Mar 07,2023 11:00
  • సాగుదార్ల ఎదురుచూపులు
  • ఎంజాయిమెంట్‌ సర్వే పూర్తి
  • ప్రాథమిక నివేదిక సిద్ధం

ప్రజాశక్తి- కృష్ణా ప్రతినిధి : కృష్ణా డెల్టాలోని లంక భూములకు పట్టాల కోసం వాటి సాగుదారులు ఎదురు చూస్తున్నారు. ఎంజాయిమెంట్‌ సర్వే పూర్తయినందున త్వరగా పట్టాలు ఇవ్వాలని కోరుతున్నారు. కృష్ణా డెల్టాలోని లంక భూములకు డి-పట్టాలిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఇందుకు సంబంధించి 2022 డిసెంబర్‌ 30న జిఒ ఎంఎస్‌ నంబర్‌ 799ను విడుదల చేసింది. దీంతో, ఇందుకు సంబంధించిన కసరత్తును కృష్ణా జిల్లా యంత్రాంగం మొదలెట్టింది. ఎంజాయిమెంట్‌ సర్వే నిర్వహించింది. 6,287 మంది రైతులు 3,570.80 ఎకరాలను సాగు చేస్తున్నారని గుర్తించింది. లబ్ధిదారులకు సంబంధించిన ప్రాథమిక నివేదికను సిద్ధం చేసింది. కృష్ణా నదికి గతంలో వచ్చిన వరదల్లో ఒండ్రుమట్టి కొట్టుకు వచ్చి నదీ గర్భంలో కొన్నిచోట్ల మేట వేసింది. సాగుకు అనుకూలంగా సారవంతంగా ఉండడంతో వాటిని దశాబ్దాలుగా పేదలు సాగు చేసుకుంటున్నారు. సాగుదార్లను గుర్తించి ఆ భూములపై వారికి ప్రతి ఏటా లీజును ప్రభుత్వం పునరుద్ధరిస్తూ వచ్చేది. ఈ లీజు ఆధారంగా పంటల సాగుకు బ్యాంకు రుణాలు, ప్రభుత్వ సహాయం అందుకునే అవకాశం ఉండేది. 20 ఏళ్ల క్రితం లీజు కేటాయింపులను ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో, లంక భూములు సాగు చేస్తున్న రైతులు కనీస గుర్తింపునకు నోచుకోవడం లేదు. నదికి వరదలు వచ్చిన సందర్భాల్లో పంటలు ముంపునకు గురైనప్పుడు వీరు ప్రభుత్వ సాయానికి దూరం అవుతున్నారు. తాజాగా లంక భూములను మూడు కేటగీరిలుగా గుర్తించి పట్టాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో సాగుదార్లలో ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం ఎప్పటికి పట్టాలు చేతికి ఇస్తుందా అని వారు ఎదురుచూస్తున్నారు.
 

                                                                    మూడు కేటగిరీలు ఇలా...

కృష్ణా కరకట్టకు దగ్గరగా ఉండి వరద వచ్చినా కొట్టుకుపోని భూమిని 'ఎ' కేటగిరీలో, దీనికి ఆనుకుని కొంత నదిలోకి ఉన్న భూమిని 'బి' కేటగిరీలో, వరదలు వస్తే పూర్తిగా మునిగిపోయే భూమిని 'సి' కేటగిరీలో చేరుస్తున్నారు. 'ఎ', 'బి' కేటగిరీలకు సంబంధించి డి-పట్టాలను ప్రభుత్వం మంజూరు చేయనుంది. 'సి' కేటగిరీలోని భూములకు ఐదేళ్లపాటు లీజు పట్టాలు కేటాయించనుంది.

/When-will-the-lands-of-Lanka-be-taken-care-of