్లో అలాంటి సంస్కరణలు చేపట్టాలనేది ఆయన ఆలోచన.
భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన వెంటనే ముస్లిం వ్యక్తిగత చట్టాల్లో సంస్కరణలను చేపట్టకపోవడానికి ఓ కారణముంది. దేశ విభజన సమయంలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో...మైనారిటీ మతంపైన మెజారిటీ మతం తన అనుకూల విధానాలను రుద్దుతున్నట్లు కనిపించకూడదన్నదే కారణం. ఆ తరువాత ముస్లిం చట్టాల క్రోడీకరణను చేపట్టారు. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించడం ద్వారా ముస్లిం చట్టంలో ఒక సంస్కరణను చేపట్టడం కూడా జరిగింది (బిజెపి, అనవసరంగా ఈ విధానాన్ని నేరంగా పరిగణించింది. తద్వారా, ప్రజల్ని విభజించి, ముస్లింలు చట్టాల్ని ఉల్లంఘించే వారిగా చూపించింది). మరో ముఖ్యమైన విషయం ఏమంటే, ఇండియన్ ముస్లిమ్స్ ఫర్ సెక్యులర్ డెమోక్రసీ లాంటి కొన్ని ప్రగతిశీల ముస్లిం గ్రూపులు గతంలో కూడా మతపరమైన తటస్థ వ్యక్తిగత చట్టాల కోసం పిలుపునిచ్చాయి.
లింగ సమానత్వంపై ఆధారపడి, హిందూ కోడ్ బిల్లులో అంబేద్కర్ రూపొందించిన చట్టాలకు తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. బిల్లును దశలవారీగా ప్రవేశపెట్టాల్సి వచ్చింది. అంబేద్కర్ రాజీనామా చేయాలని మితవాద హిందువులను హిందూ జాతీయవాద శక్తులు రెచ్చగొట్టాయి. దీంతో మనస్తాపం చెందిన ఆయన క్యాబినెట్ మంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఇటీవల మోడీ ప్రభుత్వం ద్వారా గాంధీ శాంతి బహుమతిని అందుకున్న గీతా ప్రెస్ ప్రచురించిన కల్యాణ్ మ్యాగజైన్...హిందూ కోడ్ బిల్లుపై వ్యతిరేకతను అప్పట్లో ఈ విధంగా వ్యక్తం చేసింది. ''ఇన్నాళ్లకు హిందూ ప్రజానీకం అంబేద్కర్ మాటలను చాలా తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నారు. ఇప్పుడు, ఆయన రూపొందించిన హిందూ కోడ్ బిల్లు, హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి ఉద్దేశించిన కుట్రలో అత్యంత కీలకమైౖన అంశమని తేలిపోయింది. అలాంటి వ్యక్తి న్యాయశాఖ మంత్రిగా కొనసాగితే, అది హిందువులకు అవమానం, సిగ్గుచేటు, హిందూ ధర్మంపై ఒక మచ్చ.''
యుసిసి కోసం మహిళా ఉద్యమాలు డిమాండ్ చేస్తూనే వున్నాయి. అయితే డెబ్బయ్యవ దశకం ప్రారంభంలో మధుర అత్యాచారం కేసు తరువాత యుసిసి డిమాండ్ చాలా బలంగా ముందుకొచ్చింది. ఏకరూప పౌర స్మృతి న్యాయం చేకూర్చుతుందని మహిళా ఉద్యమంలోని కొన్ని వర్గాలు విశ్వసించాయి. కానీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్‌ు రెండవ సర్సంఫ్‌ు చాలక్ ఎం.ఎస్.గోల్వాల్కర్ అందుకు విరుద్ధంగా స్పందించారు. యుసిసి, భారతదేశ భిన్నత్వాన్ని దెబ్బతీస్తుందని 1972, ఆగస్ట్ 23న ఆర్గనైజర్ పత్రిక కోసం కె.ఆర్.మల్కానీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
జాతీయ ఐక్యతను యుసిసి బలోపేతం చేస్తుందనేది ఏమాత్రం పసలేని వాదన. లింగ న్యాయం చేకూరాలంటే ఏకరూపతే మార్గం అనే ఆలోచన నుండి అనేక మహిళా గ్రూపులు తప్పుకున్నాయి. విడాకులు, వారసత్వం, పిల్లల సంరక్షణలో లింగ న్యాయం ఎలా ఉంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. మరో ప్రశ్న ఏమంటే, యుసిసిని కేవలం అధికారిక ఉత్తర్వులతో రుద్దవచ్చా? యుసిసిని విధించడం ద్వారా సాంప్రదాయాలు, ఆచారాలు మటుమాయమైపోతాయా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. సామాజిక మార్పు తేవాలన్నా, లింగ న్యాయం చేకూరాలన్నా సంబంధిత కమ్యూనిటీల్లో మార్పు కోసం చాలా కృషి జరగాలి. విభిన్న వర్గాల, మతాల, సమాజాల అధికార ప్రతినిధులుగా చెప్పుకునేవారు మొత్తంగా తమ కమ్యూనిటీల అభిప్రాయాన్ని... ముఖ్యంగా మహిళల అభిప్రాయాల్ని... ప్రతిబింబించకపోవచ్చు. మనం లింగ న్యాయం కోసం ఉన్నప్పుడు, సమాజంలో నాయకత్వ పాత్రను పోషించిన పురుషుల్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. వివిధ కమ్యూనిటీలకు చెందిన మహిళల్లో వున్న బలమైన భావాల్ని, వారి ఆగ్రహాన్ని గుర్తించి...చట్ట సవరణలు, చట్టాల మార్పుల్లో వారి భావాలకు పట్టం గట్టడమనేది కీలకంగా వుండాలి.
యుసిసి ద్వారా మహిళలకు సాధికారత కల్పించవచ్చనే బిజెపి వాదనలలో డొల్లతనం స్పష్టంగా బైటపడింది. నిజంగా శ్రద్ధ వుంటే గడచిన తన తొమ్మిదేళ్ళ పాలనలో బిజెపి భిన్న సమాజాలు, వర్గాలు, మతాల్లో సంస్కరణలకు చొరవ చూపి వుండాల్సింది. విభిన్న వర్గాలకు చెందిన మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ అవి అంతగా ప్రభావం చూపలేకపోయాయి. మైనారిటీల్లో పెరుగుతున్న ఈ అభద్రతను తొక్కిపెట్టడం వల్ల తలెత్తిన పరిస్థితిని సొమ్ము చేసుకుని మితవాద శక్తులు తమ సామూహిక శక్తిని పెంచుకున్నాయి. న్యాయమైన, ఆరోగ్యకరమైన సంస్కరణలకు గట్టిగా బ్రేక్ వేసేందుకు ఈ శక్తిని అవి ఉపయోగించుకున్నాయి.
మత ప్రాతిపదికన ప్రజలను విభజించడం బిజెపి లక్ష్యం కాబట్టి, అది యుసిసి గురించి మాట్లాడుతుంది. ఈ విషయంలో చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నం రెండు విధాలుగా జరగాల్సి వుంది. మొదటిది-అన్ని సామాజిక సమూహాలలో సంఘం నాయకత్వంలో సంస్కరణలు. రెండవది లింగ న్యాయం. యుసిసికి అంగీకారం తెలపడం లేదా వ్యతిరేకించడం కంటే కూడా యుసిసి ముసాయిదా కోసం పిలుపు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముస్లిం సమాజంలోని గొంతుకలు గుడ్డిగా చట్టపరమైన మార్పులను వ్యతిరేకించడం కంటే కూడా ముసాయిదా చూడమని కోరాలి.
వాస్తవానికి, గీతా ప్రెస్‌కు గాంధీ శాంతి బహుమతిని అందించిన బిజెపికి, మహిళా సాధికారత పట్ల ఎలాంటి ఆసక్తి లేదు. కానీ, యుసిసిని వ్యతిరేకిస్తూ ముస్లిం మత ఛాందస సంస్థలు, గొంతులు చించుకుంటాయనే విషయం మాత్రం వాటికి తెలుసు. ప్రజలను మతాల వారీగా విభజించి రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి లబ్ధి పొందేందుకు మాత్రమే ఈ యుసిసి ఉపయోగపడుతుంది. అన్ని రాజకీయ శక్తులు ఏకతాటిపై నిలిచి, యుసిసిపై తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేయడానికి ముందు యుసిసి ముసాయిదా కోసం అడగాలి.
(వ్యాసకర్త మానవ హక్కుల కార్యకర్త)
(''న్యూస్ క్లిక్ '' సౌజన్యంతో)
పొ|| రామ్ పునియాని