Dec 26,2022 11:19

ప్రజాశక్తి- ఏలూరు ప్రతినిధి : ఆయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణం పెంచడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామని, రైతులకు మొక్కలు అందించేందుకు అన్ని చర్యలూ చేపట్టామని ప్రభుత్వం చేసి ప్రకటనకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు ఏ మాత్రమూ పొంతన లేకుండా ఉంది. మొక్కల కోసం రైతులు ఎదురు చూడాల్సి వస్తోంది. ఏలూరు జిల్లాలో 28 మండలాలు ఉండగా, వాటిలోని 22 మండలాల్లో 1.20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగవుతోంది. ఈ పంట సాగు మరింత పెంచనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు సైతం మొగ్గుచూపుతున్నారు. అయితే, వారికి అవసరమైన మొక్కలను ప్రభుత్వం ఇవ్వడం లేదు. జిల్లాలో కొత్తగా 11,250 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఎకరానికి 55 నుంచి 60 మొక్కలు అవసరం అవుతాయి. వీటి కోసం రైతు భరోసా కేంద్రాలకు, ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీలకు దరఖాస్తు చేసుకున్నారు. ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీలు విత్తనాలు తెచ్చి నారు తయారు చేసి ఆ మొక్కలను రైతులకు అందించాల్సి ఉంది. మొక్క ఖరీదు రూ.194గా నిర్ణయించారు. రైతులు డబ్బు చెల్లించి కంపెనీలకు దరఖాస్తు చేసుకున్నారు. తయారైన మొక్కలను కంపెనీలు తమకు విక్రయించడం లేదని రైతులు చెప్తున్నారు. బ్లాక్‌ మార్కెట్లో మొక్క రూ.400కు విక్రయిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. కంపెనీల నుంచి దళారులు కొనుగోలు చేసి తమకు రూ.600 నుంచి రూ.700కు విక్రయిస్తున్నారని, దీంతో, ఆర్థిక భారమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయిల్‌పామ్‌ మొక్కలు ఇవ్వాలని అధికారుల, కంపెనీల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఆయిల్‌పామ్‌ మొక్కలు కావాలని దరఖాస్తు చేసిన రైతులు ఆయా భూముల్లో వేరే పంటలు వేయకూడదని నిబంధన పెట్టారు. దీంతో, మొక్కజొన్న వంటి పంటలు వేయకుండా భూములను ఖాళీగా ఉంచారు. ఇటు మొక్కలు అందక, అటు నింబంధనల వల్ల వేరే పంట సాగుకు అవకాశం లేక రైతులు నష్టపోతున్నారు. భూములు ఖాళీగా వదిలేయడంతో ఎకరాకు రూ.35 వేలకుపైగా నష్టపోయారు. ఆయిల్‌పామ్‌ మొక్కలు రైతులకు అందించడంలో ముఖ్య భూమిక పోషించాల్సిన జిల్లా ఉద్యాన శాఖాధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కంపెనీ యాజమాన్యాలు తమమాట వినడం లేదని మాట దాటవేస్తున్నారు. ఇటీవల చింతలపూడిలో మొక్కల కోసం రైతులు అధికారులను నిలదీయగా కంపెనీ ప్రతినిధులతో సమావేశమై చర్చించినా ఫలితం లేకుండాపోయింది. తమకు కావాల్సిన ఒకరిద్దరికి మొక్కలు ఇచ్చి మమ అనిపించారు. దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ వరుస క్రమంలో కంపెనీలు మొక్కలు ఇవ్వాల్సి ఉంది. కట్టిన డబ్బులను ఏడెనిమిది నెలల తర్వాత తిరిగిచ్చేస్తున్నాయి. జనవరి నెలాఖరుకు మొక్కలు అందించనున్నట్లు ఇటీవల జరిగిన వ్యవసాయ సలహా మండలి సమావేశంలో ఉద్యాన శాఖ అధికారులు చెప్పినా రైతులు మాత్రం విశ్వసించడం లేదు. దాదాపు రెండేళ్ల నుంచి ఇదే చెబుతూ తమను మోసగిస్తున్నారని వాపోతున్నారు. ఆయిల్‌పామ్‌ మొక్కలు త్వరితగతిన అందించాలని కోరుతున్నారు.
 

                                                                  ఇబ్బందికి గురిచేయడం దారుణం

ఆయిల్‌పామ్‌ సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నా మొక్కలు అందించడంలో ఉద్యాన శాఖ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. బ్లాక్‌ మార్కెట్లో మొక్కల అమ్మకం సాగుతోంది. దీన్ని అరికట్టి దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ వెంటనే మొక్కలు అందించాలి. ఇక్కడ అందుబాటులో లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి తెప్పించాలి. మొక్కలు అందించకపోతే రైతులతో కలిసి ఆందోళన చేపడతాం.
                                                                              -కె.శ్రీనివాస్‌, ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి