- ఎదురుచూపుల్లో ఉపాధ్యాయులు
- బదిలీలు, ఉద్యోగోన్నతులకు లింక్
- ఇంకా కసరత్తు అంటున్న విద్యాశాఖ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పాఠశాల విద్యాశాఖ చేపట్టిన రేషనలైజేషన్ ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతోందనని ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నారు. రేషనలైజేషన్, బదిలీలు, ఉద్యోగోన్నతులను వేసవి సెలవుల్లోపు పూర్తిచేస్తామని చెప్పినా ఆచరణలోకి మాత్రం పాఠశాల విద్యాశాఖ ఇప్పటివరకూ తీసుకురాలేకపోయింది. రేషనలైజేషన్‌కు సంబంధించిన జిఓ 117ను జూన్ 10న విద్యాశాఖ విడుదల చేసింది. ఈ ప్రక్రియ పూర్తికాకపోవడంతో ఉపాధ్యాయుల బదిలీలు, ఉద్యోగోన్నతులు నిలిచిపోయాయి. ఇది పూర్తయితేనే తప్ప బదిలీలు, ఉద్యోగోన్నతుల అంశం ఒక కొలిక్కి రాదు. దీని ఆధారంగానే ఉపాధ్యాయ పోస్టులు ఎక్కడ ఖాళీ అవుతాయి? ఎన్ని ఉపాధ్యాయ పోస్టులు మిగులుతాయి? అదనంగా ఎన్ని అవసరం అవుతాయి? అనే విషయాలు తేలాల్సి ఉంటుంది. అలాగే ఏకోపాధ్యాయ పాఠశాలలుగా ఎన్ని మిగులుతాయనేది ప్రశ్నార్థకంగా మారనుంది. వీటిని తేల్చకుండా బదిలీలు, ఉద్యోగోన్నతులను చేపట్టడం కుదరదు. రేషనలైజేషన్‌కు సంబంధించిన జిఓ 117లోని సవరణలు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ సవరణలకు విద్యాశాఖ అంగీకారం తెలిపిందా? లేదా అనే ఆందోళనలో కూడా ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ప్రకారం 1:20, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1:30, ఉన్నత పాఠశాలల్లో 1:45 ప్రకారం ఉపాధ్యాయ పోస్టులను కేటాయించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. యుపి పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 92లోపు ఉంటే బిఇడి అసిస్టెంట్ పోస్టులు తీసేయొద్దని కోరుతున్నాయి. విద్యార్థుల సంఖ్య 137లోపు ఉన్న ఉన్నత పాఠశాలలకు హెచ్‌ఎం, పిడి పోస్టులు ఉంచాలని కోరుతున్నాయి. 10 సెక్షన్లు దాటితే అదనంగా హిందీ, పిఎస్ పోస్టు ఇవ్వాలని పేర్కొంటున్నాయి. ఉన్నత పాఠశాలల్లో సెక్షన్లు ఆధారంగా కాకుండా, విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయ పోస్టులు కేటాయించాలని కోరుతున్నాయి. తెలుగు, ఆంగ్లం రెండు భాషల్లో విద్యాబోధన ఉండాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్లలో ప్రాథమిక పాఠశాలల్లో 1:20 దాటితే రెండో పోస్టు అన్న దానికే విద్యాశాఖ అంగీకారం చెప్పింది. ఉన్నత పాఠశాలల్లో 1:53 నిష్పత్తి ప్రకారం ఉపాధ్యాయ పోస్టులు ఉంటాయని తేల్చి చెప్పింది. బోధన ఇంగ్లీష్‌లో మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. మిగిలిన అంశాల్లో విద్యాశాఖ దేనికి అంగీకారం తెలిపిందో? వేటికి తెలపలేదో తేలాల్సి ఉంటుంది. రేషనలైజేషన్ ప్రక్రియలో భాగంగానే 5 వేల ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను 3,450 ఉన్నత పాఠశాలల్లో కలిపినట్లు అధికారులు చెబుతున్నారు. ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించిన ఫైల్ సిఎం వద్ద ఉంది. ఈ ప్రక్రియ పూర్తికాకుండా బదిలీలు చేపట్టడానికి వీలు కాదు. దసరా సెలవుల్లోపు ప్రక్రియ పూర్తిచేస్తామని అధికారులు చెబుతున్నా.. అప్పటికీ పూర్తవుతుందో లేదోనని ఉపాధ్యాయులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.










