Sep 23,2023 07:04

సెప్టెంబర్‌ 23 అంతర్జాతీయ సైన్‌ లాంగ్వేజ్‌ డే. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 7.2 కోట్ల మంది బధిరులు ఉన్నారు. 80 శాతం మంది అభివృద్ధి చెందిన దేశాల నుంచే వున్నారు. అంతర్జాతీయంగా 300 కంటే ఎక్కువ సైన్‌ లాంగ్వేజ్‌లు ఉన్నాయి. కేవలం 2 శాతం మంది సైగల భాష ఉపయోగిస్తున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో బధిరులు సైతం సకలాంగులతో సమానంగా పోటీ పడుతున్నారు. ఒకప్పుడు సమాజంలో చులకనగా, హేళనగా చూడబడిన చెవిటి వారు... అంతర్జాతీయంగా వినికిడి విజ్ఞానం అభివృద్ధి కావడంతో అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్తున్నారు.
         మన దేశంలో ప్రత్యేక పాఠశాలాల ఏర్పాటు పట్ల నిర్లక్ష్యం ఉంది. ఇప్పటికీ అమెరికన్‌ సైన్‌ లాంగ్వేజ్‌నే మన దేశంలో వినియోగిస్తున్నారు. ప్రపంచంలో అనేక దేశాలు స్వతహాగా తమ జాతీయ స్థాయిలో సైగల భాషను అభివృద్ధి చేసుకున్నాయి. 76 ఏళ్ల స్వాతంత్య్ర భారత దేశంలో మాత్రం ఇతర దేశాల సైగల భాషపై ఆధారపడడం బధిరుల విద్య పట్ల మన పాలకులకున్న చిత్తశుద్ధికి నిదర్శనం. 2021 ఆగష్టులో మన దేశ సైగల భాషను అధికారికంగా గుర్తిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికైనా మన సైన్‌ లాంగ్వేజ్‌ను అభివృద్ధి చేయడంపై పాలకులు శ్రద్ధ పెట్టాలి. అనేక దేశాల్లో బధిరుల కోసం ప్రాథమిక విద్య నుండి యూనివర్శిటీ చదువుల వరకు సైగల భాష లోనే బోధిస్తున్నారు. మన దేశంలో ప్రభుత్వ రంగంలో బధిరులు చదువుకునేందుకు విద్యాసంస్థలు తగినన్ని లేవు. సాధారణ పాఠశాలల్లో ప్రత్యేక ఉపాధ్యాయులను నియమించాలని విద్యాహక్కు చట్టంలో ఉన్నప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు.
           ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం మన దేశంలో 10-20 శాతం మంది వినికిడి సమస్యతో బాధపడుతున్నారు. 50 ఏళ్లు పైబడిన వారిలో 40 శాతం, 70 ఏళ్లు పైబడిన వారిలో 70 శాతం మందికి వినికిడి సమస్యతో బాధపడుతున్నారు. 2050 నాటికి ప్రతి నలుగురిలో ఒక్కరికి వినికిడి సమస్య ఉండొచ్చని 2021లో డబ్ల్యుహెచ్‌ఓ ప్రకటించింది. ఎ.పి లో గ్రామీణ ప్రాంతంలో 6.4 శాతం, పట్టణ ప్రాంతంలో 4.9 శాతం మంది బధిరులు నివసిస్తున్నారు. నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ (ఎన్‌ఎస్‌ఓ) నివేదిక ప్రకారం పురుషుల కంటే మహిళా వికలాంగుల సంఖ్య ఎక్కువగా ఉంది. 2016 ఆర్‌.పి.డి చట్టం గుర్తించిన 21 రకాల వైకల్యాల ప్రకారం వీరి సంఖ్య రెట్టింపు అవుతుంది. సామూహిక ప్రాంతాలన్నీ మూగ, చెవిటి వారితోపాటు వికలాంగులు వినియో గించుకునే విధంగా ఉండాలని 2016 ఆర్‌.పి.డి చట్టం పేర్కొంది. 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాక్సెసిబుల్‌ ఇండియా క్యాంపైన్‌ ద్వారా 2020 నాటికి ప్రధాన నగరాల్లో 50 శాతం అందుబాటు లోకి రావాలి. దేశవ్యాప్తంగా 1182 స్థలాలు గుర్తిస్తే 482 మాత్రమే అందుబాటు లోకి వచ్చాయి. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, విమానా శ్రయాలు, ప్రభుత్వ కార్యాలయా లన్నింటిలో సైగల భాష సౌకర్యాలు అందుబాటులో ఉండాలి. ఇవేవీ అమలులో లేవు. బధిరులు వినియోగించే పరికరాలు అందుబాటులో లేకపోవడం ద్వారా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వినికిడి పరికరాలను ఉచితంగానే సరఫరా చేయాలి. విద్యార్థులకు 4జి ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు అందించడం ద్వారా ఉన్నత విద్య అభ్య సించేందుకు అవకాశం ఏర్పడుతుంది. వినికిడి సమస్యను గుర్తించేందుకు శాస్త్రీయ పద్ధతిలో చికిత్స అందించాలి. దీని కోసం ప్రభుత్వ ఆసుపత్రులన్నింటిలో ఆడియాలజిస్టు, స్పీచ్‌ లాంగ్వేజ్‌ పాథాలజిస్టులను నియమించాలి. వినికిడి సమస్య ఉన్న వారికి, ఇంప్లాంట్‌ చికిత్స చేయాల్సిన వారికి ప్రభుత్వం ఉచితంగా చేయాలి. తీవ్రతను బట్టి ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలి. వినికిడి సమస్య నివారణ కోసం శాస్త్రీయ పద్ధతుల్లో ప్రభుత్వం కృషి చేయడం ద్వారా వినికిడి లోపాన్ని సహజంగా తీర్చిదిద్దగలం. అందుకోసం ప్రభుత్వాలపై పోరాడి హక్కులు సాధించుకోవాల్సిన అవసరముంది.

33
 

- యం. అడివయ్య,
ఎన్‌పిఆర్‌డి జాతీయ ఉపాధ్యక్షులు.